ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో రెండో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సులో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 19 DEC 2025 8:10PM by PIB Hyderabad

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్, మన తులసీ భాయ్ డాక్టర్ టెడ్రోస్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, నా మంత్రివర్గ సహచరుడు జె.పి. నడ్డా, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్, ఈ కార్యక్రమంతో సంబంధమున్న ఇతర దేశాల మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, గౌరవ ప్రతినిధులు, సాంప్రదాయ వైద్య రంగంలో కృషి చేస్తున్న గౌరవ నిపుణులు, సోదరీ సోదరులారా..!

డబ్ల్యూహెచ్‌వో రెండో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సు నేడు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్య రంగ నిపుణులు గత మూడు రోజులుగా ఇక్కడ సునిశితమైన, అర్థవంతమైన చర్చల్లో భాగస్వాములయ్యారు. భారత్ దీనికి బలమైన వేదికగా నిలవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా క్రియాశీల పాత్ర పోషించడం సంతోషాన్నిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డబ్ల్యూహెచ్‌వోకు, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు, ఇక్కడికొచ్చి కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మిత్రులారా,

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని భారత్‌లోని జామ్‌నగర్‌లో నెలకొల్పడం మన అదృష్టం. దేశానికి గర్వకారణం. 2022లో జరిగిన మొదటి అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సు సందర్భంగా.. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను ప్రపంచం మాకు అప్పగించింది. ఈ అంతర్జాతీయ కేంద్రం ఖ్యాతి, ప్రభావం స్థానిక స్థాయి నుంచి ప్రపంచ వేదిక వరకు విస్తరిస్తుండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. ఈ సదస్సు విజయమే దీనికి అతిపెద్ద ఉదాహరణ. సంప్రదాయ విజ్ఞానం, ఆధునిక పద్ధతుల సమ్మేళనం ఈ సదస్సులో కనిపిస్తోంది. వైద్య విజ్ఞానం, సంపూర్ణ ఆరోగ్య భవితను అమితంగా ప్రభావితం చేయగల అనేక కొత్త కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి. వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు, ప్రతినిధుల మధ్య కూడా వివరణాత్మక చర్చలు జరిగాయి. ఉమ్మడి పరిశోధనను ప్రోత్సహించడానికి, నిబంధనలను సరళీకృతం చేయడానికి, శిక్షణను విస్తరించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి కొత్త మార్గాలను కూడా ఈ చర్చలు ఆవిష్కరించాయి. భవిష్యత్తులో సంప్రదాయ వైద్యవిధానాన్ని మరింత సురక్షితంగా, విశ్వసనీయమైనదిగా మార్చడంలో ఈ సహకారం కీలక పాత్ర పోషిస్తుంది.

మిత్రులారా,

ఈ సదస్సులో అనేక ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం మన బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశోధనలను బలోపేతం చేయడం, సంప్రదాయ వైద్య రంగంలో డిజిటల్ సాంకేతికతల వినియోగాన్ని పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించదగిన నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలు సంప్రదాయ వైద్యానికి గొప్ప శక్తినిస్తాయి. డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలు, ఏఐ ఆధారిత సాధనాలు, పరిశోధన ఆవిష్కరణలు, ఆధునిక ఆరోగ్య మౌలిక సదుపాయాల ద్వారా.. సంప్రదాయమూ, సాంకేతికతల మధ్య కొత్త సహకారాన్ని కూడా మనమిక్కడ చూశాం. అన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని మరింత సమర్థంగా మార్చే అవకాశం అనేక రెట్లు పెరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ కోణంలో చూస్తే ఈ సదస్సు విజయం అత్యంత కీలకమైనది.

మిత్రులారా,

సంప్రదాయ వైద్య విధానాల్లో యోగా ముఖ్యమైన అంశం. ఆరోగ్యం, సమతౌల్యం, సామరస్య మార్గాన్ని యోగా ప్రపంచానికి చూపింది. భారత్ చేసిన ప్రయత్నాలు, 175కు పైగా దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలో మూలమూలకూ యోగా విస్తరించడాన్ని గత కొన్నేళ్లుగా మనం చూశాం. యోగా వ్యాప్తికి, అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. ఈ రోజు కొందరు ప్రముఖులు ప్రధానమంత్రి పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ న్యాయనిర్ణేతల బృందం నిశితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. ఈ గ్రహీతలందరూ యోగా పట్ల అంకితభావం, క్రమశిక్షణ, జీవితకాల నిబద్ధతకు ప్రతీక. వారి జీవితాలు అందరికీ స్ఫూర్తిదాయకం. గౌరవ పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఈ సదస్సు ఫలితాలు దీర్ఘకాలిక ప్రభావం చూపేలా.. కీలక ముందడుగు పడడం ఎంతో సంతోషాన్నిస్తోంది. సంప్రదాయ వైద్యానికి సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని, విధాన పత్రాలను ఒకే చోట భద్రపరిచేలా.. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య గ్రంథాలయ రూపంలో ఒక అంతర్జాతీయ వేదికను ప్రారంభించాం. విలువైన సమాచారాన్ని అన్ని దేశాలకు సమానంగా అందుబాటులోకి తేవడం దీనివల్ల సాధ్యపడుతుంది. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో నిర్వహించిన మొదటి డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సదస్సులో ఈ గ్రంథాలయానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ రోజు ఆ సంకల్పం నెరవేరింది.

మిత్రులారా,

అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఒక అద్భుత ఉదాహరణగా వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు ఇక్కడ నిలిచారు. భాగస్వాములుగా.. ప్రమాణాలు, భద్రత, పెట్టుబడి వంటి అంశాలపై మీరు చర్చించారు. ఈ చర్చల ఫలితంగా వెలువడే ఢిల్లీ ప్రకటన.. మున్ముందు ఉమ్మడి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఈ ఉమ్మడి కృషికి సహకరించిన వివిధ దేశాల గౌరవ మంత్రులకు అభినందనలు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మిత్రులారా,

ఈరోజు ఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా జరిగింది. భారత్ అందిస్తున్న చిరు సహకారమిది. పరిశోధన, నియంత్రణ, సామర్థ్యాభివృద్ధిని ప్రోత్సహించే అంతర్జాతీయ కేంద్రంగా ఇది సేవలందిస్తుంది.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో భాగస్వామ్యాలపై కూడా భారత్ దృష్టి సారిస్తోంది. ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన సహకారాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది.. బిమ్‌స్టెక్ దేశాలు, అంటే దక్షిణ, ఆగ్నేయాసియాలోని మన పొరుగు దేశాల కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మేం ఏర్పాటు చేస్తున్నాం. రెండోది.. జపాన్‌తో కలిసి పనిచేసేలా సహకార కార్యాచరణ ప్రారంభించాం. విజ్ఞానశాస్త్రం, సంప్రదాయ పద్ధతులు, ఆరోగ్య రక్షణను ఏకం చేయడం దీని లక్ష్యం.

మిత్రులారా,

ఈ సదస్సు ఇతివృత్తం “సమతౌల్య పునరుద్ధరణ: ఆరోగ్య శాస్త్రం, పద్ధతులు.. సంక్షేమం.” సమతౌల్యాన్ని పునరుద్ధరించడమన్నది సంపూర్ణ ఆరోగ్యంలో ఎప్పుడూ ఒక ప్రధాన భావనగానే ఉంది. మీ నిపుణులందరికీ ఈ విషయం బాగా తెలుసు.. సమతుల్యతను లేదా సమస్థితిని ఆరోగ్యానికి మూలసారంగా ఆయుర్వేదం నిర్వచిస్తుంది. ఈ సమతౌల్యాన్ని కాపాడుకునే వ్యక్తే నిజంగా ఆరోగ్యవంతుడు. ఈ రోజుల్లో మధుమేహం, గుండెపోటు, కుంగుబాటు నుంచి క్యాన్సర్ వరకు చాలా వ్యాధులకు జీవనశైలి అంశాలు, వివిధ అసమతౌల్యాలే అంతర్లీనంగా ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రపంచంలో అనేకమంది ఎదుర్కొంటున్న పని - జీవిత అసమతౌల్యం, ఆహార అసమతౌల్యం, నిద్ర అసమతౌల్యం, పేగుల్లో సూక్ష్మజీవుల అసమతౌల్యం, కేలరీల అసమతౌల్యం, భావోద్వేగ అసమతౌల్యం వంటి ఆరోగ్య సవాళ్లకు ఈ అంతరాయాలే ముఖ్య కారణం. అధ్యయనాలు దీనిని ధ్రువీకరిస్తున్నాయి. అవి వెలువరించిన డేటా ద్వారా ఇది స్పష్టమవుతోంది. ఆరోగ్య నిపుణులుగా ఈ వాస్తవం మీరు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే, సమతౌల్యాన్ని పునరుద్ధరించడమన్నది నేడు ప్రపంచవ్యాప్త లక్ష్యం మాత్రమే కాదు.. అది అంతర్జాతీయంగా అత్యవసరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మరింత వేగంగా, దృఢ సంకల్పంతో పనిచేయాలి.

మిత్రులారా,

ఈ 21వ శతాబ్దపు సమయంలో జీవితంలో సమతౌల్య నిర్వహణ అన్న సవాలు మరింత సంక్లిష్టంగా మారబోతోంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌తో కూడిన ఓ కొత్త సాంకేతిక యుగం ఆవిర్భవించిన ఈ వేళ.. మానవ చరిత్రలో విప్లవాత్మక మార్పులు ఆవిష్కృతం కాబోతున్నాయి. మున్ముందు మన జీవన విధానంలో మునుపెన్నడూ లేని మార్పులు రాబోతున్నాయి. సౌలభ్యమూ, వనరులూ పెరిగి జీవన శైలిలో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల.. శారీరక శ్రమ తగినంతగా లేక మానవ దేహానికి ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల సంప్రదాయ ఆరోగ్య సంరక్షణలో మనం కేవలం ప్రస్తుత అవసరాలపైనే దృష్టి పెట్టడం కాదు.. భవిష్యత్తుపై కూడా మనకు బాధ్యత ఉంది.

మిత్రులారా,

సంప్రదాయ వైద్యం గురించి చర్చించే సమయంలో సహజంగానే దాని భద్రత, శాస్త్రీయ ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్న తలెత్తుతుంది. ఈ దిశగానూ భారత్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ సదస్సులో అశ్వగంధ ఉదాహరణను మీరంతా చూశారు. మన సంప్రదాయ వైద్య విధానాల్లో శతాబ్దాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. కోవిడ్ 19 విపత్తు సమయంలో అంతర్జాతీయంగా దానికి వేగంగా డిమాండ్ పెరిగింది. అనేక దేశాల్లో దాన్ని ఉపయోగించడం మొదలైంది. నిశిత పరిశోధన, రుజువులతో కూడిన ధ్రువీకరణ ద్వారా.. అశ్వగంధను విశ్వసనీయ, శాస్త్రీయ పద్ధతిలో భారత్ ముందుకు తీసుకెళ్తోంది. అశ్వగంధపై ఒక ప్రత్యేక అంతర్జాతీయ చర్చను కూడా ఈ సదస్సులో నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులు దాని భద్రత, నాణ్యత, ఉపయోగాలపై లోతుగా చర్చించారు. కాలపరీక్షకు నిలిచిన ఇటువంటి మూలికలను ప్రపంచ ప్రజా ఆరోగ్య వ్యవస్థల్లో భాగం చేయడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది.

మిత్రులారా,

సంప్రదాయ వైద్యం కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా జీవనశైలి నిర్వహణకు మాత్రమే పరిమితమనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడది వేగంగా మారుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంప్రదాయ వైద్యం సమర్థమైన పాత్ర పోషిస్తుంది. ఈ దృక్పథంతోనే ఈ రంగంలో భారత్ పురోగమిస్తోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం కలిసి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో సమగ్ర క్యాన్సర్ చికిత్సను బలోపేతం చేయడానికి సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపట్టాయి. సంప్రదాయ వైద్య విధానాలను ఆధునిక క్యాన్సర్ చికిత్సలతో మేళవించడం దీని లక్ష్యం. అలాగే రుజువులతో కూడిన మార్గదర్శకాలను రూపొందించడంలోనూ సహాయపడుతుంది. రక్తహీనత, కీళ్ల నొప్పులు, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లపై భారత్‌లోని పలు ప్రముఖ సంస్థలు చికిత్సాపరమైన అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో అనేక అంకుర సంస్థలు కూడా భారత్‌లో పుట్టుకొస్తున్నాయి. ప్రాచీన సంప్రదాయాలతో యువశక్తి అనుసంధానమవుతోంది. ఈ ప్రయత్నాలన్నింటి ద్వారా.. సంప్రదాయ వైద్యం ఓ కొత్త, ఉన్నతమైన దిశగా స్పష్టంగా పురోగమిస్తోంది.

మిత్రులారా,

నేడు సంప్రదాయ వైద్యం ఓ కీలక మలుపు వద్ద నిలిచి ఉంది. ప్రపంచంలో అనేక మంది చాలా కాలంగా దీనిపై ఆధారపడి ఉన్నారు. విస్తృతమైన సామర్థ్యం ఉన్నప్పటికీ సంప్రదాయ వైద్యానికి నిజంగా దక్కాల్సిన గుర్తింపు లభించలేదు. అందువల్ల విజ్ఞానశాస్త్రం ద్వారా మనం విశ్వాసాన్ని పొందాలి. మనం దీని పరిధిని మరింత విస్తరించాలి. ఈ బాధ్యత కేవలం ఏ ఒక్క దేశానిదో కాదు.. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. ఈ సదస్సులో గత మూడు రోజులుగా కనిపించిన భాగస్వామ్యం, చర్చలు, నిబద్ధత... ఈ దిశగా సమష్టిగా ముందుకు సాగేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని బలపరిచాయి. విశ్వాసంతో, గౌరవంతో, బాధ్యతగా మనమంతా సమష్టిగా సంప్రదాయ వైద్యవిధానాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఈ సదస్సు సందర్భంగా మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

ధన్యవాదాలు.

 

***


(रिलीज़ आईडी: 2207040) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Gujarati , Kannada