ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్‌గార్ మేళాలో భాగంగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 24 JAN 2026 12:36PM by PIB Hyderabad

యువ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు!

2026 సంవత్సరం ప్రారంభం మీ జీవితాల్లో సరికొత్త సంతోషాలకు నాంది పలుకుతోంది. దీనికి తోడు నిన్ననే వసంత పంచమి ముగిసింది.. మీ జీవితాల్లోనూ కొత్త వసంతం మొదలవుతోంది. రాజ్యాంగం పట్ల విధులతో మిమ్మల్ని అనుసంధానిస్తున్న సమయమిది. యాదృచ్ఛికంగా ఇప్పుడు దేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిన్న జనవరి 23న నేతాజీ సుభాష్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకున్నాం. రేపు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని, అనంతరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించినది ఈ రోజునే. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.

నేడు మీరంతా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకుంటున్నారు. ఓ రకంగా ఇది దేశ నిర్మాణానికి ఆహ్వాన పత్రం. అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ఉత్తేజాన్నివ్వాలన్న కృతనిశ్చయ పత్రం. మీలో చాలా మంది దేశ భద్రతను బలోపేతం చేస్తారు. చాలా మంది మన విద్య - ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను శక్తిమంతం చేయబోతున్నారు. అనేక మంది మిత్రులు ఆర్థిక సేవలు - ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ కంపెనీల అభివృద్ధిలో చాలా మంది యువత కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ యువకులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.

మిత్రులారా,

యువతలో నైపుణ్యాలను పెంచడం, వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. నిర్దేశిత లక్ష్యాలతో ప్రభుత్వ నియామకాలను చేపట్టేందుకు రోజ్‌గార్ మేళాను ప్రారంభించాం. కొన్నేళ్లుగా ఇదొక వ్యవస్థగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది యువత నియామక పత్రాలను అందుకున్నారు. ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా.. నేడు దేశవ్యాప్తంగా నలభైకి పైగా ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న యువతకు నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను.

మిత్రులారా,

నేడు ప్రపంచంలో అత్యంత యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ముందుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మన యువశక్తికి కొత్త అవకాశాలను కల్పించేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. నేడు భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య, రవాణా ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ వాణిజ్య ఒప్పందాలు భారతీయ యువతకు అనేక కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తున్నాయి.

మిత్రులారా,

ఆధునిక మౌలిక సదుపాయాల్లో మునుపెన్నడూ లేని రీతిలో భారత్ ఇటీవల పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాలన్నింటిలో ఉపాధి విశేషంగా పెరిగింది. భారతదేశ స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. నేడు దేశంలో దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు కొత్తగా నమోదయ్యాయి. 21 లక్షల మందికి పైగా యువత వాటిలో పనిచేస్తున్నారు. అదేవిధంగా డిజిటల్ ఇండియా ఓ సరికొత్త ఆర్థిక వ్యవస్థను విస్తరించింది. యానిమేషన్, డిజిటల్ మీడియా వంటి అనేక రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ అవతరిస్తోంది. దేశ సృజనాధార ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఇందులోనూ యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.

యువ మిత్రులారా,

భారత్‌పై నేడు ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతుండడం కూడా యువతకు అనేక కొత్త అవకాశాలను అందిస్తోంది. ప్రపంచంలో దశాబ్ద కాలంలో తన జీడీపీని రెట్టింపు చేసుకున్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ మన దేశమే. నేడు వందకు పైగా దేశాలు ఎఫ్‌డీఐ ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. 2014కు ముందున్న పదేళ్లతో పోలిస్తే.. భారత్ రెండున్నర రెట్లు ఎక్కువగా ఎఫ్‌డీఐలను సాధించింది. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయంటే.. దేశ యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నమాటే.

మిత్రులారా,

నేడు భారత్ ఉత్పాదక శక్తిగా ఎదుగుతోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్షణ, ఆటోమొబైల్స్ వంటి రంగాలకు సంబంధించి.. ఉత్పత్తిలోనూ, ఎగుమతుల్లోనూ మునుపెన్నడూ లేనంత వృద్ధితో భారత్ దూసుకుపోతోంది. 2014 నుంచి దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు పెరిగింది.. ఆరు రెట్లు! ఇప్పుడిది రూ. 11 లక్షల కోట్లకు పైగా విలువైన పరిశ్రమ. మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు దాటాయి. భారత ఆటో మొబైల్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాల సంఖ్య రెండు కోట్లను దాటింది. ఆదాయపు పన్ను, జీఎస్టీ తగ్గింపుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభించడంతో.. ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తిని ఇది ప్రతిబింబిస్తోంది. దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

మిత్రులారా,

ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలోనే 8,000 మందికి పైగా మన ఆడబిడ్డలు నియామక పత్రాలను అందుకున్నారు. గత 11 ఏళ్లలో దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపైంది. ముద్ర, అంకుర భారత్ వంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. దీంతో మహిళల స్వయం ఉపాధి రేటు దాదాపు 15 శాతం పెరిగింది. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలను పరిశీలిస్తే.. నేడు పెద్ద సంఖ్యలో మహిళలు డైరెక్టర్లుగా, వ్యవస్థాపకులుగా ఉన్నారు. అలాగే గ్రామాల్లోని మన సహకార రంగాలు, స్వయం సహాయక బృందాలకు మహిళలు పెద్ద సంఖ్యలో నేతృత్వం వహిస్తున్నారు.

మిత్రులారా,

దేశ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ నేడు పట్టాలెక్కింది. దేశంలో సామాన్య ప్రజల జీవితాలను, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడమే దీని లక్ష్యం. జీఎస్టీలో చేపట్టిన నవతరం సంస్కరణలతో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగింది. దీని ద్వారా మన యువ పారిశ్రామికవేత్తలతో పాటు, ఎంఎస్ఎంఈలు ఎంతగానో లాభపడుతున్నాయి. ఇటీవలే చరిత్రాత్మక కార్మిక సంస్కరణలను భారత్ అమలు చేసింది. దీనిద్వారా కార్మికులు, ఉద్యోగులు, వ్యాపార సంస్థలకు కూడా మేలు జరుగుతంది. కొత్త కార్మిక నియమావళులు సామాజిక భద్రత పరిధిని విస్తరించి, శక్తిమంతం చేశాయి.

మిత్రులారా,

సంస్కరణల ఎక్స్‌ప్రెస్ గురించి ప్రతిచోటా నేడు చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి నేను మీకు ఓ పనిని కూడా ఇవ్వాలనుకుంటున్నాను. గుర్తు తెచ్చుకోండి – గడిచిన అయిదు నుంచి ఏడేళ్ల కాలంలో మీరు ఎప్పుడు, ఏ రూపంలో ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారో జ్ఞప్తికి తెచ్చుకోండి. మీకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పని పడినా, లేదా మరేదైనా మాధ్యమం ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏదైనా లోపాన్ని గమనించినా, చిరాకుకు గురైనా... అలాంటి విషయాలను ఓ సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఈ దిశగా కృతనిశ్చయులవ్వాలి – ఏ విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో, మీ తల్లిదండ్రులనో లేదా మీ మిత్రులనో కష్టపెట్టాయో, ఎలాంటి చర్యలు మిమ్మల్ని బాధించాయో లేదా మీకు కోపం తెప్పించాయో... ఆ కష్టాలను మీ ఉద్యోగ కాలంలో ఇతర పౌరులకు కలగనీయొద్దని మీరు సంకల్పించాలి. ప్రభుత్వంలో భాగంగా.. మీరు కూడా మీ స్థాయిలో చిన్న చిన్న సంస్కరణలను చేపట్టాలి. ఈ విధానంతో మీరు ముందుకు సాగితే పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.

జీవన సౌలభ్యం, సులభతర వాణిజ్యాలు బలోపేతమవ్వాలంటే.. ప్రభుత్వ విధానాలతోపాటు, క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి చిత్తశుద్ధి కూడా అత్యావశ్యకం. మీరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేగంగా మారుతున్న ఈ సాంకేతిక యుగంలో.. దేశ అవసరాలు, ప్రాధాన్యాల్లో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవాలి. ఐగాట్ కర్మయోగి వంటి వేదికలను మీరు తప్పక సద్వినియోగం చేసుకోవాలి. అనతికాలంలోనే దాదాపు ఒకటిన్నర కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఐగాట్ వేదికలో చేరి శిక్షణ పొంది, ఉన్నతిని సాధించడం సంతోషాన్నిచ్చే విషయం.

మిత్రులారా,

ప్రధానమంత్రి అయినా లేదా ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి అయినా.. మనందరమూ సేవకులమే. మనందరికీ ఒకే ఉమ్మడి మంత్రం ఉంది. దానికి ఎవరూ అతీతులు కారు. అందులో పక్షపాతాలకు తావు లేదు. నాకైనా, మీకైనా.. అందరికీ ఒకటే మంత్రం – అదే ‘నాగరిక్ దేవో భవ (ప్రజలే దేవుళ్లు).’ ఇదే మంత్రప్రదంగా మనం పనిచేయాలి. మీరు కూడా అలానే పనిచేయాలి. మీ జీవితంలోకి వచ్చిన ఈ కొత్త వసంతం, మీ జీవితంలో మొదలవుతున్న ఈ నవశకం... దీని ద్వారానే 2047 లో అభివృద్ధి చెందిన భారత్ సాకారం కాబోతోంది. నా తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

 

***


(रिलीज़ आईडी: 2218344) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Gujarati , Kannada