వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అమెరికా - భారత్ ఉమ్మడి ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
07 FEB 2026 4:29AM by PIB Hyderabad
పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం, సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య ఒక మధ్యంతర ఒప్పందం (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఇంటరిం అగ్రిమెంట్) కుదిరిందని ప్రకటిస్తున్నందుకు అమెరికా, భారత్ సంతోషిస్తున్నాయి. 2025 ఫిబ్రవరి 13న అధ్యక్షుడు డోనాల్డ్ జే. ట్రంప్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన విస్తృతమైన 'అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం' చర్చల పట్ల ఉన్న నిబద్ధతను నేటి ఫ్రేమ్‌వర్క్ పునరుద్ఘాటిస్తోంది. ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో అదనపు మార్కెట్‌ను అందుబాటులో ఉంచటం, మరింత పటిష్ఠమైన సరఫరా వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలు ఉంటాయి. అమెరికా, భారత్ మధ్య కుదిరిన ఈ మధ్యంతర ఒప్పందం మన దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది పరస్పర ప్రయోజనాలు, స్పష్టమైన ఫలితాల ఆధారంగా సమతుల్య వాణిజ్యం పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధతను చాటి చెబుతుంది.
అమెరికా, భారత్ మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందంలోని ప్రధాన నిబంధనలు:
-
డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ (డీడీజీ), పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, తాజా పండ్లు, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, ఇతర ఉత్పత్తులతో పాటు అన్ని రకాల అమెరికన్ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార- వ్యవసాయ ఉత్పత్తులపై భారతదేశం సుంకాలను తొలగిస్తుంది లేదా తగ్గిస్తుంది.
-
2025 ఏప్రిల్ 2 నాటి కార్యనిర్వహక ఉత్తర్వు 14257ను (అమెరికా వస్తువుల విషయంలో వాణిజ్య లోటును తగ్గించేందుకు పరస్పర సుంకాలను విధిస్తూ దిగుమతులను నియంత్రించడం) సవరించటం ద్వారా వస్త్రాలు- దుస్తులు, తోలు - పాదరక్షలు, ప్లాస్టిక్ - రబ్బరు, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి ఆలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు, కొన్ని రకాల యంత్రాలతో సహా భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 18 శాతం పరస్పర సుంకాన్ని అమెరికా విధిస్తుంది. ఈ మధ్యంతర ఒప్పందం విజయవంతంగా చేసుకున్న తర్వాత 2025 సెప్టెంబర్ 5 నాటి కార్యనిర్వహక ఉత్తర్వు- 14346 (పరస్పర సుంకాల పరిధిని మార్చటం, వాణిజ్య - భద్రతా ఒప్పందాల అమలు కోసం విధానాలను రూపొందించడం) కింద జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలతో సహా గుర్తించిన పలు వస్తువులపై అమెరికా ఈ పరస్పర సుంకాన్ని పూర్తిగా తొలగిస్తుంది.
-
2018 మార్చి 8 నాటి ప్రకటన 9704 (అమెరికాలోకి అల్యూమినియం దిగుమతులు), 2018 మార్చి 8 నాటి ప్రకటన 9705 (అమెరికాలోకి ఉక్కు దిగుమతులు), 2025 జూలై 30 నాటి ప్రకటన 10962ల (అమెరికాలోకి రాగి దిగుమతులు) కింద అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో నిర్దేశించిన విమానాలు, విమాన విడిభాగాలపై విధించిన సుంకాలను కూడా అమెరికా రద్దు చేస్తుంది. అమెరికా జాతీయ భద్రతా అవసరాలకు అనుగుణంగా 2019 మే 17 నాటి ప్రకటన 9888ను (ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాల దిగుమతులు) సవరించటం ద్వారా భారతీయ ఆటో విడిభాగాలకు 'ప్రాధాన్యత ప్రతిపాదికన'(ప్రిఫరెన్షియల్ టారిఫ్ రేట్ కోటా) ప్రవేశం లభిస్తుంది. ఇక ఫార్మాస్యూటికల్స్, ఫార్మా పదార్ధాలపై అమెరికా నిర్వహిస్తున్న 'సెక్షన్ 232' విచారణ ఫలితాలను బట్టి జెనరిక్ ఔషధాలు, వాటి తయారీలో వాడే ముడి పదార్ధాల విషయంలో భారతదేశానికి చర్చల ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది.
-
ఆసక్తి ఉన్న రంగాల్లో నిరంతర ప్రాతిపదికన పరస్పర ప్రాధాన్యత క్రమంలో మార్కెట్‌ను అందుబాటులో ఉంచేందుకు అమెరికా, భారత్ అంగీకరించాయి.
-
ఈ ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రధానంగా అమెరికా, భారతదేశానికే దక్కేలా రెండు దేశాలు 'రూల్స్ ఆఫ్ ఆరిజిన్'ను రూపొందించుకుంటాయి.
-
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే సుంకాలు కాని అడ్డంకులను రెండు దేశాలు పరిష్కరించుకుంటాయి. ఇందులో భాగంగా అమెరికన్ వైద్య పరికరాల వాణిజ్యంలో దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులను తొలగించడానికి భారతదేశం అంగీకరించింది. అమెరికన్ సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వస్తువులు మార్కెట్లోకి అందుబాటులోకి రావటాన్ని ఆలస్యం చేసే లేదా పరిమాణాత్మక పరిమితులను విధించే కఠినమైన 'ఇంపోర్ట్ లైసెన్సింగ్' విధానాలను భారత్ రద్దు చేస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన ఆరు నెలల లోపు గుర్తించిన రంగాల్లో అమెరికా అభివృద్ధి చేసిన లేదా అంతర్జాతీయ ప్రమాణాలు (టెస్టింగ్ అవసరాలతో సహా).. భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అమెరికన్ ఎగుమతులకు ఆమోదయోగ్యంగా ఉంటాయా లేదా అనే అంశాన్ని సానుకూల దృక్పథంతో భారత్ నిర్ణయిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయటానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. అమెరికన్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న సుంకాలు కాని సమస్యలను పరిష్కరించడానికి కూడా భారతదేశం అంగీకరించింది.
-
సాంకేతిక నిబంధనల అమలును సులభతరం చేసే లక్ష్యంతో అమెరికా, భారత్ పరస్పరం అంగీకరించిన రంగాల్లో ప్రమాణాలు, అనుగుణ్యత అంచనా పద్ధతులపై (కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ ప్రొసీజర్స్) చర్చలు జరపాలని భావిస్తున్నాయి.
-
అంగీకరించిన సుంకాలలో ఏవైనా మార్పులు జరిగితే దానికి అనుగుణంగా అవతలి దేశం కూడా తన నిబద్ధతలను మార్చుకోవచ్చని రెండు దేశాలు అంగీకరించాయి.
-
బీటీఏ చర్చల ద్వారా మార్కెట్ అవకాశాలను మరింత విస్తృతం చేయడానికి రెండు దేశాలు కృషి చేస్తాయి. భారతీయ వస్తువులపై సుంకాలను మరింత తగ్గించాలన్న భారత్ విన్నపాన్ని బీటీఏ చర్చల సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా తెలిపింది.
-
సరఫరా వ్యవస్థల పటిష్ఠత, ఆవిష్కరణలను పెంపొందించడానికి తృతీయ పక్షాల మార్కెటేతర విధానాలను ఎదుర్కోవడానికి, పెట్టుబడి సమీక్షలు- ఎగుమతి నియంత్రణలపై సహకరించుకోవడానికి రెండు దేశాలు ఆర్థిక భద్రతను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి.
-
భారతదేశం రాబోయే 5 ఏళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు - విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ), డేటా సెంటర్లలో ఉపయోగించే వస్తువులతో సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని రెండు దేశాలు గణనీయంగా పెంచుతాయి.. సంయుక్త సాంకేతిక సహకారాన్ని విస్తరిస్తాయి.
-
డిజిటల్ వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న వివక్షతతో కూడిన లేదా భారంగా ఉన్న పద్ధతులను తొలగించడానికి అమెరికా, భారత్ కట్టుబడి ఉన్నాయి. బీటీఏలో భాగంగా పటిష్ఠమైన, పరస్పర ప్రయోజనకరమైన డిజిటల్ వాణిజ్య నిబంధనలను రూపొందించడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని సిద్ధం చేస్తాయి.
ఈ ఫ్రేమ్‌వర్క్‌ను తక్షణమే అమెరికా, భారత్ అమలు చేస్తాయి. అలాగే 'నియమావళి’లో అంగీకరించిన రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) ముగించే లక్ష్యంతో ఈ మధ్యంతర ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు కృషి చేస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2224878)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20