రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమృత భారత్ స్టేషన్ పథకం కింద 172 స్టేషన్ల పనులు పూర్తి: అశ్వనీ వైష్ణవ్


· ఏటా రెండు సార్లు దేశంలోని అన్ని రైల్వే వంతెనల తనిఖీ... కొన్నిటిపై వాటి పరిస్థితి ఆధారంగా తరచూ పరిశీలన

· ఎల్‌హెచ్‌బి కోచ్‌ల తయారీ 2004–14లో 2,337 నుంచి 2014–25 నాటికి 18 రెట్లు పెరిగి 42,667కు చేరింది

· వివిధ రైల్వే స్టేషన్లలో 11650 స్టాళ్లు/యూనిట్లు ఎస్సీ.. ఎస్టీ వర్గాలు సహా అర్హులకు కేటాయింపు

· స్టేషన్లు.. రైళ్లలో పరిశుభ్రత-పారిశుధ్య పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు; పరిశుభ్రత వ్యయం
ప్రయాణిక ఛార్జీలో భాగం కాదు

· రైళ్లలో అధిక ధర వసూలు నిరోధం కోసం ‘పీఓఎస్‌’ యంత్రాలు.. ఇ-ప్యాంట్రీ సేవ.. మెనూ.. టారిఫ్ లింక్‌తో సంక్షిప్త సందేశ సదుపాయం

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 4:53PM by PIB Hyderabad

స్టేషన్ల పునరాభివృద్ధి

దేశంలోని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి లక్ష్యంగా దీర్ఘకాలిక విధానంతో రైల్వే మంత్రిత్వశాఖ అమృత భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద స్టేషన్ల మెరుగుకు బృహత్‌ ప్రణాళికల రూపకల్పన,  దశలవారీగా అమలు చేపడతారు. కింది అంశాలు ఈ ప్రణాళికలలో భాగంగా ఉంటాయి:

·        స్టేషన్, జన సంచార ప్రాంతాలకు సౌలభ్యం మెరుగుదల

·        నగరం రెండువైపులా స్టేషన్ల ఏకీకరణ

·        స్టేషన్ భవనాల మెరుగుదల

·        వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, వాటర్ బూత్‌ల మెరుగుదల

·        ప్రయాణిక రద్దీకి అనుగుణంగా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి/ఎయిర్ కాన్‌కోర్స్ ఏర్పాటు

·        లిఫ్ట్/ఎస్కలేటర్లు/ర్యాంప్ల ఏర్పాటు

·        ప్లాట్‌ఫామ్, వాటి పైకప్పుల మెరుగుదల/నిర్మాణం

·        ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ వంటి పథకాలతో స్థానిక ఉత్పత్తుల విక్రయాన్ని ప్రోత్సహించేందుకు కియోస్కుల ఏర్పాటు

·        పార్కింగ్ ప్రాంతాలు, బహుళ రవాణా ఏకీకరణ

·        దివ్యాంగులకు సౌకర్యాలు

·        మెరుగైన ప్రయాణిక సమాచార వ్యవస్థలు

·        ప్రతి స్టేషన్‌లో అవసరాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సదస్సులకు ప్రత్యేక ప్రదేశాలు, పరిసరాల సుందరీకరణ తదితర సదుపాయాల కల్పన.

సుస్థిర, పర్యావరణ హిత పరిష్కారాలతోపాటు అవసరానుగుణ కంకర రహిత రైలు మార్గాలు నిర్మాణం, దశలవారీగా, సాధ్యాసాధ్యాల మేరకు దీర్ఘకాలికంగా స్టేషన్‌లో నగర కేంద్ర పునఃసృష్టి వగైరాలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీనికింద పునరాభివృద్ధి కోసం ఇప్పటిదాకా 1337 స్టేషన్లను గుర్తించగా, ఇప్పటిదాకా 172 స్టేషన్ల పనులు పూర్తయ్యాయి.

వంతెనల భద్రత

దేశవ్యాప్తంగా వంతెనల భద్రతకు రైల్వేలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వంతెనలకు పటిష్ఠ భద్రత, జాగ్రత్త చర్యల దిశగా సుస్థిర వంతెనల తనిఖీ వ్యవస్థ ఉంది. సంబంధిత అధికారులు అన్ని వంతెనలనూ ఏటా రెండుసార్లు తనిఖీ చేస్తారు. ఈ మేరకు వర్షాకాలం ప్రారంభానికి ముందు, ఆ తర్వాత సమగ్ర తనిఖీ నిర్వహిస్తారు. దీనికితోడు చీఫ్ బ్రిడ్జి ఇంజనీర్ నిర్దేశించిన విధంగా కొన్ని వంతెనలను మాత్రం వాటి స్థితిగతులను బట్టి తరచూ పరిశీలన చేపడతుంటారు. కీలక, భారీ ఏటా 20 శాతం వంతెనల వంతున సమగ్ర సాంకేతిక తనిఖీ ప్రక్రియ నిర్వహిస్తారు.

వంతెనల మరమ్మత్తు/బలోపేతం/పునరుద్ధరణ/పునర్నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ. వంతెనల తనిఖీ ప్రాతిపదికన ఇది కొనసాగుతుంది. భారతీయ రైల్వేలలో 2022-2025 మధ్య (డిసెంబరు  2025 వరకు) 8,626 రైల్వే వంతెనల మరమ్మత్తు/పునరుద్ధరణ/బలోపేతం/పునర్నిర్మాణం చేపట్టారు.

అంతేకాకుండా కొన్ని వంతెనలను వాటి పరిస్థితిని బట్టి తరచూ తనిఖీ చేస్తారు. వంతెనల మరమ్మతు/బలోపేతం/పునరుజ్జీవనం/పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఈ తనిఖీల సందర్భంగా వాటి భౌతిక స్థితిగతులను బట్టి అవసరమైనప్పుడల్లా తగిన చర్యలు చేపడతారు. దీంతోపాటు ప్రత్యేక సాంకేతిక తనిఖీ కూడా నిర్వహించి, ఆ మార్గంలోనూ తదుపరి చర్యలు తీసుకుంటారు. రుతుపవనాల ప్రారంభానికి ముందు, తర్వాత ‘సబ్‌వేలు/ఆర్‌యూబీ’లను తనిఖీ చేస్తారు. వాటిలో నీరు చేరికను తగ్గించే చర్యల్లో భాగంగా కొత్త డిజైన్లతో మెరుగైన డ్రైనేజీ, సహజ కాలువలకు నీటి మళ్లింపు, హంప్‌లు, క్రాస్-డ్రెయిన్ల ఏర్పాటు, జాయింట్ల మూసివేత, ముప్పున్న ప్రదేశాల్లో అధిక సామర్థ్యం గల  పంపుల ఏర్పాటు వంటివి కూడా చేపడతారు.

వంతెన పునరుద్ధరణ పనుల విధానాలను ఇండియన్ రైల్వే బ్రిడ్జ్ మాన్యువల్‌లో పొందుపరిచారు. కాంట్రాక్ట్ నిర్వహణ, సాధారణ-ప్రత్యేక కాంట్రాక్ట్ నిబంధనలతో నాణ్యత హామీ ప్రణాళిక, తనిఖీ-పరీక్ష ప్రణాళికల అనుసరణకు చర్యలు చేపడతారు.

భద్రతపై జవాబుదారీతనం దిశగా లోపాలు సరిదిద్దే బాధ్యత వ్యవధి తీరేదాకా భద్రత డిపాజిట్ నిలుపుదల, కాంట్రాక్ట్ రద్దు వంటి శిక్షార్హ నిబంధనలను అమలు చేస్తారు. వంతెన పనులను పూర్తి చేయడమన్నది ప్రదేశం, రకం, పథకాల ఆమోదం, అప్రోచ్ రోడ్ లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాదిలో పని సీజన్ వ్యవధి, బ్లాక్‌ల లభ్యత, వేగ పరిమితుల విధింపు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కోచ్‌ల తయారీ

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం 3 కోచ్‌ తయారీ యూనిట్లున్నాయి. ఈ యూనిట్ల నిర్మాణ వ్యయం, వాటి ప్రదేశం, తయారీ కోచ్‌ల రకం, ప్రణాళికబద్ధ ఉత్పత్తి సామర్థ్యం, తదనుగుణ యంత్ర సామగ్రి ఏర్పాటు తదితరాలపై ఆధారపడి మారుతుంది. కోచ్‌ల తయారీ యూనిట్ల నిర్మాణం వాటిపై దీర్ఘ కాలంలో వెచ్చించాల్సిన వ్యయంతోపాటు అనేక దశలలో సాగుతుంది. ఇందులో యూనిట్ల ప్రారంభ ఏర్పాటుతో పాటు ఎప్పటికప్పుడు సౌకర్యాల తదుపరి ఉన్నతీకరణ-విస్తరణ కూడా అంతర్భాగంగా ఉంటాయి. ఉదాహరణకు॥ ఇటీవల పని ప్రారంభించిన రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రూ.3,042.83 కోట్లు వెచ్చించారు.

ఇక ప్రస్తుతం పనిచేస్తున్న 3 కోచ్‌ల తయారీ యూనిట్లలో- ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై; రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల; మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్‌బరేలిలీ ఉన్నతీకరణ/విస్తరణ సంబంధిత వివిధ ప్రాజెక్టుల కోసం రూ.2443 కోట్లు మంజూరయ్యాయి.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ విస్తరణకు సంబంధించి- ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో సురక్షిత, మరింత ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను దశలవారీగా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. సాంకేతికంగా ఉన్నతమైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రయాణం మెరుగ్గా, సుందరంగా, తేలికైన డిజైన్, యాంటీ క్లైంబింగ్ ఫీచర్లు, వైఫల్య సూచన వ్యవస్థసహా ఎయిర్ సస్పెన్షన్ (సెకండరీ), స్టెయిన్‌లెస్ స్టీల్ షెల్, డిస్క్ బ్రేక్ సిస్టమ్ వంటి విశిష్టతలుంటాయి.

దేశంలో 2004-2014 నుంచి 2014-2025 మధ్య ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఉత్పాదన:

వ్యవధి

తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

2004-2014

2,337

2014-2025

42,677 (18 రెట్లకు పైగా అధికం

రైల్వే స్టేషన్లలో స్టాళ్లు

ప్రయాణికులకు తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా రైల్వే స్టేషన్లలోని స్టాళ్ల కేటాయింపులో ఎప్పటికప్పుడు అమలులోగల పద్ధతులకు అనుగుణంగా ఈ-వేలం/ఈ-టెండర్ ప్రక్రియలు నిర్వహిస్తారు.

దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం 11,650 స్టాళ్లు/యూనిట్లు ఉన్నాయి. వీటిని ఎస్సీ/ఎస్టీ వర్గాలు సహా అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత స్టాళ్ల కేటాయింపు సంబంధిత విధానంలో ఎలాంటి నిబంధన లేదు.

పరిశుభ్రత

పరిశుభ్రత నిరంతర ప్రక్రియ కాబట్టి, రైల్వేల్లో కోచ్‌ల సముచిత నిర్వహణ, పరిశుభ్ర స్థితిలో ఉంచడానికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటుంది. వాష్‌రూమ్‌లు సహా కోచ్‌లలో శుభ్రత, పారిశుధ్యం పర్యవేక్షణకు, భరోసా ఇవ్వడానికి రైల్వేలు కింది చర్యలు తీసుకుంటున్నాయి:

·        కోచ్‌లన్నిటినీ టాయిలెట్లు సహా లోపల, వెలుపల చక్కగా శుభ్రం చేయడం కోసం ప్రాథమిక నిర్వహణ సమయంలో యాంత్రిక కోచ్ క్లీనింగ్ విధానం కొనసాగుతోంది.

·        ప్రయాణిక ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం రైళ్లలో హౌస్ కీపింగ్ స్టాఫ్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

·        ఎంపిక చేసిన రైళ్లలో యాంత్రిక పరిశుభ్రత కోసం క్లీన్ రైల్‌ స్టేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు, వాటిలో షెడ్యూల్డు స్టాపేజ్ సమయంలో వాష్‌రూమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. హై ప్రెజర్ జెట్ మెషీన్లు, క్లీనింగ్ పరికరాలతో కూడిన ప్రత్యేక సిబ్బంది బృందం కోచ్ టాయిలెట్లను శుభ్రం చేసి, ఆరబెడుతుంది.

·        అన్ని ప్రయాణిక రైళ్లలో బయో-టాయిలెట్లు ఏర్పాటు చేశారు, తద్వారా ట్రాక్‌లోని కోచ్‌ల నుంచి మానవ వ్యర్థాలు వెలువడకుండా మెరుగైన శుభ్రత ఉంటుంది. రైళ్లలో బయో టాయిలెట్ల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

వ్యవధి

బయో టాయిలెట్ల సంఖ్య

2004-2014

9,587

2014-నేటిదాకా

3,61,572

·        తనిఖీ ద్వారా క్రమం తప్పని పర్యవేక్షణతోపాటు రైల్ మదద్/రైల్ వన్ యాప్ సహా  ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు.

స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రత, పారిశుధ్యం పరిరక్షణ దిశగా ఐఆర్‌ ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేసింది. పరిశుభ్రత దిశగా వెచ్చించే నిధుల కేటాయింపు ప్రయాణిక ఛార్జీలో భాగంగా ఉండదు.

ఆహారం - కేటరింగ్‌

రైల్వేలు ఏటా సగటున 58 కోట్ల భోజనాలను అందిస్తాయి. వీటిపై ఫిర్యాదులు సగటున 0.0008 శాతం మాత్రమే. ఇటువంటి ఫిర్యాదులపై గడచిన మూడేళ్లలో విచారణ ఆధారంగా, రూ.2.6 కోట్ల జరిమానా విధించారు.

ప్రయాణికుల అభిప్రాయ స్వీకరణ కోసం రైల్ మదద్ పోర్టల్ ద్వారా కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల  ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను బలోపేతం, సరళీకృతం చేసి మరింత అందుబాటులోకి తెచ్చారు. రైల్ మదద్ పోర్టల్ ప్రారంభంతో ఫిర్యాదులు, సూచనలను నమోదుకు దశగా ప్రయాణికులకు రైల్వేలు సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి.

కేటరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్‌సీటీసీ, రైల్వే అధికారులు రైళ్లలో ఆకస్మిక, పునరావృత తనిఖీ చేస్తారు. ఆన్‌బోర్డ్ సేవల నిరంతర పర్యవేక్షణ, ప్రయాణిక ఫిర్యాదుల ప్రత్యక్ష పరిష్కారం కోసం సూపర్‌వైజర్లు, కేటరింగ్‌ అసిస్టెంట్లను ఐఆర్‌సీటీసీ నియమించింది. తనిఖీ విస్తృతం చేయడం కోసం మెయిల్, ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో కేటరింగ్ సేవల విభాగంపై పర్యవేక్షణకు అదనంగా ఆతిథ్య పర్యవేక్షకులను నియమించింది.

నిర్ణీత ధరల ప్రకారం ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచేందుకు రైల్వేలు నిరంతరం కృషి చేస్తున్నాయి. తదనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. ఇందులో భాగంగా రైళ్లలో అధిక ఛార్జీల వసూలు అరికట్టడానికి క్రింది చర్యలు చేపట్టాయి:

·        ప్రయాణికులపై రేట్లపై అవగాహన కల్పిస్తూ-  మెనూ, టారిఫ్ లింక్‌తో సంక్షిప్త సందేశం వెళ్తుంది.

·        బిల్లింగ్, నగదు రహిత చెల్లింపుల కోసం పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ఏర్పాటు.

·        బిల్లింగ్‌ను ప్రోత్సహించడం, అధిక ధరలను నిరోధించే అవగాహన కార్యక్రమాల నిర్వహణ.

·        ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బకెట్లు-టీ/కాఫీ పాత్రలపై రేట్ల స్టిక్కర్లు.

·        ప్రయాణికులు ఆన్‌లైన్ మాడ్యూల్ ద్వారా భోజనం బుక్ చేసుకునేలా మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ఇ-ప్యాంట్రీ సేవల సౌలభ్యం.

·        కేటరింగ్ సిబ్బందికి ‘క్యూఆర్‌’ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీ.

·        కేటరింగ్ వస్తువుల ధర, ప్యాకేజ్డ్ తాగునీటి బాటిళ్లపై అవగాహన దిశగా కరపత్రాల పంపిణీ.

·        అధిక ధరలు, బిల్లింగ్ సమస్యల తనిఖీ నిమిత్తం ప్రత్యేక తనిఖీ కార్యకలాపాలు.

·        అధిక ధరల వసూలు సందర్భాల్లో తగిన జరిమానా విధింపు.

కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్‌—మాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2224196) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada , Malayalam