రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెండో పర్వత సొరంగం పనుల్లో కీలక విజయం


454 మీటర్ల పొడవు, 14.4 మీటర్ల వెడల్పుతో విస్తరించిన పర్వత సొరంగం (ఎమ్‌టీ-6)

పాల్ఘర్‌లో నెల రోజుల్లోనే రెండో పర్వత సొరంగ పనుల్లో సాధ్యమైన పురోగతి

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 5:34PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెండో పర్వత సొరంగం పనుల బ్రేక్‌త్రూతో బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడిందని కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖా మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ సొరంగం 454 మీటర్ల పొడవు, 14.4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం పైన, కింద ట్రాక్‌లను కలిగి ఉంటుంది.

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం పాల్ఘర్ జిల్లాలో ఒక నెల రోజుల వ్యవధిలో బ్రేక్‌త్రూ సాధించిన రెండో పర్వత సొరంగం ఇది. అయితే మొదటి సొరంగం అయిన సఫాలే సమీపంలో నిర్మిస్తున్న ఎమ్‌టీ-5 పనులు గత నెల 2నే పూర్తయ్యాయి.

పర్వత సొరంగం (ఎమ్‌టీ-6) ను రెండు చివరల నుంచి న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్ఏటీఎమ్) విధానాన్ని ఉపయోగించి తవ్వారు. ఇది అత్యాధునిక డ్రిల్-అండ్-కంట్రోల్డ్ బ్లాస్ట్ పద్ధతి. తవ్వకం 12 నెలల్లో పూర్తవుతుంది. సొరంగం రెండు చివరల నుంచి తవ్వుతూ వచ్చే తవ్వకం బృందాలు చివరకు మధ్యలో కలుసుకున్నప్పుడు... పర్వతం గుండా నిరంతర మార్గం ఏర్పాటైనప్పుడు పర్వత సొరంగం పూర్తి కావడం ఇంజనీరింగ్ పరంగా ఒక కీలక విజయ ప్రస్థానాన్ని చేరుకోవడాన్ని సూచిస్తుంది.

మొత్తం హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న బృందం ఈ పనుల్లో అద్భుతమైన పురోగతి సాధించడం పట్ల వారిని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభినందించారు. ఈ బృందం పనిచేస్తున్న వేగం దేశంలో కొత్త విశ్వాసాన్ని నింపిందని ఆయన అన్నారు. నిర్మాణ, సాంకేతికతల్లో అనేక కొత్త ఆవిష్కరణల కారణంగా ఈ ప్రాజెక్ట్ యావత్ ప్రపంచం దృష్టిని, ప్రశంసలను ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించే అనేక అధునాతన నిర్మాణ సాంకేతికతలు, భారీ యంత్రాలు దేశీయంగా తయారు చేసినవేనని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్ విభాగం వచ్చే ఏడాది వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హై-స్పీడ్ రైలు కార్యకలాపాలు 2028 నాటికి థానే వరకు విస్తరించనున్నాయనీ... ఈ కారిడార్ 2029 నాటికి ముంబయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

పాల్ఘర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యులు డాక్టర్ హేమంత్ విష్ణు సవారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్ఘర్‌లో హై-స్పీడ్ రైలు మార్గ సొరంగం పనుల బ్రేక్‌త్రూ పట్ల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హై-స్పీడ్ రైల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ), రాబోయే వధావన్ పోర్ట్‌ సహా అనేక కీలక ప్రాజెక్టుల ద్వారా జిల్లా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2014 నుంచి మహారాష్ట్రలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయనీ, ఫలితంగా ప్రాజెక్టులు వేగంగా పూర్తవడంతో పాటు సేవలూ మెరుగయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

పాల్ఘర్ జిల్లా వంటి సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో, టన్నెల్ బోరింగ్ యంత్రాలు అంతగా అనుకూలంగా లేని క్రమరహిత సొరంగం ఆకారాల్లోనూ దాని సౌలభ్యం కారణంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి (ఎన్ఏటీఎమ్) ఈ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రక్రియకు భారీ యంత్రాలు పెద్దగా అవసరం లేదు. షాట్‌క్రీటింగ్, రాక్ బోల్ట్‌లు, లాటిస్ గిర్డర్‌లను ఉపయోగించడం ద్వారా రియల్ టైమ్ అనుసరణను ఇది అనుమతిస్తుంది.

వివిధ జియోటెక్నికల్ పరికరాలు, రియల్ టైమ్ పర్యవేక్షణ, సమర్థమైన అగ్నిమాపక చర్యలు, సరైన వెంటిలేషన్, నియంత్రిత యాక్సెస్ గల ఏర్పాట్లను ఉపయోగించి సొరంగం లోపల కార్మికుల భద్రతను నిర్ధారించారు.

మహారాష్ట్రలో బహుళ రంగాల్లో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉల్హాస్, జగని వంటి ఇతర ప్రధాన నదులపై పునాది స్థాయి పనులతో పాటు... ఈ ప్రాజెక్టులో భాగంగా వైతర్ణ నదిపై నిర్మిస్తున్న పొడవైన నది వంతెన పైర్ స్థాయికి చేరుకుంది. నాలుగు స్టేషన్ల పనులతో పాటు, లాంగ్ స్పాన్ స్టీల్ వంతెనలను ఉపయోగించే ప్రధాన జాతీయ, రాష్ట్ర రహదారి క్రాసింగ్‌లు, బాంద్రా కుర్లా కాంప్లెక్స్-షిల్ఫాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులూ వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మొత్తం 7 పర్వత సొరంగాల పనులు పురోగతిలో ఉన్నాయి.

వరుస

సంఖ్య

పర్వత సొరంగ సంఖ్య

పొడవు

పూర్తయిన శాతం

వ్యాఖ్యలు

1

MT-1

0.820

16%

 

2

MT-2

0.228

సన్నాహక పనులు జరుగుతున్నాయి

3

MT-3

1.403

41%

 

4

MT-4

1.260

32%

 

5

MT-5

1.480

57%

02 జనవరి 2026న బ్రేక్‌త్రూ పూర్తయింది

6

MT-6

0.454

47%

ఈ రోజు బ్రేక్‌త్రూ పూర్తయింది

7

MT-7

0.417

29%

 

 

గుజరాత్, దాద్రా-నాగర్ హవేలీలలో 352 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లతో ఎమ్ఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ దాదాపు 508 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్... కారిడార్ వెంట ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని, విజ్ఞానాన్ని పంచుకునే ప్రక్రియలను సులభతరం చేస్తుందని, కొత్త పారిశ్రామిక, ఐటీ కేంద్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబయి వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఇది భారత రవాణా మౌలిక సదుపాయాల్లో ఒక పరివర్తనాత్మక ముందడుగును సూచిస్తుంది.

2026 జనవరి 27 నాటికి జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాదాపు 334 కిలోమీటర్ల వయాడక్ట్‌లు, 17 నది వంతెనలు, 12 ప్రధాన క్రాసింగ్‌లు పూర్తవుతాయి. ప్రాజెక్ట్ గుజరాత్ విభాగంలో ట్రాక్ వేయడం, విద్యుదీకరణ పనులు వేగం పుంజుకున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2222824) సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada