హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


చర్చ అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం తిరస్కరణ

సభలో అవకాశం ఇచ్చినప్పుడు మట్లాడకుండా అవకాశం ఇవ్వలేదంటూ బయటకు వచ్చి ఫిర్యాదు చేయటం ప్రతిపక్ష నేత అలవాటని వ్యాఖ్య

సీట్ల సంఖ్య ప్రకారం.. లోక్‌సభలో అధికార పార్టీ కంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడటానికే ఎక్కువ సమయం కేటాయించిన శ్రీ ఓం బిర్లా

ఎల్ఓపీ నేతృత్వంలో లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలు.. కానీ ఆ అంశంపై మాట్లాడని ప్రతిపక్ష నాయకుడు

సభలో కీలక చర్చా సమయాలు.. 2025 శీతాకాల సమావేశాలప్పుడు జర్మనీ పర్యటన, 2025 బడ్జెట్ సమావేశాలప్పుడు వియత్నాం, 2023 బడ్జెట్ సమావేశాల సమయంలో యూకే పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత.. విదేశీ పర్యటన నుంచి వచ్చాక సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఫిర్యాదు

సభలో చర్చలు జరుగుతున్నప్పుడు విదేశీ పర్యటనల్లో ఉంటున్న ఎల్ఓపీ.. విదేశాల నుంచి లోక్‌సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం అసాధ్యం

కీలక చర్చలైన ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ నిషేధం, సీఏఏ అమలు, వందేమాతరం 150 ఏళ్ల వేడుకల వంటి సమయాల్లో హాజరుకాని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎల్ఓపీ

నియమాలకు లోబడి పార్లమెంటు ప్రసంగాలు.. ఇష్టానుసారం గుంపుగా మాట్లాడుకునే ప్రదేశం కాదు

జాతీయ సగటు కన్నా తక్కువగా పార్లమెంటులో ఎల్ఓపీ హాజరు శాతం

ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 17వ లోక్‌సభలో దాదాపు 158 గంటలు, ఇప్పటివరకు జరిగిన 18వ లోక్‌సభలో 71 గంటల సమయం కేటాయింపు.. దామాషా ప్రకారం మా పార్టీకి కేటాయించిన సమయం కన్నా ఎక్కువ

నేటికీ అత్యయిక స్థితి నాటి అహంకార భావనతోనే కొనసాగుతున్న ప్రతిపక్షం.. నిరంతరం ప్రతిపక్ష బలాన్ని తగ్గిస్తున్న ప్రజలు

ప్రతిపక్షాల ప్రసంగాల్లో 80% అవిశ్వాస తీర్మానంతో సంబంధం లేదు.. స్పీకర్‌ను సాకుగా చూపించి ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలు

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 10:01PM by PIB Hyderabad

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమాధానమిచ్చారు. చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ తిరస్కరించింది. ఇది సాధారణ విషయం కాదని, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టినట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. పార్లమెంటు రాజకీయాలు, సభకు ఇది దురదృష్టకరమైన సందర్భమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని, మొత్తం సభకు ప్రాతినిధ్యం వహిస్తారని, సభలోని సభ్యులందరి హక్కులను ఆయనే కాపాడతారని శ్రీ అమిత్ షా తెలిపారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం సాహసవంతమైన చర్య కాదని ఆయన అన్నారు.

ఆ అంశంపై అధికార ప్రభుత్వ, ప్రతిపక్షాలు కలిసి దాదాపు 13 గంటల పాటు చర్చించాయని, ఈ చర్చలో 42 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నట్లు శ్రీ అమిత్ షా వెల్లడించారు. స్పీకర్ నిర్ణయమే అంతిమం అని ఎన్నో ఏళ్లుగా ఉన్న సంప్రదాయానికి విరుద్ధంగా ఇవాళ ప్రతిపక్షాలు స్పీకర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేదికైన లోక్‌సభ.. కేవలం దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయతను చాటుకుందని తెలిపారు. భారత ప్రజాస్వామ్య పటిష్ఠతను అంతర్జాతీయ సమాజం సైతం గుర్తిస్తుందన్నారు. లోక్‌సభ అధిపతి నిబద్ధతను ప్రశ్నించినప్పుడు.. దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా మన ప్రజాస్వామ్య విధానాలపై అనుమానం కలుగుతుందన్నారు.

ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి గందరగోళం సృష్టించటం ఆయన భద్రతపై ఆందోళన కలిగిస్తోందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యాంగం స్పీకర్ పదవిని పార్టీలకతీతంగా ఉంచిందని, ఆయనకు ఒక తటస్థ మధ్యవర్తి పాత్రను అప్పగించిందన్నారు. ఈ మధ్యవర్తిత్వ బాధ్యతను నిర్వహిస్తున్న వారిపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 75 ఏళ్లుగా పార్లమెంటు ఉభయసభలు భారత ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేశాయని, అయితే విపక్షాలు ఇప్పుడు ఆ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. పరస్పర విశ్వాసంతో సభా కార్యకలాపాలు నడుస్తాయని, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సంరక్షకుడిగా స్పీకర్ ఉంటారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. లోక్‌సభ కార్యకలాపాల నిర్వహణకు, స్పీకర్ సభను ఏ విధంగా నడపాలో తెలియజేసేలా కొన్ని నియమాలను లోక్‌సభ రూపొందించిందని ఆయన వెల్లడించారు. ఉత్సవం లేదా క్రమపద్ధతి లేకుండా గుమికూడే ప్రదేశం సభ కాదని ఆయన స్పష్టం చేశారు. సభ నిబంధనలు అనుమతించనప్పుడు, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. లోక్‌సభ పనితీరును నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినప్పుడు జోక్యం చేసుకుని అలాంటి ప్రవర్తనను అదుపు చేయడం స్పీకర్‌ బాధ్యత అని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో తొలి ప్రధానమంత్రి కాలం నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, అయితే ప్రధాన ప్రతిపక్షం పలు సందర్భాల్లో వీటిని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాలను, సమగ్రతను ప్రశ్నించకూడదని, అలా చేయడం అత్యంత దురదృష్టకరమని, ఖండించదగిన విషయమని శ్రీ అమిత్ షా అన్నారు.

తమ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉందని, ఆ సమయంలో స్పీకర్‌పై మూడుసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అయితే, తమ పార్టీ లేదా కూటమి గానీ ఎప్పుడూ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ, స్పీకర్ పదవికి గౌరవమిచ్చామని, రాజ్యాంగపరమైన హక్కులను స్పీకర్ ద్వారానే డిమాండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. స్పీకర్‌పై ఎన్నడూ అవిశ్వాస తీర్మానం తీసుకురాలేదని శ్రీ అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు.

1954లో జీ.వీ. మాల్వంకర్‌పై సోషలిస్ట్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని శ్రీ అమిత్ షా తెలిపారు. 1966లో అప్పటి లోక్‌సభ స్పీకర్ సర్దార్ హుకం సింగ్‌పై సంయుక్త సోషలిస్ట్ పార్టీ, 1987లో బలరాం జఖర్‌పై సీపీఐ అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాయి. దాదాపు ఆ పార్టీలన్నీ ఇప్పుడు ప్రతిపక్ష కూటమిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. స్పీకర్ సమగ్రతను ఎప్పుడూ ప్రశ్నించకూడదని తమ పార్టీ బలంగా నమ్ముతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్పీకర్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, శాసన న్యాయశాస్త్రంలో లోక్‌సభ స్పీకర్‌ అత్యున్నత న్యాయనిర్ణేత అని శ్రీ అమిత్ షా అన్నారు. లోక్‌సభ కార్యకలాపాల సందర్బంగా తీసుకునే నిర్ణయాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని, రాజ్యాంగమే స్పీకర్‌కు ఆ రక్షణ కల్పించిందని ఆయన వివరించారు. నిర్భయంగా విధులను నిర్వహించేందుకు స్పీకర్‌కు ఈ రక్షణ కల్పించారు. సభ క్రమశిక్షణ, హుందాతనాన్ని కాపాడటం స్పీకర్ మొదటి బాధ్యతని, సభ్యులందరికీ సమాన అవకాశం కల్పించి, నిష్పక్షపాతంగా సభను నడిపించటం రెండో బాధ్యతని శ్రీ అమిత్ షా వివరించారు. సభ కార్యకలాపాల కోసం రూపొందించిన నిబంధనల ప్రకారం లోక్‌సభ వ్యవహరించటం పార్లమెంటరీ మర్యాద అని స్పష్టం చేశారు.

లోక్‌సభ నిబంధన 374 ప్రకారం.. సభలో గందరగోళం సృష్టించి, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సమయాల్లో సభ్యులను హెచ్చరించేందుకు, వారి పేర్లను ప్రకటించేందుకు, బహిష్కరించేందుకు, సస్పెండ్ చేసేందుకు స్పీకర్‌కు అధికారం ఉంటుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సభలో నిరసన తెలపాలనుకునేవారు లేదా క్రియాశీలకంగా వ్యవహరించాలనుకునే వారు తప్పనిసరిగా సభ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధన 375 ప్రకారం.. సభలో గందరగోళం నెలకొన్నప్పుడు, సభను వాయిదా వేయాల్సి ఉంటుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సభా నిబంధన 380 ప్రకారం.. అన్-పార్లమెంటరీ పదాలను, వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన వివరించారు. ఒక నిర్దిష్టమైన ధోరణిలో లేదా సందర్భంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్లమెంటు చరిత్రలో భద్రపరచకూడదని, అలా చేస్తే పార్లమెంటు సభ్యులు భవిష్యత్తులోనూ అదే తీరును అనుసరించే ప్రమాదం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సభ ఏర్పడినప్పటి నుంచి ఈ పదవిని చేపట్టిన ఎందరో మహానుభావులు కాలక్రమేణా అన్-పార్లమెంటరీ పదాల జాబితాను రూపొందించారని, అది అందరికీ వర్తిస్తుందని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలకు రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందని, ఎలాంటి ప్రత్యేకాధికారాలను ఇవ్వలేదన్నారు. హక్కులను కాపాడుకోవాలి కానీ, ప్రత్యేకాధికారాలు ఉన్నాయనే భ్రమలో ఉన్నవారికి పార్టీ నుంచి గానీ, ప్రజల నుంచి కానీ ఎలాంటి రక్షణా ఉండదన్నారు.

లోక్‌సభ స్పీకర్ ప్రాముఖ్యత కేవలం సభకు మాత్రమే పరిమితమైనది కాదని.. దేశానికి, అంతర్జాతీయ స్థాయికి కూడా విస్తరిస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. స్పీకర్ కేవలం సభను నడిపించే అధికారి మాత్రమే కాదని.. శాసనసభ చైతన్యానికి, ప్రజాస్వామ్య గౌరవానికి చిహ్నమని తెలిపారు. ఒక వ్యక్తి స్పీకర్ చిత్తశుద్ధిని ప్రశ్నించటమంటే.. అది మన శాసనసభల విచక్షణను, ప్రజాస్వామ్య గౌరవాన్నే ప్రశ్నించినట్లని చెప్పారు. ప్రధానమంత్రిని తొలగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టవచ్చని, లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే ప్రతిపాదనను తీసుకురావటాన్ని సాహసమైన చర్యగా భావించకూడదని శ్రీ అమిత్ షా అన్నారు. అత్యంత కఠినమైన పరిస్థితులను ఊహించి ఈ నిబంధనలను రాజ్యాంగం రూపొందించిందని ఆయన తెలిపారు. స్పీకర్‌ను తొలగించే నిబంధన కేవలం అసాధారణ పరిస్థితుల కోసమే తప్ప, సాధారణ విషయంగా పరిగణించబడకూడదని స్పష్టం చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 96 ప్రకారం.. స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలనే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు సంబంధిత ప్రిసైడింగ్ అధికారి సభకు అధ్యక్షత వహించకూడదని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అధికారంలో ఉన్న సమయంలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు వచ్చాయని, ఆ సందర్భాల్లోనూ.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు అధ్యక్ష పీఠంపై స్పీకర్ కూర్చోకపోవటమే సంప్రదాయంగా వస్తోందని ఆయన వివరించారు. ఆ మూడు సందర్భాల్లోనూ స్పీకర్లు 14 రోజుల పాటు పదవిలో కొనసాగారు. నైతిక విలువల ప్రాతిపదికన, సభా కార్యకలాపాలను పర్యవేక్షించకూడదని నిర్ణయించుకున్న ఏకైక స్పీకర్ శ్రీ ఓం బిర్లా మాత్రమేనని ఆయన తెలిపారు. నిబంధన 94-సి ప్రకారం.. అత్యంత అసాధారణమైన, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే లోక్‌సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రిని తొలగించటానికి కేవలం సాధారణ మెజారిటీ సరిపోతుందని, కానీ స్పీకర్‌ను తొలగించటానికి అసాధారణ మెజారిటీ అవసరమని శ్రీ అమిత్ షా వివరించారు.

ఏ ఒక్క రాజకీయ పార్టీ నిబంధనల ప్రకారం సభ సాగదని.. కేవలం లోక్‌సభ నిబంధనల ప్రకారమే నడుస్తుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. విపక్షాలు తరచుగా నైతిక విలువల గురించి మాట్లాడుతుంటాయని, అయితే లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా విపక్షాలకిచ్చిన అవకాశమే నిజమైన నైతికతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు రెండుసార్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, దాన్ని సరిదిద్దుకునేందుకు స్పీకర్ అవకాశమిచ్చారని శ్రీ అమిత్ షా చెప్పారు. ప్రతిపక్షాలు నిబంధనలను పాటించవని, పైగా మాట్లాడనివ్వటం లేదని ఆరోపణలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. నియమావళిని అనుసరిస్తూ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంగీకారంతో ఒక ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చినప్పుడు దానిపై చర్చించకుండా సభా కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ఆటంకం కలిగించాయని శ్రీ అమిత్ షా అన్నారు. దీనికంటే సిగ్గుపడాల్సిన ఘటన మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. చర్చల సందర్భంగా ప్రతిపక్ష నేతలు చేసిన ప్రసంగాల్లో 80 శాతానికి పైగా అంశాలు అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవే కావని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 1966లోనూ, ఆ తర్వాత ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాల సమయంలో బలరాం జాఖడ్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. ఆ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ స్పీకర్ పదవిలో మరొకరు కొనసాగుతున్నారు. కానీ, అప్పటి అధికార పార్టీ తమ పార్టీకి చెందిన వారిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించింది. అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్న ప్రతిపక్షాలకు.. ఇప్పడు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు లేదని స్పష్టం చేశారు.

ఇక 16వ లోక్‌సభ 331, 17వ లోక్‌సభ 274, ప్రస్తుత లోక్‌సభ (2025 వరకూ) 103 వంతున సమావేశాల వంతున నిర్వహించినట్లు శ్రీ అమిత్ షా వివరించారు. అలాగే, 2025 బడ్జెట్ సమావేశాల ఉత్పాదకత 118 శాతం కాగా, 16, 17, 18వ లోక్‌సభలు 91 శాతం వంతున ఉత్పాదకతను నమోదు చేశాయని పేర్కొన్నారు. మొత్తంమీద ప్రస్తుత స్పీకర్ శ్రీ ఓం బిర్లా పదవీకాలంలో అత్యధిక ఉత్పాదకత సాధించినట్లు తెలిపారు. జీరో అవర్ వ్యవధిని స్పీకర్ 5 గంటలకు పొడిగించారని ఆయన గుర్తుచేశారు. అర్ధరాత్రి దాకా జీరో అవర్‌ సమస్యలను సభ్యులు ప్రస్తావించేందుకు అనుమతించిన ఇటువంటి స్పీకర్‌ను ఎమ్మెల్యేగా, ఎంపీగా తన 30 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నడూ చూడలేదన్నారు. మొత్తం 202 మంది సభ్యులకు ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చినా, తమకు అనుమతి లభించడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు.

లోక్‌సభలో కొత్త సభ్యులను ప్రోత్సహించడం స్పీకర్ నైతిక బాధ్యతని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ మేరకు 2019లో రికార్డు స్థాయిలో 78 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నిక కాగా, వారందరికీ మాట్లాడే అవకాశం కల్పించేలా స్పీకర్ శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. శ్రీ ఓం బిర్లా కృషి ఫలితంగానే సభలో ప్రాంతీయ భాషల వినియోగం పెరిగిందని, ఇదొక ముఖ్యమైన విజయమని చెప్పారు. సభలో అనువాదకుల ప్యానెల్ తొలిసారి పూర్తిస్థాయిలో ఏర్పాటైందన్నారు. డిజిటల్ పార్లమెంట్ 2.0 కింద దాదాపు 8,000 గంటల ఆడియో-విజువల్ రికార్డింగ్‌ను డిజిటలీకరించినట్లు చెప్పారు. ఎంపీల ప్రసంగాలు, సభలో చర్చలు, ప్రశ్నోత్తరాలు తదితరాలను వినాలనుకునే యువతకు అవి నేడు డిజిటల్‌ మాధ్యమంద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ‘నేషనల్ ఇ-విధాన్’ అప్లికేషన్ ద్వారా లోక్‌సభ కార్యకలాపాలన్నిటినీ కాగిత రహితం చేసేందుకు కృషి సాగుతున్నదని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

కామన్వెల్త్ దేశాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సమావేశంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రసంగానికి విస్తృత ప్రశంసలు లభించడం, భారత పార్లమెంట్ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని హోంమంత్రి పేర్కొన్నారు. బిల్లులపై పార్లమెంటు సభ్యులకు ముందస్తు వివరాలు పొందే అవకాశం కల్పించింది ఆయనేనని చెప్పారు. బ్రిటిష్ పాలకులు నిర్మించిన భవనం నుంచి స్వతంత్ర భారతంలో కొత్త పార్లమెంట్ భవనానికి సభ మార్పు శ్రీ ఓం బిర్లా పదవీకాలంలోని కీలక పరిణామాలలో ఒకటని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఆయన ఏకాభిప్రాయంతో చేపట్టారని గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తప్పుడు సమాచార వ్యాప్తి విస్తృతంగా సాగుతున్నదని శ్రీ అమిత్ షా ఆరోపించారు. అయితే, ఇటువంటి ప్రయత్నాలేవీ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయజాలవనే వాస్తవం వారికి అర్థం కావడం లేదన్నారు. సభలో ఎవరు.. ఎప్పుడు.. ఎంత.. ఎందుకు మాట్లాడాలి అనే అంశాలను నిర్ణయించేది పాలక పార్టీ కాదన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి తమ పార్టీ ఎన్నడూ యత్నించలేదన్నారు. వాస్తవానికి తన గొంతును వినిపించకుండా చేసే కుట్ర చేస్తున్నారని శ్రీ అమిత్‌ షా ఆరోపించారు.

దేశంలో 1975నాటి ఎమర్జెన్సీ సందర్భంగా యావత్‌ ప్రతిపక్షాన్ని జైలుపాలు చేయడం ద్వారా వారి గళాన్ని అణచివేశారని ఆయన గుర్తుచేశారు. సభను నిబంధనల ప్రకారం నిర్వహించడం స్పీకర్ బాధ్యతని, లోక్‌సభలోని 349వ నియమం సభలో సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తుందని చెప్పారు. కాగా, 17వ లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి 52 మంది సభ్యులున్నా, 157 గంటల 55 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అన్నారు. దానితో పోలిస్తే, తమ పార్టీకి 303 మంది సభ్యులు ఉన్నప్పటికీ, 349 గంటల 8 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ సమాచారాన్ని పరిశీలిస్తే, అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీ వారికే స్పీకర్‌ ఎక్కువగా మాట్లాడే వీలు కల్పించినట్లు శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

ప్రస్తుత 18వ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష బలం 99 మందే అయినా, నిన్నటి దాకా 71 గంటలు మాట్లాడారని శ్రీ అమిత్ షా అన్నారు. దీనితో పోలిస్తే, 239 మంది సభ్యులున్న అధికార పార్టీకి 193 గంటల సమయం మాత్రమే మాట్లాడే సమయం ఇచ్చారన్నారు. అంటే- 18వ లోక్‌సభలో అధికార పార్టీతో పోలిస్తే ప్రతిపక్షానికి దాదాపు రెండు రెట్లు అధికంగా సమయం లభించిందన్నారు. కానీ, తనను మాట్లాడనివ్వడం లేదని, తన గొంతును అణచివేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని చెప్పారు. విపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా, ఆయన విదేశీ పర్యటనలో ఉంటున్నారని శ్రీ అమిత్‌ షా విమర్శించారు.

ప్రతిపక్ష నేత వంతు వచ్చినప్పుడల్లా ఆయన తరచూ జర్మనీ, వియత్నాం, యునైటెడ్ కింగ్‌డమ్, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో ఉండేవారన్నారు. ఆ తర్వాత తీరిగ్గా వచ్చి తనకు అనుమతి ఇవ్వడంలేదని ఫిర్యాదు చేస్తుంటారని శ్రీ అమిత్ షా ఆరోపించారు. తన వంతు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడలేదో అడగాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. ఆయనను నిజంగా మాట్లాడకుండా నిరోధించారా? లోక్‌సభను కించపరిచేందుకే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రస్తుత 18వ లోక్‌సభలో ప్రతిపక్షానికి 71 గంటలు సమయం ఇవ్వగా, ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడారని ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో కూడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేదని, దానిపై తాను మాట్లాడేది ఏమీ లేకపోతే అలాంటి తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారని శ్రీ అమిత్‌ షా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం కూడా తప్పని ఆయన ఖండించారు. వాస్తవానికి సభలో మాట్లాడటం ఆయనకు నిజంగా ఇష్టం ఉండదని, మాట్లాడాలనుకుంటే నిబంధనల ప్రకారం ఎలా చేయాలో ఆయనకు తెలియదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ అంటే బహిరంగ సభ కాదని, ప్రతి సభ్యుడూ సభా నియమాలకు అనుగుణంగా మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నాయకుడిని దాదాపు 40 సార్లు మాట్లాడనీయలేదని ప్రతిపక్షాలు ఆరోపించినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అయితే, స్పీకర్ వారిస్తున్నా ఒకే అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు పునరావృతం చేస్తుంటే నిరోధించడం తప్ప ఆయనకు వేరే మార్గం ఉండదన్నారు. ప్రచురితం కాని పుస్తకం లేదా మ్యాగజైన్ల నుంచి ఏ అంశాన్నీ సభ్యులెవరూ ఉల్లేఖించరాదని రక్షణ మంత్రి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఒక సభ్యుడు ఒకే అంశంపై పదేపదే మాట్లాడాలని చూస్తే, స్పీకర్ జోక్యం చేసుకోక తప్పదని పేర్కొన్నారు. అలాగే, ‘ఎస్‌ఐఆర్‌’పై చర్చలోనూ మాట్లాడాల్సిన సభ్యుల క్రమానికి ప్రతిపక్ష నాయకుడు అంతరాయం కలిగించారని శ్రీ అమిత్‌ షా ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నేత అవాస్తవాలతో కూడిన విలేకరుల సమావేశంపై సభలో చర్చను శ్రీ ఓం బిర్లా అనుమతించలేదని, తద్వారా దశాబ్దాల నాటి పార్లమెంటరీ సంప్రదాయాన్ని సమర్థించారని అన్నారు.

17వ లోక్‌సభ మొత్తం సమయంలో సభ్యుల నిష్పత్తి ప్రకారం ప్రతిపక్షం వాటా కేవలం 3 శాతమే అయినా, స్పీకర్‌ 40 శాతం సమయమిచ్చారని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చా సమయంలో ప్రతిపక్షానికి 34 శాతం కేటాయించారని గుర్తుచేశారు. ఇక 18వ లోక్‌సభలో వారికి 55 శాతం సమయం ఇస్తే, మాట్లాడటానికి అనుమతి లేదనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ నాయకుడికి మాట్లాడే హక్కు ఉన్నా, వారు మాట్లాడటానికి ఇష్టపడకపోతే ఎవరైనా ఏం చేయగలరని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలోనూ ‘ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి ఉండవచ్చు.. కానీ, నిబంధనల ప్రకారం మాత్రమే మాట్లాడాలి’ అని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడటంపై సభలో ఎవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

ఇక 17వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హాజరు 51 శాతం కాగా, జాతీయ సగటు 79 శాతంగా ఉందని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి అన్నారు. అలాగే 16వ లోక్‌సభలో జాతీయ సగటు 80 శాతంతో పోలిస్తే ఇది 52 శాతమని, 15వ లోక్‌సభలో జాతీయ సగటు 76 శాతంతో తో పోలిస్తే 43 శాతంగా ఉందని తెలిపారు. ఈ గణాంకాలన్నీ రికార్డుల్లో ఉన్నాయంటూ, 16వ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి కూడా పాల్గొనలేదని శ్రీ అమిత్‌ షా ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చలోనూ ఆయన ఒక్కసారి కూడా పాల్గొనలేదని, ప్రభుత్వ బిల్లులపై చర్చల్లోనూ పాల్గొనలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా 2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొనలేదని గుర్తుచేశారు. ఒకే ఒక బిల్లు మినహా విదేశాంగ విధానంపై చర్చలకూ ఆయన హాజరు కాలేదన్నారు. భూసేకరణ బిల్లు, 122వ రాజ్యాంగ సవరణ, ఆధార్ చట్టం-2016, ట్రిపుల్ తలాక్‌ సంబంధిత ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం-2019, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వం (సవరణ) చట్టం-2019, భారతీయ న్యాయ సంహిత, పన్ను సంస్కరణలు, ఆర్థిక బిల్లు-2024, వక్ఫ్ సవరణ బిల్లు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, కెప్టెన్ శుభాంశు శుక్లా అభినందన తీర్మానం తదితర అనేక కీలకాంశాలు, బిల్లులపై చర్చలలో ప్రతిపక్ష నేత పాల్గొనలేదని పేర్కొన్నారు. ఈ విధంగా అనేక ప్రధాన చర్చలలో ప్రతిపక్ష నేత పాల్గొననే లేదని శ్రీ అమిత్‌ షా విమర్శించారు.

ప్రతిపక్ష నేత తన పార్టీకి సీనియర్ నాయకుడు కావడం ప్రజా జీవితంలో సహజమని, లోక్‌సభ సమావేశమైనపుడు, పార్టీ ప్రధాన కార్యక్రమాల సమయంలో, ఎన్నికల వేళ, సీనియర్ నాయకులు ప్రచారం కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు. అందులో తప్పేమీ లేదుగానీ,  సభకు రాని సమయంలో ఆయన ఎక్కడుంటున్నారన్నదే ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే- 2017 శీతాకాల సమావేశాల సమయాన ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. 2025 బడ్జెట్ సమావేశాల వేళ వియత్నాంలో విహారానికి వెళ్లారు. ఇక 2023 బడ్జెట్ సమావేశాల సమయాన యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నారు. అంతేగాక 2018 బడ్జెట్ సమావేశాల వేళ సింగపూర్,  మలేషియాలో పర్యటించారు. అలాగే, 2020 వర్షాకాల, 2015 బడ్జెట్ సమావేశాల సమయంలోనూ విదేశీ పర్యటనలకు వెళ్లారు. మొత్తం మీద 2015 బడ్జెట్ సమావేశాల్లో ఆయన 60 రోజులు విదేశీ యాత్ర చేశారని గుర్తుచేశారు. బడ్జెట్ లేదా కీలక సమావేశాలు నిర్వహిస్తున్న ప్రతి సందర్భంలో ఆయనకు విదేశీ పర్యటన ఉండటం అత్యంత దురదృష్టకర యాదృచ్చిక వాస్తవమని శ్రీ అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తనకు మాట్లాడే అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత అంటున్నారు. విదేశాల్లో ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించే నిబంధన ఏదీ లేదని, సభలో లేకపోతే మాట్లాడటం ఎలాగని ప్రశ్నించారు.

లోక్‌సభ స్పీకర్ శైలిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తితే, ఆయన ప్రవర్తనను మాత్రమే పరిశీలించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే- సభను అధికార, ప్రతిపక్ష, సభ్యులు సహా స్పీకర్, రాష్ట్రపతి సమష్టిగా నిర్వహిస్తారని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కొన్నిసార్లు తమ సొంత ప్రవర్తన గురించి కూడా ఆలోచించాలని కోరారు. దేశ ప్రధానమంత్రి అధికార పక్ష బెంచీలో కూర్చుంటారని, ఆయనను కౌగలించుకోవడానికి పరిగెత్తడం వంటి సంఘటన సభలో మునుపెన్నడూ చోటు చేసుకోలేదని శ్రీ అమిత్ షా అన్నారు. అలాగే గాలిలో ముద్దులు విసరడం లేదా కళ్లతో సంకేతాలివ్వడం వంటివి కూడా ఎన్నడూ సభలో తటస్థించలేదని గుర్తుచేశారు.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో చైనా స్థానం బలోపేతం కావడానికి దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విధానాలు కూడా కారణమని శ్రీ అమిత్ షా ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి నిధులు పొందింది కాబట్టే, విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సీఆర్‌) కింద దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశ పౌరులందరూ ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. చైనా 1962లో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల మేర అక్సాయ్ చిన్ సహా ‘ఎన్‌ఈఎఫ్‌ఏ’లో అధికశాతాన్ని కూడా ఆక్రమించిందంటూ, ఇదంతా నేటి ప్రధాన ప్రతిపక్షం లోగడ అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్నదని పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో తిరస్కరించి, ఆ పదవికిగల గౌరవప్రతిష్ఠలను పరిరక్షించాలని సభ్యులకు శ్రీ అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2238989) సందర్శకుల సూచీ సంఖ్య : : 94
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam