సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పీప్రాహ్వాలో లభించిన బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శనను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
‘ది లైట్ అండ్ ది లోటస్- బుద్ధుని పవిత్ర అవశేషాలు’ పేరుతో నిర్వహిస్తున్న గొప్ప ప్రదర్శన
प्रविष्टि तिथि:
02 JAN 2026 3:51PM by PIB Hyderabad
పిప్రాహ్వాలో లభించిన బుద్ధుని స్మారక వస్తువులు, ధాతు పేటికలు, రత్న అవశేషాలను ఇటీవలే భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుద్ధుని పవిత్ర అవశేషాలతో రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఒక చారిత్రాత్మక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు.

1898లో, ఆ తర్వాత 1971-1975 కాలంలో పిప్రాహ్వా ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో లభించిన బుద్ధుని పవిత్ర అవశేశాలు, రత్న భాగాలు, ధాతు పేటికలను 127 సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకువచ్చారు. బుద్ధ భగవానుడి స్మారకంగా నిలిచే అమూల్య సంపదనంతా ఈ చరిత్రాత్మక ప్రదర్శనలో ప్రదర్శిస్తారు.

"ది లైట్ అండ్ ది లోటస్-బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలు" పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని అనేక సాంస్కృతిక సంస్థల నుంచి సేకరించిన సంబంధిత పురాతన వస్తువులు, కళాఖండాలను ప్రదర్శిస్తారు. బుద్ధునితో అనుబంధంగా ఉన్న లోతైన తాత్విక చింతన, అద్భుతమైన హస్తకళ, ప్రపంచ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలను ఈ అవశేషాలు సూచిస్తాయి. ఈ ప్రదర్శనలో శిల్పాలు, రాతప్రతులు, నూలు, పట్టు వస్త్రాలపై చిత్రించిన బౌద్ధ చిత్రాలు, బౌద్ధ మత సంబంధిత వస్తువులు సహా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి నేటి వరకు లభించిన 80కి పైగా పురాతన వస్తువులు ఉన్నాయి.

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సాధించి... సోథెబీస్ హాంకాంగ్‌లో జరగాల్సిన వేలాన్ని నిలిపివేసి... 2025 జూలైలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేక కళాఖండాలను విజయవంతంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చిన సంఘటనను స్మరించుకుంటూ ఈ అపూర్వ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. 1898 తవ్వకాల తర్వాత మొదటిసారిగా ఈ ప్రదర్శన ద్వారా కింది వస్తువులన్నీ ఒకచోట చేరుతున్నాయి:
• 1898 కపిలవస్తు తవ్వకాల నుంచి లభించిన అవశేషాలు
• 1972 తవ్వకాల నుంచి లభించిన సంపద
• కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం నుంచి లభించిన ధాతు పేటికలు, ఆభరణాల సంపద
• పెప్పే కుటుంబ సేకరణ నుంచి ఇటీవల తిరిగి తీసుకువచ్చిన అవశేషాలు
• రత్నాల అవశేషాలు, ధాతు పేటికలను మొదట కనుగొన్న ఏకశిలతో చేసిన రాతి పెట్టె.

బుద్ధుని ఈ పవిత్ర అవశేషాలను 1898లో విలియం క్లాక్స్‌టన్ పెప్పే పురాతన కపిలవస్తు స్థూపం వద్ద కనుగొన్నారు. వీటిని కనుగొన్న అనంతరం వీటిలో కొన్ని భాగాలు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అయ్యాయి. ఒక భాగం సియామ్ రాజుకు కానుకగా ఇచ్చారు. మరొక భాగాన్ని ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లారు. మూడో భాగం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజాల మద్దతుతో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పెప్పే కుటుంబ సంరక్షణలో ఉన్న భాగాన్ని నిర్ణయాత్మక మధ్యవర్తిత్వం ద్వారా 2025లో స్వదేశానికి తరలించింది.

బౌద్ధమతానికి భారత్ జన్మస్థలమని ఈ ప్రదర్శన స్పష్టం చేస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక మార్గదర్శిగా ప్రపంచంలో భారత్ స్థానాన్ని ఇది బలపరుస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంతో భారత్ సంబంధాలు ప్రధానంగా భారత నాగరిక, ఆధ్యాత్మిక వారసత్వంపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పటివరకు 642 పురాతన వస్తువులను దేశానికి తిరిగి తీసుకురావడం సహా పిప్రాహ్వా అవశేషాల పునరాగమనం భారత్ సాధించిన ప్రధాన విజయం.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు, పలు దేశాల రాయబారులు, దౌత్య బృంద సభ్యులు, గౌరవనీయ బౌద్ధ సన్యాసులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పండితులు, వారసత్వ నిపుణులు, కళారంగ ప్రముఖులు, కళాభిమానులు, బౌద్ధ మత అనుచరులు, విద్యార్థులు పాల్గొంటారు.
భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని, బౌద్ధ మత జన్మస్థలంగా మన దేశ ప్రాముఖ్యాన్ని చాటుతూ... వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక నాయకత్వాల పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ ప్రదర్శన పునరుద్ఘాటిస్తుంది. భారత నాగరిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రపంచంతో ఈ గొప్ప వారసత్వాన్ని పంచుకోవడం పట్ల మన దేశపు నిరంతర నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2211474)
आगंतुक पटल : 7