ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని చోటాఉదయ్‌పూర్‌.. బోడేలీలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం... శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 27 SEP 2023 8:09PM by PIB Hyderabad

భారత్‌ మాతా కీ- జై!

భారత్‌ మాతా కీ- జై!

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, పార్లమెంటులో నా సహచరుడు-బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రులు, పంచాయతీ సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!

మీరందరూ ఎలా ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి... చాలా కాలం తర్వాత నేను బోడేలీకి వచ్చాను. లోగడ ఏడాదికి రెండుమూడు సార్లు ఇక్కడికి వచ్చేవాడిని.. అంతకుముందు సంఘ్‌ కోసం పనిచేసే రోజుల్లో దాదాపు నిత్యం వస్తుండేవాడిని. కొంతకాలం కిందట ‘వైబ్రంట్ గుజరాత్‌’ కార్యక్రమానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీనగర్‌లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. ఇరవయ్యేళ్లు ఎలా గడిచిపోయాయో కదా! ఇవాళ బోడేలీ నుంచి చోటా ఉదయపూర్ వరకు.. ఉమర్‌గావ్‌ నుంచి అంబాజీ దాకా అనేక అభివృద్ధి ప్రాజెక్టుల సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చాను. ఈ విధంగా ఇక్కడి నా గిరిజన సోదరీసోదరులతో మమేకమయ్యే వీలు చిక్కింది. ముఖ్యమంత్రిగారు తన ప్రసంగంలో ప్రస్తావించినట్లుగా, దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలోగల 7500 కుపైగా పంచాయతీలకు ‘వైఫై’ అనుసంధానం పనులు ఈ రోజు పూర్తయ్యాయి. మేమిప్పుడే  ప్రారంభించిన ‘ఇగ్రామ్‌ విశ్వగ్రామ్‌’ కార్యక్రమానికి సంబంధించి ఇదొక దృశ్యం. ఈ గ్రామాల్లో నివసించే లక్షలాది ప్రజలకు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇకపై కొత్త కాదు. ఈ ఊళ్లలోని అమ్మలు, అక్కచెల్లెళ్లు కూడా వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటారు. తమ బిడ్డలు ఎక్కడ పనిచేస్తున్నా, వీడియో మాధ్యమం ద్వారా వారితో సంభాషించగలరు. ఆ మేరకు స్వల్ప వ్యయంతో అద్భుతమైన ఇంటర్నెట్ సేవలు గ్రామాల్లోని నా పెద్దలు, సోదరీసోదరులందరికీ అందుబాటులో ఉంటుంది. మీకు ఈ అద్భుత బహుమతికి ఇస్తూ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నా ప్రియ కుటుంబసభ్యులారా!

నేను చోటా ఉదయ్‌పూర్‌ లేదా బోడేలీ పరిసర ప్రాంతాలకు వస్తే, మోదీ సాహెబ్‌ ఈ జిల్లాను మాకిచ్చారని ఇక్కడి ప్రజలు తరచూ చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కదా? ఎందుకంటే నేనిక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం సుదీర్ఘంగా, ఎంతో కష్టతరంగా ఉండేది. ఆ కష్టం ఎలాంటిదో నాకు బాగా తెలుసు... అందుకే, నేను ప్రభుత్వాన్ని వారి ముంగిటకు చేర్చాను. ఉమర్గావ్‌ నుంచి అంబాజీ వరకూ గిరిజన ప్రాంతంలో అనేక భారీ ప్రణాళికలు, ప్రాజెక్టులను నరేంద్ర భాయ్ ప్రారంభించడం వారెప్పటికీ గుర్తుంచుకుంటారు. వాస్తవానికి నేను ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కాకముందే ఈ నేల, గ్రామాలు, నా గిరిజన కుటుంబాలతో నాకొక ప్రత్యేక బంధం ఏర్పడింది. అంటే- నేను ముఖ్యమంత్రి అయ్యాక కాదు... అంతకుముందు ఎప్పటినుంచో ఉన్నదే. అప్పట్లో నేనిక్కడికి ఓ సాధారణ కార్యకర్తగా వచ్చి చోటా ఉదయపూర్‌ బస్సులో వెళ్లేవాడిని. ఇక్కడ లేలాదాదా పూరింటిలో మకాం వేసేవాడిని.. ఆయనతో కలసి పనిచేసిన చాలామంది ఇవాళ ఇక్కడ ఉండి ఉంటారు. నా కార్యక్రమంలో భాగంగా దాహోద్ నుంచి ఉమర్‌గావ్‌, లిమ్డి, శాంతారాంపూర్, ఝలోద్, దాహోద్, గోద్రా, హలోల్, కలోల్ ప్రాంతాల వెళ్తుండేవాడిని. ఈ విధంగా దాదాపు రోజూ బస్సులో వచ్చి, అందరితో కార్యక్రమాలు నిర్వహించి తిరిగి వెళ్లేవాణ్ని. కాస్త సమయం దొరికితే, భోలేనాథ్‌లోని కయవరోహన్ ఈశ్వర్ ఆలయానికి వెళ్తుంటాను. ఇక నేను మల్సర్ లేదా పోర్గామ్ లేదా పోర్ లేదా నరేశ్వర్‌కి చాలాసార్లు వెళ్లాల్సి వచ్చేది. నరేశ్వర్‌లో స్వామీజీని పలుమార్లు కలిసే అవకాశం నాకు లభించింది. అలాగే చాలా కాలంపాటు భదర్వా పురోగమన పథంలో పాలుపంచుకునే భాగ్యం నాకు దక్కింది. మొత్తంమీద ఈ సువిశాల ప్రాంతంతో నా సంబంధం ఎంతో సన్నిహితమైనది. రాత్రివేళ ఎన్నోసార్లు చాలా గ్రామాల్లో బస చేసేవాడిని. ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం కోసం కొన్నిసార్లు సైకిల్‌మీద, మరికొన్నిసార్లు కాలినడకన, ఇంకొన్ని సందర్భాల్లో బస్సులో ప్రయాణించేవాళ్లం. నాకు ఏ మార్గం అనువైనదైతే అందుకు అనుగుణంగా నా కర్తవ్యం నేను నిర్వర్తించేవాడిని. అందువల్ల ఇక్కడ నా పాత మిత్రులు చాలామందే ఉన్నారు.

ఈ నేపథ్యంలో నేనివాళ శ్రీ సి.ఆర్.పాటిల్, శ్రీ భూపేంద్రభాయ్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇక్కడి జీపులో ప్రయాణిస్తుండగా, చాలామంది పాత పరిచయస్తులు కనిపించారు. చాలా కుటుంబాలతో నాకు సంబంధాలు ఉన్నందున వారి ఇళ్లకు వెళ్తుండేవాడిని కాబట్టి, అనేకమంది నాకు గుర్తున్నారు. చోటా ఉదయ్‌పూర్‌ పరిసర ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతం మొత్తాన్నీ విస్తృతంగా చుట్టివచ్చాను కాబట్టి  ఇక్కడి పరిస్థితులన్నీ నాకు బాగా తెలిసినవే. ముఖ్యమంత్రిగా నేను తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలని నిశ్చయించుకున్నాను. తదనుగుణంగా అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, వివిధ కార్యక్రమాలను అమలు చేశాను. ఆ కృషి ఫలితాలు నేడు క్షేత్రస్థాయిలో మన కళ్లముందున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఓ నలుగురైదుగురు పిల్లల గురించి ప్రస్తావిస్తున్నాను. ఇప్పడు వాళ్లు పెద్దవాళ్లు కావచ్చుగానీ, ఆ రోజుల్లో 2001-2002లో వారు నా వేలు పట్టుకుని పాఠశాలకు వచ్చేవారు. వాళ్లలో కొందరు వైద్యులు కాగా, మరికొందరు ఉపాధ్యాయులయ్యారు. ఆ ‘పిల్లలను’ కలిసే అవకాశం ఇవాళ నాకు లభించింది. ప్రజా సంక్షేమంపై నిబద్ధత, నిజాయితీగల ప్రతి చిన్న ప్రయత్నం సత్ఫలితాలిస్తుంది. ఈ సత్యాన్ని రుజువు చేసే ఉదాహరణలెన్నో నేడు నా ముందున్నాయి. అందుకే, ఈ రోజు నాకెంతో సంతృప్తిగా, ఆనందంగా ఉంది. ఆనాటి పిల్లలు ఇప్పుడెంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తుంటే సంతోషంతో పొంగిపోతున్నాను.

నా ప్రియ కుటుంబసభ్యులారా!

ఈ ప్రాంతంలో ఇప్పుడు మంచి పాఠశాలలు, రహదారులు సమకూరాయి. ఇళ్ల నిర్మాణంలో ప్రజలకు ఎంతో సౌలభ్యం కలిగింది. సురక్షిత మంచినీరు లభిస్తోంది. ఇవన్నీ కీలక ప్రాథమిక సదుపాయాలు... ఎందుకంటే- సామాన్యుల జీవితాల్లో సానుకూల మార్పులు రావడమేగాక పేదల ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేయగలవు. పేదలకు ఇళ్లు, తాగునీరు, రహదారులు, విద్యుత్తు, విద్య తదితర సౌకర్యాలన్నీ కల్పించే దిశగా మేమెప్పుడూ ఉద్యమ తరహాలో కృషికి ప్రాధాన్యమిస్తూ వచ్చాం. పేదల సమస్యలేమిటో నాకు బాగా తెలుసుగనుక వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. కాబట్టే, అత్యంత తక్కువ వ్యవధిలో, గుజరాత్‌లోని నా ప్రియ సోదరీసోదరులు సహా దేశవ్యాప్తంగా పేదల కోసం 4 కోట్లకుపైగా పక్కా ఇళ్లను నిర్మించాం. కానీ, గత ప్రభుత్వాల హయాంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం 100, 200, 500 లేదా 1000కి మాత్రమే పరిమితం. పేదల కోసం ఇళ్లు నిర్మించడమంటే-  కేవలం నాలుగు గోడలు కట్టి, ఓ తలుపు పెట్టించి అదే ఇల్లు అనడం సరికాదు. వారి ఆత్మగౌరవానికి విలువనిచ్చి, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడం. ఆ మేరకు లబ్ధిదారులకు ఎలాంటి ఇల్లు కావాలో నిర్ణయించుకునే అవకాశమిచ్చాం. మేకలు లేదా కోళ్ల పెంపకానికి స్థలం కావాలన్నా సమకూరుతుంది. మీ ఇంటిని మీ సౌకర్యానికి తగినట్లు మార్పుచేర్పులు కూడా చేసుకోవచ్చు. అందుకు ప్రభుత్వమే నిధులిస్తుంది. దళారులకు తావులేదు కాబట్టి, ప్రభుత్వం నుంచి నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ అవుతుంది. మీరు గిరిజనులైనా, దళితులైనా లేక వెనుకబడిన వర్గాల వారైనా, మీ అవసరాలనుగుణంగా ప్రభుత్వం ఇల్లు కేటాయించడమేగాక నిధులిస్తుంది. ఇక ఇలా నిర్మించిన లక్షలాది ఇళ్లను మన అక్కచెల్లెళ్ల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేలా చూస్తున్నాం. అంటే- ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల విలువైన ఆస్తి ఇప్పుడు వారి పేరిట ఉంటుంది. ఆ విధంగా వారు ‘లక్షాధికారి సోదరి’ అవుతున్నారు. నా  పేరు మీద ఇల్లు అనేదే లేకపోయినా, దేశవ్యాప్తంగా లక్షలాది కుమార్తెలకు నేను ఇళ్లు మంజూరు చేశాను.

మిత్రులారా!

గుజరాత్ గ్రామాల్లో నీటి కోసం ఎంత కటకట ఉండేదో అక్కడ నివసించే ప్రజలకు తెలుసు. మన గిరిజన ప్రాంతాల్లో ‘మేం కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నాం... మా నీటి సరఫరా సమస్య తీర్చేదెవరు?’ అని వారు అడిగేవారు. ఈ సంక్షోభాన్ని పరిష్కారం కోసం నీటిని దిగువ నుంచి ఎగువకు తీసుకెళ్లో కష్టతరమైన కార్యాన్ని మేం చేపట్టాం. ఇంటింటికీ నీరందించేందుకు ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినా  ఎంతో శ్రమించాం. దాని ఫలితంగా ఇప్పుడు పైపుల ద్వారా ప్రతి ఇంటికీ నీరందుతోంది. అంతకుముందు చేతిపంపులు వేసినా, మూడు నెలల్లోగా చెడిపోతే మూడేళ్లు గడిచినా మరమ్మతు చేయని రోజులు గతకాలపు జ్ఞాపకంగా మార్చడానికి మేమెంతో కృషి చేశాం. మరోవైపు కొళాయిల ద్వారా అందే నీరు సురక్షితం కాకపోతే అనేక వ్యాధులకు దారితీసి, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలను దెబ్బతీస్తుంది.

మీతో కలసి పనిచేసిన నాటి అనుభవాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కొళాయి ఇప్పుడు నీరు  సరఫరా అవుతోంది. మీ మధ్య మసలుతూ, మీతో భుజం కలిపి పనిచేయడం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను. మీ నుంచి నాకు లభించిన జ్ఞానం, నైపుణ్యం అమూల్యమైనవిగా రుజువయ్యాయి. మీ నుంచి తెలుసుకున్న అనేక అంశాల ప్రాతిపదికగా ప్రజా సమస్యలకు వాసత్వ, శాశ్వత పరిష్కారాలు అన్వేషించగల సామర్థ్యం నాకు అలవడిందని భావిస్తున్నాను. నా మార్గదర్శకులు మీరే... మీతో గడిపిన ఆ కాలపు అనుభవాలే నాకు ఢిల్లీలో నేడెంతో సహాయపడుతున్నాయి.

నాలుగేళ్ల కిందట మేం ‘జల్ జీవన్ మిషన్‌’ను ప్రారంభించాం... అంతకుముందు పరిస్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన తల్లులు, అక్కచెల్లెళ్లు బిందెడు నీటికోసం రోజూ కనీసం రెండుమూడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పైపులైన్లు, కొళాయిల ద్వారా 10 కోట్ల కుటుంబాల వంటింట్లోకి నేరుగా నీరు సరఫరా అవుతోంది. ఇందుకోసం చేసిన కృషి ఫలితంగానే తల్లులు, అక్కచెల్లెళ్ల ఆశీస్సులు నాకు లభిస్తున్నాయి. చోటా ఉదయపూర్‌లోని కవంట్ గ్రామానికి నేను చాలాసార్లు వెళ్లాను. అప్పట్లో గ్రామం ఎంతో వెనుకబడి ఉండేది... ఇటీవల కొందరు నన్ను కలిసినపుడు కవంట్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రగతి గురించి వాకబు చేసినపుడు వారు ఆశ్చర్యపోయారు. అదీ మా సంప్రదాయం.. మా అంకితభావం. కవంట్‌లో ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని పూర్తిగా అమలు చేయడంతో ఆ ప్రాంతంలోని 50,000 కుటుంబాలకు నేడు కొళాయి నీరందుతోంది.

మిత్రులారా!

గుజరాత్ విద్యా రంగం నిరంతర ఆవిష్కరణలు, ప్రయోగాల సుదీర్ఘ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తదనుగుణంగా మేం ప్రారంభించిన ప్రాజెక్టులు అదే క్రమంలో గణనీయ ప్రగతి సాధిస్తున్నాయి. దీనిపై  భూపేంద్రభాయ్‌తోపాటు ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. ‘మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘విద్యా సమీక్ష’ రెండోదశ కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని విద్యా సమీక్ష కేంద్రాలను సందర్శించడానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిని నేను కలిశాను. ఇదే తరహాలో దేశంలోని ప్రతి జిల్లాలో విద్యా సమీక్ష కేంద్రాల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన నన్ను కోరారు. ప్రపంచ బ్యాంకు ఇటువంటి విశిష్ట కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆకాంక్షిస్తున్నది. ఈ కేంద్రాల పరిధిలో చేపడట్టిన “జ్ఞాన శక్తి, జ్ఞాన సేతు, జ్ఞాన సాధన” వంటి కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల్లోని ప్రతిభగల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఫలితంగా మన గిరిజన యువత సమీప భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోగల చక్కని అవకాశాలు లభిస్తాయి.

నా ప్రియ కుటుంబ సభ్యులారా!

రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధిపై రెండు దశాబ్దాలుగా మేం దృష్టి సారించాం. ఇరవయ్యేళ్ల కిందట గుజరాత్‌లో తరగతి గదులు, ఉపాధ్యాయుల సంఖ్య గురించి మీకందరికీ తెలిసిందే. పిల్లలు ప్రాథమిక విద్యను పూర్తి చేయడం కూడా కనాకష్టమయ్యేది. ఎంతోమంది మధ్యలోనే బడి మానేసే దుస్థితి ఉండేది. ఉమర్‌గావ్‌ నుంచి అంబాజీ వరకూ గిరిజన ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణం. ఇప్పటిలాగా ఆనాడు ఈ ప్రాంతాల్లో సైన్స్ కోర్సులు బోధించే పాఠశాలలు లేవు. ఇప్పుడు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్‌ డిమాండ్ చేసే పార్టీలు ఇలాంటి పాఠశాలలు లేకపోవడాన్ని పట్టించుకోకుండా రాజకీయం చేస్తాయి. కానీ, తగినన్ని పాఠశాలలు, ప్రాథమిక సౌకర్యాలు లేని రోజుల్లో భావితరానికి మెరుగైన భవిష్యత్తు దిశగా మేం కృషి చేశాం. దుస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నాల వల్ల రెండు దశాబ్దాల వ్యవధిలో 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మాణం, 2 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టాం. విద్యా రంగంలో సాగిన ఈ కృషి గిరిజన ప్రాంతాలకు గరిష్ఠ ప్రయోజనమిచ్చింది.

ఇటీవల నేను సరిహద్దుల పరిరక్షణలోగల మన సైనికుల వద్దకు వెళ్లాను. నేను వెళ్లిన ప్రతిచోటా  గిరిజన ప్రాంత వ్యక్తి ఒకరు వారిలో ఉన్నారని, సరిహద్దులో దేశ రక్షణకు శ్రమిస్తున్నాడని తెలిసి, ఆశ్చర్యంతోపాటు ఆనందం కూడా కలిగింది. నేను ఏ సరిహద్దు గ్రామానికి వెళ్లినా నన్ను చూడగానే- ‘సర్, మీరు మా గ్రామానికి రావడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది’ అనడం నాకెంతో ఆనందంగా ఉంటుంది. రెండు దశాబ్దాల కాలంలో సైన్స్, వాణిజ్యం లేదా డజన్ల కొద్దీ కొత్త పాఠశాలలు-కళాశాలలు తదితరాల పరంగా ఇక్కడ నెట్‌వర్క్ ఎంతో విస్తరించింది. అలాగే, కొత్త ఆర్ట్స్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 25,000 కొత్త తరగతి గదులు నిర్మించడమే కాకుండా 5 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇక గోవింద్ గురు, బిర్సా ముండా విశ్వవిద్యాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నత విద్య ప్రమాణాల పెంపులో విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

నా ప్రియ కుటుంబ సభ్యులారా!

దేశంలో అనేక దశాబ్దాల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చింది. ఇక స్థానిక భాషలో విద్యపై 30 ఏళ్లు ఆగిన కృషిని మేం కొనసాగించాం. ఒక బాలుడు తన స్థానిక భాషలో చదువుకుంటే, వారి శ్రమ ఎంతో తగ్గుతుంది.. అన్ని భావనలను సులువుగా అర్థం చేసుకోగలరు కాబట్టే దీనికి ప్రాధాన్యం ఇచ్చాం. దేశవ్యాప్తంగా 14,000కుపైగా ‘పీఎం శ్రీ’ పాఠశాలలతోపాటు ఒక ఆధునిక పాఠశాల ఏర్పాటు చేశాం. గడచిన 9 ఏళ్లలో ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలు గిరిజన ప్రాంతాలకు గణనీయ ప్రయోజనం కల్పించాయి. వారి జీవితాల్లో సంపూర్ణ పరిణామం దిశగా మేం వీటిని ఏర్పాటు చేశాం. షెడ్యూల్డు కులాలు, తెగల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించడంలోనూ  మేం ప్రగతి సాధించాం. నా గిరిజన ప్రాంతంలోని చిన్న గ్రామాల యువతకు అంకుర సంస్థల ప్రపంచాన్ని పరిచయం చేయాలన్నదే మా ప్రయత్నం. పిల్లలకు చిన్న వయసులోనే సాంకేతికత, శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తి పెరిగే విధంగా మారుమూల ప్రాంతాల్లోనూ వినూత్న టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. తద్వారా భవిష్యత్తులో వారు శాస్త్ర-సాంకేతికతల ప్రగతికి మార్గదర్శకులు కాగలరు.

నా కుటుంబ సభ్యులారా!

కాలం చాలా మారింది.. పట్టా ధ్రువీకరణ పత్రాలతోపాటు నైపుణ్య ప్రాధాన్యం కూడా పెరిగింది. మీరు ఏ డిగ్రీ సాధించినా, మీకు ఏయే అంశాల్లో నైపుణ్యం ఉందన్నది ఇవాళ ప్రధానాంశం. అలాగే, నైపుణ్యాభివృద్ధి ద్వారా అట్టడుగు స్థాయిలో ప్రగతికి దోహదం చేసినవారు గణనీయ ప్రభావం చూపారు. అందువల్ల నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యం పెరిగి, ఈ కార్యక్రమాలు ఇప్పుడు లక్షలాది యువతకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. నైపుణ్యార్జన ద్వారా ఎవరైనా, ఎలాంటి పూచీకత్తు లేకుండా ముద్రా పథకం కింద బ్యాంకు రుణం పొందవచ్చు. ఇందుకు మీ మోదీయే హామీ! తమదైన పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించి, తమ కోసం సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పించండి. రాష్ట్రంలో వనబంధు కల్యాణ్ యోజన కింద కూడా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అలాగే 50కి పైగా గిరిజన తాలూకాలలో గణనీయ సంఖ్యలో ‘ఐటీఐ’లు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మందికిపైగా గిరిజనులు విద్యాభ్యాసం, శిక్షణ పొందారు. వారంతా ఇప్పుడు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ, మరికొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సంయుక్త కార్యకలాపాలు చేపట్టే గిరిజనుల నైపుణ్యానికీ కొత్త మార్కెట్ ఉంది. వారి పెయింటింగ్‌లు, కళాత్మకత,  సృజనాత్మకతలతోపాటు వారి కళలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక దుకాణాల ఏర్పాటుకు కృషి కొనసాగుతోంది.

మిత్రులారా!

మేము క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. దీనికి సంబంధించి ఇటీవలి కార్యక్రమమే నిదర్శనం. ఈ నెల 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు మేం శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా తమతమ ఆవాసాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే మన ‘నివాసీ’ల కోసం ఓ కీలక కార్యక్రమం చేపట్టాం. ఆ మేరకు కుమ్మరులు, దర్జీలు, క్షురకులు, రజకులు, కమ్మరులు, స్వర్ణకారులు, నిర్మాణ కార్మికులు, తాపీమేస్త్రీలు... వంటి వివిధ వృత్తుల వారికోసం రూ.కోట్ల నిధులతో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ను ప్రారంభించాం. దీనికింద సంప్రదాయ కుటుంబ వృత్తి-వ్యాపారాలు, ఆధునిక ఉపకరణాలు, కొత్త డిజైన్లు సహా ప్రపంచ మార్కెట్లో వారి ఉత్పత్తుల విక్రయానికి తగిన శిక్షణ పొందుతారు. దేశంలోని పేదలు, శ్రమజీవుల కోసమే ఈ కీలక పథకాన్ని రూపొందించాం. దీంతో విగ్రహ రూపకర్తలు తమ సుసంపన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయం, కళ అంతం కారాదన్నది మా కృతనిశ్చయం... అలాగే గురు-శిష్య సంప్రదాయం కొనసాగాలి. శ్రద్ధగా పనిచేస్తూ, నిజాయితీగా జీవించే లక్షలాది కుటుంబాలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనం అందాలి. తదనుగుణంగా వివిధ మార్గాల ద్వారా వారి జీవితాలను సుసంపన్నం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. చాలా తక్కువ వడ్డీకే రుణ లభ్యత కల్పించడమేగాక ఆ రుణానికి మోదీయే హామీగా ఉంటారు కాబట్టి, ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుందన్న మాట.

నా కుటుంబ సభ్యులారా!

దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు చిరకాలం నుంచీ అణచివేతకు గురవుతూ వచ్చారు. కానీ, ఇవాళ వివిధ పథకాల ద్వారా ఆశావహ దృక్పథంతో అభివృద్ధి వైపు ముందడుగు వేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక దశాబ్దాల తర్వాత ఆదివాసీ ప్రతిష్ఠను గౌరవించే అవకాశం నాకు లభించింది. అందులో భాగంగా దేశం ఇప్పుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం’గా నిర్వహిస్తోంది. మునుపటి ప్రభుత్వాల హయాంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వం గిరిజన సమాజ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచింది. దీనికితోడు కొన్ని రోజుల కిందట కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త భవనంలో తొలి చట్టంగా ‘నారీ శక్తి వందన్ అధినియం’ను మీ ఆశీర్వాదంతో ఆమోదించాం. ఇన్నేళ్లుగా దీనిపై వాగ్దానాల మీద వాగ్దానాలు చేసిన వారిని మీరిప్పుడు నిలదీయాలి. దశాబ్దాలుగా ఎందుకు చేతులు కట్టుకు కూర్చున్నారో ప్రశ్నించాలి. నా తల్లులు, అక్కచెల్లెళ్లకు వారి హక్కులను ముందుగానే ఇచ్చి ఉంటే, ఈనాడు వారెంతో ముందడుగు వేసి ఉండేవారు! దశాబ్దాలుగా చిన్నచిన్న సౌకర్యాలకూ దూరమైన నా గిరిజన సోదరీసోదరులు, దశాబ్దాలుగా హక్కులకు దూరమైన తల్లులు, అక్కచెల్లెళ్లు ఎట్టకేలకు మోదీ ద్వారా తమ వాటా పొందుతున్నారు. ఇన్నేళ్లుగా ఏమీ చేయనివారు ఇవాళ సమాజాన్ని చీల్చి, గందరగోళం సృష్టించడానికి కొత్త కుట్రలు పన్నుతున్నారు.

దేశంలోని నా ప్రియ గిరిజనం హక్కులేమిటో వివరించేందుకు మీ కొడుకు నేడు ఇక్కడికి వచ్చాడు. మీలో ప్రతి ఒక్కరికీ సాధికారత కల్పించే దిశగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో మేం కృషి చేస్తున్నామని చెప్పడానికే నేనివాళ చోటా ఉదయపూర్‌ వచ్చాను. నా అక్కచెల్లెళ్ల కోసం మన రాజ్యాంగం నిర్దేశించిన మేరకు పార్లమెంటు, శాసనసభల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ నిబంధనలు రూపొందాయి. కొత్త చట్టంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల మహిళలకూ రిజర్వేషన్లపై నిబంధనలున్నాయి. ఇలాంటి కీలక పరిణామాలకు వేదికైన ఈ చట్టానికి ఆమోదముద్ర వేసేదెవరు? పార్లమెంటు దీన్ని ఆమోదించినా, భారత తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ దానిపై సంతకం చేస్తేనే అది చట్టంగా మారుతుంది.

ఈ రోజు చోటా ఉదయపూర్‌లో నన్ను ఆశీర్వదించేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన నా గిరిజన సోదరీసోదరులకు నమస్కారాలు... హృదయపూర్వక అభినందనలు. స్వాతంత్ర్య ‘అమృత కాల’  ఆరంభం చాలా శుభప్రదం.. ఇది మా సంకల్పాన్ని పటిష్ఠం చేయగా, తల్లుల ఆశీస్సులు కొత్త బలాన్నిస్తున్నాయి. సరికొత్త ప్రాజెక్టులతో మేమీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. మీ ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు... ఇప్పుడు రెండు చేతులూ పైకెత్తి ముక్తకంఠంతో- భారత మాతకు జయజయధ్వానం చేద్దాం. మన నినాదం బోడేలీ నుంచి ఉమర్గావ్‌... అంబాజీ వరకు ప్రతిధ్వనించేలా గళమెత్తండి.

భారత్ మాతా కీ - జై!

భారత్ మాతా కీ - జై!

భారత్ మాతా కీ - జై!

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి గుజరాతీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

****


(रिलीज़ आईडी: 2200276) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam