సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న వేవ్‌ఎక్స్ ఇండియా


మీడియా, వినోదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో కృత్రిమ మేధ పరిష్కారాలపై దృష్టి సారించనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’

కృత్రిమ మేధ అంకుర సంస్థలకు వ్యాపార వ్యవస్థ, ప్రదర్శన స్థలాన్ని కల్పించనున్న వేవ్ఎక్స్

प्रविष्टि तिथि: 30 JAN 2026 4:18PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో (భారత కృత్రిమ మేధ ప్రభావ సదస్సు) పాల్గొనడానికి అంకుర సంస్థల నుంచి వేవ్‌ఎక్స్ దరఖాస్తులను ఆహ్వానించింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. వినూత్న కృత్రిమ మేధ పరిష్కారాలను ప్రదర్శించడానికి, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ వ్యవస్థలో సహకారాన్ని పెంపొందించడానికి ఈ సదస్సు ఒక కీలకమైన జాతీయ వేదికగా నిలవనుంది.

ఈ సదస్సులో భాగంగా, వేవ్‌ఎక్స్ ఒక ప్రత్యేక అంకుర సంస్థల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా ఎంపిక చేసిన స్టార్టప్‌లు తమ ఏఐ ఆధారిత ఉత్పత్తులను, పరిష్కారాలను జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఏవీజీసీ-ఎక్స్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న, ఏఐ ఆధారిత ఉత్పత్తులు రూపొందిస్తున్న అంకుర సంస్థలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెవిలియన్‌లో ప్రత్యేక ప్రదర్శన, వ్యాపార అవకాశాలు లభించనున్నాయి.

మీడియా, వినోద రంగంలో అత్యాధునిక, అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతలను ప్రదర్శించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెవిలియన్ ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది నూతన ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రపంచ భాగస్వాములతో నేరుగా చర్చలు జరిపేందుకు దోహదపడుతుంది. ఇది సృజనాత్మక, సాంకేతిక వ్యవస్థల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుంది.

అంకుర సంస్థలు, కీలక వాటాదారుల మధ్య నిర్మాణాత్మక అనుసంధాన్ని సులభతరం చేయడం ద్వారా దేశ కృత్రిమ మేధ ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

వేవ్ఎక్స్ గురించి

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వేవ్స్ కార్యక్రమంలో భాగంగా, మీడియా, వినోదం, భాషా సాంకేతికత రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వేవ్‌ఎక్స్‌ ఒక ప్రత్యేక అంకుర సంస్థల వేదికగా పనిచేస్తోంది. దేశంలో యువతరం సృజనాత్మక, సాంకేతిక ఆధారిత అంకుర సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ప్రారంభించిన వేవ్ ఎక్స్.. ఆవిష్కర్తలకు, ప్రభుత్వ సంస్థలకు, పరిశ్రమల దిగ్గజాలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. ప్రత్యేక హ్యాకథాన్‌లు, క్రమబద్ధమైన ఇంక్యుబేషన్ కార్యక్రమాలు, మార్గదర్శకత్వం, జాతీయ వేదికలతో అనుసంధానం చేయడం ద్వారా సరికొత్త ఆలోచనలకు వేవ్ఎక్స్‌ నిరంతరం మద్దతునిస్తోంది. బలమైన, నిరంతర ఇంక్యుబేషన్ వ్యవస్థను నిర్ధారించడానికి, వేవ్ఎక్స్ హైదరాబాద్‌లోని టీ హబ్, ఐఐటీ ఢిల్లీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇది దేశంలోని తొమ్మిది ఇంక్యుబేషన్ కేంద్రాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అవి ఐఐసీటీ ముంబై, ఎఫ్ టీఐఐ పూణే, ఎస్ఆర్ఎఫ్ టీఐ కోల్‌కతా, ఐఐఎంసీకి చెందిన ఢిల్లీ, ఐజ్వాల్, అమరావతి, ధెంకనల్, కొట్టాయం జమ్మూ కేంద్రాలు.

 

మరిన్ని వివరాల కోసం https://wavex.wavesbazaar.com/ను సందర్శించండి


(रिलीज़ आईडी: 2221038) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada