ప్రధాన మంత్రి కార్యాలయం
సంయుక్త ప్రకటన: యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటన
प्रविष्टि तिथि:
19 JAN 2026 8:10PM by PIB Hyderabad
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్.. 2026 జనవరి 19న భారత్‌లో అధికారికంగా పర్యటించారు. గత పదేళ్లలో భారత్‌ను శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సందర్శించడం ఇది ఐదోసారి. యూఏఈ అధ్యక్షునిగా ఆయనకు ఇది మూడో అధికారిక పర్యటన.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించారు. గత దశాబ్ద కాలంగా భారత్-యూఏఈ 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతూనే ఉందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు.
గత రెండేళ్లలో భారత్‌లో అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, దుబాయ్ యువరాజు- యూఏఈ ఉప ప్రధాని- రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పర్యటించటాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. తరతరాల ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపును ఈ పర్యటనలు చాటిచెప్పాయని వారు పేర్కొన్నారు.
2025 సెప్టెంబర్‌లో జరిగిన 13వ పెట్టుబడులు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం, 2025 డిసెంబర్‌లో జరిగిన 16వ భారత్-యూఏఈ జాయింట్ కమిషన్ సమావేశం, 5వ వ్యూహాత్మక చర్చల ఫలితాలను ఇద్దరు నాయకులు ఆమోదించారు.
2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదిరినప్పటి నుంచి వాణిజ్యం, ఆర్థిక సహకారంలో కనిపిస్తున్న పటిష్ఠమైన వృద్ధిని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారీ వృద్ధి నమోదు చేసినట్లు తెలిపిన ఇరువురు నేతలు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలియజేశారు. ఇరువైపులా వ్యాపార వర్గాలు ఉత్సాహంగా ఉన్నందున 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 200 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని వారు నిర్ణయించారు.
రెండు దేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) అనుసంధానించే దిశగా పనిచేయాలని వారు తమ బృందాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, యురేషియా ప్రాంతాలలో ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 'భారత్ మార్ట్', 'వర్చువల్ ట్రేడ్ కారిడార్', 'భారత్-ఆఫ్రికా సేతు' వంటి కీలక కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని వారు పిలుపునిచ్చారు.
2024లో కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రెండు దేశాల్లోని పలు రంగాల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అభివృద్ధిలో యూఏఈ భాగస్వామ్యంపై జరుగుతున్న చర్చలను వారు స్వాగతించారు. ఈ ప్రతిపాదిత భాగస్వామ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం, పైలట్ శిక్షణ పాఠశాల, నిర్వహణ, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) సౌకర్యం, గ్రీన్ఫీల్డ్ ఓడరేవు, స్మార్ట్ అర్బన్ టౌన్షిప్, రైల్వే అనుసంధానత, ఇంధన మౌలిక సదుపాయాల వంటి కీలక వ్యూహాత్మక ప్రాజెక్టుల అభివృద్ధి ఉంటుంది. మొదటి ఎన్‌ఐఐఎఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సాధించిన విజయాన్ని ఉటంకించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 2026లో ప్రారంభం కానున్న రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో పాల్గొనవలసిందిగా యూఏఈ సావరిన్ వెల్త్ ఫండ్‌లను ఆహ్వానించారు. గిఫ్ట్ సిటీ అగ్రగామి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో అక్కడ డీపీ వరల్డ్, ఫస్ట్ అబుదాబి బ్యాంకు (ఎఫ్‌ఏబీ) శాఖల ఏర్పాటును ఇద్దరు నాయకులు స్వాగతించారు. గిఫ్ట్ సిటీలోని ఎఫ్‌ఏబీ బ్రాంచ్ ఒక కీలక వారధిలా పనిచేస్తూ జీసీసీ, మెనా మార్కెట్లలోని నైపుణ్యం, అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో భారతీయ కార్పోరేట్ సంస్థలు, పెట్టుబడిదారులను అనుసంధానిస్తుంది.
సుస్థిర సరఫరా వ్యవస్థలూ, దీర్ఘకాలిక దృఢత్వాన్ని నిర్ధారించడంలో ఆహార భద్రతకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ రంగంలో భారత్-యూఏఈ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించాయి. రెండు దేశాల జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఆహారం విషయంలో జాతీయ దృఢత్వాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, విజ్ఞాన మార్పిడికి ఉన్న పాత్రను వారు ప్రధానంగా పేర్కొన్నారు.
అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత బలంగా పెంచుకోవడానికి ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగాన్ని వాణిజ్యపరమైనదిగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఉమ్మడి కార్యక్రమంపై కుదిరిన అవగాహనను వారు స్వాగతించారు. మొదటి నుంచి చివరి వరకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బలమైన పారిశ్రామిక పునాదితో కూడిన సమగ్ర అంతరిక్ష వ్యవస్థను తయారుచేయాలన్నది ఈ కార్యక్రమానికి ఉన్న ప్రధాన ఉద్దేశం. భారత్-యూఏఈ ఉమ్మడి అంతరిక్ష యాత్రలను చేపట్టడం, ప్రపంచ స్థాయి వాణిజ్య సేవలను విస్తరించడం, అధిక నైపుణ్యం కలిగిన ఉపాధి- అంకురాలను సృష్టించడం, సుస్థిర వ్యాపార నమూనాల ద్వారా ద్వైపాక్షిక పెట్టుబడులను బలోపేతం చేయాలన్న లక్షంతో ఈ ప్రాజెక్ట్ ఉంది.
కృత్రిమ మేధ (ఏఐ), వర్ధమాన సాంకేతిక రంగాలలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. భారత్‌లో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించుకోవాలనే నిర్ణయాన్ని స్వాగతించిన ఇరువురు.. ఇక్కడ డేటా సెంటర్ల ఏర్పాటులో కూడా సహకార అంశాలను అన్వేషించేందుకు అంగీకరించారు. పరస్పరం గుర్తించిన సార్వభౌమత్వ నిబంధనల ప్రకారం యూఏఈ, భారత్ మధ్య 'డిజిటల్ ఎంబసీల' ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఇద్దరు నాయకులు తమ బృందాలను ఆదేశించారు. 2026 ఫిబ్రవరిలో భారత్ ఆతిథ్యంలో జరగనున్న 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు'కు అధ్యక్షులు శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మద్దతును తెలియజేశారు.
ద్వైపాక్షిక ఇంధన భాగస్వామ్యం బలంగా ఉండటం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఇంధన భద్రతలో యూఏఈ అందిస్తున్న సహకారాన్ని ఇరువురు ప్రధానంగా చెప్పారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), అడ్నోక్ గ్యాస్ మధ్య 2028 నుంచి ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరా కోసం కుదిరిన 10 ఏళ్ల ఒప్పందాన్ని వారు స్వాగతించారు. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి) చట్టం అమలులోకి రావడాన్ని స్వాగతించిన నాయకులు.. ఇది పౌర అణు సహకారాన్ని పెంపొందించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్) అభివృద్ధి, ఉపయోగంతో సహా అత్యాధునిక అణు సాంకేతికతలలో భాగస్వామ్యాన్ని అన్వేషించేందుకు.. అలాగే అధునాతన రియాక్టర్ వ్యవస్థలు, అణు విద్యుత్ కేంద్రాల కార్యకలాపాలు, నిర్వహణ, అణు భద్రతలో సహకరించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య ఆర్థిక రంగంలో సహకారం మరింత లోతుగా బలపడటం పట్ల ఇద్దరు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన విదేశీ చెల్లింపులను సాధ్యం చేసేందుకు ఇరు దేశాల జాతీయ చెల్లింపు వేదికలను ఒకదానితో ఒకటి అనుసంధానించే దిశగా పనిచేయాలని వారు తమ బృందాలను ఆదేశించారు.
రెండు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. లోథల్‌లోని నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ కోసం పురాతన వస్తువులను అందించాలనే యూఏఈ నిర్ణయాన్ని స్వాగతించారు. భారత-యూఏఈ స్నేహానికి శాశ్వత చిహ్నంగా అబుదాబిలో 'హౌస్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. సాంస్కృతిక అవగాహనను మరింత పెంపొందించే లక్ష్యంతో యువజన మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య ఉన్న శక్తిమంతమైన సంబంధాలను నిరంతరం ప్రోత్సహించాలని వారు అంగీకరించారు.
భారత్-యూఏఈ భాగస్వామ్యానికి విద్యను ఒక మూలస్తంభంగా ఇద్దరు నాయకులు గుర్తించారు. యూఏఈలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్ ఆఫ్-షోర్ క్యాంపస్‌ల ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని ఇరు దేశాల విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించడానికి.. విద్యార్థుల మార్పిడిని విస్తరించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఒక 'విజ్ఞాన వారధి'గా పనిచేస్తుంది. పాఠశాలలు, కళాశాలల్లో ఇన్నోవేషన్- టింకరింగ్ ల్యాబ్‌లను విస్తరించడంలో సహకారం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. భారతీయ డిగ్రీలు, విద్యకు సంబంధించిన పత్రాల విషయంలో ఆటంకం లేని ధ్రువీకరణ కోసం భారతదేశపు 'డిజిలాకర్'ను యూఏఈ వేదికలతో అనుసంధానించే దిశగా కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది మెరుగైన ఆర్థిక, విద్యా అవకాశాలను పెంపొందించడమే కాకుండా జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది.
ఇరుదేశాల సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత పట్ల ఉన్న గౌరవాన్ని, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఉన్న ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో స్థిరమైన, పటిష్ఠమైన ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారం ఒక ముఖ్యమైన మూలస్తంభమని వారు గుర్తించారు. ఇరు దేశాల సైన్యం, నావికా దళం, వైమానిక దళాల చీఫ్‌లు - కమాండర్ల ఇటీవలి పర్యటనలు, ద్వైపాక్షిక సైనిక విన్యాసాల విజయవంతమైన నిర్వహణ ద్వారా వచ్చిన పురోగతిని వారు స్వాగతించారు. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం దిశగా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'పై సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు.
సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఇద్దరు నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాద చర్యలకు ఆర్థిక సాయం చేసేవారికి, ప్రణాళికలు వేసేవారికి, మద్దతు ఇచ్చేవారికి ఏ దేశం కూడా సురక్షిత ఆశ్రయం కల్పించకూడదని వారు ప్రధానంగా పేర్కొన్నారు. ఉగ్రవాదానికి నిధుల లభ్యతను అడ్డుకోవడానికి, మనీలాండరింగ్ వ్యతిరేక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పరిధిలో సహకారాన్ని కొనసాగించేందుకు వారు అంగీకరించారు.
సెప్టెంబర్ 2023లో ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించిన 'భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్'ను (ఐఎంఈసీ) ఇద్దరు నాయకులు గుర్తు చేశారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వంపై తమకు ఉన్న ఉమ్మడి ఆసక్తిని వారు ఉద్ఘాటించారు. బహుళ పక్ష వేదికల్లో ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సహకారం, పరస్పర మద్దతును వారు ప్రస్తావించారు. 2026లో భారతదేశం చేపట్టనున్న బ్రిక్స్ అధ్యక్ష పదవి విజయవంతం కావడానికి పూర్తి మద్దతును యూఏఈ తెలియజేసింది. 2026 చివరిలో యూఏఈ సహ-ఆతిథ్యం ఇవ్వనున్న ఐక్యరాజ్యసమితి నీటి సదస్సుకు మద్దతును భారత్ ప్రకటించింది. ఇది అందరికీ నీరు, పారిశుద్ధ్య లభ్యతను (ఎస్‌డీజీ 6) నిర్ధారించడంపై దృష్టి పెడుతుంది.
ధృవాలకు సంబంధించిన శాస్త్ర పరిశోధన విషయంలో ఇరు దేశాల మధ్యనున్న సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఇరుపక్షాలు.. ఉమ్మడి అన్వేషణ, సంస్థాగత సహకారం ద్వారా లభించిన సానుకూల ఫలితాలను గుర్తించాయి. లక్షిత శాస్త్రీయ కార్యక్రమాలు, సమన్వయ పరిశోధన ప్రణాళికలు, జాతీయ ధృవ పరిశోధనా సంస్థల మధ్య పటిష్ఠమైన సహకారం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ధృవ ప్రాంతాలలో నిరంతర సహకారం అనేది సాక్ష్యాధారిత వాతావరణ చర్యలకు మద్దతు ఇస్తుందని, ప్రపంచ శాస్త్రీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని వారు ప్రముఖంగా చెప్పారు.
తనకు లభించిన సాదర స్వాగతం, అద్భుతమైన ఆతిథ్యానికి అధ్యక్షుడు శ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2216404)
आगंतुक पटल : 7