గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణాభివృద్ధికి కొత్త సంకల్పం-ఉపాధికి కొత్త భరోసా


వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) – వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ – జీ రామ్ జీ)-2025 బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి హామీ-సాధికారత, వృద్ధి, సమన్వయం, పరిపూర్ణ కవరేజీపై ప్రధాన దృష్టి

పీఎం గతి శక్తిని ఉపయోగించి, పథకాల సమ్మేళనంతో గ్రామ పంచాయతీలు సంపూర్ణ ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను’ సిద్ధం చేయాలి

గ్రామీణ ప్రజాసంబంధ పనుల కోసం సమీకృత 'వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్'
జల సంరక్షణ పనులు, ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ ఘటనలను తగ్గించే పనులపై ప్రత్యేక దృష్టి

వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో వ్యవసాయ కూలీల లభ్యతను సులభతరం చేసేలా నిబంధనలు
వారంవారీ బహిరంగ ప్రకటన వ్యవస్థలు, మరింత పటిష్ఠ సామాజిక ఆడిట్ వంటి బలమైన పారదర్శక, జవాబుదారీ
విధానాలు

సమర్థంగా, సమగ్రంగా అమలు చేయడం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో రూపొందించిన సమగ్ర పాలనా వ్యవస్థ

प्रविष्टि तिथि: 16 DEC 2025 1:14PM by PIB Hyderabad

వికసిత భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ – జీ రామ్ జీ) – 2025 బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని కార్మికులుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందిస్తుంది. వికసిత్ భారత్ @2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా ఒక గ్రామీణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించడానికి ఇది ప్రయత్నిస్తుంది. తద్వారా సంపన్నమైన, సమర్థమైన గ్రామీణ భారత్ కోసం సాధికారత, వృద్ధి, సమన్వయం, పరిపూర్ణతలను ప్రోత్సహిస్తుంది.

ఈ కీలక చట్టం భవిష్యత్తుకు సిద్ధంగా, సమ్మిళితంగా నడిచే, సంతృప్తి-ఆధారిత గ్రామీణాభివృద్ధి నిర్మాణం లక్ష్యంగా రూపొందించినది. ఇది వికసిత్ భారత్ @2047 దార్శనికతకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తుంది. తద్వారా పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తుంది. వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్‌తో సమగ్ర పరిచిన వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను ప్రాథమిక ఆధారంగా ఉపయోగిస్తూ ఏకీకృత ప్రణాళిక ప్రక్రియ ద్వారా అన్ని సంబంధిత పథకాలను సంస్థాగతీకరించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సాంకేతికత ఆధారిత నిర్మాణంతో పాటు చట్టపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలకు అనుగుణంగా అమలవుతూ బలమైన పారదర్శక, జవాబుదారీ విధానాలను ఈ బిల్లు అందిస్తుంది.
వికసిత భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ – జీ రామ్ జీ) – 2025 బిల్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని కార్మికులుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందిస్తుంది
ఈ బిల్లు కింద చేపట్టే అన్ని పనులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్‌లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజాసంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికను రూపొందిస్తారు. నీటి సంబంధిత పనులు, ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ ఘటనల ప్రభావాన్ని తగ్గించడం, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. ఈ విధానం దేశవ్యాప్తంగా ఉత్పాదక, మన్నికైన, సమర్థమైన, పరివర్తనాత్మక గ్రామీణ ఆస్తుల ఏర్పాటును నిర్ధారిస్తుంది.
ఈ బిల్లు కింద ఉన్న అన్ని పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీపీల) ద్వారా గుర్తిస్తారు. ఇవి అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభించే, సమ్మిళిత-ఆధారితమైన, సంతృప్తి-ఆధారితమైన పనులు. ఈ ప్రణాళికలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమీకృతం చేస్తారు. విభిన్న రంగాల ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఏకీకృత, పూర్తి ప్రభుత్వ ఆధారిత గ్రామీణాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు. సమన్వయంతో కూడిన, సమర్థమైన ప్రణాళిక కోసం ప్రాదేశిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పీఎమ్ గతిశక్తితో సమీకృతం చేయడం ద్వారా వీజీపీపీలను రూపొందిస్తారు.
పంటలు విత్తే, కోతల కాలంలో వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉండేలా చూడటం కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల వరకు కాల వ్యవధులను ముందుగానే నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తారు. ఈ కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులూ చేపట్టరు.
చట్టాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన 6 నెలల లోపు, ఈ బిల్లులో ప్రతిపాదించిన హామీని ఆచరణలోకి తీసుకురావడానికి ఒక పథకాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం (సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్..సీఎస్ఎస్)గా పనిచేస్తుంది. దీనిలో నిధుల వాటా నమూనా ఈశాన్య ప్రాంత, హిమాలయ ప్రాంత రాష్ట్రాల విషయంలో అయితే 90:10 నిష్పత్తిలో, ఇతర రాష్ట్రాలన్నింటి విషయంలో అయితే 60:40 నిష్పత్తిలో ఉంటుంది.
నిధుల న్యాయబద్ధ పంపిణీనీ, సమ్మిళిత అభివృద్ధినీ ప్రోత్సహించడానికి నిర్దేశిత ప్రమాణాల వారీగా రాష్ట్రాలకు నియమబద్ధ కేటాయింపులు ఉండాలని బిల్లులో పేర్కొన్నారు. జిల్లాలకూ, గ్రామ పంచాయతీలకూ అవసరాల్ని బట్టి నిధుల పంపిణీ పారదర్శకంగా సాగేటట్లు చూసే బాధ్యత రాష్ట్రాలది. ఆయా పంచాయతీల కేటగిరీనీ, స్థానిక అభివృద్ధి అవసరాల్నీ రాష్ట్రాలు లెక్క లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ధర్మబద్ధతనీ, పారదర్శకత్వాన్నీ, జవాబుదారీతనాన్నీ పటిష్ఠపరచడానికి ఈ ఏర్పాటును చేశారు.
డిజిటల్ సార్వజనిక స్వరూపం ఆధారంగా రూపొందించిన ఒక సమగ్ర పరిపాలన అనుబంధ విస్తారిత వ్యవస్థను తప్పక ఏర్పాటు చేయాలని బిల్లు ఆదేశిస్తోంది. ఈ వ్యవస్థలో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, స్పేటియల్ టెక్నాలజీ ఆధారిత ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షణ, మొబైల్ ఆధారిత నివేదికల సమర్పణ, రియల్-టైమ్ డ్యాష్‌బోర్డులు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విశ్లేషణలు, సామాజిక ఆడిట్ యంత్రాంగ పటిష్ఠీకరణ కలిసి ఉంటాయి. ఇవన్నీ పారదర్శక, సమర్థ, పక్కా అమలుకు మార్గాన్ని సుగమం చేయగలుగుతాయి.
హాజరు పట్టీలు, పనులు, చెల్లింపులు, ఇబ్బందులు వగైరా ఏయే స్థాయులలో ఉన్నదీ తెలియజేయడానికి గ్రామ పంచాయతీ భవన్లలో ప్రతి వారం సమాచార వెల్లడికి సంబంధించిన సమావేశాల్ని గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా, వారం వారీ సమాచార ప్రకటనలను ఆటోమేటిగ్గా రూపొందించడంతో పాటు, వాటిని అందరూ చూసుకోవడానికి వీలుగానూ, డిజిటల్ ఫార్మేట్లోనూ ప్రదర్శిస్తారు.
ఈ బిల్లులో భాగంగా, వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. అలా అధికారిక ప్రకటన వచ్చేటంత వరకు, ఇప్పుడున్న ఎంజీఎన్‌ఆర్ఈజీఏ వేతన రేట్లే అమలవుతుంటాయి. 15 రోజుల లోపల ఉపాధిని కల్పించకపోయినట్లయితే, నిర్ణీత రేట్లలో నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది.
నేపథ్యం: గ్రామీణ భారతంలో మార్పులు
గడచిన ఇరవై సంవత్సరాల్లో, భారత్‌లోని గ్రామాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ప్రధాన పథకాల ప్రయోజనాలు అందరికీ అందేటట్లు చూస్తున్నారు. గ్రామాలకు సంధానాన్నీ, గృహనిర్మాణాన్నీ, తాగునీటినీ, పారిశుద్ధ్యాన్నీ, విద్యుదీకరణనీ, మెరుగైన డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ఆర్థిక సేవల్ని చాలా మంది చెంతకు చేర్చడం, గ్రామీణుల శ్రమశక్తిని వివిధ పనులకు వినియోగించుకోవడం, వారిలో మెరుగైన ఆదాయార్జనకు సంబంధించిన తపన నానాటికీ పెరుగుతూ ఉండటం, సత్ఫలితాల్ని అందిస్తున్న మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులను చాలా వరకు తట్టుకోగలుగుతుండడం వంటివి ఈ మార్పుల్లో కొన్ని మాత్రమే. ఈ పరిణామాలన్నీ మారుతున్న ఆకాంక్షలకు తులతూగే, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొనే, కేంద్ర, రాష్ట్ర, స్థానిక పథకాల ప్రయోజనాలను మేళవించే ఒక మార్పుచేర్పులకు వీలున్న విధానాన్ని ఆచరించాలని సూచిస్తున్నాయి.
మారుతున్న ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వ వివిధ పథకాల ప్రయోజనాలను కలిపి ఒకే సంపూర్ణ ప్రణాళికను గ్రామీణాభివృద్ధి దృష్టితో ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.  దేనికి దానికి విడివిడిగా కేటాయింపులు జరిపే పద్ధతిని అనుసరించడం కన్నా, పొందికైన రాబోయే కాలానికి తగినట్లు ఉండే విధానాన్ని అవలంబించి గ్రామ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని తీర్చిదిద్దడం ప్రభావవంతంగా ఉంటుంది. అసమానతలను తగ్గించి, నిష్పాక్షికంగా వనరులను పంపిణీ చేయడంతో పాటు నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా దేశ గ్రామీణ ప్రాంతాలన్నింటిలో సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం కూడా ముఖ్యం.
దేశాభివృద్ధి వేగాన్ని అందుకుంటున్న కొద్దీ, మారుతున్న అవసరాలనూ, ప్రజల ఆకాంక్షలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాల్సి ఉంటుంది.  శరవేగంగా మార్పు చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో, 2047 కల్లా వికసిత్ భారత్‌‌ను సాధించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి గ్రామీణాభివృద్ధి విషయంలో ఒక పరివర్తన ప్రధాన వైఖరిని అవలంబించక తప్పదు. అభివృద్ధి ప్రధాన కార్యక్రమాల స్థాయిని విస్తరించే క్రమంలో, గ్రామీణ ప్రాంతాల నివాసులకు అదనపు ఉపాధి అవకాశాలనూ కల్పించవచ్చును. వికసిత్ భారత్ లక్ష్యసాధనకు గ్రామీణ శ్రమశక్తి అండదండలను తీసుకొని తీరాలి. ఈ కారణంగా, ప్రభుత్వం గ్రామీణ కుటుంబాలకు వేతనాధారిత ఉపాధి హామీని ఒక్కో ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల స్థాయి నుంచి 125 రోజులకు పెంచాలని సంకల్పించింది. ఒక సముచిత చట్టాన్ని తీసుకు రావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పనకు ఊతాన్ని అందించాలన్నది దీనిలోని ఉద్దేశం.

 

***


(रिलीज़ आईडी: 2204930) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil , Telugu , Kannada