ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 వేదికపై పాక్స్ సిలికాలో చేరిన భారత్: అమెరికాతో వ్యూహాత్మక సాంకేతిక సహకారం మరింత బలోపేతం
గ్లోబల్ సిలికాన్ స్టాక్‌ను సురక్షితంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడమే పాక్స్ సిలికా కార్యక్రమ లక్ష్యం
సెమీకండక్టర్ నాయకత్వాన్ని శక్తిమంతం చేస్తున్న భారతీయ సమ్మిళిత వృద్ధి: శ్రీ అశ్వనీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 12:56PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 అయిదో రోజున, భారత్ అధికారికంగా పాక్స్ సిలికా కూటమిలో చేరింది. భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక, సరఫరా వ్యవస్థల సహకారాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన విజయాన్ని ఇది సూచిస్తుంది. ఏఐ-ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేసే ఫుల్ టెక్నాలజీ స్టాక్‌ను భద్రంగా ఉంచడంలో ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.
కీలకమైన ఖనిజాలు, సెమీకండక్టర్ల తయారీ నుంచి అధునాతన ఏఐ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల కల్పన వరకు ‘‘సిలికాన్ స్టాక్’’ భద్రతకు కట్టుబడి ఉన్న విశ్వసనీయమైన దేశాలతో కూడిన వ్యూహాత్మక కూటమిగా పాక్స్ సిలికా ఏర్పాటయింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో రద్దీని తగ్గించడం, ఆర్థికపరమైన ఒత్తిళ్లను నివారించడం, నూతన సాంకేతికతలను స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య దేశాలే అభివృద్ధి చేసి, నిర్వహించేలా చూడటమే దీని లక్ష్యం.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ ఈ సందర్భాన్ని చరిత్రాత్మకమైనదిగా వర్ణించారు. ‘‘మేం కేవలం సదస్సును మాత్రమే నిర్వహించడం లేదు. భవిష్యత్తును నిర్మిస్తున్నాం’’ అని అన్నారు. యువత కోసం కొత్త పునాదులు, కొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని స్పష్టం చేశారు.
‘‘1947 నుంచి భారత వృద్ధిని చూస్తే.. సమ్మిళిత ప్రభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు’’ అని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సాధించిన సమ్మిళిత వృద్ధి గురించి వివరించారు. ‘‘ప్రస్తుతం ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు అత్యంత అధునాతనమైన రెండు నానోమీటర్ల పరిమాణమున్న చిప్‌లను తయారు చేస్తున్నారు. సెమీకండక్టర్ రంగానికి ఒక మిలియన్ మంది కొత్త నిపుణుల అవసరం ఉంది. ఇది భారత్‌కు పెద్ద అవకాశం’’ అని పెరుగుతున్న దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అమెరికా ఆర్థిక ప్రగతి, ఇంధనం, పర్యావరణం విభాగ అండర్ సెక్రటరీ జాకబ్ హెల్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం కాగితంపై ఉన్న ఒప్పందం మాత్రమే కాదు.. ఉమ్మడి భవిష్యత్తుకు ప్రణాళిక’’ అని ఈ ఒప్పందాన్ని వర్ణించారు.
రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య చరిత్రను గుర్తు చేస్తూ.. ‘‘ఈ రోజు మనం పాక్స్ సిలికా ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా.. ఆధారపడటాన్ని ఆయుధంగా మార్చుకోవడాన్ని, బెదిరింపులకు పాల్పడటాన్ని మేం అంగీకరించం. ఆర్థిక భద్రతే జాతీయ భద్రత అని మేం స్పష్టం చేస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘ఫుల్ స్టాక్ భవిష్యత్తును, భూగర్భంలోని ఖనిజాలను, ప్రయోగశాలలు, తయారీ కేంద్రాల్లోని సిలికాన్ వేఫర్లను, మానవ సామర్థ్యాన్ని వెలికి తీసే మేధను మేం భద్రంగా ఉంచుతున్నాం. నిర్మించిన వారికే భవిష్యత్తు సొంతమవుతుందన్నదే పాక్స్ సిలికా ముఖ్యోద్దేశం’’ అంటూ కార్యక్రమానికి ఉన్న విస్తృత లక్ష్యం గురించి వివరించారు.
ఈ అంశాన్ని భారత్‌లో యూఎస్ రాయబారి సెర్జియో గోర్ పునరుద్ఘాటించారు. అలాగే పాక్స్ సిలికాలో భారత్ చేరడాన్ని ‘‘వ్యూహాత్మకం, ఆవశ్యకం’’గా వర్ణించారు.
‘‘21వ శతాబ్దవపు ఆర్థిక, సాంకేతిక క్రమాన్ని నిర్వహించే కూటమి పాక్స్ సిలికా’’ అని ఆయన వర్ణించారు. ‘‘కీలకమైన ఖనిజాల గనుల నుంచి చిప్‌లను తయారు చేసే కేంద్రాలు, ఏఐను అమలు చేసే డేటా సెంటర్ల వరకు మొత్తం సిలికాన్ స్టాక్‌ను భద్రంగా ఉంచేందుకే దీనిని రూపొందించాం’’ అని అన్నారు.
‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెందిన కీలకమైన రంగాలపై స్వేచ్ఛాయుత సమాజాల నియంత్రణకు సంబంధించినదే పాక్స్ సిలికా. మేం స్వాతంత్ర్యాన్ని ఎంచుకున్నాం. మేం భాగస్వామ్యాన్ని ఎంచుకున్నాం. మేం సామర్థ్యాన్ని ఎంచుకున్నాం’’ అని ఈ భాగస్వామ్యానికున్న ప్రజాస్వామ్య పునాది గురించి రాయబారి గోర్ వివరించారు.
కృత్రిమ మేధ, అధునాతన సాంకేతికతల భవిష్యత్తును స్వేచ్ఛ, భాగస్వామ్యం, దీర్ఘకాలిక స్థిరత్వం ఉన్న దేశాలు రూపొందిస్తాయనే స్పష్టమైన సందేశాన్ని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో జరిగిన ఈ ఒప్పందం ఇస్తుంది.
పాక్స్ సిలికాతో ఒప్పందం అనంతరం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్, భారత్‌లో యూఎస్ రాయబారి సెర్జియో గోర్, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా, టాటా ఎలక్ట్రానిక్స్ సీఈవో, ఎండీ రణధీర్ ఠాకూర్ పాల్గొన్నారు. ఏఐ లక్ష్యం, సెమీకండక్టర్ల స్థిరత్వాల వ్యూహాత్మక కలయిక గురించి ప్రధానంగా చర్చించారు. ఏఐ, సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాల రంగంలో భారత్ చేస్తున్న సమన్వయ ప్రయత్నాలను శ్రీ కృష్ణన్ వివరించారు. ‘‘మా విలువలను పంచుకొనే విశ్వసనీయమైన భాగస్వాములతో స్తిరమైన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడమే మా లక్ష్యం’’ అని తెలియజేశారు. ఇది అంతర్జాతీయ సాంకేతిక వ్యవస్థ భవిష్యత్తులో భారత్ స్థానాన్ని ఇది పదిలం చేస్తుందన్నారు.
‘‘ఏఐ విప్లవం వచ్చేది భవిష్యత్తులో కాదు.. అది ఇప్పటికే ప్రారంభమైంది’’ అంటూ ఈ పరివర్తనకున్న తక్షణ ఆవశ్యకతను సెర్జియో గోర్ వివరించారు. సరఫరా వ్యవస్థకు సంబంధించిన కోణాన్ని మెహ్రోత్రా వివరించారు. దీనిని ‘‘స్థిరమైన, భద్రమైన సరఫరా వ్యవస్థలను నిర్మించాలనే ఉమ్మడి నిబద్ధత’’గా వర్ణించారు. అలాగే ‘‘సమాజ హితం కోసం ఏఐను ముందుకు తీసుకెళ్లే విజయవంతమైన వ్యవస్థ’’గా వర్ణించారు. ‘‘సమయానుగుణమైన, వ్యూహాత్మక అడుగు’’గా పాక్స్ సిలికాను ఠాకూర్ వర్ణించారు. అలాగే ‘‘ముడి సరకు, ఆవిష్కరణ, గణన’’తోనే సెమీకండక్టర్ ప్రయాణం ముందుకు నడుస్తుందన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2231070)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11