ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జర్మన్ ఛాన్సలర్‌తో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 12 JAN 2026 1:25PM by PIB Hyderabad

గౌరవనీయ మిత్రులు, ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్,

ఇరు దేశాల ప్రతినిధులు,

మీడియా మిత్రులకు,

నమస్కారం!

గుటెన్ టాగ్ (శుభ దినం)!

ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంలో ఛాన్సలర్ మెర్జ్‌ను స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్-జర్మనీ మధ్య తత్వం, జ్ఞానం, ఆధ్యాత్మికతల వారధిని స్వామి వివేకానంద స్వయంగా నిర్మించడం ఒక సంతోషకరమైన యాదృచ్చిక అంశం. ఈ రోజున ఛాన్సలర్ మెర్జ్ సందర్శన ఆ వారధికి కొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని, పరిధినీ ఇస్తోంది.

ఛాన్సలర్‌గా ఆయన భారత్‌లో మాత్రమే కాకుండా ఆసియాలో పర్యటించడమూ ఇదే తొలిసారి. భారత్‌తో సంబంధాలకు ఆయన ఇచ్చే ప్రాముఖ్యానికి ఇది బలమైన నిదర్శనం. ఆయన వ్యక్తిగత శ్రద్ధ, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జర్మనీతో తన స్నేహాన్ని, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది.

గుజరాత్‌లో మనం ‘ఆవకారో మిఠో ఆపజే రే’ అని చెబుతాం అంటే ఎవరినైనా ఆప్యాయతతో, ఆత్మీయంగా స్వాగతించాలి అని. అదే స్ఫూర్తి, భావోద్వేగాలతో జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌ను భారత దేశానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం.

మిత్రులారా,
ఛాన్సలర్ మెర్జ్ పర్యటన చాలా కీలక సమయంలో జరుగుతోంది. గత సంవత్సరం మన వ్యూహాత్మక భాగస్వామ్యం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం మన దౌత్య సంబంధాల 75 సంవత్సరాల వేడుకలనూ మనం జరుపుకుంటున్నాం. ఈ మైలురాళ్ళు కేవలం కాలానికి గుర్తులు మాత్రమే కాదు... అవి మన ఉమ్మడి ఆశయాలు, పరస్పర విశ్వాసం, నిరంతరం బలోపేతం అవుతున్న సహకారానికి చిహ్నాలు.

భారత్-జర్మనీ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య సన్నిహిత సహకారం మొత్తం మానవాళికి ముఖ్యమైనది. పెరుగుతున్న వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త శక్తిని నింపాయి. మా ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరి... 50 బిలియన్ డాలర్ల మార్కునూ దాటింది.

రెండు వేలకు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇది భారత్ పట్ల వారి అచంచల విశ్వాసాన్ని, ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలనూ ప్రతిబింబిస్తుంది. ఈ ఉదయం జరిగిన భారత్-జర్మనీ సీఈవోల సదస్సులోనూ ఇది స్పష్టంగా కనిపించింది.

మిత్రులారా,
భారత్-జర్మనీ మధ్య సాంకేతిక సహకారం ప్రతి యేటా మరింత బలంగా మారుతోంది. నేడు దాని ప్రభావం క్షేత్రస్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్-జర్మనీలు ఒకే విధమైన ప్రాధాన్యాలను పంచుకుంటున్నాయి. ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్-జర్మనీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. ఇది జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల కోసం ఒక ఉమ్మడి వేదికగా ఉపయోగపడుతుంది.

వాతావరణం, ఇంధనం, పట్టణాభివృద్ధి, పట్టణ రవాణా వంటి రంగాల్లో మేం సంయుక్తంగా కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నాం. ఇరు దేశాల కంపెనీలు గల గ్రీన్ హైడ్రోజన్‌ రంగంలో కొత్త మెగా ప్రాజెక్ట్ భవిష్యత్ ఇంధన రంగంలో గేమ్-ఛేంజర్‌గా నిరూపితమవుతుంది.

సురక్షితమైన, విశ్వసనీయమైన, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా భారత్- జర్మనీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈరోజు సంతకం చేస్తున్న అవగాహన ఒప్పందాలు ఈ అన్ని రంగాల్లో మన సహకారానికి కొత్త ఊపును, బలాన్నీ ఇస్తాయి.

మిత్రులారా,
రక్షణ, భద్రత రంగాల్లో పెరుగుతున్న సహకారం ఇరు దేశాల పరస్పర విశ్వాసం, ఉమ్మడి దృక్పథానికి చిహ్నం. రక్షణ వాణిజ్యానికి సంబంధించిన ప్రక్రియలను సరళీకృతం చేసినందుకు ఛాన్సలర్ మెర్జ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించే రోడ్ మ్యాప్ కోసం మేం కృషి చేస్తున్నాం. ఇది సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తికి కొత్త అవకాశాలను తెరుస్తుంది.

మిత్రులారా,
భారత్-జర్మనీ ప్రజల మధ్య లోతైన, చారిత్రక సంబంధాలు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు జర్మనీ మేధో ప్రపంచానికి ఒక కొత్త దృక్పథాన్ని అందించాయి. స్వామి వివేకానంద తత్వం జర్మనీకి మాత్రమే కాకుండా యావత్ ఐరోపాకూ స్ఫూర్తినిచ్చింది. జర్మనీలో మొదటిసారిగా భారత స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురవేసిన మేడమ్ కామా... మన స్వాతంత్య్ర ఆకాంక్షలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చారు. మనం ఈ చారిత్రక అనుబంధానికి ఈ రోజు ఒక ఆధునిక భాగస్వామ్య రూపాన్ని ఇస్తున్నాం.

వలసలు, రాకపోకలు, నైపుణ్యాలను పెంపొందించడంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. భారత్‌లోని ప్రతిభావంతులైన యువ శ్రామిక శక్తి జర్మనీ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది.

ప్రపంచ నైపుణ్య భాగస్వామ్యంపై ఈ రోజు జారీ చేసిన ఉమ్మడి ఆశయాల ప్రకటన ఈ నమ్మకానికి ప్రతీక. ఇది ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల రాకపోకలను సులభతరం చేస్తుంది.

ఈ రోజు క్రీడా రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి మేం పటిష్ఠ చర్యలు తీసుకున్నాం. ఇది మన యువతను అనుసంధానించే ఒక సమర్థ సాధనంగా మారుతుంది.

ఉన్నత విద్యపై ఈ రోజు విడుదల చేసిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక విద్యా రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుంది. భారత్‌లో తమ క్యాంపస్‌లను తెరవాలని నేను జర్మన్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తున్నాను.

భారత పౌరులకు వీసా రహిత రవాణాను ప్రకటించినందుకు నేను ఛాన్సలర్ మెర్జ్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

గుజరాత్‌లోని లోథల్‌లో అభివృద్ధి చేస్తున్న నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌లో జర్మన్ మారిటైమ్ మ్యూజియం భాగస్వామ్యం కావడం నాకు సంతోషంగా ఉంది. ఇది మన ఇరుదేశాల నౌకా వాణిజ్య రంగాలను అనుసంధానించే ఒక చరిత్రాత్మక ముందడుగు అవుతుంది.

గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం సాంప్రదాయిక వైద్య రంగంలో జర్మనీతో సన్నిహిత సహకారాన్ని కలిగి ఉంది. ఈ రోజు సంతకం చేస్తున్న అవగాహన ఒప్పందం ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,
భారత్-జర్మనీ ఎల్లప్పుడూ భుజం భుజం కలిపి నిలబడ్డాయి. మన స్నేహ బంధం బలం ప్రపంచ వేదికపై స్పష్టంగా కనిపిస్తుంది. ఘనా, కామెరూన్, మలావి వంటి దేశాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా మనం కొనసాగిస్తున్న త్రైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం ప్రపంచానికి ఒక విజయవంతమైన నమూనాగా నిలుస్తుంది. గ్లోబల్ సౌత్‌లో అభివృద్ధికి మద్దతునివ్వడానికి మేం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం.

ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇరు దేశాలకు అత్యంత ప్రాధాన్యం గలది. ఈ ప్రాంతంలో మన సహకారాన్ని పెంపొందించుకోవడానికి, మేం ఒక సంప్రదింపుల యంత్రాంగాన్ని ప్రారంభించబోతున్నాం.
ఈ రోజు మేం ఉక్రెయిన్, గాజాతో సహా అనేక ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై వివరంగా చర్చించాం. భారత్ ఎల్లప్పుడూ అన్ని సమస్యలు, వివాదాల శాంతియుత పరిష్కారాన్ని సమర్థించింది. ఈ దిశగా జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు మద్దతునిస్తుంది.

ఉగ్రవాదం మానవాళి మొత్తానికి ఒక తీవ్రమైన ముప్పు అని మేం అంగీకరిస్తున్నాం. భారత్-జర్మనీ పూర్తి దృఢ సంకల్పంతో కలిసికట్టుగా దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తాయి.

ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థలను సంస్కరించడం చాలా కీలకమని భారత్-జర్మనీలు అంగీకరిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడానికి జీ4 గ్రూప్ ద్వారా చేస్తున్న మన సమష్టి ప్రయత్నాలు ఈ ఉమ్మడి నమ్మకానికి నిదర్శనం.

గౌరవనీయా,
140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకు భారత్‌లోకి మరోసారి సాదర స్వాగతం పలుకుతున్నాను. నేటి చర్చలు భారత్-జర్మనీ భాగస్వామ్యానికి కొత్త శక్తిని, స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.

మీ పర్యటనకు, మీ వ్యక్తిగత మద్దతుకు, భారత్‌తో మీ స్నేహానికి ధన్యవాదాలు.

డాంకే షోన్ (చాలా ధన్యవాదాలు).

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.


(रिलीज़ आईडी: 2215021) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam