ప్రధాన మంత్రి కార్యాలయం
కోటా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. సమగ్రాభివృద్ధితో హడోటీ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ
· కోటా, బుండి, బరాన్, ఝలావర్ సహా మొత్తం హడోటీ ప్రాంతంలో కొత్త ఆశలు నిండిన రోజు ఇది.. ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ రోజొక మైలురాయి
· దాదాపు రూ. 1,500 కోట్ల వ్యయంతో ఆధునిక విమానాశ్రయంతో ఈ ప్రాంత అభివృద్ధిలో నూతనోత్తేజం
· ఈ విమానాశ్రయం ప్రారంభమైతే మెరుగుపడనున్న ప్రయాణ సౌలభ్యం... కోటా తో పాటు ఈ ప్రాంతమంతా వేగంగా వాణిజ్యాభివృద్ధి
· రవాణా రంగంలో వేగంగా పురోగమిస్తున్న కోటా
· అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోటాలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆధునిక హంగులు
· కోట, బుండి గుండా వెళ్ళే ఢిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్ రహదారితో ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 3:44PM by PIB Hyderabad
హడోటీ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమాన్నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ నేడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్మించబోతున్న కొత్త విమానాశ్రయం ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి బలమైన చోదక శక్తిగా నిలవబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సభనుద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవలి తన అజ్మీర్ పర్యటనను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు 21,000 మంది యువతకు నియామక పత్రాలను అందించిన విషయాన్ని ప్రస్తావించారు. వారం రోజుల వ్యవధిలోనే ఇలా వరుసగా భారీ కార్యక్రమాల నిర్వహణ.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనేందుకు నిదర్శనమన్నారు. ‘‘నేడు రాజస్థాన్ ఎంత వేగంతో ముందుకు సాగుతోందో ఈ కార్యక్రమాలే మనకు చాటిచెబుతున్నాయి’’ అని ఆయన స్పష్టం చేశారు.
హడోటీ ప్రాంతంలోని కోటా, బుండి, బరాన్, ఝలావర్ ప్రజలకు ఇదొక కొత్త ఆశలు చిగురిస్తున్న రోజు ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దాదాపు రూ.1,500 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక విమానాశ్రయ నిర్మాణం మొదలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘‘రాబోయే రోజుల్లో ఈ ఆధునిక విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధిలో నూతన ఉత్తేజాన్ని నింపబోతోంది’’ అని మోదీ స్పష్టం చేశారు.
2023 నవంబరు నాటి తన చేసిన పర్యటనను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. విమానాశ్రయం గురించి అక్కడి ప్రజలకు నాడు ఇచ్చిన హామీ ఈ రోజు నెరవేరుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విమానం ఎక్కాలంటే జైపూర్ లేదా జోధ్‌పూర్ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులు ఇక తొలగిపోతాయని పేర్కొన్నారు. ‘‘ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రయాణాలు సులభతరమవుతాయి. కోటాతోపాటు ఈ ప్రాంతమంతటా వాణిజ్యం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది’’ అని శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు.
విద్యకూ, విద్యుత్తుకూ నిలయమైన ఒక విశిష్ట కేంద్రంగా కోటా నగరాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. అణుశక్తి, బొగ్గు, గ్యాసు, జలవనరుల ద్వారా ఈ ప్రాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందంటూ కొనియాడారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోటా డోరియా చీరలు, కోటా స్టోన్.. అలాగే బుండీలోని బాస్మతీ బియ్యం వంటి స్థానిక ఉత్పత్తులకు ఎంతో పేరుందని ప్రశంసించారు. ‘‘కోటాలో నిర్మించబోయే ఈ కొత్త విమానాశ్రయం ఈ అవకాశాలను ఎన్నో రెట్లు పెంచేందుకు చోదక శక్తిగా పనిచేస్తుంది’’ అని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలోని పర్యాటక అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. శ్రీ మథురాధీశ్ జీ, గరాడియా మహదేవ్ వంటి క్షేత్రాల ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని, అలాగే ముకుందరా హిల్స్ వంటి వన్యప్రాణి కేంద్రాల విశిష్టతను ప్రధానమంత్రి వివరించారు. ‘‘ఈ మెరుగైన విమాన సౌకర్యం వల్ల ప్రపంచవ్యాప్త పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు. తద్వారా స్థానిక యువతకు, వ్యాపారులకు, ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా ఎంతో మేలు జరుగుతుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
కోటా ప్రాంతంలో సమగ్ర రవాణా విప్లవం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమృత భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ఢిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్ రహదారి వల్ల ప్రయోజనాలను ఆయన వివరించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ‘‘రైలు, రోడ్డు మార్గాల తర్వాత.. ఇప్పుడు మొదలవుతున్న ఈ విమానయాన సదుపాయాలు కోటా నగర అభివృద్ధిలో వేగాన్ని మరింత పెంచుతాయి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. పార్లమెంటులో ఆయన పాత్రనుద్దేశించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘‘కొన్ని పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన అల్లరి విద్యార్థులున్నప్పటికీ.. మొత్తం తరగతి ని చక్కగా నిర్వహించే ఒక ఉపాధ్యాయుడిలా ఆయన సభను నడుపుతున్నారు’’ అని శ్రీ మోదీ చమత్కరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన రంగాన్ని విశ్లేషిస్తూ.. 2014లో కేవలం 70 విమానాశ్రయాలే ఉండగా.. నేడు ఆ సంఖ్య 160 దాటిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కొత్త టెర్మినళ్లు, విమానాశ్రయాలను వికేంద్రీకృత అభివృద్ధికి ఉదాహరణలుగా చెప్పారు. ‘‘కోటాలో నిర్మిస్తున్న ఈ కొత్త విమానాశ్రయం కూడా అదే రీతిలో ఈ ప్రాంత అభివృద్ధికి నూతన ఉత్తేజాన్ని అందిస్తున్న పూర్తి నమ్మకం నాకుంది’’ అని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ ప్రాధాన్యాన్ని, వేగవంతమైన పురోగతి దిశగా స్పష్టమైన సంకల్పాన్ని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సుసంపన్నమైన, శక్తిమంతమైన రాష్ట్రంగా రాజస్థాన్ నిలవాలని ఆకాంక్షించారు. ‘‘అభివృద్ధి చెందిన రాజస్థాన్ కోసం మనం వేస్తున్న ఈ బలమైన పునాది.. వికసిత భారత్ సంకల్పానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది’’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
(రిలీజ్ ఐడి: 2236626)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam