ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 03 JAN 2026 2:59PM by PIB Hyderabad

నమో బుద్ధాయ.

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...
నూట ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత వారసత్వ సంపద తిరిగి వచ్చింది... భారత వైభవం వెనక్కి వచ్చింది. ఈ రోజు నుంచి దేశ ప్రజలంతా బుద్ధ భగవానుడి ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీర్వాదాలను పొందగలుగుతారు. ఈ శుభ సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన అతిథులందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర సందర్భంలో బౌద్ధ సంప్రదాయానికి చెందిన సన్యాసులు, ధర్మ గురువులూ మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ నేను నమస్కరిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి కొత్త శక్తిని అందిస్తోంది. 2026 సంవత్సరం ప్రారంభంలోనే జరుగుతున్న ఈ శుభ వేడుక నిజంగా స్ఫూర్తిదాయకం. 2026 సంవత్సరంలో నా మొదటి బహిరంగ కార్యక్రమం బుద్ధ భగవానుడి పాదాల చెంత ప్రారంభమవడం నా అదృష్టం. బుద్ధ భగవానుడి ఆశీర్వాదాలతో ఈ 2026 సంవత్సరం ప్రపంచానికి శాంతి, శ్రేయస్సు, సామరస్యంతో కూడిన నూతన శకాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.
మిత్రులారా,
ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన ప్రదేశమే అత్యంత ప్రత్యేకమైనది. ఖిలా రాయ్ పిథోరా ప్రాంతం భారత అద్భుత చరిత్రకు నిలయం. సుమారు వెయ్యి సంవత్సరాల కిందట ఆనాటి పాలకులు ఈ చరిత్రాత్మక కోట చుట్టూ బలమైన, సురక్షితమైన గోడలతో ఒక నగరాన్ని నిర్మించారు. అదే చారిత్రక నగర సముదాయంలో మనం మన చరిత్రకు ఒక ఆధ్యాత్మిక, పవిత్రమైన అధ్యాయాన్ని జోడిస్తున్నాం.
మిత్రులారా,
ఇక్కడికి వచ్చే ముందే నేను ఈ చరిత్రాత్మక ప్రదర్శన వివరాలను తెలుసుకున్నాను. బుద్ధుని పవిత్ర అవశేషాలు మనందరినీ ఆశీర్వదించాయి. అవి భారత్ నుంచి తరలివెళ్లడం, చివరికి తిరిగి రావడం రెండూ మనకు ముఖ్యమైన పాఠాలే. బానిసత్వం మనకు రాజకీయంగా, ఆర్థికంగా నష్టం కలిగించడం మాత్రమే కాదు... అది మన వారసత్వాన్నీ నాశనం చేస్తుందనేదే ఆ పాఠం. బుద్ధుని పవిత్ర అవశేషాల విషయంలోనూ అదే జరిగింది. బానిసత్వ పాలన కాలంలో వాటిని భారత్ నుంచి తీసుకెళ్లి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు దేశం వెలుపల ఉంచారు. వాటిని తీసుకెళ్లిన వారికి, వారి వారసులకు ఈ అవశేషాలు కేవలం జీవం లేని పురాతన వస్తువులు మాత్రమే. అందుకే వారు ఈ పవిత్ర అవశేషాలను అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేయడానికి ప్రయత్నించారు. కానీ భారతదేశానికి ఈ అవశేషాలు మన గౌరవనీయ దైవంలోని భాగం... మన నాగరికతలోని విడదీయరాని భాగం... అందుకే భారత్ వారి బహిరంగ వేలాన్ని అనుమతించకూడదని నిర్ణయించుకుంది. ఈ రోజు బుద్ధునితో అనుసంధానమైన ఈ పవిత్ర అవశేషాలు అతని కర్మ భూమికి, అతని ధ్యాన భూమికి, అతని మహాబోధి భూమికి, అతని మహాపరినిర్వాణ భూమికి తిరిగి వచ్చేందుకు సహకరించిన గోద్రేజ్ గ్రూప్‌ వారికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
బుద్ధ భగవానుడి జ్ఞానం, ఆయన చూపిన మార్గం మానవాళి అందరికీ చెందినవి. అవి కాలాతీతమైనవి అంటే కాలంతో పాటు మారేవి కాదు. ఇటీవలి నెలల్లో మనం ఈ భావనను పదే పదే అనుభవించాం. బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలు ఎక్కడికి ప్రయాణించినా అక్కడ విశ్వాసం, భక్తి నెలకొన్నాయి. థాయిలాండ్‌లో అటువంటి పవిత్ర అవశేషాలను వేర్వేరు ప్రదేశాల్లో ప్రదర్శనకు ఉంచిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే వాటిని నాలుగు మిలియన్లకు పైగా భక్తులు దర్శించుకున్నారు. వియత్నాంలో, ప్రజల భావన చాలా బలంగా ఉంది. అందుకే ప్రదర్శన వ్యవధిని పొడిగించాల్సి వచ్చింది. తొమ్మిది నగరాల్లో దాదాపు పంతొమ్మిది మిలియన్ల మంది ఈ అవశేషాలకు నివాళులర్పించారు. మంగోలియాలో వేలాది మంది ప్రజలు గండన్ ఆశ్రమం వెలుపల గంటల తరబడి వీటి దర్శనం కోసం వేచి ఉన్నారు. చాలామంది భారతీయ ప్రతినిధులు బుద్ధుని భూమి నుంచి వచ్చినందున వారిని తాకాలని కోరుకున్నారు. రష్యాలోని కల్మికియా ప్రాంతంలోనూ కేవలం ఒక వారంలోనే లక్షా యాభై వేలకు పైగా భక్తులు పవిత్ర అవశేషాలను దర్శించారు. ఇది స్థానిక జనాభాలో సగానికి పైగా సమానం. వివిధ దేశాల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలకు సాధారణ పౌరులు, ప్రభుత్వ పెద్దలు అందరూ సమాన భక్తితో ఐక్యంగా కలిసి దర్శనం చేసుకున్నారు. బుద్ధుడు అందరికీ చెందినవాడు. బుద్ధుడు అందరినీ కలుపుతాడు.
మిత్రులారా,
భగవాన్ బుద్ధుడు నా జీవితంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నందున... నేను చాలా అదృష్టవంతుడినని భావిస్తున్నాను. నేను జన్మించిన వడ్నగర్ బౌద్ధ విజ్ఞానానికి ఒక ప్రధాన కేంద్రం. భగవాన్ బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని చేసిన సారనాథ్... ఈ రోజు నా కర్మభూమి. నేను ప్రభుత్వ బాధ్యతలకు దూరంగా ఉన్న సమయంలోనూ బౌద్ధ క్షేత్రాలను తీర్థయాత్రికుడిగా సందర్శించాను. ప్రధానమంత్రిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అదృష్టం నాకు లభించింది. నేపాల్‌లోని లుంబినిలో ఉన్న పవిత్ర మాయాదేవి ఆలయ సందర్శన ఒక అద్భుత అనుభవం. జపాన్‌లోని తో-జి ఆలయం, కింకాకు-జి వద్ద బుద్ధుని సందేశం కాలపరిమితులను అధిగమిస్తుందని నేను భావించాను. చైనాలోని జియాన్‌లో ఉన్న బిగ్ వైల్డ్ గూస్ పగోడానూ నేను సందర్శించాను. అక్కడి నుంచే బౌద్ధ గ్రంథాలు ఆసియా అంతటా వ్యాపించాయి. అక్కడ భారత్ పాత్రను ఇప్పటికీ స్మరిస్తున్నారు. మంగోలియాలోని గండన్ మొనాస్టరీలో బుద్ధుని వారసత్వంతో ప్రజలకున్న గాఢమైన భావోద్వేగ అనుబంధాన్నీ నేను చూశాను. శ్రీలంకలోని అనురాధపురంలో ఉన్న జయ శ్రీ మహాబోధిని చూడటం... చక్రవర్తి అశోకుడు, భిక్కు మహీంద, సంఘమిత్ర నాటిన సంప్రదాయంతో అనుసంధానం అయిన అనుభవం. థాయ్‌లాండ్‌లోని వాట్ ఫో, సింగపూర్‌లోని బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్‌ను నేను సందర్శించడం... భగవాన్ బుద్ధుని బోధనల ప్రభావంపై నా అవగాహనను మరింతగా పెంచింది.
మిత్రులారా,
నేను ప్రయాణించిన ప్రతిచోటా... అక్కడి ప్రజల మధ్యకు బుద్ధుని వారసత్వ ప్రతీకను తీసుకురావడానికి ప్రయత్నించాను. అందుకే చైనా, జపాన్, కొరియా, మంగోలియా దేశాలకు నేను బోధి వృక్షం మొక్కలను తీసుకెళ్లాను. అణుబాంబుతో ధ్వంసమైన హిరోషిమా నగరంలోని బొటానికల్ గార్డెన్‌లోని బోధి వృక్షాన్ని చూసినప్పుడు... అది మానవాళికి అందించే గొప్ప సందేశాన్ని మీరు ఊహించవచ్చు.
మిత్రులారా,
భారతదేశం కేవలం రాజకీయం, దౌత్యం, ఆర్థిక వ్యవస్థల ద్వారానే కాకుండా అంతకంటే లోతైన సంబంధాల ద్వారా ముడిపడి ఉందనటానికి గౌతమ బుద్ధుని ఈ ఉమ్మడి వారసత్వమే నిదర్శనం. మనం మనస్సు - భావోద్వేగాలు, విశ్వాసం - ఆధ్యాత్మికత ద్వారా అనుసంధానమై ఉన్నాం.
మిత్రులారా,
భారత్ కేవలం గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాల సంరక్షకురాలు మాత్రమే కాదు.. ఆయన సంప్రదాయాన్ని సజీవంగా ముందుకు తీసుకెళ్లే వాహిక కూడా. పిప్రహ్వా, వైశాలి, దేవినీ మోరి, నాగార్జున కొండలలో లభించిన బుద్ధుని అవశేషాలు ఆయన సందేశానికి సజీవ రూపాలు. విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మికత రెండింటి ద్వారా భారత్‌ ఈ అవశేషాలను ప్రతి రూపంలోనూ భద్రపరిచింది.. కాపాడింది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి సహకరించేందుకు భారత్ నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం పురాతన స్తూపాలను దెబ్బతీసినప్పుడు వాటి పునర్నిర్మాణానికి భారత్ మద్దతిచ్చింది. మయన్మార్‌లోని బగన్ భూకంపం తర్వాత పదకొండుకు పైగా పగోడాల పరిరక్షణ బాధ్యతను భారత్‌ చేపట్టింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో కూడా  బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన ప్రదేశాలు- అవశేషాల అన్వేషణ, పరిరక్షణ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గుజరాత్‌లోని నా జన్మస్థలమైన వాద్‌నగర్.. బౌద్ధ సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్కడ బౌద్ధమతానికి సంబంధించిన వేలాది అవశేషాలు కనుగొన్నాం. నేడు మా ప్రభుత్వం వాటిని సంరక్షించడం, ప్రస్తుత తరాన్ని వాటితో అనుసంధానం చేయడంపై దృష్టి సారిస్తోంది. దాదాపు 2500 సంవత్సరాల చరిత్రను అనుభూతి చెందేలా అక్కడ ఒక అద్భుతమైన అనుభూతి మ్యూజియాన్ని నిర్మించాం. కేవలం కొన్ని నెలల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో బౌద్ధ కాలం నాటి ఒక ప్రధాన కేంద్రం కనుగొన్నాం. దీని పరిరక్షణ పనులను ఇప్పుడు వేగవంతం చేస్తున్నాం.
మిత్రులారా,
గత పది-పదకొండు ఏళ్లలో బౌద్ధ క్షేత్రాలను ఆధునికతతో అనుసంధానించేందుకు కూడా భారత్‌ ప్రయత్నించింది. బౌద్ధ గయలో ఒక కన్వెన్షన్ కేంద్రం, యోగా - అనుభూతి కేంద్రం ఏర్పాటు చేశాం. సార‌నాథ్‌లోని ధమేక్ స్తూపం వద్ద లైట్ - సౌండ్ షో, బుద్ధ థీమ్ పార్క్ ఏర్పాటు చేశాం. శ్రావస్తి, కపిలవస్తు, కుశీనగర్‌లలో ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేశాం. తెలంగాణలోని నల్గొండలో డిజిటల్ అనుభూతి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సాంచి, నాగార్జున సాగర్, అమరావతిలో యాత్రికుల కోసం కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేశాం. నేడు భారత్‌లో అన్ని బౌద్ధ పుణ్యక్షేత్రాల మధ్య మెరుగైన అనుసంధానత ఉండేలా దేశంలో ఒక 'బౌద్ధ సర్క్యూట్' తయారవుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, యాత్రికులకు విశ్వాసం, ఆధ్యాత్మికత ‌విషయంలో లోతైన అనుభూతి అందుతుంది.
మిత్రులారా,
బౌద్ధ వారసత్వం సహజమైన రీతిలో భవిష్యత్ తరాలకు చేరేలా చూడాలన్నదే మా ప్రయత్నం. ప్రపంచ బుద్ధిస్ట్ సదస్సుతో పాటు వైశాఖ, ఆషాఢ పూర్ణిమ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను ఈ ఆలోచనతోనే నిర్వహిస్తున్నాం. గౌతమ బుద్ధుని అభిధమ్మ, ఆయన మాటలు - బోధనలు మొదట పాలీ భాషలోనే ఉన్నాయని మీ అందరికీ తెలుసు. పాలీ భాషను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేం కృషి చేస్తున్నాం. ఈ కారణంగానే పాలీ భాషకు 'ప్రాచీన భాష' హోదాను కల్పించాం. ఇది ధమ్మాన్ని అసలు సారాంశంలో అర్థం చేసుకోవటం, వివరించటాన్ని సులభతరం చేస్తుంది. బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన పరిశోధనలను కూడా ఇది బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
గౌతమ బుద్ధుని జీవన తత్వం భౌగోళిక సరిహద్దులను దాటి ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపింది. “భవతు సబ్బ మంగళం, రక్ఖంతు సబ్బ దేవతా, సబ్బ బుద్ధానుభావేన సదా సుత్తి భవంతు తే”... ఇది ప్రపంచ సంక్షేమం కోసం చేసే ప్రార్థన. బుద్ధుడు మానవాళిని తీవ్రవాదం నుంచి రక్షించడానికి ప్రయత్నించాడు. తన అనుచరులతో “అత్త దీపో భవ భిక్ఖవే! పరీక్ష్య భిక్షవో గ్రాహ్యం, మద్వచో న తు గౌరవాత్” అని అన్నాడు. “భిక్షువులారా మీకు మీరే వెలుగుగా మారండి. నా మాటలను కూడా కేవలం నాపై ఉన్న గౌరవంతో కాకుండా పరీక్షించి ఆచరించండి” అన్నది దీని అర్థం.
మిత్రులారా,
బుద్ధుని ఈ సందేశం ప్రతి యుగానికి, ప్రతి కాలానికి సందర్భోచితమైనది. అత్త దీపో భవ- మనకు మనమే వెలుగుగా మారడం అనేది ఆత్మగౌరవానికి పునాది.. స్వయం సమృద్ధికి అసలైన సారాంశం.
మిత్రులారా,
సంఘర్షణ, ఆధిపత్యానికి బదులుగా కలిసి నడిచే మార్గాన్ని భగవాన్ బుద్ధుడు ప్రపంచానికి చూపారు. ఇదే ఎల్లప్పుడూ భారతదేశ ప్రధాన తత్వంగా ఉంది. ఆలోచనల బలం, భావోద్వేగాల లోతు ద్వారా మానవాళి ప్రయోజనం కోసం ప్రపంచ సంక్షేమ మార్గాన్ని మనం స్వీకరించాం. ఇదే దృక్పథంతో 21వ శతాబ్దపు ప్రపంచానికి భారత్‌ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. అందుకే ఈ యుగం యుద్ధానిది కాదు బుద్ధునిది అని మనం అన్నప్పుడు.. భారతదేశ పాత్ర స్పష్టంగా ఉంటుంది. మానవతా శత్రువులపై బలం అవసరమే కానీ వివాదాలు ఉన్నచోట చర్చలు, శాంతి మాత్రమే అత్యవసరం.
మిత్రులారా,
'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే సూత్రానికి భారత్ కట్టుబడి ఉంది. భగవాన్ బుద్ధుడు మనకు నేర్పింది ఇదే. ఈ ప్రదర్శనను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో అనుసంధానమవుతారని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
భగవాన్ బుద్ధుని ఈ పవిత్ర అవశేషాలు భారతదేశ వారసత్వం. శతాబ్ద కాలం వేచి చూసిన తర్వాత అవి తిరిగి మన దేశానికి చేరుకున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వచ్చి ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకోవాలని,  బుద్ధుని ఆలోచనలతో మమేకం కావాలని, కనీసం ఒక్కసారైనా సందర్శించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువ మిత్రులు, బిడ్డలు ఖచ్చితంగా ఈ ప్రదర్శనను చూడాలని నేను కోరుతున్నాను. మన గత వైభవాన్ని భవిష్యత్తు కలలతో అనుసంధానించేందుకు ఈ ప్రదర్శన ఒక గొప్ప మాధ్యమం. ఈ ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనితో పాటు మరోసారి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు!
నమో బుద్ధాయ!

 

***


(रिलीज़ आईडी: 2211498) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam