|
ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· “దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం.. ఆకాంక్షలను రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది” · “భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని యువతరం.. రైతులు.. తయారీదారులకు విస్తృత అవకాశాలు” · “సంస్కరణ..సామర్థ్యం.. సత్ఫలితం’ మా ప్రభుత్వ తారకమంత్రం.. భారత సంస్కరణల ఎక్స్ ప్రెస్ శరవేగంగా దూసుకెళ్తోంది” · “భారత ప్రజాస్వామ్యం... జనసంఖ్య లబ్ధి ప్రపంచానికి ఆశాదీపాలు” · “ఇది పరిష్కారాలు.. సాధికారతనిచ్చే నిర్ణయాలతోపాటు సంస్కరణలను వేగిరపరచాల్సిన సమయం”
प्रविष्टि तिथि:
29 JAN 2026 11:52AM by PIB Hyderabad
పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది పౌరుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల కఠోర శ్రమను, యువతరం ఆకాంక్షలను ప్రస్ఫుటం చేసిందని వ్యాఖ్యానించారు. సమావేశాల ప్రారంభానికి ఎంతో ముందుగానే... 2026 ఆరంభ సమయాన అనేక మార్గదర్శకాంశాలను రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులందరి ముందుంచారని ఆయన గుర్తుచేశారు. దేశాధినేతగా రాష్ట్రపతి సరళ ప్రసంగంలో వెలిబుచ్చిన ఆకాంక్షలను ఎంపీలందరూ తప్పక పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ సమావేశాలు కీలకమైనవి కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ సమావేశం కావడంతోపాటు 21వ శతాబ్దపు తొలి త్రైమాసికం ముగింపు సహా రెండో త్రైమాసికం ఆరంభాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. దేశం 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ బడ్జెట్ ప్రస్తుత శతాబ్దపు రెండో త్రైమాసికంలో మొదటిదని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
ఈ ఏడాది అత్యంత సానుకూల వాతావరణంలో ప్రారంభమైందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆత్మవిశ్వాస భరిత భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా, ఆకర్షణీయ కూడలిగా ఆవిర్భవిస్తోందని చెప్పారు. ఈ త్రైమాసికం మొదట్లో భారత్-ఐరోపా సమాఖ్య (ఈయూ) కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మన యువత ఉజ్వల భవిష్యత్తును, ఆశాజనక అవకాశాలను ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు. ఆకాంక్షభరిత, ఆశయసహిత యువతరంతోపాటు స్వయంసమృద్ధ భారత్‌కు ఈ ఒప్పందం వాణిజ్య స్వేచ్ఛనిస్తుందని చెప్పారు. భారత్ తయారీదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సామర్థ్యం పెంచుకోగలరని ప్రధానమంత్రి ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు. భారత్-ఈయూ మధ్య కుదిరిన దీన్ని ‘అన్ని ఒప్పందాలను మించిన అద్భుత ఒప్పందం’గా అభివర్ణించారు. ఇప్పుడొక విస్తృత మార్కెట్‌కు బాటలు పడ్డాయని, భారత వస్తూత్పత్తులు తక్కువ ధరకే అక్కడికి చేరువ కాగలవన్నారు. పరిశ్రమ అగ్రగాములు, తయారీదారులు ఉన్నంతతో తృప్తి పడిపోకుండా నాణ్యతపై నిశితంగా దృష్టి సారించాలని ఆయన అప్రమత్తం చేశారు. అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తులతో ఈ బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల 27 ఐరోపా సమాఖ్య దేశాల కొనుగోలుదారులను ఆకర్షించవచ్చునని చెప్పారు. తద్వారా లాభార్జన మాత్రమేగాక వారి హృదయాలను కూడా గెలుచుకోవచ్చని, ఇది దశాబ్దాల పాటు దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘భారత్’ బ్రాండ్‌కు అనుగుణంగా కంపెనీల బ్రాండ్‌లు కొత్త ప్రతిష్ఠను తెచ్చిపెడతాయన్నారు. ‘ఈయూ’ సభ్యత్వంగల 27 దేశాలతో ఈ ఒప్పందం భారత మత్స్యకారులు, రైతులు, యువత సహా ప్రపంచ మార్గాన్వేషణపై ఆసక్తిగల సేవల రంగానికీ అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. విశ్వసనీయ, పోటీతత్వ, ఉత్పాదకత సహిత భారత్ దిశగా ఇదొక కీలక మలుపు కాగలదని ఆయన ఆశాభావం ప్రకటించారు.
దేశం ప్రజల దృష్టి ఇప్పుడు బడ్జెట్ వైపు మళ్లడం సహజమే అయినప్పటికీ, ఈ ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చింది మాత్రం ‘సంస్కరణ-సామర్థ్యం-సత్ఫలితం’ సూత్రమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో నేడు సంస్కరణల ఎక్స్ ప్రెస్ శరవేగంగా ప్రయాణిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణ ప్రస్థానాన్ని మరింత వేగిరపరచడంలో తమ సానుకూల శక్తిని జోడించారంటూ ఎంపీలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల నుంచి దీర్ఘకాలిక పరిష్కారాల వైపు దేశం నేడు పయనిస్తున్నదని పేర్కొన్నారు. సామర్థ్యంపై అంచనాలను ఇవి సానుకూలం చేస్తాయని, ప్రపంచ విశ్వాసాన్ని మరింత చూరగొంటాయని ఆయన అన్నారు. దేశం పురోగమనం లక్షించే ప్రతి నిర్ణయం మానవాళి కేంద్రకంగా ఉంటుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారత్ నేడు సాంకేతికత పరిజ్ఞానాల్లో పోటీ పడటమే కాకుండా దాని సామర్థ్యాన్ని అంగీకరించి, అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నదని తెలిపారు. మానవ కేంద్రక వ్యవస్థల విషయంలో ప్రభుత్వం ఎన్నడూ రాజీపడబోదని, సాంకేతికతను సున్నితత్వంతో సమతూకం చేసే దృక్పథంతో ముందడుగు వేస్తున్నదని ఆయన చెప్పారు. చివరి అంచెదాకా సేవల ప్రదానంపై ప్రభుత్వం శ్రద్ధను విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పథకాలు ఫైళ్లకు పరిమితం కాకుండా జీవన సౌలభ్యం మెరుగుకు తోడ్పడేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ భావితరం సంస్కరణలలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం, జనాభా నేడు ప్రపంచానికి గొప్ప ఆశాకిరణంగా మారాయన్నారు. ప్రజాస్వామ్యంపై భారత్ నిబద్ధత, ప్రజాస్వామ్యం శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా తీసుకుంటున్న నిర్ణయాలకు గౌరవంపై ప్రపంచానికి స్పష్టమైన సందేశమిచ్చే అవకాశాన్ని ఈ ప్రజాస్వామ్య ఆలయం మనకిచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ సందేశాలను యావత్ ప్రపంచం స్వాగతించడమేగాక ప్రశంసిస్తున్నదని పేర్కొన్నారు. నేటి పరిస్థితులు విచ్ఛిన్నానికి కాకుండా పరిష్కారానికి సముచితమైనవని పేర్కొన్నారు. అలాగే, అవరోధాలకు కాకుండా పరిష్కారాన్వేషణకు అనువైనవని శ్రీ మోదీ స్పష్టం చేశారు. పరిష్కార శకాన్ని వేగిరపరచడంలో, నిర్ణయాలను శక్తిమంతం చేయడంలో, చివరి అంచె సేవా ప్రదానాన్ని విజయవంతంగా కొనసాగించడంలో పార్లమెంటు సభ్యులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగం ముగించారు.
***
(रिलीज़ आईडी: 2220038)
|