గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మై గవ్ పోర్టల్‌లో ‘వికసిత్ భారత్-జీ-రామ్-జీ చట్టం 2025’ కోసం లోగో రూపకల్పన పోటీని నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోటీకి ప్రతిపాదనలు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 20, 2026
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 5:19PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మైగవ్ పోర్టల్ ద్వారా ‘వికసిత్ భారత్—గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం: వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్-జీ-రామ్-జీ) చట్టం 2025’ కోసం లోగో డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. వీబీ-జీ-రామ్ జీ చట్టం 2025 కింద సమ్మిళిత అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణ పురోగతిని సమర్థవంతంగా ప్రతిబింబించే లోగోను ఎంపిక చేయడం ఈ పోటీ లక్ష్యం.
దేశంలోని పౌరులు తమ సృజనాత్మకతను చాటుకుంటూ ఈ చట్టం కోసం ఒక వినూత్న లోగోను రూపొందించే అవకాశాన్ని ఈ పోటీ కల్పిస్తుంది. ఎంపిక చేసిన లోగో అధికారిక ముద్రగా మారుతుంది. భవిష్యత్తులో దీనిని ప్రభుత్వం అన్ని రకాల ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగిస్తుంది.
విజేతగా నిలిచిన లోగోకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ. 50,000 నగదు బహుమతిని అందజేస్తుంది. ఎంపిక చేసిన లోగోకు చెందిన అన్ని మేధో సంపత్తి హక్కులు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకే ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఆ లోగోను మార్చడానికి లేదా ఉపయోగించడానికి మంత్రిత్వ శాఖకు పూర్తి అధికారం ఉంటుంది.
ఈ పోటీలో పాల్గొనడానికి మార్చి 20, 2026 ఆఖరి తేదీ. గడువు ముగిసిన తర్వాత వచ్చిన ప్రతిపాదనలు లేదా నిర్ణీత నమూనాలో సమర్పించని వాటిని పరిగణనలోకి తీసుకోరు. అన్ని ప్రతిపాదనలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. సృజనాత్మకత, వాస్తవికత, ఇతివృత్తానికి గల ప్రాముఖ్యత, ఆకర్షణీయమైన రూపకల్పన, వివిధ మాధ్యమాల్లో వాడుకోవడానికి వీలుగా ఉండటం వంటి అంశాల ఆధారంగా లోగోను ఎంపిక చేస్తుంది.
పోటీలో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారు తమ వివరాలను నమోదు చేసుకుని, మై-గవ్ పోర్టల్ (https://bit.ly/3Pp6vi8) ద్వారా తమ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఒకరు కేవలం ఒక్క ఎంట్రీని మాత్రమే పంపడానికి అవకాశం ఉంది. పాల్గొనేవారు తమ మై-గవ్ ప్రొఫైల్‌లో పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఖచ్చితంగా, పూర్తిస్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సమాచారం అసంపూర్తిగా ఉంటే వాటిని తిరస్కరిస్తారు.
పోటీకి సంబంధించిన పూర్తి నిబంధనలు, వివరాల కోసం మై-గవ్ అధికారిక వెబ్‌సైట్ (www.mygov.in) సందర్శించవచ్చు.
లోగో సరళంగా, సృజనాత్మకంగా, ప్రభావవంతంగా ఉండాలి. ఇది ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, మొబైల్ యాప్‌ల వంటి అన్ని వేదికల్లో వాడుకోవడానికి అనువుగా ఉండాలి. లోగో పూర్తిగా సొంతంగా సృష్టించినదై ఉండాలి. ఇది ఎక్కడా ప్రచురితం కాకూడదు. ఎటువంటి కాపీరైట్ నియమాలు, మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించకూడదు.
లోగోను జేపీఈజీ, పీఎన్‌జీ లేదా పీడీఎఫ్ నమూనాలో సమర్పించాలి. ఇది కనీసం 300 డీపీఐ (డాట్స్ పెర్ ఇంచ్) రిజల్యూషన్‌తో హై-డెఫినిషన్‌లో ఉండాలి. లోగోతో పాటు, ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచన, ఉద్దేశ్యాన్ని వివరిస్తూ 50 నుంచి 100 పదాలలో ఒక చిన్న వివరణను తప్పనిసరిగా ఇవ్వాలి.
వీబీ-జీ రామ్ చట్టం 2025 చట్టం కింద గ్రామీణ కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కల్పించే చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. అలాగే సాధికారత, సమ్మిళిత అభివృద్ధి, పథకాల అనుసంధానం, సంతృప్తి ద్వారా ప్రజలకు సేవలను అందించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా సంపన్నమైన, సమర్థవంతమైన, స్వావలంబన గ్రామీణ భారత నిర్మాణానికి ఈ చట్టం ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2237294)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65