రాష్ట్రపతి సచివాలయం
'సశక్త నారీ, సమృద్ధ ఢిల్లీ' కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు, ఆత్మగౌరవంతో జీవించినప్పుడు, సమాన అవకాశాలతో పాటు భద్రతను పొందినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 2:08PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఇవాళ (2 మార్చి 2026) ఎన్‌సీటీ ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన 'సశక్త నారీ, సమృద్ధ ఢిల్లీ' కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నేడు ప్రతి రంగంలోనూ మహిళలు ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. ‘‘సైనికులుగా దేశ సరిహద్దులను రక్షిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ప్రయోగశాలల్లో పరిశోధనలు చేస్తున్నారు’’ అన్నారు. క్రీడా పోటీల్లో అంతర్జాతీయ వేదికలపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని కొనియాడారు. రాజకీయాలు, సామాజిక సేవ, పరిపాలనా విభాగాలు, వ్యాపారాల్లోనూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్నాతకోత్సవాల్లో పట్టాలు, పతకాలు అందుకుంటున్న వారిలో విద్యార్థినుల సంఖ్య పెరగటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘‘కానీ హింస, ఆర్థిక అసమానత, సామాజిక మూసధోరణి, ఆరోగ్యం విషయంలో మహిళలు నేటికీ నిర్లక్ష్యానికి గురవుతునేది వాస్తవం. ఈ అడ్డంకులను అధిగమించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది’’ అన్నారు. ఒక మహిళ ఎప్పుడైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, ఆత్మగౌరవంతో జీవించగలదో, సమాన అవకాశాలను, భద్రతను పొందగలదో అప్పుడే నిజమైన సాధికారత సాధించినట్లని తెలిపారు. సాధికారత పొందిన మహిళ కేవలం ఆమె జీవితాన్నే కాక, సమాజ గమనాన్ని, భవిష్యత్ తరాలనూ మార్చగలదని వ్యాఖ్యానించారు.
మహిళా సాధికారతకు భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్రపతి తెలిపారు. ‘‘బేటీ బచావో బేటీ పడావో యోజన కార్యక్రమం ద్వారా బాలికల విద్య, భద్రతను ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా కోట్లాది మంది మహిళలు పొగ బారి నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. లక్‌పతి దీదీ యోజన వంటి కార్యక్రమాలు మహిళలకు అవకాశాలు కల్పిస్తూ స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయి. మహిళల ఆరోగ్య సంరక్షణలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిని మెరుగుపరుస్తున్నాయి. మహిళా సాధికారత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని గుర్తుంచుకోవాలి. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి, ప్రతి సంస్థ బాధ్యత. మహిళలను చదివించటం, వారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించటం, ప్రోత్సాహం, మద్దతుని అందించటం మన కర్తవ్యం. మహిళలు కలలను కనవచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని మనం భరోసా కల్పించాలి. వారి కలలను నెరవేర్చుకోవటంలో మనం తోడుంటామని చెప్పాలి’’ అని రాష్ట్రపతి అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్రజలు నివసిస్తారని రాష్ట్రపతి అన్నారు. ఢిల్లీలోని మహిళలు సురక్షితంగా, విద్యావంతులుగా, స్వావలంబన దిశగా సాగినప్పుడు, వారికి ప్రతి రంగంలో ఆత్మవిశ్వాసంతో నాయకత్వాన్ని అందించగలిగితే దేశవ్యాప్తంగా సానుకూల సందేశం వెళ్తుందన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధిలో యావత్ దేశానికి ఢిల్లీ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
సమృద్ధ ఢిల్లీ, అభివృద్ధి చెందిన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేయటంలో ఢిల్లీ మహిళలకు పూర్తిస్థాయి సహకారం అందించాలంటే, వారు ఎదగటానికి ప్రభుత్వం, సమాజం మెరుగైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్రపతి అన్నారు. ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛా వాతావరణం వారికి ఉండాలని ఆమె కాంక్షించారు.
Please click here to see the President's Speech-
***
(రిలీజ్ ఐడి: 2234669)
సందర్శకుల సూచీ సంఖ్య : : 89