సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
‘150 ఏళ్ల వందేమాతరం’పై గణతంత్ర దినోత్సవ శకటం-2026ను ప్రదర్శించనున్న సాంస్కృతిక శాఖ
प्रविष्टि तिथि:
21 JAN 2026 9:59PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ‘150 ఏళ్ల వందేమాతరం’ ఇతివృత్తంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శకటాన్ని ప్రదర్శించనుంది. దేశ నాగరికతా స్మృతికి, సమష్టి చేతనకు, సాంస్కృతిక అవిచ్ఛిన్నతకు ఓ సజీవ వ్యక్తీకరణగా మన జాతీయ గేయాన్ని ఈ శకటం ద్వారా చాటనున్నారు.
ఈ ఇతివృత్తం గురించి వివరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శకటాలు కేవలం ఉత్సవ ప్రదర్శనలు మాత్రమే కావనీ, అవి దేశ నాగరికత స్మృతిని చాటే సంచార భాండాగారాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఈ శకటాలు ఏటా మన భావాలను, విలువలను, చారిత్రక అనుభవాలను అందరికీ అర్థమయ్యేలా దృశ్య రూపంలో ఆవిష్కరిస్తున్నాయన్నారు. సంస్కృతి అనేది ఈ గణతంత్రానికి అలంకారం మాత్రమే కాదని, దాన్ని నిలబెట్టే చేతనా శక్తి అని వీటి ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఈ సాంస్కృతిక వాహినిలో అద్వితీయమైన, శాశ్వతమైన స్థానం వందేమాతరానికి ఉందన్నారు.
ఒకప్పుడు విప్లవకారుల గళం నుంచి వెలువడి.. కారాగారాల్లో, సభల్లో, ఊరేగింపుల్లో వందేమాతరం ప్రతిధ్వనించిందని, అది కేవలం ఒక గేయం మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు. సమష్టి చేతనను మేల్కొల్పగల ఆధ్యాత్మిక శక్తి వందేమాతరంలో ఉందని శ్రీ అరవిందులు దర్శించారని, అది నిజమని చరిత్ర నిరూపించిందని శ్రీ వివేక్ అగర్వాల్ అన్నారు. 1875లో బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన ఈ గేయం.. దేశాన్ని తల్లిగా భావించింది. సుజలాం, సుఫలాం అంటూ.. ప్రకృతి సంపదతో, దీవెనలతో, అంతర్గత శక్తితో అలరారే ఒక గొప్ప శక్తిగా దేశాన్ని ఆయన దర్శించారు. వలస పాలన కాలంలో మనలో గౌరవాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని వందేమాతరం పునరుజ్జీవింపజేసింది. దేశభక్తిని వీరత్వంగాను, కవిత్వాన్ని కృతనిశ్చయంగాను మార్చింది. ప్రాంతాలు, భాషలు, విశ్వాసాలకు అతీతంగా.. స్వాతంత్ర్యమనే సమష్టి ఆశయం దిశగా భారతీయులను ఏకం చేసింది.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రదర్శిస్తున్న ఈ 2026 గణతంత్ర దినోత్సవ శకటం.. ఈ సుదీర్ఘమైన, బహువిధమైన వందేమాతర ప్రస్థానానికి ఉత్తేజకరమైన దృశ్యరూపాన్నిస్తుంది. కదిలే ట్రాక్టర్ ముందు భాగంలో వందేమాతరం మౌలిక రాతప్రతిని ప్రదర్శిస్తూ శకటం ముందకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచీ వచ్చిన జానపద కళాకారులు ప్రదర్శనలతో దాన్ని అనుసరిస్తారు. ఇది దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్ళకు కడుతుంది. ఈ శకటం మధ్యలో నేటి తరం ప్రతినిధులుగా జెన్-జి యువత నిలుస్తారు. చారిత్రాత్మక విష్ణుపంత్ పాగ్నీ గానం స్ఫూర్తితో వీరు వందేమాతరాన్ని ఆలపిస్తారు. ఆయన వందేమాతరం చరణాల వరుసను మార్చి సారంగ రాగంలో రికార్డు చేసి.. వలస పాలనలో విధించిన ఆంక్షలను (సెన్సార్ షిప్) అధిగమించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో కళాత్మక ప్రతిఘటనకు ఇదొక విశేష ఉదాహరణ.
2021 నుంచి ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రానికి (ఐజీఎన్‌సీఏ) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణతంత్ర దినోత్సవ శకటం రూపకల్పన, ప్రదర్శన బాధ్యతలను అప్పగించారు. ఆ సంస్థ ఏటా దేశ తాత్విక, చారిత్రక, సాంస్కృతిక మూలాల ప్రాతిపదికన ఇతివృత్తాలను రూపొందిస్తోంది. తరతరాలను ప్రభావితం చేసేలా వాటిని దృశ్యమానం చేస్తోంది. 2026 శకటం ఈ ఒరవడిని కొనసాగిస్తోంది. వందేమాతరాన్ని కేవలం ఓ చారిత్రక రచనగా మాత్రమే కాకుండా.. మన నైతికతను, సంస్కృతిని, ఉద్వేగ భావనలను ప్రతిధ్వనించే నిరంతర స్రవంతిగా నిలుపుతోంది.
ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రం (ఐజీఎన్‌సీఎ) సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద జోషి మాట్లాడుతూ.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శకటం కేవలం ఒక మంత్రిత్వ శాఖనో, విభాగాన్నో సూచించడానికే పరిమితం కాదని, దేశ సమష్టి భావోద్వేగాలను, చరిత్రను, జాతీయ చేతనను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. స్ఫూర్తిదాయకమైన జాతీయ గేయ చారిత్రక, సాంస్కృతిక ప్రస్థానాన్ని కళాత్మక వ్యక్తీకరణతో కళ్లకు కట్టేలా.. గణతంత్ర దినోత్సవ ప్రదర్శన కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శకటం ఇతివృత్తాన్ని ‘150 ఏళ్ల వందేమాతరం’గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
గత ఆరేళ్లుగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణతంత్ర దినోత్సవ శకటం రూపకల్పన, ప్రదర్శన బాధ్యతను ఐజీఎన్‌సీఏ నిర్వహిస్తోందని డాక్టర్ జోషి చెప్పారు. చాలా మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు తమ నిర్దిష్ట విజయాలనో, పథకాలనో ప్రముఖంగా ప్రదర్శిస్తుండగా.. సాంస్కృతిక శాఖ మాత్రం అనేక సాంస్కృతిక కోణాలను మేళవిస్తూ విశిష్ట శైలిని అనుసరిస్తోందన్నారు. కొన్నేళ్లుగా చేపట్టిన ఇతివృత్తాల్లో ఈ విధానం ప్రతిబింబిస్తోందన్నారు. అదే స్ఫూర్తితో 2026 ఇతివృత్తాన్ని ‘150 ఏళ్ల వందేమాతరం’గా నిర్ణయించామని తెలిపారు.
భారత్ గణతంత్ర దినోత్సవం- 2026ను నిర్వహిస్తున్న ఈ తరుణంలో.. స్వాతంత్ర్యాన్ని స్మరించుకోవడమే కాదు, దానికి అర్హులుగా నిలవాలని వందేమాతరం దేశానికి పిలుపునిస్తోంది. నేడు మన ముందున్న బాధ్యతలతోనూ, భవిష్యత్ ఆకాంక్షలతోనూ స్వాతంత్ర్య పోరాట స్మృతులను అనుసంధానిస్తూ.. ఈ ప్రదర్శన ద్వారా వందేమాతరాన్ని దేశ ఐక్యతకు, సాంస్కృతిక ఉన్నతికి, అజేయ స్ఫూర్తికి చిహ్నంగా చాటడం సాంస్కృతిక శాఖ లక్ష్యం.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణతంత్ర దినోత్సవ కేటలాగ్‌ను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
***
(रिलीज़ आईडी: 2217295)
आगंतुक पटल : 3