ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీమద్ విజయరత్న సుందర్ సురీశ్వర్ మహారాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
“మహారాజ్ రచనల ద్వారా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు ఆధ్యాత్మిక పరిష్కారం”
“సాంస్కృతిక మూలాలను బలోపేతం చేస్తూ వికసిత భారత్ దిశగా దేశానికి యువత సారథ్యం”
దేశం... సమాజం కోసం నవ సంకల్పాలను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి మోదీ
प्रविष्टि तिथि:
11 JAN 2026 1:44PM by PIB Hyderabad
శ్రీమద్ విజయరత్న సుందర్ సురీశ్వర్ మహారాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ పవిత్ర సందర్భంలో ముందుగా పూజనీయులైన భువనభాను సురీశ్వర్ మహారాజ్ పాదాలకు ప్రణమిల్లుతున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రశాంతమూర్తి సువిశాల గచ్ఛాధిపతి పూజనీయ శ్రీమద్ విజయ రాజేంద్ర సూరీశ్వర్ మహారాజ్, శ్రీ కల్పతరు సురీశ్వర్ మహారాజ్, సరస్వతీ కృపాపాత్ర పరమ పూజనీయ ఆచార్య భగవంత్ శ్రీమద్ విజయరత్న సుందర సురీశ్వ మహారాజ్ సహా కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి-సాధువులంరికీ సగౌరవ వందనమాచరించారు. అంతేకాకుండా ఊర్జా మహోత్సవ్ కమిటీ సభ్యులందరికీ ప్రశంసలతోపాటు అభినందనలు తెలిపారు.
శ్రీమద్ విజయరత్న సుందర్ సురీశ్వర్ మహారాజ్ 500వ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం తనతోపాటు అందరికీ దక్కిన అదృష్టమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జ్ఞానాన్ని గ్రంథాలకు పరిమితం చేయకుండా స్వీయ ఆచరణ ద్వారా ఆయన అందరికీ ఆదర్శప్రాయులయ్యారని కొనియాడారు. మహారాజ్ వ్యక్తిత్వం సంయమనం, నిరాడంబరత, స్పష్టతల అద్భుత సమ్మేళనమని పేర్కొన్నారు. ఆయన రచనలలో అనుభవసారం ఉట్టిపడుతుందని, వచనాల్లో కరుణాశక్తి ప్రవహిస్తుందని, చివరకు మౌనంలోనూ ఆయన మనకు మార్గదర్శనం చేస్తారని ప్రముఖంగా ప్రస్తావించారు. మహారాజ్ విరచిత 500వ పుస్తకం “ప్రేమ్ను విశ్వ, విశ్వనో ప్రేమ్” అనేక విషయాలను ప్రబోధిస్తుందని, ఈ సృజనాత్మక రచన ద్వారా సమాజం, యువతరమే కాకుండా యావత్ మానవాళి ప్రయోజనం పొందుతుందని విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భం, ఊర్జా మహోత్సవం ప్రజలలో నవ్య ఆలోచనా శక్తిని నింపుతాయంటూ, అందరికీ అభినందనలు తెలిపారు.
విశాల సాగర సమాన మహారాజ్ ఆలోచనల్లోని అసంఖ్యాక అనర్ఘ రత్నాల్లో ఈ 500 రచనలు ఒక భాగమని ఆయన అభివర్ణించారు. నేడు మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అవి సరళ, ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సమయ, సందర్భానుసారం ఈ విభిన్న గ్రంథాలు మార్గనిర్దేశం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. తీర్థంకరులు, పూర్వ ఆచార్యులు ప్రబోధించిన అహింస, నిస్వార్థం, బహుముఖత్వం వంటి లక్షణాలు ప్రేమ, సహనం, సామరస్యం ఈ రచనలలో ఆధునిక-సమకాలీన రూపేణా దర్శనమిస్తాయని తెలిపారు. ముఖ్యంగా విభజన-సంఘర్షణలతో సతమతమవుతున్న నేటి ప్రపంచం “ప్రేమ్ను విశ్వ, విశ్వనో ప్రేమ్” పుస్తకం గతంకన్నా వర్తమానంలోనే అత్యావశ్యకమన్నారు. ఇది కేవలం ఒక పుస్తకం కాదని... ఒక మంత్రమని, ప్రేమ భావనలోని శక్తిని పరిచయం చేస్తూ, ప్రపంచం అభిలషించే శాంతిసామరస్యాలకు మార్గం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
“పరస్పరోపగ్రహో జీవనం”.. అంటే- ప్రతి జీవి మరొక జీవితో అనుసంధానితమై ఉంటుందన్నది జైన తత్వశాస్త్ర మార్గదర్శక సూత్రమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దీన్ని అర్థం చేసుకుంటే, మన దృక్పథం వ్యక్తిగతం నుంచి సామూహికం దిశగా మళ్లుతుందని, వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతంగా సమాజం, దేశం, మానవాళి లక్ష్యాల గురించి ఆలోచిస్తామని ఆయన వివరించారు. ఈ స్ఫూర్తితోనే తాను ‘నవకార్ మంత్ర’ దినోత్సవంలో పాల్గొన్నానని, 4 వర్గాల వారూ ఏకమైన ఆ చారిత్రక సందర్భంలో తాను 9 వినతులు, 9 సంకల్పాలను ప్రకటించానని గుర్తుచేసుకున్నారు. వాటినిప్పుడు తిరిగి ప్రస్తావిస్తున్నానని చెబుతూ- వీటిలో మొదటిది జల సంరక్షణ అని చెప్పారు. అలాగే రెండోది- ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కాగా... మూడోది- పరిశుభ్రత లక్ష్యం దిశగా పయనం, నాలుగోది- స్థానిక ఉత్పత్తులకు చేయూత, ఐదోది ‘భారత్ దర్శన్’ను అనుసరించడం, ఆరోది... ప్రకృతి వ్యవసాయం చేయడం, ఏడోది- ఆరోగ్యకర జీవనశైలిని అనుసరణ కాగా, ఎనిమిదోది యోగా-క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం, తొమ్మిదోది పేదలకు అండదండగా కట్టుబాటుతో నిలవడమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
“ప్రపంచం మొత్తం మీద యువజన ప్రాబల్యం అధికంగాగల దేశం భారత్ మాత్రమే. వికసిత భారత్ దిశగా దేశం ముందంజకు దోహదం చేస్తున్న ఈ యువశక్తి, అదే సమయంలో సాంస్కృతిక మూలాలను కూడా బలోపేతం చేస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు. ఈ వినూత్న పరిణామంలో మహారాజ్ సాహిబ్ వంటి సాధుజన మార్గనిర్దేశం, వారి సాహిత్యం, ప్రవచనాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చివరగా- మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మహారాజ్ సాహిబ్ 500వ పుస్తకానికి శుభాకాంక్షలు ప్రకటించారు. మహారాజ్ ఆలోచన విధానం భారత మేధా, నైతిక, మానవ పయనంపై నిరంతరం వెలుగులు ప్రసరింపజేస్తుందని ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తూ ప్రసంగం ముగించారు.
***
(रिलीज़ आईडी: 2213637)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam