ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఎల్లప్పుడూ జ్ఞాన యోగ మార్గానికే అంకితమైన భారత్.. వేల ఏళ్ల నాటి వేదాలు నేటికీ స్ఫూర్తి: పీఎం

ఆధ్యాత్మికత, సేవకు చిహ్నం భగవాన్ స్వామినారాయణ్: పీఎం

ప్రాచీన రాతప్రతులను సంరక్షించేందుకు జ్ఞాన భారతం మిషన్‌కు అందరూ సహకరించాలని పీఎం పిలుపు

प्रविष्टि तिथि: 23 JAN 2026 1:56PM by PIB Hyderabad

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత్ ఎల్లప్పుడూ జ్ఞానయోగ మార్గానికి అంకితమై ఉందని, వేల ఏళ్ల నాటి వేదాలు నేటికీ స్ఫూర్తినిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వేదాల్లోని జ్ఞానంతో మన రుషులు, మునులు కాలానుగుణంగా నూతన వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వేదాల నుంచి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి పురాణాలు ఉద్భవించాయని.. శృతి, స్మృతి, కథావచనం, సంకీర్తనల ద్వారా ఈ సంప్రదాయం నేటికీ శక్తిమంతంగా కొనసాగుతుందని పీఎం అన్నారు.

గొప్ప సాధువులు, దార్శనికులు, మేధావులు వివిధ యుగాల్లో ఆయా పరిస్థితులకు తగినట్లుగా మన సంప్రదాయానికి కొత్త అధ్యాయాలను జోడించారని పీఎం స్పష్టం చేశారు. భగవాన్ స్వామి నారాయణ్ జీవితం ప్రజా విద్య, ప్రజా సేవతో ముడిపడి ఉన్నట్లు అందరికీ తెలుసన్నారు. ఈ అనుభవాలని సరళమైన పదాలతో వివరించారని, శిక్షాపత్రి ద్వారా జీవితానికి సరైన మార్గదర్శకత్వాన్ని భగవాన్ స్వామినారాయణ్ అందించారని కొనియాడారు.

శిక్షాపత్రి నుంచి మనం నేర్చుకున్న కొత్త పాఠాలను, వాటి ఆదర్శాలను దైనందిన జీవితంలో ఎలా ఆచరణలో పెడుతున్నామో అంచనా వేసేందుకు ద్విశతాబ్ది వేడుకలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఆధ్యాత్మిక సాధన, ప్రజాసేవకు ప్రతీక భగవాన్ స్వామి నారాయణ్ జీవితమని కొనియాడారు. సమాజం, దేశం, మానవాళి కోసం ఆయన అనుచరులు అంకితభావంతో నేడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, నీటి సంరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రశంసనీయమన్నారు. సామాజిక సేవ పట్ల బాధ్యతలను సాధువులు నిరంతరం విస్తరించటం ఎంతో స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్వదేశీ, స్వచ్ఛతా వంటి ప్రజా ఉద్యమాలతో దేశం ముందుకు సాగుతోందని, "ఓకల్ ఫర్ లోకల్" మంత్రం ప్రతి ఇంటికీ చేరుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాలతో ప్రయత్నాలు ముడిపడినప్పుడు, శిక్షాపత్రి ద్విశతాబ్ది వేడుకలు చిరస్మరణీయంగా మారతాయని అభిప్రాయపడ్డారు. ప్రాచీన రాతప్రతులు, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు జ్ఞాన భారతం మిషన్‌ను దేశం ప్రారంభించిందని, మేధోపరమైన సంస్థలన్నీ దీనికి మరింత సహకారం అందించాలని కోరారు. భారతదేశ ప్రాచీన జ్ఞానాన్ని, దాని గుర్తింపును తప్పనిసరిగా కాపాడుకోవాలని, ఇలాంటి సంస్థల సహకారంతో జ్ఞాన భారతం మిషన్ విజయం, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

దేశం ప్రస్తుతం గొప్ప సాంస్కృతిక మహోత్సవమైన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను జరుపుకుంటోందని, సోమనాథ్ ఆలయం మొదటిసారి ధ్వంసమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వేల ఏళ్ల ప్రయాణాన్ని ఈ పండుగ ద్వారా దేశం స్మరించుకుంటోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో భాగస్వాములు కావాలని, దీని ఉద్దేశాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి కోరారు. భగవాన్ స్వామినారాయణ్‌ను అనుకరించే వారి కృషి ద్వారా భారత్ అభివృద్ధి ప్రయాణానికి ఆయన ఆశీస్సులు నిరంతరం ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2217923) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam