వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోక్యోలో భారత్-జపాన్ సీఈపీఏ ఏడో సంయుక్త సంఘ సమావేశం..చర్చలకు సహాధ్యక్షత వహించిన వాణిజ్య విభాగ కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్


భారత్-జపాన్ వాణిజ్యంలో వైవిధ్యాన్నీ, సమతౌల్యాన్నీ తీసుకురావాలని పిలుపునిచ్చిన శ్రీ రాజేశ్ అగ్రవాల్..సీఈపీఏకు ఉన్న పూర్తి సామర్థ్యంతో పాటు ఎగుమతి అవకాశాల ప్రస్తావన

నాడు పోస్టు చేయడమైనది: 04 MAR 2026 5:53PM by PIB Hyderabad

భారత్-జపాన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ఆధ్వర్యంలో ఏడో సంయుక్త సమితి సమావేశాన్ని జపాన్లోని టోక్యోలో 2026 మార్చి నెల 2న నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్‌, జపాన్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ డిప్యూటీ మంత్రి సహాధ్యక్షత వహించారు.
సీఈపీఏ అమలుకు సంబంధించిన అంశాలను ఇరు పక్షాలూ సమీక్షించడంతో పాటు, ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్ఠపరుచుకోవడానికి గల అవకాశాలపై కూడా చర్చించారు.
సమావేశం కొనసాగిన క్రమంలో, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎంఈటీఐ) ఉప మంత్రితోనూ శ్రీ అగ్రవాల్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడి వాతావరణాన్నీ మెరుగుపరచడంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి త్వరలో జరుగనున్న 14వ మంత్రుల స్థాయి సమావేశం సహా అనేక అంశాల్ని గురించి ఈ సందర్భంగా చర్చించారు.
ఎంఈటీఐ ఉప మంత్రితో శ్రీ అగ్రవాల్ సమావేశమైన సందర్భంగా, 2025 ఆగస్టులో వార్షిక శిఖరాగ్ర సదస్సు వేళ రెండు దేశాల నేతలూ ప్రకటించిన ఉమ్మడి దృష్టికోణాన్ని గుర్తుకు తెచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడిని పెంచుకోవాల్సిన, వైవిధ్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు. జపాన్‌కున్న సాంకేతిక విజ్ఞానం, మూలధనం, ఆధునిక తయారీ వంటి బలాలు, భారత్ లోని నైపుణ్యం గల కార్మికులు, విశాల మార్కెట్టు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. వీటి మధ్య బలమైన పూరకత్వం నెలకొనాలని సూచించారు. నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చర్చించిన ఉభయ దేశాల ప్రజల రాకపోకలు సహా.. సీఈపీఏకు సంబంధించిన పూర్తి ప్రయోజనాల్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందని ఆయన ప్రస్తావించారు.
జౌళి, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయంతో పాటు సేవల రంగాల్లో జపాన్‌కు భారత్ ప్రస్తుతం చేస్తున్న ఎగుమతుల్లో వృద్ధికి అవకాశాలు చెప్పుకోదగినంతగా ఉన్నాయని శ్రీ అగ్రవాల్ వివరించారు. దీర్ఘకాలిక సుస్థిరతను సాధించే దిశగా మరింత అధిక సమతౌల్య పూర్వక ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వాణిజ్య కార్యదర్శి జపాన్ పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో ఏర్పాటైన ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. సాయంత్రం, భారతీయ పరిశ్రమ సమాఖ్య (సీఐఐ), కెయిదాన్‌రెన్ ల సహకారంతో జపాన్లోని భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వాణిజ్య, పెట్టుబడి సంబంధిత రోడ్ షోను ఏర్పాటు చేశారు. ఈ రోడ్ షోను భారత్ ‌నుంచి వాణిజ్యానికి ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు జపాన్ కంపెనీల నుంచి పెట్టుబడులు ఎక్కువగా వచ్చేందుకు మార్గాన్ని సుగమం చేసే ఉద్దేశంతో  నిర్వహించారు.
వాణిజ్యం, పెట్టుబడి కోసం భారత్‌లో విధానపరంగా అనుకూల వాతావరణం నెలకొందని శ్రీ అగ్రవాల్ సమావేశంలో పాల్గొన్నవారి దృష్టికి తీసుకువచ్చారు.  వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, నియంత్రణ సంబంధిత ప్రక్రియల్ని సరళతరంగా రూపొందించడానికి చర్యల్ని చేపడుతున్నారని వివరించారు. సీఈపీఏ ఒక సుస్థిర ప్రణాళికను అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇది సుంకాల్లో నిశ్చితత్వానికీ, నియంత్రణల పరంగా ముందస్తు అంచనాలకూ బాట పరుస్తోందనీ, ఫలితంగా ప్రపంచ వేల్యూ చైన్లోనూ, సరఫరా వ్యవస్థలోనూ విశ్వసనీయ భాగస్వాములుగా భారత్, జపాన్‌ల మధ్య బలమైన సహకారానికి ఒక సహాయక వాతావరణం ఏర్పడగలదన్నారు.

 

image.png
జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ ఉప మంత్రి తో వాణిజ్య కార్యదర్శి


image.png
రోడ్ షో లో సీఐఐ ప్రతినిధి వర్గంతో వాణిజ్య కార్యదర్శి


image.png
రోడ్ షో సందర్భంగా చర్చలో పాల్గొన్న వాణిజ్య కార్యదర్శి, నిక్కీ ఆసియాకు చెందిన డాక్టర్ యామాదా

***


(రిలీజ్ ఐడి: 2235456) సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam