ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


· “మన దేశంలో ఆయుర్వేదం ఏ ఒక్క కాలం లేదా ప్రాంతానికో పరిమితం కాదు... జీవితంపై అవగాహన.. సమతౌల్య సాధన.. ప్రకృతితో సమరస జీవనం దిశగా యుగయుగాల నుంచి మనకు మార్గనిర్దేశం చేస్తోంది”

· “నివారక వైద్యంపై నిశితంగా దృష్టి సారిస్తూ ‘జాతీయ ఆయుష్ మిషన్‌’ను మేం ప్రారంభించాం”

· “కాలానుగుణ మార్పులను అనుసరిస్తూ ఆయుర్వేదంలో ఆధునిక సాంకేతికతలు సహా కృత్రిమ మేధ వినియోగం పెంచాలి”

प्रविष्टि तिथि: 28 JAN 2026 2:25PM by PIB Hyderabad

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్  సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3

మానవాళికి శతాబ్దాలుగా సేవలందిస్తున్న భారతీయ వైద్య సంప్రదాయానికి కేరళలోని ఆర్య వైద్యశాల సజీవ చిహ్నమని ఆయన వివరించారు. మన దేశంలో ఆయుర్వేదం ఏదో ఒక కాలానికి లేదా ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. జీవితంపై అవగాహన, సమతౌల్య సాధన, ప్రకృతితో సమరస జీవనం దిశగా యుగయుగాల నుంచి ఈ విధానం మనకు మార్గనిర్దేశం చేస్తున్నదని ఆయన అన్నారు. ఆర్య వైద్యశాల నేడు 600కు పైగా ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తున్నదని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ఈ ఆస్పత్రి శాఖలు ఆయుర్వేద విధానాల్లో చికిత్స అందిస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో చికిత్స కోసం ఈ వైద్యశాలలకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్య వైద్యశాల తన అవిరళ కృషితో ఈ నమ్మకాన్ని సముపార్జించుకున్నదని, ఆపన్నులైన ప్రజలకు అనేక సందర్భాల్లో ఈ సంస్థ ఆశాకిరణంగా మారిందని శ్రీ మోదీ అన్నారు.

“ఆర్య వైద్యశాల సేవాధర్మం ఒక ఆలోచనకు పరిమితం కాదు. అది వారి చర్యలు, విధానాలు, వ్యవస్థలలో ప్రతిబింబించే ఒక పవిత్ర భావన” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న ధార్మిక ఆస్పత్రి 100 సంవత్సరాలుగా ప్రజలకు నిరంతర సేవలందిస్తోందని తెలిపారు. ఈ ఆస్పత్రితో ముడిపడిన ప్రతి ఒక్కరి పాత్రను ఆయన ప్రశంసించారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్య నిపుణులు, ఇతర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రితో సంబంధంగల ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆస్పత్రి ప్రస్థానంలో ఒక శతాబ్ద కాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. కేరళ ప్రజలు ఆయుర్వేద సంప్రదాయాలను శతాబ్దాలుగా సజీవంగా ఉంచుతూ, పరిరక్షించడమే కాకుండా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశంలోని ప్రాచీన వైద్య విధానాలను చాలాకాలం నుంచి వేర్వేరుగా చూస్తున్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, గత 10-11 ఏళ్లలో ఈ విధానాలు ఎంతో మారాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజానీకం సమగ్ర దృక్పథంతో చూస్తున్నారని చెప్పారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, యోగా విధానాలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ దృక్పథంతోనే తమ ప్రభుత్వం కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. నివారక వైద్యంపై నిశితంగా దృష్టి సారిస్తూ ‘జాతీయ ఆయుష్ మిషన్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. తదనుగుణంగా యోగా, నివారక ఆరోగ్య సంరక్షణ, సామాజిక ఆరోగ్య సేవలందించే 12,000కుపైగా ఆయుష్ శ్రేయో  కేంద్రాలపు ప్రారంభించామని శ్రీ మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగాగల  ఇతర ఆస్పత్రులను కూడా ఆయుష్ సేవలతో అనుసంధానించి, ఔషధ సరఫరాపైనా దృష్టి సారించామని ఆయన వివరించారు. భారత సంప్రదాయ వైద్య పరిజ్ఞాన ప్రయోజనాలు దేశం నలుమూలలాగల ప్రజలకు చేరేలా చూడాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు తెలిపారు.

ఆయుష్ రంగంపై ప్రభుత్వ విధానాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు ఆయుష్ ఉత్పాదక రంగం వేగంగా పురోమిస్తున్నదని చెప్పారు. భారత సంప్రదాయ సంపూర్ణ ఆరోగ్య విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఆయుష్ ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తులు, సేవలను ఇది ప్రోత్సహిస్తుందని, తదనుగుణంగా ఇప్పటికే సానుకూల ఫలితాలిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత్‌ 2014లో సుమారు ₹3,000 కోట్ల విలువైన ఆయుష్, మూలికా ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఇప్పుడది ₹6,500 కోట్లకు పెరిగిందన్నారు. దీనివల్ల దేశంలోని రైతులకూ ఎంతో ప్రయోజనం కలుగుతున్నదని తెలిపారు.

ఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకానికి విశ్వసనీయ గమ్యంగానూ భారత్‌ ఆవిర్భవిస్తోందని చెప్పారు. దీనికి మరింత ప్రోత్సాహమిస్తూ ఆయుష్ వీసాను  ప్రవేశపెట్టామని, విదేశీ సందర్శకులు ఆయుర్వేద-సంప్రదాయ వైద్యంలో మెరుగైన సౌకర్యాలు పొందేందుకు ఇటువంటి చర్యలు తోడ్పడుతున్నాయని శ్రీ మోదీ అన్నారు.

ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం దాన్ని ప్రతి ప్రధాన అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ప్రదర్శిస్తోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం లేదా జి20 శిఖరాగ్ర సదస్సు వంటి వేదికలపై తాను స్వయంగా ఆయుర్వేదానికి ఒక సంపూర్ణ ఆరోగ్య మాధ్యమంగా ప్రాచుర్యం కల్పించారని పేర్కొన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రా’న్ని ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఇక ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద’ ఇప్పటికే తన పని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఆయుర్వేద ఔషధాలకు  పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం కోసం గంగానది ఒడ్డున ఔషధ మొక్కల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మరో విజయాన్ని కూడా పంచుకుంటూ- ఐరోపా సమాఖ్యతో భారత్‌ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నదని వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారత సంప్రదాయ వైద్య సేవలకు, వైద్యులకు భారీ ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని శ్రీ మోదీ అన్నారు. అలాగే భారత్‌లో పొందిన వృత్తిపరమైన అర్హత ఆధారంగా మన ఆయుర్వేద వైద్యులు నియంత్రణ రహిత ఐరోపా సమాఖ్య సభ్య దేశాలలోనూ సేవలందించే వీలుంటుందన్నారు. తద్వారా ఆయుర్వేదం, యోగాతో ముడిపడిన యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ఐరోపాలో ఆయుష్ శ్రేయో కేంద్రాల ఏర్పాటుకు ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ విజయంపై ఆయుర్వేదం, ఆయుష్‌తో సంబంధంగల ప్రముఖులందరికీ అభినందనలు తెలిపారు.

భారత్‌ శతాబ్దాలుగా ఆయుర్వేదం విధానంతో ప్రజలకు చికిత్స అందిస్తున్నదని గుర్తుచేశారు. అయిప్పటికీ, జాతీయంగా... ప్రత్యేకించి అంతర్జాతీయంగా ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని వివరించడానికి కృషి చేయాల్సి రావడం దురదృష్టకరమని ప్రధానమంత్రి ఆవేదన వెలిబుచ్చారు. ఆయుర్వేద సంబంధిత పరిశోధనలు-పత్రాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఆయుర్వేద పద్ధతులను విజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రాతిపదికన పరీక్షిస్తే ప్రజల విశ్వాసం బలోపేతం కాగలదన్నారు. ఈ దిశగా సీఎస్ఐఆర్, ఐఐటీ వంటి సంస్థలతో సంయుక్తంగా ఆయుర్వేదాన్ని నిరంతరం విజ్ఞాన శాస్త్ర-పరిశోధన అనే గీటురాయిపై పరీక్షించడంలో ఆర్య వైద్యశాల కృషిని శ్రీ మోదీ కొనియాడారు. ఔషధ, క్లినికల్ పరిశోధనలతోపాటు కేన్సర్ చికిత్సపైనా ఈ సంస్థ దృష్టి సారించిందని, ఆయుష్ మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో పరిశోధనల నిర్వహణ దిశగా ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌’ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

కాలానుగుణ మార్పులను అనుసరిస్తూ, ఆయుర్వేదంలో ఆధునిక సాంకేతికతలు సహా కృత్రిమ మేధ వినియోగం పెంచాలని ప్రధానమంత్రి అన్నారు. వ్యాధి సంక్రమణ అంచనాలతోపాటు భిన్న పద్ధతులలో చికిత్స చేసే వినూత్న విధానాలను ఇది సాధ్యం చేస్తుందని చెప్పారు. సంప్రదాయం-ఆధునికతల సమ్మేళనం ఆరోగ్య సంరక్షణపై జన జీవనంలో విశ్వాసానికి పునాది కాగలదని ఆర్య వైద్యశాల నిరూపించినట్లు ఆయన అన్నారు. ఈ సంస్థ ఆయుర్వేదంపై ప్రాచీన అవగాహనను పరిరక్షిస్తూ, ఆధునిక అవసరాల మేరకు చికిత్సను క్రమబద్ధీకరించి రోగులకు సేవలందిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిదాయక కృషికిగాను ఆయన ఆర్య వైద్యశాలకు మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సంస్థ భవిష్యత్తులోనూ ఇదే అంకితభావం, సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను మెరుగుపరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2219769) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam