లోక్‌సభ సచివాలయం
పార్లమెంట్ భవన సముదాయంలో అమరవీరులకు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు
జాతి ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలనే మన సమిష్టి నిబద్ధత కేవలం ఒక అధికారిక ప్రకటన మాత్రమే కాదు.. ఎలాంటి ఉగ్రవాద కుట్రలకు భారత్ తలవంచదని చెప్పే బలమైన సందేశం కూడా: లోక్‌సభ స్పీకర్
प्रविष्टि तिथि:
13 DEC 2025 2:03PM by PIB Hyderabad
2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి వార్షిక సందర్భాన్ని పురస్కరించుకుని.. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థను రక్షించే ప్రయత్నంలో తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందికి, ఉద్యోగులకు భారత్ నేడు నివాళులర్పించింది.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రముఖులు అమరవీరులకు నివాళులర్పించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్ఫల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ సీపీ మోదీ, అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు.
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేడు ఉదయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పంచుకున్నారు.
“2001 సంవత్సరంలో భారత పార్లమెంటుపై జరిగిన పిరికి ఉగ్రవాద దాడిలో అమరవీరులైన మన ధైర్యవంతులైన భద్రతా సిబ్బంది, ఉద్యోగుల అత్యున్నత త్యాగానికి నివాళులు.
ప్రజాస్వామ్య అత్యున్నత సంస్థ అయిన మన పార్లమెంటును రక్షిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు వందనాలు. దేశం పట్ల వారి అసమానమైన అంకితభావం నిరంతరం స్ఫూర్తిదాయకం.
ఉగ్రవాదులను ఎదుర్కొన్న ఆ అమరవీరుల శౌర్యం, విధి నిర్వహణపై వారి నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు, దేశ రక్షణ పట్ల భారత అజేయ సంకల్పానికి ప్రతీక. ఉగ్రవాదానికి భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకంగా నిలబడింది. జాతి ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలనే మన సమష్టి నిబద్ధత కేవలం ఒక అధికారిక ప్రకటన మాత్రమే కాదు, ఉగ్రవాద దురుద్దేశాల ముందు భారత్ ఎప్పటికీ తలవంచదు అనే బలమైన సందేశం కూడా.
ఈ సాటిలేని త్యాగం మన భవిష్యత్తు తరాలకు ధైర్యం, నిస్వార్థం, విధి నిర్వహణ పట్ల అంకితభావానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’.
2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిని తిప్పికొట్టే క్రమంలో రాజ్యసభ సచివాలయ భద్రతా సహాయకులు శ్రీ జగదీష్ ప్రసాద్ యాదవ్, శ్రీ మత్బర్ సింగ్ నేగి, కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ శ్రీమతి కమలేష్ కుమారి, ఢిల్లీ పోలీసు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు శ్రీ నానక్ చంద్, శ్రీ రామ్‌పాల్, ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు శ్రీ ఓం ప్రకాష్, శ్రీ బిజేందర్ సింగ్, శ్రీ ఘన్‌శ్యామ్, కేంద్ర ప్రజా పనుల విభాగానికి చెందిన తోటమాలి శ్రీ దేశ్‌రాజ్ వీరమరణం పొందారు.
వారి ధైర్యసాహసాలను గుర్తిస్తూ.. శ్రీ జగదీష్ ప్రసాద్ యాదవ్, శ్రీ మత్బర్ సింగ్ నేగి, శ్రీమతి కమలేష్ కుమారీలకు మరణానంతరం అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. అదే విధంగా శ్రీ నానక్ చంద్, శ్రీ రాంపాల్, శ్రీ ఓం ప్రకాష్, శ్రీ బిజేందర్ సింగ్, శ్రీ ఘన్‌శ్యామ్‌లకు మరణానంతరం కీర్తి చక్ర అవార్డును ప్రదానం చేశారు.
(रिलीज़ आईडी: 2203626)
आगंतुक पटल : 5