ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్, నికోబార్ దీవుల్లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాట వీరుడు మాత్రమే కాదు.. స్వతంత్ర దేశానికి దార్శనికుడు కూడా: ప్రధానమంత్రి
ఆధునిక రూపంలో ఉంటూనే, ప్రాచీన చైతన్యంలో వేళ్లూనిన దేశాన్ని ఆయన ఊహించారన్న ప్రధానమంత్రి
పరాక్రమ్ దివస్ ఇచ్చే స్పూర్తి దేశ అభివృద్ధి సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంటుంది: ప్రధానమంత్రి
నేడు శక్తిని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా నిర్వహించాలో, ఎలా ఉపయోగించాలో దేశానికి తెలుసు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2026 6:07PM by PIB Hyderabad
అండమాన్, నికోబార్ దీవుల్లో నిర్వహించిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అని, ఇది ఒక అద్భుతమైన, గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు. నేతాజీ వీరత్వం, ధైర్యసాహసాలు మనకు ఎల్లప్పుడూ స్పూర్తినిస్తాయని, ఆయన పట్ల మనకు గౌరవభావాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో పరాక్రమ్ దివస్ దేశ స్ఫూర్తిలో ఒక అంతర్భాగమైన పండుగగా మారిందని ఆయన వెల్లడించారు. జనవరి 23 పరాక్రమ్ దివస్, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, జనవరి 29 బీటింగ్ రిట్రీట్, జనవరి 30 పూజ్య బాపూజీ వర్ధంతి ఇలా వరుసగా రావడం గణతంత్ర మహోత్సవాన్ని జరుపుకునే కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తోందని అన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
2026లో పరాక్రమ దివస్ ప్రధాన వేడుకలు అండమాన్ నికోబార్ దీవులలో జరుగుతున్నాయని పేర్కొంటూ.. ఇక్కడి చరిత్ర పరాక్రమం, త్యాగం, ధైర్యసాహసాలతో నిండి ఉందని శ్రీ మోదీ చెప్పారు. సెల్యులార్ జైలులో వీర్ సావర్కర్ వంటి దేశభక్తుల గాథలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధం ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చాయని ఆయన వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ అనే ఆలోచనకు ముగింపు ఉండదనే నమ్మకానికి అండమాన్ ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇక్కడ అనేకమంది విప్లవకారులు చిత్రహింసలకు గురయ్యారని, అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. అయితే ఆ అణచివేత వల్ల స్వాతంత్య్ర పోరాట జ్వాల ఆరిపోకుండా మరింత రగిలిందని ఆయన అన్నారు. దీని ఫలితంగానే అండమాన్ నికోబార్ దీవులు స్వతంత్ర భారత తొలి సూర్యోదయానికి సాక్షిగా నిలిచాయని ప్రధాని శ్రీ మోదీ తెలిపారు. 1947 కంటే ముందే డిసెంబర్ 30, 1943న సముద్ర కెరటాల సాక్షిగా ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2018లో ఈ మహత్తర ఘట్టానికి 75వ వార్షికోత్సవం సందర్భంగా, అదే ప్రదేశంలో డిసెంబర్ 30న జెండా ఎగురవేసే భాగ్యం తనకు దక్కిందని ఆయన ప్రస్తావించారు. సముద్ర తీరంలో జాతీయ గీతం వినిపిస్తుంటే, బలమైన గాలుల మధ్య ఎగురుతున్న త్రివర్ణ పతాకం స్వాతంత్య్ర సమరయోధుల అసంఖ్యాక కలలు నెరవేరాయని చాటిచెప్పినట్లుగా అనిపించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అండమాన్ నికోబార్ దీవుల అద్భుతమైన చరిత్రను పరిరక్షించాల్సి ఉందని, అయితే ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన వారు ఒక రకమైన అభద్రతా భావంతో ఉండేవారని శ్రీ మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఘనతను కేవలం ఒకే ఒక్క కుటుంబానికి పరిమితం చేయాలని వారు భావించారని, ఈ రాజకీయ స్వార్థం వల్ల దేశ చరిత్ర నిర్లక్ష్యానికి గురైందని ఆయన వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ దీవులు కూడా వలస పాలన గుర్తింపుతోనే ఉండిపోయాయని, స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఇక్కడి దీవులను బ్రిటిష్ అధికారుల పేర్లతోనే పిలిచేవారని శ్రీ మోదీ అన్నారు. చరిత్రలో జరిగిన ఈ అన్యాయానికి తమ ప్రభుత్వం ముగింపు పలికిందని, అందుకే పోర్ట్ బ్లెయిర్ ఇప్పుడు ‘శ్రీ విజయపురం’గా మారిందని, ఈ పేరు నేతాజీ విజయాన్ని మనకు గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా ఇతర దీవులకు స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, సుభాష్ ద్వీప్ అని పేరు మార్చినట్లు ఆయన తెలిపారు. 2023లో అండమాన్‌లోని 21 దీవులకు 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లను పెట్టిన విషయాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు అండమాన్ నికోబార్ దీవుల్లో బానిసత్వాన్ని సూచించే పేర్లు తొలిగిపోతున్నాయని, స్వతంత్ర దేశాన్ని ప్రతిబింబించే కొత్త పేర్లు తమ గుర్తింపును చాటుతున్నాయని ఆయన చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేవలం స్వాతంత్య్ర పోరాట వీరుడు మాత్రమే కాదని, స్వతంత్ర దేశానికి దూరదృష్టి కలిగిన మహానాయకుడని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక రూపంలో ఉంటూనే, దేశపు ప్రాచీన చైతన్యంలో వేళ్లూనుకున్న దేశాన్ని ఆయన ఊహించారని అన్నారు. నేతాజీ దార్శనికతను నేటి తరానికి పరిచయం చేయడం మన బాధ్యత అని, తమ ప్రభుత్వం ఆ బాధ్యతను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీకి అంకితం చేస్తూ ఒక మ్యూజియం నిర్మించామని, ఇండియా గేట్ సమీపంలో నేతాజీ విగ్రహాన్ని ప్రతిష్టించామని తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ కవాతులో ఐఎన్‌ఏ సహకారాన్ని గుర్తు చేసుకున్నామని ఆయన వివరించారు. అదే విధంగా సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాలను కూడా ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాలు నేతాజీకి ఇచ్చే గౌరవానికి చిహ్నమే కాకుండా మన యువతకు, భవిష్యత్తు తరాలకు శాశ్వతమైన స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆదర్శాలను గౌరవించడం, వాటి నుంచి స్ఫూర్తి పొందడమే వికసిత్ భారత్ సంకల్పాన్ని శక్తితో, ఆత్మవిశ్వాసంతో నింపుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
బలహీనమైన దేశం తన లక్ష్యాలను సాధించడం కష్టమని, అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎల్లప్పుడూ శక్తిమంతమైన దేశాన్ని కలగన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్ కూడా తనను తాను ఒక బలమైన, దృఢ సంకల్పం కలిగిన దేశంగా నిలబెట్టుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశానికి గాయం చేసిన వారి ఇళ్లలోకి వెళ్లి మరీ భారత్ ఎదురుదాడి చేసి వారిని అంతమోందించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు శక్తిని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా నిర్వహించాలో, ఎలా వినియోగించుకోవాలో దేశానికి తెలుసని ప్రధానమంత్రి అన్నారు. బలమైన భారత్ గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్న కలలకు అనుగుణంగా దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చే దిశగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. గతంలో భారత్ విదేశాల నుంచి ఆయుధాల దిగుమతిపై మాత్రమే ఆధారపడేదని, కానీ నేడు భారతదేశ రక్షణ ఎగుమతులు రూ. 23,000 కోట్లు దాటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన బ్రహ్మోస్, ఇతర క్షిపణులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆత్మనిర్భరత శక్తితో భారత్ తన సాయుధ దళాలను ఆధునీకరిస్తోందని వ్యాఖ్యానించారు.
నేడు 140 కోట్ల మంది పౌరులు అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాధించేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నారని, ఈ మార్గం ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంతో బలపడిన స్వదేశీ మంత్రంతో శక్తిని పొందుతోందని చెప్పారు. పరాక్రమ దివస్ ఇచ్చే స్ఫూర్తి వికసిత భారత్ దిశగా సాగుతున్న ఈ ప్రయాణానికి నిరంతరం బలాన్ని ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి (రిటైర్డ్), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్ట్ ఛైర్మన్ బ్రిగేడియర్ (రిటైర్డ్) ఆర్‌ఎస్ చికారా, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఐఎన్ఏ దిగ్గజం లెఫ్టినెంట్ ఆర్‌మాధవన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 2218134)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam