|
ప్రధాన మంత్రి కార్యాలయం
అబుదాభి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 5:45PM by PIB Hyderabad
అబుధాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌లో అధికారిక పర్యటన నిమిత్తం ఈ నెల 18న ఢిల్లీకి వచ్చారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026”లో 19న ఆయన పాల్గొన్నారు. లోగడ 2024 సెప్టెంబరులో ఆయన తొలిసారి పర్యటించగా, ఇప్పుడు భారత్ పర్యటనకు రావడం ఇది రెండోసారి.
ఈ నేపథ్యంలో ‘ఏఐ’ సదస్సులో పాల్గొన్న అనంతరం 19న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గౌరవనీయ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ కలుసుకున్నారు. భారత్-యూఏఈ మధ్య బలమైన రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య, ఇంధన, ప్రజా సంబంధాల సహిత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా అబుధాబి, దుబాయ్ రాచకుటుంబాల సభ్యుల ఇటీవలి భారత పర్యటన విజయవంతం కావడాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక సహకారం తదితర విస్తృత రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల విశేష ప్రగతిపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉభయ పక్షాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి (సీఈపీఏ) 2026 ఫిబ్రవరి 18 నాటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో అద్భుత వృద్ధిని వారు కొనియాడారు. ఇంకా, ఇద్దరు నాయకులు గణనీయమైన ద్వి-మార్గం పెట్టుబడి ప్రవాహాలను ప్రశంసించారు. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థలో యూఏఈ ‘స్వతంత్ర వెల్త్ ఫండ్’ సంస్థల పెట్టుబడులు కొనసాగేలా చూడాలని వారు నిర్ణయించారు. అలాగే, పరస్పర ప్రయోజనం దిశగా ఈ భాగస్వామ్యం బలోపేతంలో సరికొత్త స్వతంత్ర ఫండ్ ‘ఎల్'ఇమాద్’ సామర్థ్యాన్ని వారు ప్రశంసించారు. అంతరిక్షం, అణుశక్తి, సాంకేతికత, ఆవిష్కరణ వంటి వ్యూహాత్మక రంగాలలో భారత్, యూఏఈ మధ్య సహకార విస్తృతికిగల అవకాశాలపైనా వారు చర్చించారు.
సంప్రదాయ, కొత్త సంయుక్త రంగాలలో ద్వైపాక్షిక సహకార విస్తృతికి వేదికగా నిలిచిన కింది కార్యక్రమాలపై వారిద్దరూ హర్షం ప్రకటించారు:
· వైద్య, ఆరోగ్య రంగంలో సహకారంపై భారత ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరోగ్య-నివారణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం ఖరారు: వృత్తిపరమైన ఆదానప్రదానం, సంస్థాగత సహకారం, పరిశోధన, డిజిటల్ ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి దిశగా సంయుక్త కృషిని ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది. ఇది రెండు దేశాల ప్రజలకూ ప్రయోజనకరంగా ఉంటుంది.
· భారత్‌లో సూపర్ కంప్యూటర్ క్లస్టర్ విస్తరణ దిశగా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, జి42, మొహమ్మద్ బిన్ జాయెద్ కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం మధ్య ఒడంబడిక పత్రం ఖరారు: దీంతో భారత్‌లో సూపర్ కంప్యూటర్ క్లస్టర్ విస్తరణ వేగం పుంజుకుంటుందని ప్రధానమంత్రి మోదీ, యూఏఈ అధ్యక్షుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ జనవరి 19న భారత పర్యటన సందర్భంగా ప్రకటించారు. సూపర్ కంప్యూటర్ క్లస్టర్ ఏఐ ఇండియా మిషన్‌లో భాగంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలకు పరిశోధన, అనువర్తనాల అభివృద్ధి వాణిజ్య వినియోగాలకు అందుబాటులో ఉంటాయి.
· గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో అబుధాబి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు.
న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు విజయవంతం కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గౌరవనీయ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభినందించారు. తదుపరి ఏఐ సదస్సును స్విట్జర్లాండ్ నిర్వహించనుండగా, అనంతర సదస్సును యూఏఈ నిర్వహించనుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
భారత్-యూఏఈ మధ్య క్రమబద్ధ నాయకత్వ స్థాయి చర్చల సంప్రదాయాన్ని ఈ పర్యటన పునరుద్ఘాటించింది. ఇది రెండు దేశాల సాంకేతిక భాగస్వామ్యంపై ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధతను బలోపేతం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలలో కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికతలు కీలక మూలస్తంభాలలో ఒకటిగా నిలిచాయి.
***
(రిలీజ్ ఐడి: 2230501)
|