హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గీతా ప్రెస్ ప్రచురించిన 'కళ్యాణ్' మాసపత్రిక శతాబ్ది సంచిక విడుదల కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విధానాల్లోని మూలాల్లో ఉన్న భారత సంస్కృతి సైద్ధాంతిక బలాన్ని పునఃస్థాపించే ప్రయత్నం

ప్రతి యుగంలోనూ సనాతన స్ఫూర్తిని సజీవంగా ఉంచటంలో శక్తిమంతమైన మాధ్యమంగా గీతా ప్రెస్

లాభాపేక్ష కోసం కాకుండా, తరతరాలను తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్న గీతా ప్రెస్

ప్రతి సంక్షోభ సమయంలో భారతీయ సంస్కృతి దీపాన్ని ప్రజ్వలింపజేస్తున్న 'కళ్యాణ్’.. సనాతన ధర్మాన్ని పాటించేవారి ధార్మిక శక్తిని సంఘటితం చేయటానికి కృషి

ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 'కళ్యాణ్' పత్రికలోని ప్రతి పదం, వాక్యం, సంచిక సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి అంకితం

1950లో అప్పటి ప్రధానమంత్రి నాయకత్వంలో పాశ్చాత్య ఆలోచనతో ప్రభావితమైన విధానాలు రూపొందుతున్న తరుణంలో 'హిందూ సంచిక' ప్రచురణ ద్వారా దేశానికి సైద్ధాంతిక దిశానిర్దేశం చేసిన గీతా ప్రెస్ కళ్యాణ్ పత్రిక

ఆయుధాలతో కాదు మాటలు, జ్ఞానంతో నాగరికతలు ఏర్పడతాయని వెల్లడించిన 'కళ్యాణ్’.. 'సత్యం’, 'సత్వ' కాంతితో ప్రకాశించినప్పుడే ప్రభావవంతంగా మాటలు

భారతీయ సంస్కృతిని చిరస్థాయిగా నిలబెట్టేందుకు జరిగిన బలమైన ప్రయత్నమే 'కళ్యాణ్' పత్రిక

వివిధ రకాల సాహిత్యాన్ని గీతా ప్రెస్ రూపొందించటం ద్వారా దేశంలో గొప్ప చైతన్యానికి అంకురార్పణ

కోట్లాది మంది సాధువుల అవిశ్రాంత కృషిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన గీతాప్రెస్

కర్మయోగిగా మారి గీతాప్రెస్ ద్వారా సనాతన సంస్కృతిని బలోపేతం చేసిన పూజ్యనీయ హనుమాన్ ప్రసాద్ పొద్దార్

లక్ష్మీనారాయణ దేవాలయంలో పూజలు, గంగా మాతకు ప్రార్థనలు నిర్వహించిన కేంద్ర హోంమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 JAN 2026 7:39PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గీతా ప్రెస్ ప్రచురించిన 'కళ్యాణ్' మాసపత్రిక శతాబ్ది సంచిక విడుదల కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. అనంతరం లక్ష్మీనారాయణ దేవాలయంలో పూజలు చేసి, గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని నమ్మేవారికి, ప్రపంచ సమస్యలకు భారతీయ సంస్కృతిలో పరిష్కారాలను వెతికేవారికి, ఈ పుణ్యభూమిని ప్రేమించేవారికి గీతా ప్రెస్ గురించి తెలియకుండా ఉండదని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. 103 ఏళ్లుగా పూజ్యనీయులు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ గీతా ప్రెస్ ద్వారా సనాతన ధర్మ జ్యోతిని నిరంతరం ప్రజ్వలింపజేస్తున్నారని కొనియాడారు. భక్తి మార్గం ద్వారా కోట్ల మంది ప్రజల్లో ఆయన, ఆధ్యాత్మిక చింతనను నింపటమే కాక, ఆ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షానికి మార్గం సుగమం చేశారు. సర్వస్వాన్ని త్యజించి, పొద్దార్ జీవితం మొత్తాన్ని గీతా ప్రెస్ కి అంకితం చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. గీతా ప్రెస్ ద్వారా పొద్దార్.. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలోనూ భారత సంస్కృతి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, గౌరవాన్ని నింపారని చెప్పారు.

లాభం కోసం కాకుండా, భవిష్యత్ తరాల నిర్మాణానికి గీతా ప్రెస్ పనిచేస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. స్వావలంబన పద్ధతిలో కోట్లాది మంది ప్రజలకు సాహిత్యాన్ని చేర్చటంలో గీతా ప్రెస్ విజయం సాధించిందని తెలిపారు. ప్రతి పాఠకుడిలో శాశ్వతమైన జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు 'కళ్యాణ్' పత్రిక కృషి చేస్తుందన్నారు. నేడు దేశవ్యాప్తంగా సనాతన చైతన్య ఉత్సవం కనిపిస్తుందని, ప్రతి సంక్షోభంలోనూ 'కళ్యాణ్' భారతీయ సంస్కృతి దీపాన్ని ప్రజ్వలింపజేస్తూనే ఉందని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో భారతీయులకు 'కళ్యాణ్' కేవలం పత్రిక మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొనియాడారు. భారత సంస్కృతిని అజరామరం చేసేందుకు జరిగిన ప్రయత్నాల్లో 'కళ్యాణ్' పత్రిక పేరు అత్యంత శక్తిమంతమైనదని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారిలోని సద్గుణ శక్తిని ఏకం చేసేందుకు 100 ఏళ్లుగా 'కళ్యాణ్' కృషి చేసిందని ఆయన అన్నారు. దేశం గురించి ఎంతో తెలిసిన వారు కూడా గీతాప్రెస్ అందించిన అసమాన సహకారాన్ని పూర్తిగా అంచనా వేయటం అసాధ్యమని తెలిపారు.

'కళ్యాణ్' వంటి పత్రిక 100 ఏళ్లు పూర్తి చేసుకోవటం గొప్ప విజయమని కేంద్ర హోంమంత్రి కొనియాడారు. ఈ పత్రిక ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 'కళ్యాణ్' లోని ప్రతి పదం, వాక్యం, సంచిక.. సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి అంకితమైందని తెలిపారు. ఉపనిషత్తులపై ఆది శంకరాచార్యుల వివరణాత్మక గ్రంథాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా గీతాప్రెస్ అద్భుతమైన సేవ చేసిందన్నారు. నాలుగు తరాలుగా గీతాప్రెస్, సాహిత్యంలోని అసలైన సారాంశాన్ని తగ్గిపోనీయకుండా ప్రతి తరానికి నిరంతరాయంగా అందిస్తుందని చెప్పారు.

సనాతన ధర్మానికి అంకితం చేసిన 100 ప్రత్యేక సంచికలను 'కళ్యాణ్' పత్రిక ప్రచురించిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 1932 నాటి 'కళ్యాణ్' సంచికలో భగవాన్ శ్రీ కృష్ణుడిని ఆరాధ్య దైవంగా, రాజకీయవేత్తంగా, తత్వవేత్తగా, సకల దుష్టుల సంహారకుడైన గొప్ప వ్యక్తిగా చూపించినట్లు చెప్పారు. 1936లో 'కళ్యాణ్' యోగా సంచికను ప్రచురించిందని, అందులో యోగా నిర్వచనం, స్వభావం, పద్ధతులను క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక 'కళ్యాణ్' నుంచి మొదటగా స్త్రీ సంచిక విడుదలైందని పేర్కొన్నారు. 1950లో పాశ్చాత్య ప్రభావంతో దేశ విధానాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో 'కళ్యాణ్' పత్రిక హిందూ సంస్కృతి సంచికను ప్రచురించినట్లు శ్రీ అమిత్ షా చెప్పారు. భారత్ స్వతంత్ర దేశంగా మారి, సొంత విధానాలను రూపొందించుకుంటున్నప్పుడు అవి, విదేశీ ఆలోచనలపై కాక, దేశ సంస్కృతిపై ఆధారపడి ఉండాలన్నదే ఈ సంచిక ఉద్దేశమని చెప్పారు. 'కళ్యాణ్' శతాబ్ది ఉత్సవాల వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాంస్కృతిక విలువలే ప్రధానాంశాలుగా దేశ విధానాలు రూపొందుతున్నాయని తెలిపారు.

మతాన్ని మూఢనమ్మకంగా చిత్రీకరించటం బ్రిటీష్ పాలనలో ఫ్యాషన్ గా మారిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. ఆ సమయంలో దురుసు భాషను ప్రయోగించకుండా 'కళ్యాణ్' ద్వారా జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు పొద్దార్ కృషి చేశారన్నారు. ప్రజల సంక్షేమం, ప్రపంచ శ్రేయస్సు దీని ఏకైక లక్ష్యమని చెప్పారు. 'కళ్యాణ్' పత్రికలో ప్రపంచ సంక్షేమ భావన ఇమిడి ఉందని కొనియాడారు. మన మౌలిక సిద్ధాంతాల పట్ల వ్యతిరేకతను తర్కం, శాస్త్రం, శాంతి మార్గంలో పొద్దార్ జీ ఎదుర్కొన్నారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సనాతన ధర్మ రక్షణ కేవలం వాదనల ద్వారా సాధ్యం కాదని.. శాస్త్ర విజ్ఞానం, హేతుబద్ధత ద్వారానే సాధ్యమని చెప్పారు. ప్రచారం కోసమో, నిధుల కోసమో గీతా ప్రెస్ ఎప్పుడూ పనిచేయలేదని, ఎందుకంటే దాని లక్ష్యం వ్యక్తుల చుట్టూ కాక, ఉన్నత ఆశయాల చుట్టూ కేంద్రీకృతమైందని వివరించారు. ఆయుధాల ద్వారా కాకుండా.. మాటలు, జ్ఞానం ద్వారా నాగరికతలు నిర్మితమవుతాయని 'కళ్యాణ్' పత్రిక మనకు నేర్పిందని హోంమంత్రి చెప్పారు. సత్యం, సద్గుణాల కాంతితో ప్రకాశించినప్పుడే మాటలకు శక్తి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

'కళ్యాణ్' పత్రికను ప్రారంభించిన సమయంలో అందులో ప్రకటనలు ప్రచురించకూడదని మహాత్మా గాంధీ ఇచ్చిన సూచన మేరకు నేటికీ ఒక్క ప్రకటనను కూడా ప్రచురించలేదని శ్రీ అమిత్ షా తెలిపారు. ఆధ్యాత్మిక పుస్తకాలు, పత్రికలు మార్కెట్ ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం, జాతి నిర్మాణమే గీతా ప్రెస్ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. విస్తృతంగా సాహిత్యాన్ని గీతాప్రెస్ ప్రచురించిందని, తద్వారా దేశంలో గొప్ప చైతన్యం కలిగిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు, సాధువుల అవిశ్రాంత కృషిని సామాన్య ప్రజలకు గీతా ప్రెస్ తెలియజేసిందని చెప్పారు. దీనిద్వారానే సనాతన ధర్మం పట్ల ఆకర్షణ పెరిగిందని, భారత సంస్కృతిపై విశ్వాసం, కొత్త ఆశలు చిగురిస్తున్నాయన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశ యువతలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. దాదాపు 550 ఏళ్ల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం నిర్మితమైనట్లు చెప్పారు. విధ్వంసం చేసే వారికంటే విశ్వాసానికున్న శక్తి చాలా గొప్పదనే సందేశాన్ని ఔరంగజేబు ధ్వంసం చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పునర్నిర్మాణం ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఈ ఏడాదిని 'సోమనాథ్ స్వాభిమాన్ వర్ష్'గా నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమనాథ్ ఆలయాన్ని 16 సార్లు ధ్వంసం చేయగా, 16 సార్లు పునర్నిర్మించినట్లు గుర్తు చేసుకున్నారు. విధ్వంసకారులైన గజనీ, ఖిల్జీ కాలగర్బంలో కలిసిపోయారని, సోమనాథుని శాశ్వత పతాకం నేటీకీ సగర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, మహాకాళేశ్వర్ కారిడార్ ను నిర్మించామని, కేదార్‌నాథ్ క్షేత్రాన్ని పునరుద్ధరించామని, బద్రీధామ్ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని శ్రీ అమిత్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా 35కు పైగా పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ, వైభవాన్ని చాటి చెప్పే పనులు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించటం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీలో మాట్లాడినప్పుడు యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోతుందని తెలిపారు. భారత్ నుంచి దొంగలించి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలించిన 642కు పైగా విగ్రహాలను తిరిగి తీసుకొచ్చి వాటి స్థానాల్లో పునఃప్రతిష్ఠించినట్లు తెలిపారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ లెక్కలేనంత మంది సాధువులు ధర్మాన్ని, పుణ్యాన్ని, సంస్కృతిని కాపాడి, పోషించారని పేర్కొన్నారు. గీతా ప్రెస్ వంటి సంస్థలు, 'కళ్యాణ్' వంటి పత్రికలు సనాతన ధర్మ జ్యోతిని ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉన్నాయని కొనియాడారు.

 

***


(రిలీజ్ ఐడి: 2217313) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada