సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారానికి వ్యతిరేకంగా పౌరులను బలోపేతం చేయనున్న ఐటీ నిబంధనలు
ఐటీ నిబంధనల ప్రకారం వార్తలు, సమకాలీన విషయాల ప్రచురణకర్తలు నైతిక నియమావళిని పాటించడం తప్పనిసరి
प्रविष्टि तिथि:
12 DEC 2025 2:13PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలో అధికరణ 19 (1) ప్రకారం పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు,తప్పుదోవ పట్టించే సమాచారం పెరుగుతున్న సందర్భాలను గుర్తించిన భారత ప్రభుత్వం వాటిని నియంత్రించడంపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమాచార సాంకేతికత చట్టం 2000 ప్రకారం సమాచార సాంకేతికత (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నియమాలు 2021ను ఫిబ్రవరి 25, 2021 న నోటిఫై చేసింది.
ఈ నియమాల్లో భాగం-III.. వార్తలు, సమకాలీన విషయాల ప్రచురణకర్తలు తప్పనిసరిగా పాటించాల్సిన నైతిక నియమావళి గురించి ప్రధానంగా వివరిస్తుంది. ఇందులో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం 1995 ప్రకారం నిర్దేశించిన కార్యక్రమ నియమావళిని అనుసరించడం, ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 ప్రకారం పత్రికా ప్రవర్తనా నియమాలకు కట్టుబడి ఉండటం ఉంటుంది.
ఐటీ నిబంధనల ప్రకారం నీతి నియమావళికి కట్టుబడి ఉండటానికి మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టింది.
అలాగే ఐటీ నిబంధనలు రెండో భాగంలో యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి మధ్యవర్తులు తమ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు, అసత్యమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నివారించాల్సిన బాధ్యత వాటిపై ఉందని వివరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలను గుర్తించేందుకు నవంబర్ 2019లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఓ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్ సీయూ) ను ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన అధికారులతో వార్తల ప్రామాణికతను నిర్ధారించిన తరువాత సరైన సమాచారాన్ని ఎఫ్ సీయూ తమ సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచురిస్తుంది.
సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు, పోస్టులను నిరోధించడానికి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తుంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతలు వంటి అంశాల్లో ఈ చర్యలు తీసుకుంటుంది.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేడు రాజ్యసభలో డాక్టర్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అందించారు.
(रिलीज़ आईडी: 2203064)
आगंतुक पटल : 7