ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భారత్ – రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 05 DEC 2025 7:48PM by PIB Hyderabad

గౌరవనీయుడైన నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారత, విదేశీ నాయకులూ.. సోదరీ సోదరులారా... నమస్కారం.

భారత్ - రష్యా బిజినెస్ ఫోరంలో, ఇంతపెద్ద ప్రతినిధి బృందంతో నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవ అత్యంత కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నేడు మీ అందరి మధ్య ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ ఫోరంలో పాల్గొని తన విలువైన అభిప్రాయాలను పంచుకున్న నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వ్యాపారం కోసం సరళీకృత సానుకూల యంత్రాంగాలను ఏర్పాటు చేస్తున్నాం. భారత్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఎఫ్‌టీఏపై చర్చలు మొదలయ్యాయి.

మిత్రులారా, 

పీయూష్ గారు ఇప్పుడే చెప్పినట్టుగా, అలాగే అధ్యక్షుడు వివిరించిన సానుకూలతలను పరిశీలిస్తే.. ఈ విభిన్నమైన అంశాలున్నప్పటికీ, అనతి కాలంలోనే గణనీయమైన లక్ష్యాలను మనం సాధించవచ్చు. వ్యాపారంలో అయినా లేదా దౌత్యంలో అయినా.. ఏ భాగస్వామ్యానికైనా పరస్పర విశ్వాసమే పునాది. ఈ నమ్మకమే భారత్ - రష్యా సంబంధాలకు గొప్ప బలం. అదే మన ఉమ్మడి ప్రయత్నాలకు దిశానిర్దేశం చేస్తూ, వాటిని వేగవంతం చేస్తుంది. సరికొత్త స్వప్నాలు, ఆకాంక్షలతో ముందుకురికేలా మనకు స్ఫూర్తినిచ్చే ప్రయోగ వేదిక ఇది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లు దాటాలని గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్, నేను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ, నిన్నటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నా సంభాషణలు, మనకు కనిపిస్తున్న అవకాశాలను బట్టి చూస్తే.. మనం 2030 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని నాకనిపిస్తోంది. నాకది స్పష్టంగా కనిపిస్తోంది. నిర్దేశిత సమయానికి ముందే ఆ లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. నా నమ్మకం బలపడుతోంది. సుంకాలు, ఇతర అవరోధాలు తగ్గుతున్నాయి.

కానీ మిత్రులారా,

ఈ ప్రయత్నాలన్నింటి వెనుకా ఉన్న నిజమైన శక్తి మీ వంటి వ్యాపారవేత్తలే. మీ శక్తి, మీ సృజన, మీ ఆశయాలే మన ఉమ్మడి భవితను తీర్చిదిద్దుతాయి.

మిత్రులారా,

దేశంలో మునుపెన్నడూ లేనంత వేగంగా, అపూర్వ స్థాయిలో గత పదకొండేళ్లలో మేం అనేక మార్పులను తెచ్చాం. సంస్కరణ, ఆచరణ, పరివర్తన – ఈ సూత్రాన్ని అనుసరించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ శరవేగంగా అడుగులేస్తోంది. ఈ పదకొండేళ్ల సంస్కరణల ప్రస్థానంలో మేమెప్పుడూ అలసిపోలేదు, విశ్రమించలేదు. గతంలో ఎన్నడూ లేనంత బలమైన సంకల్పం మాది. లక్ష్యం దిశగా చాలా వేగంగా, గొప్ప విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. వాణిజ్య సౌలభ్యాన్ని ప్రోత్సహించడం కోసం జీఎస్టీలో నవతరం సంస్కరణలు, అనుమతి అవసరాల తగ్గింపుల వంటి చర్యలు తీసుకున్నాం. రక్షణ, అంతరిక్షాల్లో ప్రైవేటు రంగానికీ అవకాశం కల్పించడం ద్వారా, ఆ రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించాం. నేడు పౌర అణు రంగంలో కూడా కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తున్నాం. ఈ సంస్కరణలు కేవలం పాలనాపరమైనవే కావు.. ఆలోచనా ధోరణిలో సంస్కరణలివి. అభివృద్ధి చెందిన భారత్... ఇదే ఈ సంస్కరణలన్నింటి ఏకైక సంకల్పం.

మిత్రులారా, 

నిన్న, ఈ రోజు మీరు చాలా ఉపయోగకరమైన, అర్థవంతమైన చర్చలు జరిపారు. భారత్, రష్యా మధ్య సహకారానికి సంబంధించి.. అన్ని రంగాలూ ఈ సమావేశంలో చర్చకు రావడం సంతోషాన్నిచ్చే అంశం. విలువైన సూచనలు చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నా తరఫున కొన్ని ఆలోచనలను మీ ముందుంచుతాను. మొదటిది – లాజిస్టిక్స్, రవాణా రంగంలో.. మన రవాణా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై అధ్యక్షుడు పుతిన్, నేను ప్రత్యేకంగా చర్చించాం. ఐఎన్‌ఎస్‌టీసీ లేదా ఉత్తర సముద్ర మార్గం.. అంటే చెన్నై - వ్లాడివోస్టాక్ కారిడార్‌లలో దేనిలోనైనా ముందుకు సాగేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా త్వరలోనే పురోగతి సాధిస్తాం. ఇది రవాణా సమయాన్ని, ఖర్చులను తగ్గిస్తుంది. వ్యాపారం కోసం కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్ టెక్నాలజీ శక్తితో.. సుంకాలు, రవాణా, నియంత్రణ వ్యవస్థలను మనం వర్చువల్ వాణిజ్య కారిడార్ల ద్వారా మనం అనుసంధానించవచ్చు. ఇది సుంకాల పరంగా అనుమతులను వేగవంతం చేస్తుంది. రాత పనిని తగ్గిస్తుంది. సరుకు రవాణాలో అంతరాయాలను తొలగిస్తుంది. రెండోది – సముద్ర ఉత్పత్తులకు సంబంధించినది. భారత్ నుంచి పాలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అర్హత ఉన్న భారతీయ కంపెనీల జాబితాను రష్యా ఇటీవల విస్తరించింది. దీంతో భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభించాయి. భారత అత్యుత్తమ సముద్ర ఉత్పత్తులు, అదనపు ఆదాయాన్నివ్వగల సముద్ర ఆహారోత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. శీతల స్థితిలో వస్తువుల రవాణా వ్యవస్థ, లోతు సముద్రంలో చేపల వేట, ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణల్లో ఉమ్మడి వాణిజ్య కార్యకలాపాలను, సాంకేతిక భాగస్వామ్యాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది రష్యాలో దేశీయ డిమాండును తీర్చడమే కాకుండా, భారతీయ ఉత్పత్తులకు కూడా కొత్త మార్కెట్లు కూడా లభిస్తాయి. మూడోది – ఆటోమొబైల్ రంగం. తక్కువ ధరల్లో, సమర్థమైన ఎలక్ట్రిక్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, సీఎన్జీ రవాణా సాధనాల్లో భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. అధునాతన సామగ్రిలో రష్యా ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఇరుదేశాలు కలిసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆటోమోటివ్ భాగాలు, ఉమ్మడి రవాణా రంగాల్లో భాగస్వామ్యాలను నెలకొల్పవచ్చు. ఇది మన సొంత అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా.. అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా అభివృద్ధికి దోహదపడుతుంది. నాలుగోది – ఔషధ రంగం.. భారత్ నేడు అందుబాటు ధరలకే ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఔషధాలను సరఫరా చేస్తోంది. అందుకే భారత్‌ను ప్రపంచ ఔషధాలయంగా కూడా పిలుస్తున్నారు. రెండు దేశాలు కలిసి ఉమ్మడిగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలు, రేడియోయాక్టివ్ పరమైన ఔషధాలు, ఏపీఐ సరఫరా వ్యవస్థల్లో సహకారాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్య రక్షణ పరంగా భద్రతను పెంచుతుంది. కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేస్తుంది. అయిదోది – జౌళి. సహజమైన నార వస్త్రాల నుంచి సాంకేతిక ప్రత్యేకతలున్న వస్త్రాల వరకు.. ఇందులో భారత్‌కు విస్తృతమైన అవకాశాలున్నాయి. డిజైన్, హస్తకళలు, తివాచీలలో మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాలిమర్లు, సింథటిక్ ముడి పదార్థాల్లో రష్యా ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఇరుదేశాలు కలిసి జౌళీకి సంబంధించి శక్తిమంతమైన సరఫరా వ్యవస్థను ఏర్పరచవచ్చు. అదేవిధంగా ఎరువులు, సిరామిక్స్, సిమెంటు తయారీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో సహకారానికి అనేక అవకాశాలున్నాయి.

మిత్రులారా

అన్ని రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంలో మానవ వనరుల తరలింపు కీలక పాత్ర పోషిస్తుంది. నేడు భారత్ ప్రపంచ నైపుణ్య రాజధానిగా ఎదుగుతోంది. సాంకేతికత, ఇంజినీరింగ్, ఆరోగ్య రక్షణ, నిర్మాణం, లాజిస్టిక్స్ సహా ప్రతీ రంగంలో ప్రపంచ అవసరాలను తీర్చే సమర్థత ప్రతిభావంతులైన మన యువతకు ఉంది. రష్యా జనాభా, ఆర్థిక ప్రాధాన్యాల దృష్ట్యా.. ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయ ప్రతిభావంతులకు రష్యన్ భాషలో, అత్యాధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా.. మనం సంయుక్తంగా రష్యా అవసరాలకు తగిన శ్రామిక శక్తిని సృష్టించవచ్చు. అది ఇరు దేశాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.

మిత్రులారా, 

మన రెండు దేశాల పౌరులకు పర్యాటక వీసాలకు సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజు తీసుకున్నాము. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని పెంచుతుంది. టూర్ ఆపరేటర్లకు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. మిత్రులారా.. ఉమ్మడి ఆవిష్కరణలు, ఉమ్మడిగా ఉత్పత్తి, సమష్టి సృజనల్లో సరికొత్త ప్రయాణాన్ని భారత్, రష్యా నేడు మొదలుపెడుతున్నాయి. పరస్పర వాణిజ్యాన్ని పెంచడానికి మాత్రమే మన లక్ష్యం పరిమితం కాదు. మొత్తం మానవాళి సంక్షేమం మన లక్ష్యం. ఇందుకోసం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారాలను మనం రూపొందించాలి. ఈ ప్రయాణంలో రష్యాతో భుజం భుజం కలిపి నడవడానికి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. నేను మీ అందరికీ చెబుతున్నాను... రండి, భారత్‌లో తయారు చేయండి, భారత్‌తో జట్టుకట్టండి. సమష్టిగా పనిచేస్తూ ప్రపంచానికి ఉత్పత్తులను అందిద్దాం. ఈ మాటలతో.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.

 

***


(रिलीज़ आईडी: 2200035) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam