రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కి ఎంపికై, ఎల్ బీఎస్ఎన్ఏఏలో 128వ ప్రవేశ శిక్షణ కార్యక్రమానికి హాజరైన అధికారులు రాష్ట్రపతితో సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 2:41PM by PIB Hyderabad
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి పదోన్నతి పొంది, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్ బీఎస్ఎన్ఏఏ)లో 128వ ప్రవేశ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు నేడు (మార్చి 2, 2026) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.

అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. దేశ నిర్మాణ ప్రక్రియలో సివిల్ సర్వీస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. అధికారులుగా వారి బాధ్యతలు ఇప్పుడు కేవలం జిల్లా లేదా రాష్ట్ర ప్రాధాన్యతలకు మాత్రమే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటాయని పేర్కొన్నారు. శాఖాపరమైన సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని, పాలనలో అడ్డంకులను తొలగించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సహకారంతో పనిచేయడం ద్వారా సంస్థాగత సమగ్రతను పెంపొందించవచ్చని, ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయవచ్చని తెలిపారు. అభివృద్ధి ఫలితాలను సాధించడంలో, ప్రజా సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించడంలో అధికారుల వృత్తి నైపుణ్యం, సమన్వయం, నిబద్ధత అవసరమని ఆమె చెప్పారు. అధికారులు ఇప్పుడు కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమైన పాలకులు కాదని, దేశవ్యాప్తంగా పాటించాల్సిన పాలనా ప్రమాణాలకు వారు సంరక్షకులని ఆమె గుర్తుచేశారు. వారు తీసుకునే ప్రతి నిర్ణయం 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించాలనే సమగ్ర లక్ష్యానికి అనుగుణంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఐఏఎస్ అధికారులుగా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి విధానాలను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అధికారులు తమ విలువైన అనుభవాన్ని ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తిని దిక్సూచిగా చేసుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాలని ఆమె సూచించారు.
అధికారులు సమ్మిళిత అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన, నిరుపేద వర్గాలకు చేరినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అర్థం ఉంటుందని ఆమె చెప్పారు. భౌగోళిక, సామాజిక లేదా ఆర్థిక కారణాల వల్ల ఏ ఒక్క సమూహం కూడా వెనుకబడిపోకుండా చూడటానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని అధికారులను కోరారు. స్థిరత్వం, వాతావరణ స్థితిస్థాపకత అధికారుల నిబద్ధతను తెలియజేసే మరో కీలక విషయమని అన్నారు. సీనియర్ అధికారులుగా వారు పర్యావరణహిత పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండే పాలనను ప్రోత్సహించాలని, స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించాలని ఆమె సూచించారు. నేడు మనం తీసుకునే సామూహిక నిర్ణయాలు, చర్యలే భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలను నిర్ణయిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

***
(రిలీజ్ ఐడి: 2234671)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11