ప్రధాన మంత్రి కార్యాలయం
జెరూసలెంలో సాంకేతిక ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 10:37AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌లో ఒక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారు. వివిధ రంగాల్లో ఇజ్రాయెల్ మార్గదర్శక నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో కళ్లకు కట్టారు. వ్యవసాయ సంబంధిత సాంకేతికత, జల సాంకేతికత, వాతావరణ సాంకేతికత, ఆరోగ్య రంగ సాంకేతికత, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతిక రంగాలకు చెందిన అగ్రగామి కంపెనీలూ, పరిశోధన సంస్థలూ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి.
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో నవకల్పన, సాంకేతిక భాగస్వామ్యం ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్నది. రెండు దేశాలూ ‘‘భారత్-ఇజ్రాయెల్ నవకల్పన వారధి’’ కార్యక్రమం సాయంతో, ఆధునిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి కలిసి పనిచేస్తున్నాయి. ప్రదర్శనను ప్రధానమంత్రి సందర్శించిన సందర్బంగా, కింద ప్రస్తావించిన కంపెనీలు, సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో మాట్లాడారు:
• క్వాంటమ్, డీప్ టెక్: క్వాంటమ్ మెషీన్స్ ఆధ్వర్యంలోని ఇజ్రాయెలీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఐక్యూసీసీ) గురించీ, క్లాసిక్ ఆధ్వర్యంలో క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటును సరళతరం చేయడం గురించీ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధానమంత్రికి వివరించారు.
• హెల్త్-టెక్, ఏఐ: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారితంగా రూపొందించిన పాయింట్-ఆఫ్-కేర్ అల్ట్రాసౌండ్‌ను అంకుర సంస్థ ఏఐఎస్ఏపీ ప్రదర్శించింది. ఇది వాస్తవిక సమయంలో రోగనిర్ధారణ సంబంధిత మార్గదర్శనాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక నష్టభయాన్ని గుర్తించడంతో పాటు విశ్లేషణ కోసం ఉద్దేశించిన ఏఐ ఆధారిత ఉపకరణం ‘టెక్ స్కౌట్’’ను ఇజ్రాయెల్ సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హొరైజన్ స్కానింగ్ విభాగం పరిచయం చేసింది.
• స్మార్ట్ మొబిలిటీ: మొబైల్ఐ పేరుతో ఏర్పాటైన ఒక సాంకేతిక కంపెనీ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తాను రూపొందించిన సెన్సర్నీ, చిప్ సాంకేతికతనీ ప్రదర్శించింది.
• సైబర్ భద్రత: చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సంస్థ తాను రూపొందించిన ఆధునిక ఆపద నివారణ పరిష్కారాల్ని గురించి వివరించడంతో పాటు భారత్‌లో తాను అందిస్తున్న సహకారం తీరుతెన్నులను తెలియజేసింది.
• నీరు, వ్యవసాయం: ఈ విభాగంలో ప్రదర్శించిన పరిష్కారాల్లో.. సుస్థిర అభివృద్ది రంగంలో నవకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. గాలి నుంచి తాగునీటిని తయారు చేసే తన సాంకేతికతను వాటర్‌జెన్ ప్రదర్శించింది. గురుత్వాకర్షణ ఆధారిత సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఎన్-డ్రిప్ ప్రదర్శించింది. విద్యుచ్ఛక్తి సాయం తీసుకోకుండానే ఆహార వ్యర్థాల్ని తగ్గించడానికి ఉద్దేశించిన పంట కోత తరువాతి కాలంలో అమలు చేయదగ్గ పరిష్కారాల్ని నేచురల్ ఆఫ్‌సెట్ ఫార్మింగ్ (ఎన్ఓఎఫ్) ఆవిష్కరించింది.
• వాతావరణం, బయో-టెక్: ప్రయోగశాలలో తయారు చేసే పాల ప్రొటీన్ల విషయంలో అనుసరించాల్సిన పులియబెట్టే చర్యను రీమిల్క్ ప్రదర్శించింది. మెషీన్ లర్నింగ్-ఇంటిగ్రేటెడ్ మైక్రోఆల్గే కల్టివేషన్ పద్ధతిని బార్‌ఆల్గే ప్రదర్శించింది. ప్లాస్టిక్ వ్యర్థాల్ని నిర్వహించేందుకు స్పెషలైజ్డ్ బయో-కన్వర్షన్ యాడిటివ్‌లను ఉపయోగించే పద్దతిని ‘మైనోరా బయో’ ప్రదర్శించింది.
• ఇంధనం, ప్రాకృతిక వనరులు: ఖనిజ వనరుల పరిమాణ నిర్ధారణకు ఉద్దేశించిన అధిక స్పష్టతతో కూడిన మాడలింగును జియోఫిజికల్ ఇనిస్టిట్యూట్ (జీఐఐ) ప్రదర్శించింది.
• అంతరిక్షం: బుల్లి కమ్యూనికేషన్స్ శాటిలైట్లతో పాటు ఏకీకృత సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రదర్శించింది.
నూతన ఆవిష్కర్తలతో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రదర్శనకు పెట్టిన అత్యాధునిక సాంకేతికతలలో.. భారత్-ఇజ్రాయెల్ నవకల్పన, అంకుర సంస్థలు, వాణిజ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు. మరీ ముఖ్యంగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్యసంరక్షణ సేవలు, డిజిటల్ సేవల వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నట్లు గమనించారు. భారత్‌లో పెట్టుబడి పెట్టే, తయారు చేసే, సాంకేతిక భాగస్వామ్యాలను నెలకొల్పుకొనేందుకు ఉన్న అవకాశాల్ని తెలుసుకోవాల్సిందిగా కంపెనీలను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
***
(రిలీజ్ ఐడి: 2233283)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4