ఆర్థిక మంత్రిత్వ శాఖ
అధికారిక నిర్వచనాలు సూచించిన దానికి మించి భారత్‌లో ఆర్థికంగా, కార్యాచరణపరంగా అధిక పట్టణీకరణ: ఆర్థిక సర్వే 2025-26
దాదాపు 1,036 కిలోమీటర్ల మెట్రో-ఆర్‌ఆర్‌టీఎస్ కార్యకలాపాలతో దేశంలోని 24 నగరాల్లో వేగవంతంగా భారీ రవాణా విస్తరణ
2025–26 నాటికి 98 శాతం పట్టణ వార్డులకు విస్తరించిన మున్సిపల్ ఘన వ్యర్థాల (ఎమ్ఎస్‌డబ్ల్యూ) ఇంటింటి సేకరణ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఏవై-యూ) కింద రెండు దశల్లో 122.06 లక్షల గృహాలు మంజూరు
భవిష్యత్ పట్టణ విధానం స్వతంత్ర ప్రాజెక్టుల కంటే వ్యవస్థ పనితీరుకే ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్న ఆర్థిక సర్వే
प्रविष्टि तिथि:
29 JAN 2026 1:42PM by PIB Hyderabad
"భారత నగరాలు కేవలం నివాస స్థలాలు మాత్రమే కాదు... కీలకమైన ఆర్థిక మౌలిక సదుపాయాలుగా కూడా పనిచేస్తాయి. సాంద్రత, సామీప్యతలు ఉత్పాదకతను పెంచే, కార్మిక మార్కెట్లను బలోపేతం చేసే, ఆవిష్కరణలకు వీలు కల్పించే నగర ఆర్థిక వ్యవస్థలను సృష్టిస్తాయి. అందువల్ల నగరాల ఆర్థిక పాత్ర భారత వృద్ధి పథానికి కేంద్రంగా ఉంది" అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వే పేర్కొంది.
భారత్‌లో ఇప్పటికే ఆర్థికంగా చాలా పట్టణీకరణ జరిగిందని, దేశ జాతీయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం నగరాలు, పట్టణ ప్రాంతాల నుంచే జరుగుతోందని 2025-26 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ పట్టణీకరణతో పౌరులకు ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో మెరుగైన రీతిలో ప్రయోజనం కలిగించేలా చేయడం మన కర్తవ్యం.
నగరాలను ప్రణాళికయుత పెట్టుబడి, వ్యూహాత్మక ప్రణాళికలు అవసరమైన ఆర్థిక ఆస్తులుగా సర్వే ప్రస్తావించింది. పబ్లిక్ పాలసీ, ఆర్థిక ప్రాధాన్యాలు, ప్రణాళిక విధానాలను భారత వృద్ధి పథానికి అనుగుణంగా ఉంచేందుకు నగరాలను ఆర్థిక మౌలిక సదుపాయాలుగా గుర్తించడం అవసరమైన మొదటి చర్యగా సర్వే పేర్కొన్నది.
నగరాలు వృద్ధి ఇంజిన్‌లు
2025-26 ఆర్థిక సర్వే ప్రకారం... భారత్‌లో అధికారిక నిర్వచనాలు సూచించిన దానికి మించి ఆర్థికంగా, కార్యాచరణ పరంగా చాలా ఎక్కువ పట్టణీకరణ జరిగింది. యూరోపియన్ కమిషన్‌లోని గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్‌కు చెందిన గ్లోబల్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ లేయర్ (జీహెచ్ఎస్ఎల్) అందించిన ఉపగ్రహ డేటా ప్రకారం భారత్‌లో 2015 నాటికి 63 శాతం పట్టణీకరణ జరిగింది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం నివేదించిన పట్టణీకరణ రేటుకు దాదాపు రెట్టింపు.
2011 నాటికి దేశంలో పట్టణ జనాభా 31 శాతంగా ఉండగా, 2036 నాటికి 60 కోట్ల మందికి అంటే దేశ జనాభాలో 40 శాతం మందికి పట్టణాలు, నగరాలు నివాసంగా ఉంటాయని... జీడీపీలో పట్టణ ప్రాంతాల వాటా సుమారుగా 70 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.
రవాణా
గత దశాబ్ద కాలంలో భారత్ వేగవంతమైన రవాణా వ్యవస్థను భారీ స్థాయిలో భౌతికంగా విస్తరించిందని 2025-26 ఆర్థిక సర్వే పేర్కొంది. 2025 నాటికి, దాదాపు 24 నగరాల్లో దాదాపు 1,036 కిలోమీటర్ల మార్గంలో మెట్రో/ఆర్‌ఆర్‌టీఎస్‌లు పనిచేస్తుండగా, మరిన్ని కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి.
10,000 ఇ-బస్సులతో సిటీ బస్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పీఎమ్ ఇ-బస్ సేవను ప్రారంభించిందని ఆర్థిక సర్వే తెలిపింది. రూ.20,000 కోట్ల కేంద్ర సహాయం, ఆపరేటర్‌లకు సరిపడా ఆదాయాన్ని నిర్ధారించడానికి చెల్లింపు భద్రతా యంత్రాంగం (పీఎస్ఎమ్) మద్దతుతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం ద్వారా దీనిని చేపట్టారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 7,293 ఇ-బస్సులు ఆమోదం పొందగా... డిపోలు, బిహిండ్ ద మీటర్ (బీటీఎమ్) ఇంధన మౌలిక సదుపాయాల కోసం రూ.983.75 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటికే రూ.437.5 కోట్లు పంపిణీ అయ్యాయి.
ఫలితాలను మరింత మెరుగుపరచడానికి బస్సుల సంఖ్యను పెంచడం, అధునాతన సాంకేతికతలను సమీకృతం చేయడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించాలని... రవాణా ఖర్చుల తగ్గింపు కోసం విద్యుత్‌తో నడిచే బస్సులను విస్తరించాలని... డిమాండ్ ఆధారిత, భాగస్వామ్య రవాణాను అమలు చేయాలని... రవాణా-ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కార్యాచరణ చేపట్టాలని... స్టేషన్ల చుట్టూ భూమిని విస్తరించడం ద్వారా వాటి విలువను పెంచుకోవాలని 2025-26 ఆర్థిక సర్వే సూచించింది.
పట్టణ పరిశుభ్రత
గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బీఎమ్-యూ) కింద ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాల్లో ఒకదాన్ని చేపట్టిందనీ... దీనికి అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్), అమృత్ 2.0 కింద పెట్టుబడులూ తోడయ్యాయని 2025-26 ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. ఈ చర్యలు పారిశుధ్య ఫలితాల్లో స్పష్టమైన ప్రయోజనాలను అందించాయి, వాటిలో ముఖ్యమైనది అన్ని నగరాల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలన.
2014–15లో మున్సిపల్ ఘన వ్యర్థాల (ఎమ్ఎస్‌డబ్ల్యూ) ఇంటింటి సేకరణ అత్యంత తక్కువగా ఉండగా, 2025–26 నాటికి అది 98 శాతం పట్టణ వార్డులకు విస్తరించిందనీ... దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా వ్యర్థాల సేకరణ వాహనాలు దీని కోసం పని చేస్తున్నాయని సర్వే తెలిపింది.
సాంకేతికత వినియోగం ద్వారా నగర అభివృద్ధి
2025 మే 9 నాటికి, స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్‌సీఎమ్) కింద ఉన్న నగరాలు ప్రణాళికాయుత ప్రాజెక్టుల్లో గణనీయమైన భాగాన్ని పూర్తి చేశాయని సర్వే పేర్కొంది. వాటిలో స్మార్ట్ రహదారులు, సైకిల్ ట్రాక్‌లు, కమాండ్-కంట్రోల్ సెంటర్లు, అభివృద్ధి చేసిన నీటి పారుదల, మురుగునీటి పారుదల నెట్‌వర్క్‌లు, ఉల్లాసభరితమైన పబ్లిక్ ప్రదేశాలూ ఉన్నాయి. దాదాపు 8,067 ప్రాజెక్టుల్లో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. వీటి కోసం దాదాపు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించారు.
పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహనిర్మాణానికి మద్దతునివ్వడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో... ప్రత్యక్ష పన్ను, జీఎస్టీ ప్రయోజనాలు... ప్రాధాన్య రంగ రుణాల్లో (పీఎస్ఎల్) చేర్చడం... మౌలిక సదుపాయాల హోదా కల్పించడం వంటివి భాగంగా ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎమ్ఏవై-యూ) రెండు దశల కింద, మొత్తం 122.06 లక్షల ఇళ్ళు మంజూరయ్యాయి. వీటిలో దేశవ్యాప్తంగా 96.02 లక్షల గృహాలను 24.11.2025 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు.
పట్టణ వీధి వ్యాపారుల (ఎస్‌వీల) జీవనోపాధిని పునరుద్ధరించడం, బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి (పీఎమ్ స్వనిధి) కీలక పాత్ర పోషించిందని సర్వే వివరించింది.
పట్టణ రోజువారీ పాలనలో నియమాల కచ్చితత్వాన్ని విశ్వసనీయం చేయడానికి ఆదేశాలను సమకాలీకరించడం, ఫలితాలకు బాధ్యులను స్పష్టం చేయడం, తాత్కాలిక జోక్యం నుంచి సాధారణ అమలును నిరోధించడం చాలా ముఖ్యమైనవిగా సర్వే పేర్కొంది.
ప్రణాళిక, పరిపాలన, ఆర్థిక చేయూత
నగర, పట్టణాభివృద్ధికి అవసరమైన ఆర్థిక అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం అనేక సమష్టి ప్రయత్నాలను చేపట్టింది. 2023–24 కేంద్ర బడ్జెట్‌లో రూ.10,000 కోట్ల ప్రారంభ వ్యయంతో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ నిధి (యూఐడీఎఫ్)ని ప్రకటించింది. క్రెడిట్ అర్హత లేనప్పటికీ ఆచరణీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కలిగి ఉన్న టయర్-2, టయర్-3 నగరాలకు మద్దతునివ్వడానికి ఆర్థిక సంస్థల ద్వారా మళ్ళించిన రివాల్వింగ్ ఫండ్‌గా దీనిని రూపొందించినట్లు ఆర్థిక సర్వే 2025-26 తెలిపింది.
పది లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రతీ నగరం... ప్రతి ఐదు సంవత్సరాలకోసారి నవీకరించే 20 సంవత్సరాల చట్టబద్ధమైన నగర ప్రాదేశిక, ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. ఇందులో మూడు నిర్ధిష్ట అంశాలు ఉన్నాయి:
i. రవాణా నెట్‌వర్క్ ప్రణాళిక
ii. వార్షిక యూనిట్ లక్ష్యాలతో గృహ పంపిణీ ప్రణాళిక
- మౌలిక సదుపాయాల కారిడార్‌లకు అనుసంధానించిన భూ-విలువ సంగ్రహణ విధాన ప్రణాళిక.
వ్యవస్థ పట్ల పౌరుల బాధ్యతాయుత ప్రవర్తన గురించి అవగాహన
కమ్యూనికేషన్ అనేది ఊహించదగిన వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కనుగొనడం కాకుండా వాటిని బలోపేతం చేయాలని సర్వే పేర్కొంది. అధిక-ప్రభావం గల ప్రవర్తనల గురించిన సరళమైన, స్థానిక, పునరావృత సందేశాలు సకాలంలో అందించినప్పుడు అవి అత్యుత్తమ ఫలితాలనిస్తాయి.
ముగింపు
గృహనిర్మాణం, రవాణా, పారిశుధ్యం, వాతావరణ పరిస్థితులను తట్టుకోగలగడం, ఆర్థిక రంగాల ఏకీకృతం ద్వారా స్వతంత్ర ప్రాజెక్టుల కంటే వ్యవస్థ పనితీరుకే భవిష్యత్ పట్టణ విధానం ప్రాధాన్యమివ్వాలి. అదే సమయంలో సమగ్రతను, దీర్ఘకాలిక ఆర్థిక సామర్థ్యాన్ని సమర్ధించే జీవించదగిన, అన్ని రకాల వాతావరణానికి సిద్ధంగా ఉన్న నగరాలకు రూపకల్పన చేయాలి.
భారత పట్టణ భవిష్యత్తును నిర్మించే వ్యూహాత్మక ప్రయత్నం... మన నగరాలను ఆర్థిక చైతన్యం, సామాజిక సమగ్రత, పర్యావరణ సుస్థిరత, సంస్థాగత సామర్థ్యం కలిగి ఉండేలా చేయడమేనని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది.
****
(रिलीज़ आईडी: 2220499)
आगंतुक पटल : 6