ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
18 JAN 2026 4:41PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి. ఆనంద బోస్, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ శర్బానంద సోనోవాల్, సుకాంత మజుందార్, శంతను ఠాకూర్, నా పార్లమెంటు సహచరులు సౌమిక్ భట్టాచార్య, సౌమిత్ర ఖాన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, సోదరీ సోదరులారా!
నిన్న నేను మాల్దాలో ఉన్నాను, ఈరోజు హుగ్లీలో మీ అందరి మధ్యకు వచ్చే భాగ్యం కలిగింది. వికసిత భారత్ కోసం తూర్పు భారత్ అభివృద్ధి - లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, అంకితం ఇచ్చే అవకాశం నాకు లభించింది. నిన్న దేశ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైంది. బెంగాల్‌కు సుమారు అరడజను కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందాయి. ఈరోజు మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక రైలు నా పార్లమెంటు నియోజకవర్గం కాశీ బనారస్‌తో బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇవే కాకుండా, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా మొదలయ్యాయి. అంటే, పశ్చిమ బెంగాల్ రైలు అనుసంధానానికి గత 24 గంటలు అపూర్వమైనవి. బహుశా గత 100 ఏళ్లలో 24 గంటల వ్యవధిలో ఇంతటి పని జరగలేదు.
మిత్రులారా,
బెంగాల్‌లో జలరవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై కూడా దృష్టి సారించింది. ఓడరేవుల ద్వారా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం అందిస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే, ఓడరేవులు, నదీ జలరవాణా ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, భారత దేశ ప్రగతికి ఇవి చాలా ముఖ్యం. పశ్చిమ బెంగాల్‌ను తయారీ, వాణిజ్యం, రవాణా, రంగాల్లో ఒక పెద్ద కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇవి పునాదులు. ఈ ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
మనం ఓడరేవు, దాని అనుబంధ వ్యవస్థపై ఎంతగా దృష్టి పెడితే, అంతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గత 11 ఏళ్లలో, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు సామర్థ్యం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడి పెట్టింది. ఈ ఓడరేవు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సాగరమాల పథకం కింద రహదారులు కూడా నిర్మించారు. ఈరోజు మనం దీని ఫలితాన్ని చూడవచ్చు. గత ఏడాది కాలంలో, కోల్‌కతా పోర్టు సరకు రవాణాలో కొత్త రికార్డులు సృష్టించింది.
మిత్రులారా,
బాలాగఢ్‌లో నిర్మించే 'ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్' హుగ్లీ, చుట్టుపక్కల ప్రాంతాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. ఇది కోల్‌కతా నగరంలోని రవాణా ఒత్తిడిని తగ్గిస్తుంది. గంగా నదిపై నిర్మించిన జలరవాణా మార్గం ద్వారా సరకు రవాణా మరింత పెరుగుతుంది. ఈ మౌలిక సదుపాయాల వ్యవస్థ మొత్తం హుగ్లీ ప్రాంతాన్ని ఒక గిడ్డంగి, వాణిజ్య కేంద్రంగా మార్చడానికి తోడ్పడుతుంది. ఇది ఇక్కడికి వందల కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులను తీసుకువస్తుంది. వేలాది యువతకు ఉపాధి లభిస్తుంది. రవాణా రంగంతో ముడిపడిన వారికి, చిన్న వ్యాపారులకు లాభం చేకూరుతుంది. అలాగే రైతులు, ఉత్పత్తిదారులకు కొత్త మార్కెట్లు దొరుకుతాయి.
మిత్రులారా,
నేడు మనం బహుళవిధ కనెక్టివిటీకి, పర్యావరణహిత రవాణాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. రవాణాలో ఆటంకాలు లేకుండా ఉండటానికి ఓడరేవులు, నదీ జలరవాణా మార్గాలు, రహదారులు, విమానాశ్రయాలు - ఇలా అన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల రవాణా ఖర్చు, ప్రయాణ సమయం రెండూ తగ్గుతున్నాయి.
మిత్రులారా,
మన రవాణా సాధనాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనేది మా ప్రయత్నం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బోట్ల ద్వారా నదీ రవాణా, పర్యావరణహిత రవాణా రెండింటికీ బలం చేకూరుతుంది. ఇది హుగ్లీ నదిపై ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. కాలుష్య సమస్య తగ్గుతుంది. నదీ ఆధారిత పర్యాటక రంగం కూడా పుంజుకుంటుంది.
మిత్రులారా,
భారత్ నేడు మత్స్య సంపద, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతుల్లో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో పశ్చిమ బెంగాల్ దేశాన్ని నడిపించాలనేది నా కల. నదీ జలరవాణా మార్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన దార్శనికతతో బెంగాల్‌కు ఎక్కువగా మద్దతు ఇస్తోంది. దీని ప్రయోజనం ఇక్కడి రైతులతో పాటు మన మత్స్యకార మిత్రులకు కూడా అందడం ప్రారంభమైంది.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ప్రయాణానికి వేగాన్ని ఇస్తాయి. ఈ ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి అనేకానేక శుభాకాంక్షలు. పొరుగున ఉన్న వేలమంది ప్రజలు చాలాసేపు నుంచి వేచి చూస్తున్నారు. అక్కడ కూడా నేను చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బహుశా ప్రజలు అవి వినేందుకు ఆసక్తితో ఉంటారు. అక్కడ నేను కాస్త వివరంగా మాట్లాడతాను. అందుకే నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మీ అందరి అనుమతితో తదుపరి సమావేశానికి బయలుదేరుతున్నాను. చాలా ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2215938)
आगंतुक पटल : 4