ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
"ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భాగంగా 24 గంటల్లోనే 2.5 లక్షలకు పైగా ఏఐ బాధ్యతా ప్రతిజ్ఞలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత్"
కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 4:09PM by PIB Hyderabad
ఫిబ్రవరి 16 నుంచి 17వ తేదీ వరకు 24 గంటల వ్యవధిలోనే చెల్లుబాటయ్యే 2,50,946 ప్రతిజ్ఞలతో... "24 గంటల్లో ఏఐ బాధ్యత ప్రచారం కోసం అత్యధిక ప్రతిజ్ఞలు అందుకున్న దేశం"గా భారత్ విజయవంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సాధించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ప్రకటించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్... ఆ శాఖ అదనపు కార్యదర్శి, ఇండియాఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డీజీ శ్రీ అభిషేక్ సింగ్... ఇండియాఏఐ సీవోవో శ్రీమతి కవితా భాటియా... ఇంటెల్ సెంట్రల్ ఇంజనీరింగ్ గ్రూప్ ఎస్‌వీపీ, జీఎమ్ శ్రీ శ్రీనివాసన్ అయ్యంగార్... ఈ విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్ణేత శ్రీ ప్రవీణ్ పటేల్ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 16న ఇంటెల్ ఇండియా సహకారంతో ఇండియాఏఐ మిషన్ కింద దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఏఐ బాధ్యత ప్రతిజ్ఞ ప్రచారం... aipledge.indiaai.gov.in అనే ప్రత్యేక పోర్టల్ ద్వారా కృత్రిమ మేధ విషయంలో నైతిక, సమ్మిళిత, బాధ్యతాయుత వినియోగానికి కట్టుబడి ఉండేలా దేశవ్యాప్తంగా పౌరులకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డేటా గోప్యత, జవాబుదారీతనం, పారదర్శకత, దృష్టాంత-ఆధారిత ప్రశ్నల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి కీలక సూత్రాలను గురించి అవగాహన కలిగించింది. తద్వారా విశ్వసనీయమైన, మానవ-కేంద్రిత ఏఐ వ్యవస్థను నిర్మించాలనే భారత్ దార్శనికతను ఇది బలోపేతం చేసింది. ప్రతిజ్ఞను పూర్తి చేసిన వారు డిజిటల్ బ్యాడ్జ్, ఏఐ అభ్యసన అవకాశాలు పొందారు.
శ్రీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... బాధ్యతాయుతంగా, నైతికతతో ఏఐని వినియోగించడంలో యువతను భాగం చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రశంసించారు. "కళాశాలలను చేరుకోవడానికి, అధ్యాపకులతో సంభాషించడానికి, సమాజ శ్రేయస్సు కోసం - మన జీవితాలను మెరుగుపరిచే సాంకేతికతగా - ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి, దాని బాధ్యతాయుత ఉపయోగాన్ని నిర్ధారించుకోవడానికి విద్యార్థులు ఈ ప్రతిజ్ఞను తీసుకోవాలని ప్రోత్సహించిన ఆయన దార్శనికత మాకు ప్రేరణనిచ్చింది. ఈ ప్రతిజ్ఞ చేసిన 2,50,000 మంది విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. ఇది నిజంగా దేశానికి గర్వకారణమైన రోజు. ఏఐని బాధ్యతతో వినియోగించే భవిష్యత్తు దిశగా దేశం పయనించాల్సిన మార్గం ఇది."
5,000 ప్రతిజ్ఞల ప్రారంభ లక్ష్యాన్ని మించి రికార్డు స్థాయి బాగస్వామ్యం నమోదవడం బలమైన ప్రజా భాగస్వామ్యాన్ని, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం పట్ల పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ప్రచారం పౌరుల నేతృత్వంలోని డిజిటల్ బాధ్యతలో కీలక విజయాన్ని సూచిస్తుందనీ... సమ్మిళితత్వం, నైతిక విలువలు, ప్రజల విశ్వాసంపై దృష్టి సారించి ప్రపంచస్థాయి ఏఐ చర్చను రూపొందించడం పట్ల భారత్ నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2229715)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12