యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘మేక్ ఇన్ ఇండియా ఇన్ స్పోర్ట్స్’, ‘అంతర్జాతీయ సంబంధాలు’ కమిటీలను వేయాల్సిందిగా జాతీయ క్రీడా సమాఖ్యలకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సలహా
ఈ కమిటీల నియామకం ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా క్రీడల్లో స్వదేశీ సామర్థ్యాల్ని ప్రోత్సహిస్తూనే, క్రీడా దౌత్యంతో పాటు ప్రపంచ క్రీడా రంగంలో భారత్ స్థానాన్ని పటిష్టపరచగలుగుతుంది
ఆయా రంగాల నిపుణులతో కమిటీలు వేయాలంటూ ఎన్ఎస్ఎఫ్‌లకు సూచన.. వాటి వివరాల్ని మేక్ ఇన్ ఇండియా ఇన్ స్పోర్ట్స్ విషయంలో అయితే 60 రోజుల్లోనూ, అంతర్జాతీయ సంబంధాల విషయంలో అయితే 30 రోజుల్లోనూ తెలియజేయాలి
प्रविष्टि तिथि:
13 JAN 2026 10:32AM by PIB Hyderabad
గుర్తింపు గల జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్లు) అన్నీ తమ తమ సంస్థల్లో అంతర్జాతీయ సంబంధాలు, మేక్ ఇన్ ఇండియా ఇన్ స్పోర్ట్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది.
క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ సంబంధాల కమిటీ.. సంబంధిత అంతర్జాతీయ సమాఖ్యలు (ఐఎఫ్‌లు), ఖండాల సమాఖ్యలు (సీఎఫ్‌ల)లో చోటుచేసుకొంటున్న పరిణామాలను పర్యవేక్షిస్తుంది. పోటీ నియమాల్లో, స్వరూపాల్లో మార్పులు, పరిపాలన ప్రణాళికలు, ఎన్నికలు, క్రీడాకారుల కోసం చేపట్టే కార్యక్రమాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తూ ఉంటుంది.
అంతర్జాతీయ స్థాయి సహకారానికి సంబంధించిన మధ్యకాలిక ప్రణాళికను కూడా ఈ కమిటీ రూపొందిస్తుంది. ద్వైపాక్షిక, బహుపార్శ్విక ఎంఓయూలు, సంయుక్త శిక్షణ శిబిరాలు, ఒక దేశం క్రీడాకారులు ఇతర దేశాల్లో పర్యటించడం, సాంకేతిక బదిలీ కార్యక్రమాలు, భారత్‌లో అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్ని నిర్వహించడం వంటివి ఈ కమిటీ పరిధిలోకి వస్తాయి.
అంతర్జాతీయ ఏర్పాట్లన్నీ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఒలింపిక్ ప్రణాళిక, ఐఎఫ్ చట్టాలకు అనుగుణంగా ఉండేటట్లు ఈ కమిటీ చూస్తుంది. సుపరిపాలనతో పాటు డోపింగ్ వ్యతిరేక నియమాల పాలనకూ కట్టుబడి ఈ కమిటీ పనిచేస్తుంది. క్రీడాకారుల ప్రయోజనాల్ని కూడా కమిటీ కాపాడుతుంది.
ఇతర దేశాల్లోని జాతీయ సమాఖ్యలతో, ప్రధాన అంతర్జాతీయ క్రీడా పరిశోధన, క్రీడా విద్యాసంస్థలతో సమన్వయాన్ని ఈ కమిటీ మరింత బలపరుస్తుంది. భారతీయ క్రీడాకారులకు అత్యుత్తమ స్థాయి శిక్షణావకాశాలతో పాటు స్పోర్ట్‌స్ సైన్సు పరంగా సహాయం లభించేటట్లు చూస్తుంది.
అంతర్జాతీయ సమాఖ్యలతో, సంబంధిత సంఘాలతో ఈ కమిటీ సమన్వయాన్ని ఏర్పరుచుకుంటుంది. అంతర్జాతీయ ఈవెంట్లను భారత్‌లో నిర్వహించడానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనల సమాచారాన్ని మంత్రిత్వ శాఖతో ముందుగానే పంచుకొంటుంది. ఎప్పటికప్పుడు వేలం ప్రక్రియల్లో పాలుపంచుకొంటూ ఉంటుంది. అవసరమైన సందర్బాల్లో ముందస్తు సంప్రదింపులు జరపడం, అప్పటికి అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అనుమతి పొందడం కూడా ఈ కమిటీ విధులే.
మేక్ ఇన్ ఇండియా ఇన్ స్పోర్ట్‌స్ కమిటీ ఉత్పాదనల అభివృద్ధి, ప్రయోగాలు, సంబంధిత క్రీడాంశంలో ధ్రువీకరణకు మార్గాన్ని సుగమం చేయడానికి భారతీయ తయారీదారు సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, పరీక్షల నిర్వహణ, ప్రమాణీకరణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది. మేక్ ఇన్ ఇండియాలో సంకల్పం చెప్పుకొన్న ప్రకారం దేశీయ క్రీడా సంబంధిత తయారీ అనుబంధ విస్తారిత వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఈ కమిటీ.
దేశవాళీ పరిష్కారాలను అనుసరించడంపై నిర్ణీత కాలానికి నివేదికల్ని రూపొందించడం, చోటు చేసుకున్న పురోగతిని ప్రధానంగా ప్రస్తావించడం, ఎదురవుతున్న ఇబ్బందుల్ని పేర్కొనడం, ఎన్ఎస్ఎఫ్ పరిధిలో పరిశీలించడానికి అనువుగా సిఫారసులను చేయడం, మరీముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఆశయ సాధనకు ఏ రకంగా తోడ్పాటును అందించవచ్చో అనే విషయాలపై ఈ కమిటీ శ్రద్ధ తీసుకొంటుంది.
అంతర్జాతీయ సంబంధాలపై కమిటీ:
సమాఖ్యలోని సీనియర్ సభ్యులు, ఇదివరకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, కోచ్‌లు, ప్రపంచ క్రీడా పరిపాలన, దౌత్యం రంగాల్లో అనుభవం గల సబ్జెక్టు నిపుణులకు ఈ కమిటీలో సభ్యత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీలో ఎవరెవరిని వేశారు, ఏయే అంశాలను కమిటీ పరిశీలనకు సూచించారనేవి సహా వివరాలను ఈ సూచనను జారీ చేసినప్పటి నుంచి 30 రోజుల లోపల మంత్రిత్వ శాఖకు తెలపాలి.
మేక్ ఇన్ ఇండియా ఇన్ స్పోర్ట్‌స్ కమిటీ:
సమాఖ్య సభ్యుల్లో సీనియర్లు, సాంకేతిక నిపుణులు, ఇప్పటికే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, క్రీడాసామగ్రి లేదా సాంకేతికత, తయారీ, లేదా ప్రమాణాల్లో అనుభవమున్న కనీసం ఒక సభ్యుడు లేదా సభ్యురాలు.. వీరికి కమిటీలో స్థానాన్ని కల్పించాలి. కమిటీలో ఎవరెవరిని వేశారు, తదితర వివరాలను ఈ సూచనను జారీ చేసినప్పటి నుంచి 60 రోజుల లోపల మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి.
***
(रिलीज़ आईडी: 2215011)
आगंतुक पटल : 3