ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 18 JAN 2026 1:40PM by PIB Hyderabad

ప్రకృతి ప్రేమికులైన అస్సాం ప్రజలకు సగౌరవ వందనం!

అస్సాం గవర్నర్‌ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గరీటా, రాష్ట్ర మంత్రులు శ్రీ అతుల్ బోరా, శ్రీ చరణ్ బోరో, శ్రీ కృష్ణేందు పాల్, శ్రీ కేశబ్ మహంత, ఇతర ప్రముఖులు, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది.. గ్రామాలు దూరదూరంగా ఉన్నా కనుచూపు మేర ప్రజలు.. గ్రామీణ ప్రజానీకమే దర్శనమిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

కజిరంగాను మరోసారి సందర్శించే అవకాశం ఇవాళ నాకు లభించింది. ఈ సందర్భంగా మునుపటి నా పర్యటన గుర్తుకు రావడం సహజం.. ఎంతో సహజం. రెండేళ్ల కిందటి ఆ మధుర క్షణాలు నా జీవితంలో అత్యంత ప్రత్యేక అనుభవాన్నిచ్చాయి. ఆ రోజున కజిరంగా జాతీయ పార్కులో రాత్రి బస చేసి, మరునాటి రోజు ఉదయం ఏనుగుల సఫారీలో ఈ ప్రాంతం అందాన్ని నేను చాలా సన్నిహితంగా అనుభూతి చెందాను.

మిత్రులారా!

అస్సాం వచ్చినప్పుడల్లా నాకొక విభిన్న ఆనందానుభూతి కలుగుతుంది. ఇది ఎందరో వీరుల జన్మ భూమి. అలాగే ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుకునే పుత్రులు, పుత్రికలకు కన్న నేల. నేను నిన్ననే గువహటిలో నిర్వహించిన ‘బకురుంబా దహౌ’ వేడుకలలో పాల్గొన్నాను. అక్కడ మన బోడో పుత్రికలు బకురుంబా నృత్యంతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇదొక అద్భుత ప్రతిభా ప్రదర్శన.. పది వేల మందికిపైగా కళాకారుల ఉత్తేజం, ఖామ్ తాళం, సిఫుంగ్ నాదం- ఆ క్షణాలు అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. కళ్లారా చూసిన బకురుంబా నృత్యానుభూతి హృదయంలో ఇంకిపోయింది. అస్సాం కళాకారులు నిజంగా అద్భుతం సృష్టించారు. వారి కఠోర శ్రమ, ప్రదర్శన కోసం సన్నాహాలు, సమన్వయం... అన్నీ అత్యద్భుతంగా అలరించాయి. రికార్డు సృష్టించిన ఆ నృత్య సంబరంలో భాగస్వాములైన కళాకారులందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా అభినందనలు. అలీగే, దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకూ నా అభినందనలు. ఎందుకంటే- బోడో సంప్రదాయాన్ని ఘనంగా చాటే ఈ అద్భుత నృత్య ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో నిన్నటి నుంచీ తన ఆధిపత్యం చాటడాన్ని చూస్తూనే ఉన్నాను. ఈ నేపథ్యంలో కళ-సంస్కృతుల సమ్మేళనమైన ఈ భారతీయ దృక్పథాన్ని, దాని శక్తిని దేశవిదేశాల ప్రజానీకం తప్పక గుర్తించారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ క్రమంలో తమవంతు పాత్ర పోషిస్తున్న సామాజిక మాధ్యమ మిత్రులందరూ కూడా అభినందనలకు అర్హులే. ఇక మీడియా మిత్రుల విషయానికొస్తే- ఈ వేడుకల వల్ల నిన్న సాయంత్రం దాకా అందరూ అందులో తలమునకలయ్యారు. అయితే, ఇవాళ ఉదయం నుంచి అనేక టీవీ చానెళ్లు ఈ కార్యక్రమ పునఃప్రసారం చేస్తున్నాయంటే, అదెంత అద్భుతంగా సాగిందో మీరు ఊహించుకోవచ్చు.

మిత్రులారా!

నిరుడు నేను ఝుమర్ వేడుకలలో కూడా పాల్గొన్నాను. ఈ దఫా మాఘ బిహు సందర్భంగా ఇక్కడికి వచ్చే అవకాశం లభించింది. నెల కిందట వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల కోసం నేనిక్కడికి వచ్చాను. గువహటిలోని ప్రసిద్ధ గోపీనాథ్ బోర్డోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించిన నేపథ్యంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నేను ప్రారంభించాను. అలాగే, నామ్‌రూప్‌లో అమ్మోనియా-యూరియా ఉత్పత్తి ప్రాంగణానికి శంకుస్థాపన చేశాను. బీజేపీ ప్రభుత్వ ‘వారసత్వ సహిత వికాసం’ మంత్రానికి ఇలాంటి సందర్భాలన్నీ మరింత బలం చేకూరుస్తాయి. ఇవాళ ఈ కార్యక్రమంలో కొందరు మిత్రులు కొన్ని చిత్రాలు పట్టుకుని నిలుచుకున్నారు. ఎంతసేపని వారు అలా నిలబడతారు.. వాటిని ఇటు తీసుకురమ్మని మా సిబ్బందికి చెబుతున్నాను... ఈ మేరకు ‘ఎస్పీజీ’ సిబ్బంది.. దయచేసి ఆ చిత్రాలను సేకరించాలి. వాటిని అందజేసేవారి చిరునామా ఆ చిత్రాల వెనుక రాసి ఉంటే, మీకందరికీ నేను తప్పక బదులిస్తాను. ఇదిదో... ఈ వైపునా కొందరు యువకులు చాలా సేపటి నుంచి భుజంభుజం కలిపి నిలుచుని కనిపిస్తున్నారు. మీ కళాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ ప్రేమాభిమానాలను ఆస్వాదిస్తూ సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరందరూ కూర్చోండి... ఇక్కడి మిత్రులు వారిని ఇబ్బంది పెట్టకుండా దయచేసి సాదరంగా దగ్గరకు తీసుకురండి.

మిత్రులారా!

అస్సాం చరిత్రలో కలియాబోర్‌కు కీలక స్థానం ఉంది. ఈ ప్రదేశం రాష్ట్ర వర్తమానానికే కాకుండా భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యం. ఇది కజిరంగా జాతీయ పార్కుకు ప్రవేశ ద్వారమేగాక ఎగువ అస్సాం  అనుసంధాన కూడలి. అస్సాం వీరపుత్రుడు లచిత్ బోర్ఫుకాన్ మొఘల్ దురాక్రమణదారులను తరిమికొట్టడానికి ఇక్కడి నుంచే వ్యూహరచన చేశాడు. ఆయన నేతృత్వాన ప్రజలు సాహసం, ఐక్యత, దృఢ సంకల్పంతో మొఘల్ సైన్యాన్ని చిత్తుచేశారు. దీన్ని కేవలం సైనిక విజయంగా కాకుండా అస్సాం ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాల ప్రకటనగా మనం గుర్తించాలి. లోగడ పశ్చిమ అస్సాం మొత్తం వ్యవహారాలను ఇక్కడి నుంచే నిర్వహించారు. అహోం వంశీయుల పాలన కాలం నుంచీ కలియాబోర్‌  వ్యూహాత్మక ప్రాధాన్యంగల ప్రదేశం. ఇక నేడు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం అనుసంధానం, అభివృద్ధికి ప్రధాన కూడలిగా రూపొందుతుండటం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా!

బీజేపీ ఇవాళ దేశ ప్రజానీకం తొలి ఎంపికగా మారింది. ఏడాదిన్నర కాలం నుంచీ మా పార్టీపై దేశవాసుల నమ్మకం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. ఇటీవల బీహార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా 20 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు బీజేపీని రికార్డు స్థాయి విజయంతో ఆశీర్వదించారు. ఇక రెండు రోజుల కిందట మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో మేయర్లు, కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాలను  ప్రకటించగా- ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేషన్లలో ఒకటైన ముంబైలో ప్రజలు తొలిసారి రికార్డు స్థాయిలో బీజేపీకి పట్టంగట్టారు. అయితే, విజయం ముంబైలో లభిస్తే, ఆ వేడుకను నేడు కజిరంగాలో కూడా నిర్వహించుకుంటున్నారు. ఇదేవిధంగా ఆ రాష్ట్రంలోని చాలా నగరాల పౌరులు తమకు సేవచేసే అవకాశాన్ని మాకిచ్చారు.

మిత్రులారా!

దీనికి ముందు సుదూర దక్షిణాన కేరళలోనూ ప్రజలు తొలిసారి బీజేపీకి భారీ మద్దతివ్వడంతో ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మేయరుగా మా పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారు.

మిత్రులారా!

ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఏవైనప్పటికీ తీర్పు స్పష్టంగా ఉంది... దేశంలోని ఓటర్లందరూ నేడు సుపరిపాలనను, అభివృద్ధిని అభిలషిస్తున్నారు. అంటే- వారసత్వం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారిస్తున్నారు కాబట్టే బీజేపీని ఇష్టపడుతున్నారు.

మిత్రులారా!

ఈ ఎన్నికలు మరో సందేశం కూడా ఇస్తున్నాయి... అదేమిటంటే- కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను దేశం పదేపదే తిరస్కరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఊపిరిపోసుకున్న ముంబై నగరంలో, ఇవాళ ఆ పార్టీ 4 లేదా 5వ స్థానానికి పతనమైంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పాలన సాగిన మహారాష్ట్రలో ఆ పార్టీ పూర్తిగా కుంచించుకుపోయింది. అభివృద్ధి పరంగా కాంగ్రెస్‌ పార్టీకి ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏదీ లేదు కాబట్టే, అది దేశ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ అస్సాం లేదా కజిరంగాకు ఎప్పటికీ, ఎలాంటి మంచీ చేయదు.

మిత్రులారా!

కజిరంగా సౌందర్యాన్ని భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా- “ఆమార్ కజిరంగా ధోన్యో, ప్రకృతిర్ ధునియా కులత్ ఖేలి, ఆమార్ మోన్ హోల్ పుణ్యో” (మా కజిరంగా ధన్యభూమి, ఇక్కడి ప్రకృతి అందమైన ఒడిలో ఆటపాటలతో మా హృదయాలు పునీతమయ్యాయి) అని హృద్యంగా అభివర్ణించారు. ఆయన వాక్కులో కజిరంగాపై అపార ప్రేమ భావన... ప్రకృతిపై అస్సామీ ప్రజానీకం హృదయానుగత అనురక్తి స్పష్టమవుతాయి. కజిరంగా ఒక జాతీయ ఉద్యానం మాత్రమే కాదు... ఇది అస్సాం ఆత్మ, ప్రాణం... ఈ దేశ జీవవైవిధ్యంలో ఒక అనర్ఘ రత్నం. అందుకే, యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదాను ప్రకటించింది.

మిత్రులారా!

కజీరంగాను, ఇక్కడి వన్యప్రాణులను కాపాడటమంటే పర్యావరణ పరిరక్షణకు పరిమితం కాదు... అస్సాం భవిష్యత్తు కోసమేగాక భావితరాల పట్ల మన బాధ్యత కూడా. ఇది కేవలం మోదీ ఒక్కటి బాధ్యత కాదు... మీ అందరి కర్తవ్యం. ఈ వాస్తవాన్ని గమనంలో ఉంచుకుంటూ, నేడు అస్సాం గడ్డపై కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాం. ఎంతో విస్తృత ప్రభావం చూపే ఈ ప్రాజెక్టులన్నీ మీకు దక్కుతున్న నేపథ్యంలో హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

కజిరంగా అంటే- ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు నిలయం... ఏటా వరదల వేళ బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లితే ఇక్కడ అతిపెద్ద సవాలు ఎదురవుతుంది. ఆ సమయంలో వన్యప్రాణులు ఎత్తయిన ప్రదేశాల కోసం అన్వేషిస్తూ బయటకొచ్చే క్రమంలో అవి జాతీయ రహదారిని దాటాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఖడ్గమృగాలు, ఏనుగులు, జింకలు వాహన రాకపోకల నడుమ దిగ్భ్రాంతితో నిలిచిపోతాయి. అయితే, రహదారిలో రాకపోకలకు ఆటంకం రాకూడదు... అలాగే అడవి కూడా సురక్షితంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ దృక్కోణంతోనే కలియాభోర్ నుంచి నుమాలిగఢ్ దాకా సుమారు 90 కిలోమీటర్ల పొడవునా రూ.7వేల కోట్లతో ఒక కారిడార్‌ను రూపొందిస్తున్నాం. ఇందులో సుమారు 35 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వన్యప్రాణుల కారిడార్ అంతర్భాగంగా ఉంటుంది. అప్పుడు వాహనాలు పైనుంచి వెళ్తాయి కాబట్టి, కింద వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఒంటికొమ్ము ఖడ్గమృగమైనా, ఏనుగులైనా, పులులైనా, జింకలైనా వాటి సంచార మార్గాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గానికి రూపకల్పన చేశారు.

మిత్రులారా!

ఈ కారిడార్‌తో ఎగువ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అనుసంధానం కూడా మెరుగవుతాయి. కజీరంగా ఎలివేటెడ్ కారిడార్, కొత్త రైలు మార్గాల ద్వారా అస్సాం ప్రజలకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అందుకే, ఈ కీలక ప్రాజెక్టులపై రాష్ట్ర, దేశ ప్రజానీకానికి నా అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ప్రకృతి సురక్షితంగా ఉంటే, దాంతోపాటు అవకాశాల సృష్టి కూడా సాధ్యమవుతుంది. కొన్నేళ్లుగా కజిరంగాలో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. హోమ్‌స్టేలు, గైడ్ సేవలు, రవాణా, చేతివృత్తులు, చిన్న వ్యాపారాలు వగైరాల ద్వారా స్థానిక యువత కొత్త ఆదాయ మార్గాలను అనుసరిస్తున్నారు.

మిత్రులారా!

మరో అంశంపై అస్సాం ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. ఒకనాడు కజిరంగాలో ఖడ్గమృగాల వేట ఉదంతాలు అస్సాంను ఎంతో ఆందోళనకు గురిచేస్తూండేవి. అప్పట్లో... 2013-2014 మధ్య డజన్ల కొద్దీ ఒంటికొమ్ము ఖడ్గమృగాలను వేటగాళ్లు నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. ఈ పరిస్థితిని ఇక ఎంతమాత్రం అనుమతించరాదని బీజేపీ ప్రభుత్వం సంకల్పం పూనింది. ఆ మేరకు భద్రత వ్యవస్థను నవీకరించి, బలోపేతం చేశాం. అటవీ శాఖకు ఆధునిక వనరులు సమకూర్చడమే కాకుండా పర్యవేక్షణ వ్యవస్థకు అధికారాలిచ్చాం. ‘వనదుర్గ’ పేరిట మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం. దీంతో ఆహ్లాదకర ఫలితాలు లభించాయి... అంటే- 2025 వచ్చేనాటికి ఖడ్గమృగం వేట సంఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. అందుకే మీ అందరితోపాటు ప్రభుత్వం, పౌరులు అభినందనలకు అర్హులు. ఇదంతా బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకల్పం, రాష్ట్రవాసుల కృషి ఫలితమే.

మిత్రులారా!

అభివృద్ధితో ప్రకృతి విధ్వంసం తప్పదన్న భానవ చాలాకాలం నుంచీ పాతుకుపోయింది. ఇవి రెండూ పరస్పర వ్యతిరేకం కాబట్టి, కలిసి ముందుకు సాగడం అసాధ్యమన్న వాదన ఉండేది. కానీ, ఈ రెండూ... ఆర్థిక వ్యవస్థ-పర్యావరణం జోడెడ్ల తరహాలో కలసి ముందడుగు వేయగలవని మన దేశం నేడు ప్రపంచానికి రుజువు చేస్తోంది. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం, వృక్ష సంపద  పెరిగాయి. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో దేశమంతటా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికింద ఇప్పటిదాకా 260 కోట్లకు పైగా మొక్కలు నాటారు. దేశంలో 2014 తర్వాత పులులు, ఏనుగుల సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. రక్షిత, సామాజిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరణ చోటుచేసుకుంది. భారత్‌లో ఎన్నడో అంతరించిపోయిన చిరుతపులులను ఇప్పుడు తిరిగి తీసుకువచ్చాం. చిరుతపులి నేడు సందర్శకులకు ఓ కొత్త ఆకర్షణగా మారింది. చిత్తడి నేలల పరిరక్షణపైనా మా కృషి నిరంతరం కొనసాగుతోంది. కాబట్టే, భారత్‌ ఆసియా స్థాయిలో అతిపెద్ద ‘రామ్‌సర్’ నెట్‌వర్క్‌ కాగలిగింది. ‘రామ్‌సర్’ ప్రదేశాల సంఖ్య రీత్యా భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది. అభివృద్ధితోపాటు వారసత్వ పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ ఎలాగో ఇప్పుడు మన అస్సాం కూడా ప్రపంచానికి చాటుతోంది.

మిత్రులారా!

ఈశాన్య ప్రాంతానికి అత్యంత వేదనాభరిత అంశం ‘దూరమే’... హృదయాల మధ్య, ప్రదేశాల మధ్య ఈ దూరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. దేశాభివృద్ధి మరెక్కడో సాగుతుండగా, తాము వెనుకబడ్డామనే భావన ఇక్కడి ప్రజలను సదా వేధిస్తూనే వచ్చింది. ఇది ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా విశ్వాసంపైనా దుష్ప్రభావం చూపింది. ఈ భావనను రూపుమాపేందుకు బీజేపీ కృషి చేసింది. ఈ మేరకు ద్వంద్వ సారథ్య ప్రభుత్వం ఈశాన్యం ప్రగతికి ప్రాధాన్యమిచ్చింది. రహదారులు, రైలు-విమాన-జల మార్గాల ద్వారా అస్సాంను అనుసంధానించే కృషిని ఏకకాలంలో ప్రారంభించింది.

మిత్రులారా!

రైలు మార్గాల అనుసంధానం పెంచితే, సామాజిక-ఆర్థిక స్థాయులలో దాని ప్రయోజనాలు కనిపిస్తాయి. అందువల్ల, అనుసంధాన విస్తరణ ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ముఖ్యం. కానీ, కాంగ్రెస్ హయాంలో ఈ అంశాన్ని ఎన్నడూ పట్టించుకున్నది లేదు. మీకిప్పుడు కొన్ని గణాంకాలు వివరిస్తాను. కేంద్రంలో కాంగ్రెస్ పాలన సందర్భంగా రైల్వే బడ్జెట్‌లో అస్సాం వాటా అత్యంత స్వల్పం.. అంటే- రూ.2 వేల కోట్లు దాటేది కాదు. కానీ, ఇవాళ బీజేపీ పాలనలో ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి... ఈ లెక్కలను మీరు మరచిపోయారా లేక మీకు గుర్తుకొస్తున్నాయా? మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాను... కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్‌లో అస్సాం రాష్ట్రానికి వచ్చే నిధులు రూ.2 వేల కోట్లు... ఎంతా? ముక్తకంఠంతో చెప్పండి... ఎంత? మరి బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎంత లభిస్తోంది- రూ.10 వేల కోట్లు! ఎంతా? ఎంత.. ఎంత.. అక్షరాలా రూ.10 వేల కోట్లు. అంటే- కాంగ్రెస్ పార్టీ పాలనతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా నిధులను బీజేపీ అస్సాం రాష్ట్రంలో రైల్వేల ప్రగతికి కేటాయిస్తోంది.

మిత్రులారా!

ఇలా పెట్టుబడులు పెరగడంతో మౌలిక సదుపాయాల కల్పన భారీస్థాయిలో కొనసాగింది. కొత్త రైలు మార్గాల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ వగైరాలతో రైల్వేల సామర్థ్యం ఇనుమడించి, ప్రజలకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ కలియాభోర్ నుంచి ప్రారంభమయ్యే 3 కొత్త రైళ్లతో అస్సాంలో రైల్వే అనుసంధానం మరింత విస్తరిస్తుంది. ఈ మేరకు వందే భారత్ స్లీపర్ రైలు గువహటి నగరాన్ని కోల్‌కతాతో జోడిస్తుంది. ఈ ఆధునిక రైలు ద్వారా సుదూర ప్రయాణం మరింత సౌకర్యవంతం కాగలదు. అంతేకాకుండా 2 అమృత భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభిస్తున్నాం. ఈ రైళ్లు ప్రయాణించే మార్గాల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక కీలక  స్టేషన్లున్నాయి. తద్వారా లక్షలాది ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. ఈ రైళ్లు అస్సాం వ్యాపారులను కొత్త మార్కెట్లతో అనుసంధానిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు చేరువవుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు అస్సాం ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయి. ఈ అనుసంధాన విస్తరణ ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో తాము అభివృద్ధికి దూరంకాదనే నమ్మకాన్ని ప్రోదిచేస్తాయి. ఈశాన్య రాష్ట్రాలకు ‘దూరం’ సమస్య సమసింది... ఇప్పుడవి హృదయగతంగానే కాకుండా రాజధాని ఢిల్లీ నగరానికీ దగ్గరయ్యాయి.

మిత్రులారా!

అస్సాం ముందున్న ఒక పెను సమస్య గురించి ఇవాళ మీ అందరి సమక్షంలో చర్చించడం చాలా అవసరం. ఇదేమిటంటే- అస్సాం గుర్తింపును కాపాడటం.. సంస్కృతిని పరిరక్షించడం. మీరే చెప్పండి ఇది అవసరమా... కాదా? చెదురుమదురు సమాధానం కాదు... అందరూ ఒక్కుమ్మడిగా గొంతెత్తి చెప్పండి. అస్సాం గుర్తింపును కాపాడాలా.. వద్దా? మీ ప్రతిష్ఠ నిలబెట్టుకోవాలా.. వద్దా? మీ పూర్వికుల వారసత్వ పరిరక్షణ అవసరమా... కాదా? అస్సాంలో చొరబాటుదారులను బీజేపీ ప్రభుత్వం నిరోధిస్తున్న తీరు, అడవులతోపాటు చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను పరిరక్షిస్తున్న విధానం, మీ భూములను దురాక్రమణ నుంచి విముక్తం చేస్తున్న పద్ధతి... తదితరాలన్నిటినీ మీరెంతగానో ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ సరైన చర్యలేనా.. కాదా? ఇదంతా చేయాలా.. వద్దా? ఇది మీ మేలు కోసమేనా.. కాదా? మిత్రులారా! ఇప్పుడు కాస్త నిదానించి, ఒక్క క్షణం యోచించండి... ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిందేమిటి?

మిత్రులారా!

ఆనాడు కేవలం ఓట్లు కొల్లగొట్టి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం అస్సాం గడ్డను చొరబాటుదారుల పరం చేసింది. దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని నడిపింది. ఆ కాలంలో చొరబాట్లు నిరంతరం పెరుగుతూనే వచ్చాయి. ఇక ఈ చొరబాటుదారులు ఏం చేశారు? అస్సాం చరిత్ర, సంస్కృతి లేదా మన విశ్వాసం గురించి వారికేం తెలుస్తుంది? అందుకే, వారు అన్ని చోట్లా దురాక్రమణకు దిగారు... దీంతో జంతుజాలం సంచరించే ప్రాంతాలు అన్యాక్రాంతం అయ్యాయి. అక్రమ వేటకు ప్రోత్సాహం లభించింది... స్మగ్లింగ్ సహా ఇతర నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.

మిత్రులారా!

ఈ చొరబాటుదారుల వల్ల మన జనాభా సమతౌల్యం దెబ్బతింటోంది. మన సంస్కృతిపై వీరు దాడి చేయడమేగాక పేదల, యువత ఉపాధిని లాక్కుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలను మోసగించి, భూములను ఆక్రమిస్తున్నారు. ఇదంతా అస్సాంతోపాటు దేశం భద్రతకు పెనుముప్పు తెస్తుంది.

మిత్రులారా!

కాంగ్రెస్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి... ఆ పార్టీది ఒకే ఒక విధానం- అది చొరబాటుదారులను రక్షించడమే! వారి సాయంతో అధికారంలోకి రావడమే... ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతోపాటు దాని మిత్రపక్షాలు అదే పని చేస్తున్నాయి. బీహార్‌లోనూ వారు చొరబాటుదారుల రక్షణ కోసం యాత్రలు, సభలు నిర్వహించారు. కానీ, ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను నేలమంట్టం చేశారు. ఇప్పుడిక అస్సాం ప్రజల వంతు... ఈ గడ్డమీద కూడా మీరు కాంగ్రెస్‌కు చోటులేకుండా చేసి, తగిన గుణపాఠం నేర్పుతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

అస్సాం పురోగమనం ఈశాన్య ప్రాంతమంతటా అభివృద్ధికి కొత్త బాటలు పరుస్తోంది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి దిశానిర్దేశం చేస్తున్న ఈ రాష్ట్రం ముందడుగు వేస్తే, ఈ ప్రాంతం యావత్తూ ప్రగతి పథంలో పయనిస్తుంది. దేశ ప్రగతి కూడా ఈ ప్రాంత పురోగమనంలో అంతర్భాగం. ఈ దిశగా మా కృషి, అస్సాం ప్రజల విశ్వాసం ఈశాన్య భారతాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈ నమ్మకంతోపాటు నేటి ప్రాజెక్టుల సమర్పణ ద్వారా మీకందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు చెబుతున్నాను. ఇప్పుడు నాతో గళం కలిపి నినదించండి-

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఇది వందేమాతరం 150వ వార్షికోత్సవం సంవత్సరం.. ఆ పవిత్ర స్మరణలో భాగంగా నాతో గళం కలిపి, దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి-

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

***


(रिलीज़ आईडी: 2215937) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Gujarati