ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో కలిసి నిర్వహించిన పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
प्रविष्टि तिथि:
27 JAN 2026 2:36PM by PIB Hyderabad
గౌవరనీయులు,
అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా,
అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్,
ఉభయ దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
చారిత్రాత్మకమైన ఈ పర్యటనలో నా ఇద్దరు సన్నిహిత మిత్రులు.. అధ్యక్షుడు కోస్టా, అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్‌లను భారతదేశానికి స్వాగతించడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.
అధ్యక్షుడు కోస్టా సరళమైన జీవనశైలి, సమాజం పట్ల ఉన్న లోతైన నిబద్ధతకు విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. అందుకే ఆయనను ఆప్యాయంగా 'లిస్బన్ గాంధీ' అని పిలుస్తారు. అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రపంచవ్యాప్తంగా ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. జర్మనీకి మొదటి మహిళా రక్షణ మంత్రిగా మాత్రమే కాకుండా ఐరోపా కమిషన్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.
నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మొదటిసారిగా ఐరోపా సమాఖ్య అగ్రనేతలు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు కూడా మరొక చారిత్రాత్మక సందర్భం. ఇవాళ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు.. తమ సంబంధాలలో ఒక సరికొత్త, నిర్ణయాత్మక అధ్యాయాన్ని చేర్చడానికి ఒకచోట చేరాయి.
మిత్రులారా,
ఇటీవలి కాలంలో భారత్, ఐరోపా సమాఖ్య మధ్య సంబంధాలు అద్భుతమైన పురోగతిని సాధించాయి. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక సమన్వయం, బలమైన ప్రజా సంబంధాల ప్రాతిపదికన ఏర్పడిన మన భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుతోంది. నేడు మన దేశాల మధ్య 180 బిలియన్ యూరోల విలువైన వాణిజ్యం జరుగుతోంది. 8 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు ఐరోపా సమాఖ్య దేశాల్లో నివసిస్తూ అక్కడి అభివృద్ధికి చురుగ్గా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
వ్యూహాత్మక సాంకేతికతల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వరకు, డిజిటల్ గవర్నెన్స్ నుంచి అభివృద్ధి భాగస్వామ్యాల వరకు ప్రతి రంగంలో మన సహకారం కొత్త పుంతలు తొక్కింది. ఈ విజయాల స్ఫూర్తితో నేటి శిఖరాగ్ర సదస్సులో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలను మేం తీసుకున్నాం.
మిత్రులారా,
తన చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ నేడు చేసుకుంది. నెలలోని 27వ తేదీన ఐరోపా సమాఖ్యలోని 27 సభ్య దేశాలతో భారత్ ఈ ఎఫ్‍టీఏ చేసుకోవటం ఒక సంతోషకరమైన కాకతాళీయం. ఈ చారిత్రాత్మక ఒప్పందం మన రైతులు, చిన్న తరహా పరిశ్రమలకు ఐరోపా మార్కెట్లలో సులభతరమైన ప్రవేశాన్ని కల్పిస్తుంది.. తయారీ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.. మన సేవా రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
అంతేకాకుండా ఈ ఎఫ్‍టీఏ.. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది… కొత్త ఆవిష్కరణల భాగస్వామ్యాలను పెంచుతుంది.. ప్రపంచ స్థాయిలో సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు.. ఇది భాగస్వామ్య శ్రేయస్సు కోసం ఒక కొత్త బ్లూప్రింట్.
మిత్రులారా,
ఈ ప్రతిష్ఠాత్మకమైన ఎఫ్‍టీఏతో పాటు నిపుణుల బదిలీల కోసం ఒక కొత్త చట్రాన్ని కూడా మేం రూపొందిస్తున్నాం. ఇది భారతీయ విద్యార్థులు, కార్మికులు, నిపుణులకు ఐరోపా సమాఖ్యలో కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో మనకు సుదీర్ఘమైన, విస్తృతమైన భాగస్వామ్యం ఉంది. ఈ ముఖ్యమైన అనుసంధానాలను మరింత బలోపేతం చేయాలని ఈ రోజు మేం నిర్ణయించాం.
మిత్రులారా,
ఏ బలమైన భాగస్వామ్యానికైనా రక్షణ, భద్రత అనేవి పునాదులు. ఈ రోజు మేం 'భద్రత, రక్షణ భాగస్వామ్యం' ద్వారా దీనిని అధికారికంగా మారుస్తున్నాం. ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సముద్ర భద్రత, సైబర్ భద్రతపై మనం మరింత సన్నిహితంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
నియమ నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ పట్ల మన ఉమ్మడి నిబద్ధతను కూడా ఇది బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మన సహకారం పెరుగుతుంది. ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తిపై కలిసి పనిచేయడానికి మన రక్షణ సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మిత్రులారా,
నేటి విజయాల ఆధారంగా రాబోయే ఐదేళ్ల కోసం మేం మరింత ప్రతిష్ఠాత్మక, సమగ్రమైన వ్యూహాత్మక అజెండాను ప్రారంభిస్తున్నాం. సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితుల్లో ఈ అజెండా స్పష్టమైన దిశను అందిస్తుంది. ఇది మన భాగస్వామ్య శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.. ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.. భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తుంది.. ప్రజల మధ్య సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది.
మిత్రులారా,
భారత్, ఐరోపా సమాఖ్య మధ్య సహకారం 'ప్రపంచ శ్రేయస్సు కోసం భాగస్వామ్యం'గా నిలుస్తుంది. మేం త్రైపాక్షిక ప్రాజెక్టులను ఇండో-పసిఫిక్ నుంచి కరేబియన్ వరకు విస్తరిస్తాం. తద్వారా సుస్థిర వ్యవసాయం, స్వచ్ఛమైన ఇంధనం మహిళా సాధికారతకు స్పష్టమైన మద్దతును అందిస్తాం. ఐఎమ్ఈసీ కారిడార్‌ను ప్రపంచ వాణిజ్యం, సుస్థిర అభివృద్ధికి కీలక స్తంభంగా ఏర్పాటుచేసేందుకు మేం కలిసి కృషి చేస్తాం.
మిత్రులారా,
నేడు ప్రపంచ వ్యవస్థ తీవ్రమైన అస్థిరతకు లోనవుతోంది. ఈ సమయంలో భారత్, ఐరోపా సమాఖ్య మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ వ్యవస్థలో స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్‌తో సహా పలు అంతర్జాతీయ అంశాలపై మేం నేడు వివరణాత్మకంగా చర్చించాం. బహుళ పక్షవాదం, అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం మా ఉమ్మడి ప్రాధాన్యతగా కొనసాగుతాయి. మన వర్ధమాన సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల సంస్కరణ అత్యవసరమని మేమంతా ఏకాభిప్రాయంతో ఉన్నాం.
మిత్రులారా,
దేశాల మధ్య సంబంధాల ప్రస్థానంలో దిశ మారిందని, ఇక్కడే ఒక కొత్త యుగం ప్రారంభమైందని ప్రకటించే క్షణాలు కొన్ని చరిత్రలో స్వయంగా ఉంటాయి. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య నేడు జరిగిన ఈ చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు అటువంటి క్షణాన్ని తెలియజేస్తోంది.
ఈ అసాధారణ ప్రయాణం, భారతదేశం పట్ల మీ స్నేహం, మన ఉమ్మడి భవిష్యత్తు పట్ల మీ నిబద్ధత విషయంలో నేను మరోసారి అధ్యక్షుడు కోస్టా, అధ్యక్షురరాలు వాన్ డెర్ లేయన్‌లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.
****
(रिलीज़ आईडी: 2219368)
आगंतुक पटल : 4