ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇటలీ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

प्रविष्टि तिथि: 02 MAR 2023 2:53PM by PIB Hyderabad

గౌరవ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ గారూ,

ఇరు దేశాల ప్రతినిధులూ,

మీడియా మిత్రులూ...

నమస్కారం!

తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న గౌరవ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకీ, తన ప్రతినిధి బృందానికీ హృదయపూర్వక స్వాగతం. ఇటలీకి ఆమె తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాదు.. ఆ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా. గతేడాది నిర్వహించిన ఎన్నికల్లో ఇటలీ ప్రజలు ఆమెను ఎన్నుకున్నారు. ఈ చరిత్రాత్మక విజయం సాధించిన ఆమెకు భారతీయులందరి తరఫునా అభినందనలు, శుభాకాంక్షలు. ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల అనంతరం బాలీలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సులో మేం మొదటిసారి సమావేశమయ్యాం.

మిత్రులారా,

ఈ రోజు మా చర్చలు చాలా ఉపయోగకరంగా, అర్థవంతంగా సాగాయి. భారత్ - ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు ఈ సంవత్సరంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. భారత్ - ఇటలీ భాగస్వామ్యానికి వ్యూహాత్మక భాగస్వామ్య హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా మేం నిర్ణయించాం. ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మేం ప్రధానంగా దృష్టి సారించాం. మన ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ ప్రచారాలు భారత్‌లో పెట్టుబడుల దిశగా అనేక అవకాశాలను సృష్టిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, సెమీకండక్టర్లు, టెలికాంఅంతరిక్షం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. భారత్ - ఇటలీ మధ్య ఒక అంకుర సంస్థల అనుసంధాన వ్యవస్థ (స్టార్టప్ బ్రిడ్జి) ఏర్పాటును ఈ రోజు మేం ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

మిత్రులారా,

రక్షణ సహకార రంగంలోనూ ఇరుదేశాలు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి. దేశంలో రక్షణ తయారీ రంగంలో ఉత్పత్తిపరంగానూ, నిర్మాణపరంగానూ కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఇది ఇరుదేశాలకు ప్రయోజనకరం. రెండు దేశాల సాయుధ దళాల మధ్య క్రమం తప్పకుండా ఉమ్మడి విన్యాసాలతోపాటు శిక్షణ కోర్సులను నిర్వహించాలని కూడా మేం నిర్ణయించాం. ఉగ్రవాదమూ, వేర్పాటువాదాలపై పోరులో భారత్, ఇటలీ భుజం భుజం కలిపి నడుస్తున్నాయి. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమెలా అన్న అంశంపైనా మేం వివరంగా చర్చించాం.

మిత్రులారా,

భారత్, ఇటలీ మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, ప్రజా సంబంధాలున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ సంబంధాలకు కొత్త రూపాన్ని, నవోత్తేజాన్ని ఇవ్వడంపై మేం చర్చించాం. వలసలు, రాకపోకలకు సంబంధించి భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యముంది. ఈ ఒప్పందం త్వరితగతిన ఖరారైతే మన ప్రజా సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. రెండు దేశాల ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతపైనా మేం ప్రధానంగా చర్చించాం. భారత్ - ఇటలీ మధ్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మేం నిర్ణయించాం. దీనిద్వారా ఇరుదేశాల వైవిధ్యంచరిత్రవిజ్ఞాన శాస్త్ర - సాంకేతికతలుఆవిష్కరణలుక్రీడలు, విజయాలను అంతర్జాతీయ వేదికపై మనం చాటగలం.

మిత్రులారా,

కోవిడ్ విపత్తు, ఉక్రెయిన్ సంఘర్షణ వల్ల ఏర్పడ్డ ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాలు అన్ని దేశాలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇవి బాగా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ అంశంపై ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కృషి ఆవశ్యకతపైనా ప్రధానంగా చర్చించాం. జీ20కి భారత్ అధ్యక్ష బాధ్యతలో ఉన్న సమయంలో ఈ అంశానికీ మేం ప్రాధాన్యమిస్తున్నాం. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. చర్చలుదౌత్యం ద్వారానే ఈ వివాదాన్ని పరిష్కరించగలమని, ఏ శాంతి ప్రక్రియకైనా సహకరించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టంగా చెప్పింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇటలీ క్రియాశీల భాగస్వామ్యాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం. ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమంలో భాగమయ్యేలా ఇటలీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మన సహకారాన్ని పెంపొందించుకునేలా నిర్దిష్ట అంశాలను గుర్తించేందుకు ఇది మనకు వీలు కల్పిస్తుంది. అంతర్జాతీయ వాస్తవాలను మెరుగైన రీతిలో ప్రతిబింబించేందుకు బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు ఆవశ్యకం. ఈ అంశంపైనా మేం చర్చించాం.

ఆర్యా,

ఈ సాయంత్రం రైజినా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా మీరు హాజరు కాబోతున్నారు. అక్కడ మీ ప్రసంగాన్ని వినేందుకు మేమందరం ఎదురుచూస్తున్నాం. భారత్‌లో పర్యటించి, ఫలప్రదంగా చర్చలు నిర్వహించిన మీకు, మీ ప్రతినిధి బృందానికి చాలా ధన్యవాదాలు.

గమనికఇది ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించు అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2204222) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam