వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైతుల కోసం చారిత్రాత్మక సంస్కరణలు: కొత్త విత్తన చట్టం వివరాలను వెల్లడించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు; సంప్రదాయ విత్తన వ్యవస్థలకు రక్షణ: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులకు పూర్తి ఉపశమనం కల్పిస్తాం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నాసిరకం విత్తనాలు అమ్మితే రూ. 30 లక్షల వరకు జరిమానా, కఠిన శిక్ష విధించేందుకు చట్టంలో ప్రతిపాదన

నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాలను తక్షణమే గుర్తించేలా ట్రేసబిలిటీ వ్యవస్థ తో మరింత పారదర్శకత

విత్తన కంపెనీల నమోదు తప్పనిసరి - విత్తనాల అనధికారిక విక్రయాలపై నిషేధం

प्रविष्टि तिथि: 16 JAN 2026 5:17PM by PIB Hyderabad

కొత్త విత్తన చట్టం (విత్తన చట్టం 2026) లోని ప్రత్యేకతలను, రైతులపై దాని ప్రభావం గురించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్రతిపాదిత చట్టం రైతుల రక్షణ, విత్తన నాణ్యత,  వ్యవస్థ అంతా పారదర్శకతను నిర్ధరించే లక్ష్యంతో ఒక చారిత్రాత్మక ముందడుగు అని కేంద్ర మంత్రి అన్నారు.

 

రైతులకు ప్రతి విత్తనం గురించి పూర్తి సమాచారం

ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా "విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయింది, ఏ డీలర్ దానిని సరఫరా చేశారు, ఎవరు దానిని అమ్మారు” అనే విషయాలు తెలుసుకోగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ చౌహాన్  తెలిపారు. ప్రతి విత్తన ప్యాకెట్‌పై ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని స్కాన్ చేయడం ద్వారా రైతులు దాని మూలం గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను నిరోధించడమే కాకుండా, ఒకవేళ అలాంటి విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశిస్తే, దానికి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

 

ఇక నాసిరకం విత్తనాలు  వ్యవస్థలోకి ప్రవేశించవు

ట్రేసబిలిటీని అమలు చేసిన తర్వాత, నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాలను వెంటనే గుర్తించవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు. “నాసిరకం విత్తనాలు వ్యవస్థలోకి రావు, ఒకవేళ వచ్చినా అవి దొరికిపోతాయి. అలాంటి విత్తనాలను సరఫరా చేసేవారికి శిక్ష పడుతుంది" అని ఆయన అన్నారు. ఇది రైతులను తప్పుదారి పట్టించే కంపెనీలు, డీలర్ల ఏకపక్ష విధానాలకు అడ్డుకట్ట వేస్తుంది.

విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ప్రతి విత్తన కంపెనీ ఇప్పుడు తప్పని సరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందువల్ల ఏ కంపెనీలకు కార్యకలాపాలు నిర్వహించడానికి అధికారం ఉందో స్పష్టం అవుతుందని శ్రీ చౌహాన్ తెలిపారు.  "రిజిస్టర్డ్ కంపెనీల వివరాలు అందుబాటులో ఉంటాయి. అనధికార విక్రయదారులు విత్తనాలను అమ్మడానికి  ఎంత మాత్రం అనుమతి ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇది మార్కెట్ నుంచి నకిలీ కంపెనీలను తొలగిస్తుంది.  రైతులకు విశ్వసనీయమైన వనరుల ద్వారా మాత్రమే విత్తనాలు అందేలా చేస్తుంది.

సంప్రదాయ విత్తనాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

రైతులు ఉపయోగించే సంప్రదాయ విత్తనాలపై కొత్త చట్టం ఆంక్షలు విధిస్తుందనే ఆందోళనలను మంత్రి తోసిపుచ్చారు. రైతులు తమ స్వంత విత్తనాలను విత్తుకోవచ్చు. అలాగే ఇతర రైతులతో విత్తనాలను పంచుకోవచ్చు. స్థానిక స్థాయిలో కొనసాగుతున్న సంప్రదాయ విత్తన మార్పిడి విధానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు” ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విత్తనాలు వేసే సమయంలో రైతులు విత్తనాలను పరస్పరం మార్పిడి చేసుకుని, తర్వాత అదనపు పరిమాణంతో తిరిగి ఇవ్వడం సాధారణ ఆచారమని ఆయన ఉదహరించారు. ఇలాంటి పద్ధతులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

నాసిరకం విత్తనాలు అమ్మితే  రూ. 30 లక్షల జరిమానా, శిక్ష 

విత్తన నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “గతంలో, జరిమానా రూ. 500 వరకు ఉండేది. ఇప్పుడు రూ. 30 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడితే, శిక్ష విధించే నిబంధన కూడా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. అన్ని కంపెనీలు తప్పు చేయవని అంగీకరిస్తూనే, రైతులను మోసం చేసే వారిపైనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐసీఏఆర్, భారతీయ కంపెనీలదే బలమైన పాత్ర

విత్తన చట్టంలో మూడు స్థాయిలలో నిబంధనలు ఉన్నాయని మంత్రి తెలిపారు.  1. ప్రభుత్వ రంగం (భారత వ్యవసాయ పరిశోధనా మండలి,  వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు), 2. అధిక నాణ్యత కలిగిన విత్తనాలను ఉత్పత్తి చేసే దేశీయ కంపెనీలు 3. విదేశీ విత్తనాల కోసం సరైన మూల్యాంకన విధానం. (విదేశాల నుంచి  దిగుమతి చేసుకున్న విత్తనాలను క్షుణ్ణంగా పరీక్షించి, మూల్యాంకనం చేసిన తర్వాతే ఆమోదం). “నాణ్యమైన విత్తనాలు రైతులకు చేరేలా మన ప్రభుత్వ సంస్థలను, దేశీయ ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేస్తామని” కేంద్రమంత్రి తెలిపారు.

రైతుల కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

రైతుల్లో అవగాహన లోపంపై శ్రీ చౌహాన్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రగతిశీల రైతులు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించేందుకు 'వికసిత కృషి సంకల్ప్ అభియాన్' వంటి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే)  విత్తన నాణ్యత, విత్తన ఎంపిక, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మే వారికి కఠిన శిక్ష

ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, ఉద్దేశపూర్వకంగా నాసిరకం విత్తనాలను ఉత్పత్తి చేసే లేదా విక్రయించే ఎవరికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 30 లక్షల వరకు జరిమానా విధించవచ్చని కేంద్ర మంత్రి అన్నారు. "గతంలో చట్టం బలహీనంగా ఉండేది. ఇప్పుడు రైతులకి న్యాయం జరిగేలా దానిని సమర్థవంతంగా మార్చాం”  అని ఆయన అన్నారు.

కాలంచెల్లిన  1966 చట్టం నవీకరణ 

ప్రస్తుతం ఉన్న 1966 నాటి విత్తన చట్టం, ఆధునిక సాంకేతికత లేదా డేటా వ్యవస్థలు లేని కాలానికి చెందినదని శ్రీ చౌహాన్ అన్నారు. "ట్రేసబిలిటీ, డిజిటల్ రికార్డులు, జవాబుదారీతనం ఆధారంగా ఇప్పుడు  ఆధునిక చట్టాన్ని తీసుకువస్తున్నాం.  దీనివల్ల భవిష్యత్తులో ఏ రైతు మోసపోడు" అని తెలిపారు. 

రాష్ట్రాల హక్కులు యధాతథం

కొత్త చట్టం రాష్ట్రాల అధికారాలను నీరుగార్చవచ్చనే ఆందోళనలనుద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు చెక్కుచెదరకుండా ఉంటాయి. కేంద్రం కేవలం సమన్వయం మాత్రమే చేస్తుంది, రాష్ట్రాల సహకారంతోనే చట్టం అమలు జరుగుతుంది” అని స్పష్టం చేశారు.

ప్రతి రైతుకు సరైన విత్తనం అందించడమే మా లక్ష్యం

ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీ చౌహాన్ పునరుద్ఘాటించారు.  "మంచి కంపెనీలకు ప్రోత్సహం లభిస్తుంది. అలాగే తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.ఇదే కొత్త చట్టం సారాంశం” అని అన్నారు. విత్తన చట్టం 2026 ద్వారా, ప్రభుత్వం రైతులకు సురక్షితమైన, నమ్మకమైన, మంచి దిగుబడి విత్తనాలను అందించడానికి, నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఒక నిర్ణయాత్మక అడుగు వేస్తోందని ఆయన అన్నారు.


(रिलीज़ आईडी: 2215497) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Punjabi , Gujarati , Kannada , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil