ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 28 జనవరి 2023న ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ ర్యాలీలో చేసిన ప్రసంగం.

प्रविष्टि तिथि: 28 JAN 2023 9:48PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అజయ్ భట్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ, అలాగే నా ప్రియమైన యువ స్నేహితులందరికీ నమస్కారాలు!

ఎన్‌సీసీ తన 75వ వార్షికోత్సవాన్ని దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేడుకలతో కలిసి నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఎన్‌సీసీకి ప్రాతినిధ్యం వహించి దేశాభివృద్ధికి తోడ్పడిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నా ముందున్న ఎన్‌సీసీ క్యాడెట్లు మరింత ప్రత్యేకమైనవారు. ఈరోజు కార్యక్రమం రూపొందించిన విధానం చూస్తుంటే కాలం మాత్రమే కాదు, దాని స్వరూపం కూడా మారిపోయిందని తెలుస్తోంది. గతంలో కంటే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇది వైవిధ్యభరితంగా ఉండటంతో పాటు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' అనే ప్రాథమిక సూత్రాన్ని భారతదేశంలోని ప్రతి మూలకు విస్తరింపజేయడంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్‌సీసీ మొత్తం బృందానికి, దాని అధికారులు, నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎన్‌సీసీ క్యాడెట్లుగా, దేశ యువతగా 'అమృత్' తరానికి ప్రతినిధులుగా నిలుస్తున్నారు. ఈ 'అమృత్' తరం రాబోయే 25 సంవత్సరాలలో దేశాన్ని నూతన శిఖరాలకు చేరుస్తుంది, భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతుంది.

స్నేహితులారా,

ఇప్పుడే, దేశాభివృద్ధిలో ఎన్‌సీసీ పాత్రను, మీరు చేస్తున్న అభినందనీయమైన కృషిని మేము చూశాము. మీ తోటివారిలో ఒకరు నాకు ఐక్యతా జ్యోతిని అందజేశారు. మీరు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 60 రోజుల్లో, ప్రతిరోజూ 50 కిలోమీటర్లు పరిగెత్తుతూ ఈ యాత్రను పూర్తి చేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి చాలామంది సహచరులు ఈ ఐక్యతా జ్యోతి పరుగులో పాల్గొన్నారు. మీరు నిజంగా ప్రశంసనీయమైన, స్ఫూర్తిదాయకమైన పని చేశారు. ఇక్కడ ఒక ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, మీ నైపుణ్యాన్ని, శ్రద్ధను ప్రదర్శించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

స్నేహితులారా,

మీరు గణతంత్ర దినోత్సవ కవాతులో కూడా పాల్గొన్నారు. ఈ కవాతు ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మొదటిసారిగా కర్తవ్య పథ్‌లో జరిగింది. అంతేకాకుండా, ఢిల్లీలో ఈ రోజుల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీలో చాలా మందికి ఈ వాతావరణం అలవాటు ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలను సందర్శించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీకు సమయం దొరుకుతుందా? మీరు నేషనల్ వార్ మెమోరియల్, పోలీస్ మెమోరియల్‌ను సందర్శించకపోతే, తప్పకుండా వెళ్ళండి. అలాగే, మీరు ఎర్రకోటలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను కూడా చూడాలి. స్వాతంత్ర్య భారతదేశంలోని ప్రధానమంత్రులందరినీ పరిచయం చేయడానికి ఒక ఆధునిక పీఎం-మ్యూజియం కూడా నిర్మించారు. గత 75 సంవత్సరాల్లో దేశాభివృద్ధి ప్రయాణం గురించి మీరు తెలుసుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్‌ల అద్భుతమైన మ్యూజియంలను కూడా మీరు సందర్శించవచ్చు. ఇక్కడ చూడదగినవి చాలా ఉన్నాయి. బహుశా ఈ ప్రదేశాలు మీకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించి, మీరు దృఢమైన లక్ష్యాలతో నిరంతరం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి.

యువ మిత్రులారా,

ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన శక్తి యువత. మీ వయస్సులో ఉత్సాహం, అభిరుచి ఉట్టిపడుతాయి. మీలో ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలలు నిర్ణయాలుగా మారినప్పుడు, వాటిని నెరవేర్చుకోవాలనే కృతనిశ్చయం ఉంటే, మీరు విజయం సాధిస్తారు. ఇది భారతీయ యువతకు సరికొత్త అవకాశాల సమయం. భారతదేశ సమయం వచ్చిందని అందరూ చెబుతున్నారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోంది. దీనికి అతిపెద్ద కారణం దేశంలోని యువత. ఈ రోజు నేను భారతదేశ యువత ఎంత అవగాహనతో ఉన్నారో ఒక ఉదాహరణతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రపంచంలోని 20 బలమైన ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన జీ20కి ఈ సంవత్సరం భారతదేశం అధ్యక్షత వహిస్తుందని మీకు తెలుసు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది యువత ఈ విషయంపై నాకు లేఖలు రాశారని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. మీలాంటి యువతే దేశ విజయాలు, ప్రాధాన్యతల పట్ల చూపిస్తున్న ఆసక్తిని చూడటం నిజంగా గర్వంగా ఉంది.

స్నేహితులారా,

ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఉత్సాహంతో, అభిరుచితో ఉప్పొంగుతున్న యువతపై ప్రభుత్వం ఎప్పుడూ దృష్టి సారిస్తుంది. నేటి భారతదేశం కూడా మీ కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడే వేదికను అందించడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశంలో యువత కోసం కొత్త రంగాలు తెరుచుకుంటున్నాయి. డిజిటల్ విప్లవం, స్టార్టప్ విప్లవం లేదా ఆవిష్కరణల విప్లవం ఏదైనా కావచ్చు, యువత దీని ద్వారానే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశంలోని యువతకు రక్షణ రంగంలో భారతదేశం నిరంతరం సంస్కరణలు చేపడుతున్న విధానం కూడా ప్రయోజనకరంగా ఉంది. ఒకప్పుడు మనం రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. నేడు సైన్యానికి అవసరమైన వందలాది వస్తువులను భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. సరిహద్దు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కూడా మనం కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ భారత యువతకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టాయి.

స్నేహితులారా,

యువతపై నమ్మకం ఉంచితే వచ్చే ఫలితాలకు మన అంతరిక్ష రంగం ఒక మంచి ఉదాహరణ. దేశం యువ ప్రతిభావంతుల కోసం అంతరిక్ష రంగంలో అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా, మొదటి ప్రైవేటు ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించబోతున్నారు. అదే విధంగా, యానిమేషన్, గేమింగ్ రంగం కూడా తెలివైన యువతకు అనేక అవకాశాలను కల్పిస్తోంది. మీరు స్వయంగా డ్రోన్‌ను ఉపయోగించి ఉండవచ్చు లేదా ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు చూసి ఉండవచ్చు. ప్రస్తుతం డ్రోన్‌ల వినియోగం కూడా నిరంతరం పెరుగుతోంది. వినోదం, రవాణా, వ్యవసాయం ఇలా ఏ రంగానికైనా డ్రోన్ సాంకేతికత అందుబాటులో ఉంది. నేడు దేశంలోని యువత భారతదేశంలోనే అన్ని రకాల డ్రోన్‌లను తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు.

స్నేహితులారా,

చాలా మంది యువతీయువకులు మన భద్రతా సంస్థల్లో చేరాలని ఆశిస్తున్నారని నేను గ్రహించాను. ఇది మీకు ఒక గొప్ప అవకాశం, ముఖ్యంగా మన అమ్మాయిలకు మరింతగా ఉపయోగపడుతుంది. గత ఎనిమిది సంవత్సరాలలో పోలీసు పారామిలిటరీ దళాలలో మహిళల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. మూడు సైనిక విభాగాల్లో మహిళలను ముందుండి నడిపించడానికి అనుమతి లభించింది. ఈ రోజు మహిళలు మొదటిసారిగా అగ్నివీర్‌లుగా భారత నావికాదళంలో చేరారు. మహిళలు సాయుధ బలగాల్లో పోరాట పాత్రల్లో కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. మొదటి మహిళా క్యాడెట్ల శిక్షణ ఎన్డీయే పుణెలో ప్రారంభమైంది. మన ప్రభుత్వం సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. ఈ రోజు దాదాపు 1500 మంది బాలికా విద్యార్థులు సైనిక్ పాఠశాలల్లో చదువుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎన్‌సీసీలో కూడా మార్పులు వస్తున్నాయి. గత దశాబ్దంగా ఎన్‌సీసీలో బాలికల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఇక్కడ జరిగిన కవాతుకు కూడా ఒక అమ్మాయి నాయకత్వం వహించింది. చాలా మంది యువకులు సరిహద్దు, తీర ప్రాంతాల్లో ఎన్‌సీసీని విస్తరించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు, సరిహద్దు, తీర ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది క్యాడెట్లు నమోదు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో యువశక్తి దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఎలాంటి లక్ష్యమైనా అసాధ్యం కాదని నేను విశ్వాసంగా చెప్పగలను. దేశ లక్ష్యాలను సాధించడంలో మీరు సంస్థాగతంగా, వ్యక్తిగతంగా మీ పాత్రను మరింత విస్తరిస్తారని నేను నమ్ముతున్నాను.

భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ఎంతోమంది త్యాగాల మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే స్వతంత్ర భారతదేశంలో ప్రతి క్షణం దేశం కోసం జీవించడం ప్రపంచంలో దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చే ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఆదర్శాల్లో కూడా లోపాలను వెతుకుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక సమస్యల ముసుగులో దేశ ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి దుష్ట ప్రయత్నాలు ఎన్ని చేసినా భారతీయుల మధ్య ఎప్పటికీ విబేధాలు రావు. ఐక్యత అనే మంత్రం గొప్ప మందు, గొప్ప శక్తి. ఈ ఐక్యతా మంత్రమే భారతదేశ భవిష్యత్తు కోసం  సంకల్పం, సామర్థ్యం, వైభవం పొందే ఏకైక మార్గం. మనం ఆ మార్గాన్ని అనుసరించాలి ఆ మార్గంలోని అడ్డంకులతో పోరాడాలి. దేశం కోసం జీవించడం ద్వారా మన కళ్ళ ముందు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలి. గొప్ప భారతదేశాన్ని చూడాలనే దానికంటే చిన్న సంకల్పం ఉండకూడదు. ఈ సంకల్పం నెరవేరడానికి మీ అందరికీ నా శుభాకాంక్షలు. రాబోయే 25 సంవత్సరాల కాలం భారతదేశానికి అమృత కాలం, ఇది మీ అమృత కాలం కూడా. 2047లో దేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయంలో మీరు దేశానికి మార్గదర్శకులుగా ఉంటారు. స్నేహితులారా, 25 సంవత్సరాల తర్వాత మీరు ఏ స్థానంలో ఉంటారో ఊహించుకోండి. కాబట్టి మనం ఒక్క క్షణాన్నీ, ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. మాతృభూమిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. మీ అందరికీ నా శుభాకాంక్షలు. నాతో గట్టిగా చెప్పండి - భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై!

వందేమాతరం, వందేమాతరం!
వందే మాతరం, వందే మాతరం!
వందేమాతరం, వందేమాతరం!
వందేమాతరం, వందేమాతరం!

ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2204527) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam