హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
2026 మార్చి 31 నాటికి బస్తర్ సహా యావత్తు భారత్ నుంచి నక్సలిజం అంతం
రాబోయే 5 సంవత్సరాల్లో బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్‌గా మారుతుంది
2026 బస్తర్ ఒలింపిక్స్ నక్సల్ రహిత బస్తర్‌లో జరుగుతాయి
నక్సలిజాన్ని వదిలివేసి 2025 బస్తర్ ఒలింపిక్స్‌లో 700 మందికి పైగా యువత పాల్గొనడం మనందరికీ గర్వకారణం
లొంగిపోయిన వారు భయం కంటే ఆశను, విధ్వంసం కంటే అభివృద్ధిని ఎంచుకున్నారు.. ఇది మోదీ కలలుగన్న అభివృద్ధి చెందిన బస్తర్
ఒకప్పుడు 'లాల్ సలాం' నినాదాలు వినిపించిన బస్తర్‌లో, ఇప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు మారుమోగుతున్నాయి
శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.కాబట్టి నక్సలైట్లు తమ ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలి. పునరావాస విధాన ప్రయోజనాలను పొందాలి
రాబోయే కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌లో బస్తర్ ఆటగాళ్లు దేశానికి కీర్తిని తీసుకువచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి
2025 బస్తర్ ఒలింపిక్స్‌లో 3,91,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది రెండున్నర రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. పెరిగిన క్రీడాకారుల భాగస్వామ్యంలో మహిళలు పురుషులను అధిగమించారు
లొంగిపోయిన వారికి, నక్సల్స్ హింసకు గురైన వారికి మేం చాలా ఆకర్షణీయమైన పునరావాస పథకాలను తీసుకువస్తాం
అభివృద్ధి చెందిన బస్తర్‌ను నిర్మించేందుకు కేంద్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి
సాయుధ నక్సలైట్లను ఒప్పించి, వారిని తిరిగి సమాజంలోకి తీసుకురావడంలో సహాయం చేయాలని సమాజ నాయకులకు, సామాజిక కార్యకర్తలకు కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి
प्रविष्टि तिथि:
13 DEC 2025 5:35PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో నేడు జరిగిన బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. 2026 మార్చి 31లోగా దేశం మొత్తంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తొలగించాలని సంకల్పించినట్లు తెలిపారు. నేడు బస్తర్ ఒలింపిక్స్లో దానిని సాధించే దిశగా ఉన్నామని అన్నారు. వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్లో జరిగే బస్తర్ ఒలింపిక్స్ నాటికి చత్తీస్‌గఢ్‌తో సహా దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించి, నక్సల్స్ రహిత బస్తర్ అభివృద్ధి వైపు ముందుకు సాగుతుందని చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మొత్తం బస్తర్‌ను, దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చేందుకు తాము సంకల్పించుకున్నామని శ్రీ అమిత్ షా అన్నారు. ఇక్కడితో ఆగకూడదని, కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ అనే ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ ను డిసెంబర్ 2030 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్‌గా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. బస్తర్‌లోని ప్రతి వ్యక్తికి ఇల్లు, విద్యుత్, మరుగుదొడ్డి, కుళాయి ద్వారా తాగునీరు, గ్యాస్ సిలిండర్, 5 కిలోల ఆహార ధాన్యాలు, 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. రాబోయే అయిదు సంవత్సరాలలో బస్తర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్‌గా మార్చేందుకు తాము సంకల్పించుకున్నామని శ్రీ షా అన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, శ్రీ విష్ణు దేవ్ సాయి నాయత్వంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అభివృద్ధి చెందిన బస్తర్‌ను తయారు చేయడంలో ముందుకు సాగడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.
బస్తర్‌లోని ప్రతి గ్రామానికి రోడ్లు, విద్యుత్తు సౌకర్యం.. 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం సహకార సంఘాల ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బస్తర్‌లోని ఏడు జిల్లాలన్నీ ఇతర గిరిజన జిల్లాలలోకెల్లా అత్యధిక పాల ఉత్పత్తిని సాధించే జిల్లాలుగా మారుతాయని, పాడి పరిశ్రమ ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటాయని అన్నారు. బస్తర్‌లో కొత్త పరిశ్రమలను కూడా స్థాపిస్తామని, ఉన్నత విద్య కోసం ఏర్పాట్లు చేస్తామని, దేశంలోనే అత్యుత్తమ క్రీడా సముదాయం, అత్యాధునిక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని కూడా అమలు చేస్తామని శ్రీ షా తెలిపారు. లొంగిపోయిన వారికి, నక్సలిజం కారణంగా గాయపడిన వారికి ఆకర్షణీయమైన పునరావాస విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధిపై నక్సలైట్లు పడగ విప్పిన నాగుపాములా కాచుకుని కూర్చున్నారని అందుకే నక్సలిజాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని హోం మంత్రి అన్నారు. మావోయిస్టుల అంతంతో ఈ ప్రాంతంలో కొత్త అభివృద్ధి ప్రారంభం అవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ విష్ణు దేవ్ నాయకత్వంలో ఇది అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందని ఆయన అన్నారు.
బస్తర్ ఒలింపిక్స్-2025లో ఏడు జిల్లాల నుంచి ఏడు జట్లు, లొంగిపోయిన నక్సలైట్ల నుంచి ఒక జట్టు పాల్గొన్నాయని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ క్రీడల్లో 700 మందికి పైగా లొంగిపోయిన నక్సలైట్లు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నక్సలిజం మోసానికి గురై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. 700 మందికి పైగా యువత ఆయుధాలను వదిలివేసి ప్రధాన స్రవంతిలో చేరి నేడు క్రీడా మార్గంలోకి వచ్చారని ఆయన అన్నారు. 2026 మార్చి 31 నాటికి ఈ దేశం నక్సలిజం రహితంగా మారుతుందని శ్రీ షా పునరుద్ఘాటించారు. హింసలో పాల్గొన్న నక్సలైట్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తూ.. ఇప్పటికీ దారి తప్పి ఆయుధాలు చేతబూని కూర్చున్న వారు, ఆయుధాలు వదిలివేసి, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సంక్షేమం గురించి, వారి కుటుంబాల గురించి ఆలోచించి, అభివృద్ధి చెందిన బస్తర్ సంకల్పంలో చేరాలని కోరారు. నక్సలిజం.. ఆయుధాలు పట్టిన వారికి కానీ, గిరిజనులకు కానీ, భద్రతా దళాలకు కానీ ఎవరికీ ప్రయోజనం చేకూర్చదని అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం సుగమం చేయగలదని ఆయన చెప్పారు.
లొంగిపోయిన 700 మంది నక్సలైట్లు ఈ క్రీడల్లో క్రీడాకారులుగా ముందుకు వచ్చి యావత్ దేశానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ క్రీడాకారులు భయం కంటే ఆశను, విభజన కంటే ఐక్యత మార్గాన్ని, విధ్వంసం కంటే అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారతం,అభివృద్ధి చెందిన బస్తర్ దార్శనికత కి నిదర్శనమని అన్నారు. మన బస్తర్ సంస్కృతి ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన సంస్కృతులలో ఒకటని చెప్పారు. అన్ని తెగల ఆహారం, పర్యావరణం, కళ, సంగీత వాయిద్యాలు, నృత్యం, సాంప్రదాయ క్రీడలు ఛత్తీస్‌గఢ్‌కే కాకుండా యావత్తు దేశానికి కూడా అత్యంత గొప్ప వారసత్వమని అన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవల ఒక ఆధునిక రికార్డింగ్ స్టూడియోను నిర్మించడం ద్వారా సాంప్రదాయ పాటలను సంరక్షించడం ప్రారంభించిందని శ్రీ అమిత్ షా అన్నారు. నక్సలిజం అనే ఎర్రటి బీభత్సం నీడలో అంతరించిపోయే దశలో ఉన్న అనేక సాంప్రదాయ పండుగలను కూడా ప్రోత్సహించామని ఆయన చెప్పారు. బస్తర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల బృందం ఇక్కడికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం ద్వారా రాబోయే కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే స్థాయికి బస్తర్ క్రీడాకారులను తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గత సంవత్సరం బస్తర్ ఒలింపిక్స్‌లో 1 లక్ష 65 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం 3 లక్షల 91 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇది దాదాపు 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. అంతేగాక మహిళల భాగస్వామ్యం దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నారు. ఈ ఉత్సాహాన్ని చూసి రాబోయే రోజుల్లో ఖేలో ఇండియా గిరిజన క్రీడలకు ప్రధానమంత్రి శ్రీ మోదీ ఛత్తీస్‌గఢ్‌ను ఎంపిక చేశారని ఆయన తెలిపారు.
బస్తర్ ఇప్పుడు మారుతోందని, భయానికి బదులుగా భవిష్యత్తుకు పర్యాయపదంగా మారిందని కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఒకప్పుడు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించిన చోట నేడు బడి గంటలు మోగుతున్నాయని, రోడ్లు నిర్మించడం ఒకప్పుడు కలగా ఉన్న చోట, ఈ రోజు రైల్వే పట్టాలు,రహదారులు వేస్తున్నారని చెప్పారు. ‘లాల్ సలాం’ నినాదాలు వినిపించే చోట నేడు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు వినిపిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందిన బస్తర్ కోసం మనమందరం దృఢంగా సంకల్పించుకున్నామని ఆయన అన్నారు. ఎన్‌కౌంటర్లలో నక్సలైట్లను చంపాలనే లక్ష్యం భారత ప్రభుత్వానికి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని, అందుకే 2000 మందికి పైగా నక్సలైట్ యువకులు కూడా లొంగిపోయారని చెప్పారు. దీనికి మన గిరిజన నాయకులు కీలక సహకారాన్ని అందించారని, వారి మార్గదర్శకత్వం నక్సలిజం యువకులలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపిందని ఆయన అన్నారు. గిరిజన నాయకులు, సామాజిక కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ.. ఇప్పటికీ ఆయుధాలు చేతబూని తిరుగుతున్న వారిని ఒప్పించి, ప్రధాన స్రవంతిలోకి తిరిగి తీసుకురావాలని హోం మంత్రి కోరారు.
(रिलीज़ आईडी: 2203623)
आगंतुक पटल : 7