హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళలపై నేరాల నిరోధం దిశగా చేపట్టిన చర్యలివే

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 3:27PM by PIB Hyderabad

మహిళలు, బాలలపై నేరాల సంబంధిత నిబంధనలకు ప్రాధాన్యంతో దేశంలో తొలిసారిగా వాటిని ఒక అధ్యాయం కిందకు చేరుస్తూ ‘భారతీయ న్యాయ సంహిత-2023’ (బీఎన్‌ఎస్‌) అమలులోకి వచ్చింది. మహిళలపై నేరాలకు పాల్పడిన దోషులకు అంతిమంగా మరణశిక్ష వరకూ వివిధ రకాల కఠిన శిక్షలను ఈ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇందులో భాగంగా 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే- దోషులకు సహజ మరణం సంప్రాప్తించేదాకా యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష విధించవచ్చు. వివాహం, ఉద్యోగం, ప్రమోషన్‌ లేదా గుర్తింపు గోప్యత వంటి ప్రలోభాలతో లైంగిక సంబంధం నెరపే వారిని శిక్షించేందుకు ‘బీఎన్‌ఎస్‌-2023’లో కొత్త సెక్షన్‌ను చేర్చారు. కొత్త క్రిమినల్ చట్టాలలో మహిళల రక్షణ సంబంధిత కీలక నిబంధనలను అనుబంధంలో చూడవచ్చు.

కొత్త చట్టాలలో న్యాయ ప్రక్రియ వేగం, సామర్థ్యం, పారదర్శకత గణనీయంగా మెరుగయ్యాయి. ఈ మేరకు సమన్‌- వారంట్ల జారీ, బట్వాడా, అమలు, ఫిర్యాదీలు-సాక్షుల విచారణ, దర్యాప్తులలో సాక్ష్యాల నమోదు సహా అప్పీలేట్ చర్యలు లేదా ఏదైనా ఇతర విచారణలను ఎలక్ట్రానిక్ విధానంలో ఎలక్ట్రానిక్ సమాచార లేదా ఆడియో-వీడియో మాధ్యమాల ద్వారా నిర్వహించవచ్చు. దీనికి సంబంధించి ఇ-సమన్స్, ఇ-సాక్ష్య, ‘న్యాయ-శ్రుతి’ (వీడియో కాన్ఫరెన్స్‌) వంటి అనువర్తనాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఎలక్ట్రానిక్ మార్గంలో సమన్ల బట్వాడాకు ‘ఇ-సమన్’ వీలు కల్పిస్తుంది. అలాగే డిజిటల్ ఆధారాల చట్టబద్ధ-శాస్త్రీయ నమోదు సహా తారుమారుకు వీల్లేని విధంగా సేకరణ, సంరక్షణ ఎలక్ట్రానిక్ మార్గంలో నివేదనకు ‘ఇ-సాక్ష్య’ తోడ్పడుతుంది. తద్వారా ప్రామాణికతకు భరోసా లభించడమే కాకుండా జాప్యం తగ్గుతుంది. ‘న్యాయ-శ్రుతి’తో నిందితులు, సాక్షులు, పోలీసు అధికారులు, ప్రాసిక్యూటర్లు, శాస్త్రీయ నిపుణులు, ఖైదీలు తదితరుల హాజరీ ప్రత్యక్ష సాదృశ (వర్చువల్‌) మాధ్యమం ద్వారా సులువవుతుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ అనువర్తనాల సాయంతో కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియ వేగం, సామర్థ్యం, పారదర్శకత మెరుగుపడతాయి. తద్వారా మరింత ప్రభావశీల, సాంకేతికాధారిత, సత్వర పౌర హిత న్యాయ ప్రదాన వ్యవస్థకు మద్దతు లభిస్తుంది.

మహిళలు.. బాలల రక్షణ కోసం నిబంధనలు

     i.        భారతీయ న్యాయ సంహిత-2023లో కొత్త అధ్యాయం-5 కింద మహిళలు, పిల్లలపై నేరాలకు ఇతరత్రా అన్ని నేరాలకు మించి ప్రాధాన్యం ఇచ్చారు.

    ii.        అలాగే సామూహిక అత్యాచార నేరాల్లో మైనర్ బాధితుల విషయంలో వయోభేదం తొలగించారు. ఇంతకుముందు 16 ఏళ్లు, 12 ఏళ్లకన్నా తక్కువ వయసున్న బాలికలపై సామూహిక అత్యాచార నేరానికి వేర్వేరు శిక్షలను నిర్దేశించారు. ఈ నిబంధన సవరణ వల్ల ఇప్పుడు 18 ఏళ్లకన్నా తక్కువ వయస్సున్న మహిళపై సామూహిక అత్యాచార నేరానికి యావజ్జీవ కారాగారం లేదా మరణశిక్ష విధించవచ్చు.

   iii.        సమన్లు స్వీకరణ సజావుగా సాగే విధంగా మహిళలను కుటుంబంలో అర్హులైన వయోజన సభ్యురాలుగా గుర్తింపు కల్పించారు. ఈ మేరకు కుటుంబంలో ‘ఏ వయోజన పురుష సభ్యుడైనా’ అనే పదజాలాన్ని ‘వయోజన సభ్యులెవరైనా’ అని మార్పు చేశారు.

  iv.        బాధితురాలికి మరింత రక్షణ దిశగానే కాకుండా అత్యాచార నేరంపై దర్యాప్తులో పారదర్శకత  కోసం బాధితుల వాంగ్మూలాన్ని ఆడియో-వీడియో మార్గాల ద్వారా పోలీసులు రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

    v.        మహిళలపై కొన్ని నేరాల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని సాధ్యమైనంతవరకూ మహిళా మేజిస్ట్రేట్ ద్వారా, వారు అందుబాటులో లేనిపక్షంలో ఒక మహిళ సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా బాధితులకు సహాయక వాతావరణం ఏర్పరచి సున్నితంగా వ్యవహరించడంతోపాటు న్యాయానికి భరోసా ఇవ్వాలి.

  vi.        అత్యాచార బాధితురాలి వైద్య నివేదికను 7 రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పంపాలని వైద్య నిపుణులకు ఈ చట్టం నిర్దేశిస్తోంది.

 vii.        15 ఏళ్ల లోపు, 60 ఏళ్లకు మించి (65కు లోపు) పురుషులు లేదా స్త్రీ లేదా మానసికంగా/శారీరకంగా వైకల్యంగల వ్యక్తి లేదా తీవ్ర అనారోగ్యం పీడితులైన వ్యక్తి (పురుషుడు లేదా స్త్రీ) తాము నివసించే ప్రదేశం కాని ఇతర ప్రదేశాల్లో పోలీసు విచారణకు హాజరు కానక్కర్లేదనే నిబంధన కూడా ఉంది. అలాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు హాజరు కాగల సంసిద్ధత ఉన్నపుడు అందుకు అనుమతించవచ్చు.

viii.        కొత్త చట్టాల ప్రకారం మహిళలు-బాలలపై నేరాల విషయంలో బాధితులకు అన్ని ఆస్పత్రులలో ఉచిత ప్రాథమిక లేదా వైద్య చికిత్సను అందించాల్సి ఉంటుంది. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల శ్రేయస్సుతోపాటు వారు కోలుకునేందుకు ఈ నిబంధన  ప్రాధాన్యమిస్తుంది. అంతేకాకుండా అత్యవససర వైద్య సంరక్షణ తక్షణ లభ్యతకు భరోసా ఇస్తుంది.

  ix.        భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 95 ప్రకారం నేరానికి పాల్పడటం, కిరాయి నేరగాళ్లను నియమించడం లేదా భాగస్వాములను చేయడం శిక్షార్హ నేరం. దీనికి పదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటుతో కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నేరం చేయించేందుకు బాలలను పురిగొల్పడం లేదా కిరాయికి నియమించడం వంటి చర్యలకు పాల్పడకుండా నేర ముఠాలు లేదా బృందాలను నిరోధించడం ఈ నిబంధన లక్ష్యం.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్‌ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2237699) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil