ప్రధాన మంత్రి కార్యాలయం
ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
16 DEC 2025 11:10PM by PIB Hyderabad
మహాశయులారా,
సోదరీసోదరులారా,
తెనా ఇస్టిలిన్,
విశిష్ట దేశమైన ఇథియోపియాలో మీ అందరి మధ్య ఇలా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ మధ్యాహ్నమే నేను ఇథియోపియాకు చేరుకున్నాను. ఈ నేలపై అడుగుపెట్టిన క్షణం నుంచి ఇక్కడి ప్రజలతో గొప్ప ఆత్మీయత ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రధానే స్వయంగా నాకు స్వాగతం పలికారు. ఫ్రెండ్షిప్ పార్క్, సైన్స్ మ్యూజియంకు నన్ను తీసుకెళ్లారు.
ఇక్కడి నాయకులతో కీలకమైన అంశాలపై ఈ సాయంత్రం చర్చించాను. ఇవన్నీ కలసి మరచిపోలేని అనుభూతినిచ్చాయి.
స్నేహితులారా,
ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఇప్పుడే స్వీకరించాను. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, సుసంపన్నమైన నాగరికతల్లో ఒకటైన దేశం నుంచి ఈ సత్కారాన్ని పొందడం నాకు గర్వకారణం. భారతీయులందరి తరఫున ఈ పురస్కారాన్ని వినయంగా, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను.
అది 1896 తిరుగుబాటు సమయంలో తమ తోడ్పాటును అందించిన గుజరాతీ వర్తకులైనా, ఇథియోపియా స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారతీయ సైనికులైనా, లేదా విద్య, పెట్టుబడుల ద్వారా భవిష్యత్తును నిర్మించడంలో సహకరించిన భారతీయ ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలైనా.. మన భాగస్వామ్యాన్ని మలచిన అనేక మంది భారతీయులకు ఈ గౌరవాన్ని అంకితమిస్తున్నాను. అలాగే భారత్‌పై నమ్మకం ఉంచి, మనస్ఫూర్తిగా ఈ సంబంధాన్ని బలోపేతం చేస్తున్న ప్రతి ఇథియోపియన్ పౌరుడికి అంతే సమానంగా ఈ గౌరవం దక్కుతుంది.
స్నేహితులారా,
ఈ సందర్భంగా నా స్నేహితుడు, ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ ఆలీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఆర్యా,
దక్షిణాఫ్రికాలో గత నెలలో జరిగిన జీ20 సమావేశంలో మనం కలుసుకున్నప్పుడు, ఇథియోపియాను సందర్శించాలని ఆప్యాయంగా కోరారు. నా స్నేహితుడు, సోదరుడు అంత ప్రేమతో నన్ను ఆహ్వానిస్తే నేను ఎలా కాదనగలను? అందుకే తొలి అవకాశంలోనే ఇథియోపియాకు రావాలని నిర్ణయించుకున్నాను.
స్నేహితులారా,
సాధారణ దౌత్య నియమాలను అనుసరించి ఉంటే.. ఈ పర్యటనకు చాలా సమయం పట్టి ఉండేది. కానీ 24 రోజుల్లోనే మీ అనురాగం, ఆత్మీయత నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి.
స్నేహితులారా,
గ్లోబల్ సౌత్‌పై ప్రపంచం దృష్టి సారిస్తున్న సమయంలో, ఇథియోపియా కొనసాగిస్తున్న గౌరవం, స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం అనే సంప్రదాయం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన దశలో ఇథియోపియా పగ్గాలు సమర్థులైన డాక్టర్ అబియ్ చేతుల్లో ఉండటం మంచి విషయం.
తాను అనుసరించే ‘మెడేమర్’ అనే తత్వంతో, అభివృద్ధి పట్ల బలమైన నిబద్ధతతో ఇథియోపియాను ప్రగతి మార్గంలో ఆయన నడిపిస్తున్న తీరు మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అది పర్యావరణ పరిరక్షణ, సమగ్రాభివృద్ధి అయినా లేదా భిన్నత్వంతో కూడిన సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమైనా, ఆయన చేపడుతున్న ప్రయత్నాలను, కార్యక్రమాలను, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నాను.
స్నేహితులారా,
‘‘సా విద్యా, యా విముక్తయే’’ అంటే జ్ఞానమే స్వాతంత్ర్యాన్నిస్తుందని భారత్‌లో మేం విశ్వసిస్తాం.
ఏ దేశానికైనా విద్యే పునాది. ఇథియోపియా, భారత్ మధ్య సంబంధాల్లో ఉపాధ్యాయుల నుంచి విశిష్టమైన సహకారం లభించడం పట్ల నేను గర్విస్తున్నాను. ఇథియోపియా గొప్ప సంస్కృతి వారిని ఇక్కడికి ఆహ్వానించింది. అనేక తరాలను తీర్చిదిద్దే అవకాశం వారికి దక్కింది. ఇప్పటికీ, ఇథియోపియన్ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఎంతో మంది భారతీయ అధ్యాపకులు పనిచేస్తున్నారు.
స్నేహితులారా,
లక్ష్యం, నమ్మకంపై ఏర్పడిన భాగస్వామ్యాలదే భవిష్యత్తు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఇథియోపియాతో కలసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
మరోసారి. 1.4 బిలియన్ల భారతీయుల తరఫున ఇథియోపియా ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2205187)
आगंतुक पटल : 7