పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో ఘనంగా ముగిసిన పెసా మహోత్సవ్–2025


పెసా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల పెసా మహోత్సవ్‌లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ – గిరిజన హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ స్పష్టం; క్షేత్రస్థాయిలో సమర్థ అమలుకు పిలుపు


పెసా పోర్టల్, పెసా సూచికలు, గిరిజన భాషల్లో పెసాపై శిక్షణ మాడ్యూళ్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాపై ఈ-బుక్ ఆవిష్కరణతో పెసా దినోత్సవం ఘనంగా నిర్వహణ


प्रविष्टि तिथि: 24 DEC 2025 5:54PM by PIB Hyderabad

24 డిసెంబర్ 2025

విశాఖపట్నం

పంచాయతీలు (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం, 1996 (పెసా) గిరిజనుల నీరు, అరణ్యాలు, భూములు, సహజ వనరులపై హక్కులకు బలమైన రాజ్యాంగ పరిరక్షణను అందిస్తుందని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ పేర్కొన్నారు. పెసా దినోత్సవం (24 డిసెంబర్ 2025) సందర్భంగా విశాఖపట్నంలో 23–24 డిసెంబర్ 2025 తేదీల్లో నిర్వహించిన రెండు రోజుల పెసా మహోత్సవ్‌లో భాగంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు ఈ మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, ఆర్చరీ, పెసా రన్, గిరిజన డెమో గేమ్స్ వంటి క్రీడా పోటీలతో పాటు, గిరిజన వంటకాలు, హస్తకళలు, కళలు, సంస్కృతి, నృత్యాలు, సంప్రదాయాలను తెలియజేసే ప్రదర్శనలను నిర్వహించడం జరిగింది. ఇవన్నీ గిరిజన వారసత్వానికి జాతీయ స్థాయి వేదికగా నిలిచాయి.

ప్రొఫెసర్ బఘేల్ మాట్లాడుతూ, పెసా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పాలనను పటిష్ట పరిచేందుకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎన్నికైన ప్రతినిధులు, అధికారుల కోసం క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఉత్తమ ఆచరణలను రాష్ట్రాల మధ్య పునరావృతం చేయడానికి వాటిని డాక్యుమెంట్ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో స్థానిక అవసరాలు, సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించే భాగస్వామ్య అభివృద్ధి ప్రణాళికలు గిరిజన సమాజ పురోగతికి కీలకమని, ఇవే గౌరవ ప్రధాని వికసిత్ భారత్–2047 విజన్ ను సాధించేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. పెసా మహోత్సవ్ లక్ష్యం గిరిజన యువతను అనుసంధానం చేయడం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించడం, గిరిజన సంస్కృతికి జాతీయ గుర్తింపును కల్పించి, “మేరి పరంపర, మేరి పహచాన్” భావాన్ని బలోపేతం చేయడమని తెలిపారు.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భారద్వాజ్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నీరు, అరణ్యాలు, భూముల పరిరక్షణకు పెసా చట్టం కీలకంగా వ్యవహారిస్తోందని తెలిపారు. ఈ చట్టం స్థానిక సంస్థలను శక్తివంతం చేస్తుందని, సామాజిక ఆధారిత నిర్ణయాలను నిర్ధారిస్తుందని, గ్రామసభను ప్రజాస్వామ్య ప్రక్రియ కేంద్రంగా నిలబెడుతుందని ఆయన అన్నారు. గ్రామసభలు ద్యారా తీసుకునే నిర్ణయాలు గిరిజనులను వారి వనరులను స్వయంగా నిర్వహించి, వారి అభివృద్ధి దిశను స్వయంగా నిర్ధేశించుకునే అవకాశాన్ని కల్పించిన భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఝార్ఖండ్ ప్రభుత్వం పెసా నియమావళి ముసాయిదాను ఆమోదించిందని, దీంతో పెసా నియమావళి నోటిఫికేషన్ దిశగా అడుగులు వేసిన తొమ్మిదవ రాష్ట్రంగా ఝార్ఖండ్ నిలిచిందని శ్రీ భారద్వాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశి భూషణ్ కుమార్, ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నానికి విచ్చేసిన ప్రతినిధులను స్వాగతిస్తూ పెసా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెసా జిల్లాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా పౌరులకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

మహోత్సవ్ రెండో రోజు, పెపా దినోత్సవం కలిసోచ్చిన సందర్భంగా పెసా పోర్టల్, పెసా సూచికలు, గిరిజన భాషల్లో పెసాపై శిక్షణ మాడ్యూళ్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాపై ఈ-బుక్ వంటి కీలక కార్యక్రమాలను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో శ్రీ వివేక్ భారద్వాజ్, శ్రీ శశి భూషణ్ కుమార్ లు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇవి రాష్ట్రాల వ్యాప్తంగా పెసా అమలుకు, సంస్థాగత బలోపేతానకి, పర్యవేక్షణ, సామర్థ్య నిర్మాణానికి కీలక అడుగులుగా నిలుస్తాయి. భారతదేశంలోని భిన్న గిరిజన, జానపద వారసత్వాన్ని ప్రతిబింబించే సంపన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి శాస్త్రీయ నృత్యం, తెలంగాణ నుంచి గుస్సాడి, రాజస్థాన్ నుంచి గవారి, ఒడిశా నుంచి ధీమ్సా, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి జానపద నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఎంపిక చేసిన గిరిజన డెమో గేమ్స్ కూడా ప్రదర్శించగా, పాల్గొన్న బృందాలను సత్కారించారు.

పెసా రన్ (పురుషుల విభాగం)లో శ్రీ అతుల్ చిధాడే (మహారాష్ట్ర) మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ఆ తర్వాత శ్రీ సూరజ్ మాషి, శ్రీ మనోజ్ హిల్లిన్ ( ఇరువురు మహారాష్ట్రకు చెందినవారే) నిలిచారు. మహిళల విభాగంలో, రాజ్ కుమారి (రాజస్థాన్) మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత హీరా సాంగా (జార్ఖండ్), ప్రియ (హిమాచల్ ప్రదేశ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల ఆర్చరీలో, ఖుషి ననోమా (రాజస్థాన్) స్వర్ణ పతకాన్ని, అనురాధ కుమారి (జార్ఖండ్) రజత పతకాన్ని, అంబిక (ఒడిశా) కాంస్య పతకాన్ని గెలుపొందారు. పురుషుల ఆర్చరీలో శ్రీ కృష్ణ పింగువా (జార్ఖండ్) స్వర్ణ పతకాన్ని, శ్రీ బద్రీలాల్ మీనా (రాజస్థాన్) రజత పతకాన్ని, శ్రీ దినేష్ ముర్ము (జార్ఖండ్) కాంస్య పతకాన్ని గెలుపొందారు. 2025 డిసెంబర్ 23న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ పోటీలలో, పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజయం సాధించడంతో పాటు మహిళల విభాగంలో జార్ఖండ్ విజేతగా నిలిచింది. పెసా ముగింపు కార్యక్రమంలో పెసా రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గిరిజన డెమో గేమ్స్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. పెసా మహోత్సవ తదుపరి ఆతిథ్య ఇవ్వనున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రకు చిహ్నంగా బాటన్‌ను అందజేశారు.

పెసా చట్టంలోని రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా, పది పెసా రాష్ట్రాలన్నింటిలోనూ గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ముఖ్యమంత్రులు వీడియో సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పంచాయతీ ప్రతినిధులు పెసా మహోత్సవ్‌ను ప్రజల భాగస్వామ్యాన్ని లోతుగా పెంపొందించే, క్షేత్రస్థాయి స్వయంపాలనను బలోపేతం చేసే “లోక్ ఉత్సవ్ – లోక్ సంస్కృతి”గా అభివర్ణించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ స్టేడియంలో 23–24 డిసెంబర్ 2025 తేదీల్లో నిర్వహించిన రెండు రోజుల పెసా మహోత్సవ్, పెసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటిస్తూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి స్వయంపాలనను మరింత బలోపేతం చేసే సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిసింది.

 

****

GSK/YUP


(रिलीज़ आईडी: 2208239) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia