ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

అందరి కోసం ఏఐ: భారత మండపంలో బహుభాషా ఓపెన్‌ సోర్స్‌ ఏఐ నమూనా ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 21 FEB 2026 1:03PM by PIB Hyderabad

అందరికీ అందుబాటులో ఉండేలా, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏఐ వ్యవస్థలను రూపొందించటానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతూ ఫిబ్రవరి 20న భారత మండపంలో "‘‘అందరి కోసం ఏఐ: వ్యక్తిగత, స్థానిక, బహుభాషా ఏఐ ఆవశ్యకత" అనే అంశంపై సదస్సును నిర్వహించారు.

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం, కరెంట్ ఏఐ, కల్ప ఇంపాక్ట్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన, ప్రపంచంలోనే మొదటి ఓపెన్‌ సోర్స్‌ హ్యాండ్‌హెల్డ్‌ బహుభాషా ఏఐ ప్రోటోటైప్‌ను ఈ సెషన్‌లో ప్రదర్శించారు. తక్కువ లేదా అసలు ఇంటర్నెట్ అనుసంధానం లేని ప్రాంతాల్లోనూ పనిచేసేలా, వ్యక్తిగత భద్రతను కల్పిస్తూ, స్థానికంగా వినియోగించుకునేలా ఈ కాంపాక్ట్‌ వాయిస్‌-ఫస్ట్‌ డివైజ్‌ను రూపొందించారు. నిరంతరం ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా పరికరంలోనే బహుభాషా సంభాషణలను విశ్లేషించటం ద్వారా వివిధ భాషల్లో అప్పటికప్పుడే సమాచారాన్ని పొందే వీలుంటుంది.

 

సమ్మిళిత, సాంస్కృతిక మూలాలకు అనుగుణంగా భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఏఐ వ్యవస్థలను రూపొందించేందుకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ నమూనా ఒక నిదర్శనం. ప్రజా ప్రయోజనాలకు సహాయక సాంకేతికతగా రూపొందించిన ఈ పరికరం.. ఓపెన్ సోర్స్‌ ఏఐ హార్డ్‌వేర్‌ సురక్షితంగా, సులభంగా అందుబాటులో ఉండేలా ఎంతగా విస్తరించదగినదో నిరూపిస్తుంది. గ్రామీణ, వసతులు లేని ప్రాంతాలకు ఇది కీలకం. వివిధ భాషల్లో వినియోగాన్ని, భారతీయ భాషా వ్యవస్థ అంతటా దీన్ని ఎలా అన్వయించవచ్చో ఆచరణాత్మకంగా ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌కి ఈ నమూనాను భాషిణి బృందం వివరించింది. అందరికీ ఏఐ అనే లక్ష్యానికి అనుగుణంగా సమ్మిళిత, బహుభాషా సామర్థ్యంతో స్థానికంగా వినియోగించుకోదగిన ఏఐ పరిష్కారాల అభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.

 

వ్యూహాత్మక ప్రపంచ స్థాయి భాగస్వామ్య నమూనాకు ఈ భాగస్వామ్యం ప్రతిరూపం. భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విధానాన్ని, భాషా సంబంధిత ఏఐ సాంకేతికతను, అంతర్జాతీయ ఓపెన్ హార్డ్‌వేర్ ఆవిష్కరణలతో ఇది అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు గ్లోబల్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రకటించారు. ఇది ఓపెన్ సోర్స్‌ ప్రోటోటైప్ ఆధారంగా నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ, భారత ఆవిష్కరణల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

ఏఐ రంగంలో ఏకరూపకతను నివారించటమే కాక, నూతన ఏఐ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తూనే, భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశం స్పష్టం చేసింది.

సమ్మిళిత, బహుభాషా, వ్యక్తిగత గోప్యతను కాపాడే ఏఐ అభివృద్ధిలో భారత నాయకత్వ స్థానాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, బాధ్యతయుమైన ఏఐ ఆవిష్కరణలకు ఆదర్శవంతమైన నమూనాను ఇది అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2231311) సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Tamil