ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 21న హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని


దేశంలో అత్యాధునిక తయారీ, సెమీ కండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయనున్న ప్రాజెక్టు.. అనుబంధ రంగాల ఎదుగుదలకూ ఊతం

ప్రపంచ సెమీ కండక్టర్ రంగంలో పటిష్టమవుతున్న భారత్ స్థానానికి నిదర్శనం ఈ ప్రాజెక్టు

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 6:50PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ (వైఈఐడీఏ)లో హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఇండియా చిప్ కంపెనీ భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 2026 ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

సాంకేతిక స్వావలంబన దిశగా భారత్ ప్రయాణంలో హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ సెమీ కండక్టర్ కేంద్రం ఏర్పాటు ఒక కీలక ప్రస్థానం. అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీలో భారత్‌ను ప్రపంచస్థాయి విశ్వసనీయ కేంద్రంగా నిలపాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు ఇది నిదర్శనం.

 

సవరించిన సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) పథకం కింద.. ఈ అవుట్‌సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని వైఈఐడీఏ పరిధిలో ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నారు. దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, పటిష్టమైన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమోటివ్, వినియోగ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇతర పరికరాల వంటి కీలక రంగాలకు ఊతమివ్వడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

ఈ ప్రాజెక్టు దేశ సెమీ కండక్టర్ వ్యవస్థకు ఎంతగానో ఊతమిస్తుంది. ఇది ఆవిష్కరణలనూ, నైపుణ్యాభివృద్ధినీ, సాంకేతికత వినియోగాన్నీ ప్రోత్సహిస్తుంది. ఈ కేంద్రం ద్వారా వేల సంఖ్యలో ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా.. అనుబంధ పరిశ్రమల వృద్ధికీ ఇది దోహదపడనుంది.

 

హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో పటిష్టమవుతున్న భారత్ స్థానాన్ని చాటడమే కాకుండా.. పటిష్టమైన, స్వయంసమృద్ధి కలిగిన ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను నిర్మించడంలో కీలక ముందడుగుగా నిలుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2231076) సందర్శకుల సూచీ సంఖ్య : : 100