ప్రధాన మంత్రి కార్యాలయం
నూతన పార్లమెంట్ భవనంలో రాజ్యసభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
19 SEP 2023 5:46PM by PIB Hyderabad
గౌరవ అధ్యక్షా,
ఈ రోజు మనందరికీ ఒక చిరస్మరణీయమైన రోజు. ఇది చరిత్రాత్మకమైనది కూడా. ఇంతకుముందు లోక్‌సభలో నా అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు, ఈ రోజు రాజ్యసభలో మీరు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు.
గౌరవ అధ్యక్షా,
మన రాజ్యాంగంలో రాజ్యసభను పార్లమెంటు ఎగువ సభగా పరిగణించారు. ఈ సభ రాజకీయాల విభేదాలకు అతీతంగా దేశానికి దిశానిర్దేశం చేయగలిగే ఒక ఉన్నతమైన మేధో చర్చా కేంద్రంగా మారాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఇది ఏ దేశమైనా సహజంగా కోరుకునేదే. ఇది ప్రజాస్వామ్య సుసంపన్నతకు దోహదపడుతుంది.
గౌరవ అధ్యక్షా,
ఈ సభకు ఎందరో ప్రముఖ వ్యక్తులు ప్రాతినిధ్యం వహించారు. నేను వారందరి పేర్లను ప్రస్తావించలేకపోవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి, గోవింద్ వల్లభ్ పంత్ సాహెబ్, లాల్ కృష్ణ అద్వానీ, ప్రణబ్ ముఖర్జీ సాహెబ్, అరుణ్ జైట్లీ ఇంకా ఎంతో మంది ఈ సభను అలంకరించి దేశానికి మార్గనిర్దేశం చేశారు. అలాగే, తమంతట తామే ఒక సంస్థలా, ఒక స్వతంత్ర మేధోమథన కేంద్రంలా పనిచేసి, తమ విజ్ఞానంతో, తమ కృషితో దేశానికి మేలు చేసిన సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. పార్లమెంటు చరిత్ర ప్రారంభ రోజుల్లో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజ్యసభ ప్రాముఖ్యతను వివరిస్తూ, పార్లమెంటు కేవలం శాసనపరమైనది మాత్రమే కాదు, చర్చా వేదిక అని అన్నారు. రాజ్యసభ ప్రజల అనేక ఉన్నత, ఉత్కృష్టమైన అంచనాలను కలిగి ఉంటుంది. అందువల్ల, గౌరవ సభ్యుల మధ్య ముఖ్యమైన విషయాలపై అర్థవంతమైన చర్చలు జరగడం, వాటిని వినడం ఎంతో ఆనందాన్నిస్తుంది. పార్లమెంటు నూతన భవనం కేవలం ఒక కొత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది ఒక నూతన ప్రారంభానికి సంకేతం. మనం కొత్త దానితో అనుబంధం పెంచుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దీన్ని అనుభూతి చెందుతాం. మన ఆలోచనా విధానం కూడా దానికి అనుగుణంగా మారుతుంది. దానిని ఉత్తమంగా ఉపయోగించుకోవాలని, అత్యంత అనుకూలమైన వాతావరణంలో పనిచేయాలని మన మనస్సు కోరుకుంటుంది. అమృత కాలం ప్రారంభం వేళ ఈ భవనం నిర్మాణం పూర్తి కావడం, మనం అందులోకి ప్రవేశించడం ఒక కొత్త శక్తికి సంకేతం. ఇది మన దేశంలోని 140 కోట్లమంది పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఇది మనలో సరికొత్త ఆశను, నూతన విశ్వాసాన్ని నింపుతుంది.
గౌరవ అధ్యక్షా,
మనం నిర్దేశిత కాలపరిమితిలో మన లక్ష్యాలను సాధించాలి. ఎందుకంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, దేశం ఇకపై వేచి ఉండలేదు. మన తల్లిదండ్రులు కష్టాలు పడ్డారు- మనం కూడా పడదాంలే- అని ఒకప్పుడు అనుకునేవారు. విధి ఎలాగో అలా గట్టెక్కిస్తుందని నమ్మేవారు. కానీ ఈ రోజు, సమాజం మనస్తత్వం, ముఖ్యంగా యువ తరం ఆలోచనా విధానం అందుకు భిన్నంగా ఉంది. అందువల్ల, మనం సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా, కొత్త విధానంతో మన పని పరిధిని విస్తరించాలి. మనం మన ఆలోచనల పరిమితులను అధిగమించి, మన సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. మన సామర్థ్యాలు పెరిగే కొద్దీ, దేశ సామర్థ్యాలను పెంచడంలో మన పాత్ర కూడా పెరుగుతుంది.
గౌరవ అధ్యక్షా,
ఈ కొత్త భవనంలో, ఈ ఎగువ సభలో, మన ప్రవర్తన, నడవడిక ద్వారా మనం దేశంలోని శాసనసభలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, మొత్తం వ్యవస్థకు స్ఫూర్తినిస్తూ, పార్లమెంటరీ గౌరవానికి ప్రతీకలుగా నిలవగలమని నేను నమ్ముతున్నాను. ఈ ప్రదేశానికి అత్యధిక సామర్థ్యం ఉందని, దేశం దాని ప్రయోజనాలను పొందగలదని నా విశ్వాసం. ఇది ప్రజల ప్రతినిధులకు - వారు 'గ్రామ ప్రధాన్'గా ఎన్నికైనా లేదా పార్లమెంటుకు వచ్చినా ప్రయోజనం చేకూర్చాలి. ఈ సంప్రదాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనం ఆలోచించాలి.
గౌరవ అధ్యక్షా,
గత తొమ్మిదేళ్లుగా మీ సహకారంతో దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. వాటిలో కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ నిర్ణయాలలో కొన్ని అత్యంత సవాలుతో కూడినవి. రాజకీయంగా సున్నితమైనవి. అయినప్పటికీ, ఈ సవాళ్లను దాటి ఆ దిశగా ముందుకు సాగే ధైర్యాన్ని ప్రదర్శించాం. రాజ్యసభలో మాకు అవసరమైన సంఖ్యాబలం లేదు. కానీ రాజ్యసభ పక్షపాత ఆలోచనలకు అతీతంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటుందనే విశ్వాసం మాకు ఉంది. ఈ రోజు, మీ విశాల దృక్పథం, మీ అవగాహన, దేశం పట్ల మీ బాధ్యతాయుతమైన భావం, మీ సహకారం ఫలితాలు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాకు వీలు కల్పించాయని నేను సంతృప్తితో చెప్పగలను, ఇది రాజ్యసభ గౌరవాన్ని కేవలం సంఖ్యా బలంతోనే కాకుండా విజ్ఞతాపరమైన శక్తితో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది? అందుకే, ఈ సభలోని ప్రస్తుత, గత గౌరవ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు.
గౌరవ అధ్యక్షా,
ప్రజాస్వామ్యంలో, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రారు, ఎప్పుడు అధికారంలోకి వస్తారు అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్య స్వభావం, లక్షణాలలో సహజంగా, అంతర్లీనంగా ఉంటుంది. అయితే, దేశానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడల్లా, మనమందరం రాజకీయాలకు అతీతంగా, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, కలిసికట్టుగా పనిచేయడానికి ప్రయత్నించాం.
గౌరవ అధ్యక్షా,
రాజ్యసభ ఒక విధంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది సహకార సమాఖ్యకు రూపం. ఇప్పుడు పోటీతత్వ సహకార సమాఖ్య విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. మనం అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, దేశం అపారమైన సహకారంతో పురోగమించడాన్ని మనం చూడవచ్చు. కోవిడ్ సంక్షోభం చాలా ముఖ్యమైనది. ప్రపంచం కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే, మన సహకార సమాఖ్య బలం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి దేశాన్ని తీవ్ర సంక్షోభం నుంచి రక్షించగలిగాయి. ఇది మన సహకార సమాఖ్య శక్తిని ప్రదర్శిస్తుంది. సంక్షోభ సమయాల్లోనే కాకుండా, వేడుకల సమయాల్లో కూడా మన సమాఖ్య వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంది, కానీ మనం మన బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించి, దాని గుర్తింపు పొందాం. భారత దేశ వైవిధ్యం, దాని అనేక రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, భాషలు, సంస్కృతులు మొదలైన అంశాలన్నీ జీ20 శిఖరాగ్ర సదస్సు, వివిధ రాష్ట్ర స్థాయి సదస్సుల వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. చివరగా ఆతిధ్యమిచ్చిన ఢిల్లీకి ముందు, దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో 220కి పైగా శిఖరాగ్ర సమావేశాలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. అవి ప్రపంచంపై చూపిన ప్రభావం మన ఆతిథ్యాన్ని, చర్చల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల మన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇది మన సమాఖ్య బలం. సహకార సమాఖ్య కారణంగానే మనం ఈ రోజు పురోగతి సాధిస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
ఈ కొత్త సభలో, అలాగే మన కొత్త పార్లమెంట్ భవనంలో సమాఖ్య భావన స్ఫూర్తిని మనం నిజంగా చూడొచ్చు. ఈ భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు, ఇందులో పొందుపరచడానికి రాష్ట్రాలను వాటి గుర్తింపును ప్రతిబింబించే వివిధ అంశాలను సూచించాలని కోరడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇక్కడ ఎలాగైనా ప్రాతినిధ్యం లభించేలా చూడటం చాలా ముఖ్యం. వివిధ రకాల కళారూపాలు, భవనం గోడలను అలంకరించిన అనేక చిత్రాలు ఈ భవనం వైభవాన్ని చాటడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రదర్శించడానికి రాష్ట్రాలు తమ అత్యుత్తమ కళాఖండాలను ఎంచుకున్నాయి. ఒక విధంగా,ఇక్కడ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. వాటి వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ వాతావరణానికి సహకార సమాఖ్య స్ఫూర్తిని జోడిస్తుంది.
గౌరవ అధ్యక్షా,
సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను అసాధారణ వేగంతో గణనీయంగా ప్రభావితం చేసింది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుకు ఒకప్పుడు 50 ఏళ్లు పట్టేది, ఇప్పుడు అది వారాల వ్యవధిలో జరిగిపోతోంది. ఆధునికత అత్యవసరంగా మారింది, దానితో పాటుగా మనం కూడా నిరంతరం, తెలివిగా ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే మనం ఆధునికతతో పాటు అడుగులో అడుగు వేసి, అంచెలంచెలుగా పురోగమించగలం.
గౌరవ అధ్యక్షా,
సంవిధాన్ సదన్ గా పేర్కొన్న పాత భవనంలో, మనం స్వాతంత్య్ర ‘అమృత మహోత్సవాన్ని’ అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకున్నాం. మన 75 ఏళ్ల ప్రయాణాన్ని తిరిగి చూసుకొని, కొత్త దిశను రూపొందించేందుకు, కొత్త సంకల్పాలను తీసుకోవడానికి ప్రయత్నాలను కూడా ప్రారంభించాం. నూతన పార్లమెంట్ భవనంలో స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సమయానికి, ఆ స్వర్ణోత్సవం అభివృద్ధి చెందిన భారతదేశానికి చెందుతుందనే పూర్తి నమ్మకం నాకు ఉంది. పాత భవనంలో మనం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాం. నూతన పార్లమెంటు భవనంలో మనం ప్రపంచంలో అగ్రశ్రేణి మూడు ఆర్థిక శక్తులలో ఒకటిగా రూపాంతరం చెందుతామని నేను విశ్వసిస్తున్నాను. పాత భవనంలో నిరుపేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. చాలా పనులు పూర్తయ్యాయి. నూతన భవనంలో మనం ఇప్పుడు 100% సంతృప్తిని సాధిస్తాం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వారి న్యాయమైన వాటా లభిస్తుంది.
గౌరవ అధ్యక్షా,
ఈ కొత్త సభలో గోడలతో పాటు, మనం సాంకేతికతకు అలవాటు పడవలసి ఉంటుంది. ఐప్యాడ్‌లలో ప్రతిదీ మన కళ్ల ముందు కనిపిస్తుంది. రేపు వీలైతే, చాలా మంది గౌరవ సభ్యులు కొంత సమయం కేటాయించి, సాంకేతికతతో పరిచయం పెంచుకోవాలని నేను సూచిస్తున్నాను. వారు కూర్చుని తమ స్క్రీన్‌లను చూడడానికి ఇది వారికి సౌకర్యంగా ఉంటుంది. లోక్‌సభలో ఈ రోజు నేను గమనించాను. కొంతమంది సహచరులు ఈ పరికరాలను నిర్వహించడంలో కష్టాలు పడ్డారు. కాబట్టి, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం మన బాధ్యత. రేపు మనం ఇందుకోసం కోసం కొంత సమయాన్ని కేటాయించగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది.
గౌరవ అధ్యక్షా,
ఇది డిజిటలైజేషన్ యుగం. ఈ సభలో కూడా మనం ఈ విషయాలలో భాగమవ్వాలి. ప్రారంభంలో కొంత సమయం పట్టవచ్చు. కానీ ఇప్పుడు చాలా అంశాలు చాలా సులభంగా వాడుకకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని సులువుగా స్వీకరించవచ్చు. ఇప్పుడు, మనం చేద్దాం. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పు తెచ్చింది, మనం ఎంతో లబ్ధి పొందాం. కొత్త ఆలోచన, కొత్త ఉత్సాహం, కొత్త శక్తి, కొత్త పట్టుదలతో మనం ముందుకు సాగుతూ గొప్ప విజయాలు సాధించవచ్చని నేను గతంలో చెప్పాను.
గౌరవ అధ్యక్షా,
ఈ రోజు నూతన పార్లమెంటు భవనం దేశానికి ముఖ్యమైన ఒక చరిత్రాత్మక నిర్ణయానికి సాక్షిగా నిలుస్తోంది. లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అక్కడ చర్చల తరువాత అది ఇక్కడికి కూడా రానుంది. గత కొన్ని సంవత్సరాలుగా మహిళా సాధికారత దిశగా అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మనం సమష్టిగా అత్యంత కీలకమైన అడుగు వేస్తున్నాం. ప్రభుత్వం జీవన సౌలభ్యాన్ని జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. జీవన సౌలభ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల గురించి మనం మాట్లాడినప్పుడు, ఈ కృషికి నిజమైన లబ్ధిదారులు మన అక్కాచెల్లెళ్ళు, మన మహిళలు. ఎందుకంటే వారు ఎన్నో కష్టాలను భరించాలి. అందువల్ల, వారిని దేశ నిర్మాణంలో పాలుపంచుకునేలా చేయడం మన ప్రయత్నం, అది మన బాధ్యత కూడా. మహిళల శక్తి, మహిళల భాగస్వామ్యం నిరంతరం అవసరమవుు.తున్న కొత్త రంగాలు చాలా ఉన్నాయి. గనుల తవ్వకంలో కూడా మహిళలు పనిచేయవచ్చనే నిర్ణయం మన ఎంపీల కారణంగానే సాధ్యమైంది. మన కుమార్తెలకు సామర్థ్యం ఉంది. కాబట్టి, బాలికల కోసం అన్ని పాఠశాలల తలుపులను మనం తెరిచాం. ఈ సామర్థ్యానికి ఇప్పుడు అవకాశాలు లభించాలి. ఇకపై వారి జీవితాలలో "అయితే, కానీ" అనే పరిస్థితి ఉండకూడదు. మనం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే, మన కుమార్తెలు, అక్కాచెల్లెళ్లు అంత ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. అది సమాజంలో భాగమైంది. దీని కారణంగా సమాజంలో కుమార్తెలు, మహిళల పట్ల గౌరవభావం పెరిగింది. ముద్రా యోజన అయినా, జన్ ధన్ యోజన అయినా, ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు క్రియాశీలకంగా లబ్ధి పొందారు. ఆర్థిక సమ్మిళితం విషయానికి వస్తే, మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని భారత్ చూస్తోంది. ఇది వారి కుటుంబ సభ్యుల సామర్థ్యాన్ని కూడా బయటపెడుతుందని నేను భావిస్తున్నాను. తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉజ్వల పథకాన్ని ప్రారంభించడానికి మేం ప్రయత్నం చేశాం. గతంలో గ్యాస్ సిలిండర్ కోసం ఎంపీల ఇంటి చుట్టూ చాలా సార్లు తిరగాల్సి వచ్చేదని మనకు తెలుసు. దీనిని పేద కుటుంబాలకు ఉచితంగా అందించడం అనేది ఎంతో ఆర్థిక భారం. కానీ మహిళల జీవితాలను దృష్టిలో ఉంచుకుని నేను అది చేశాను. ట్రిపుల్ తలాక్ సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది, రాజకీయ ప్రయోజనాలకు బలైంది. మన గౌరవ పార్లమెంట్ సభ్యులందరి సహాయంతో ఇంత తీవ్రమైన సమస్యకు పరిష్కారం సాధ్యమైంది. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను రూపొందించేందుకు కూడా మేం పని చేశాం. మహిళా నేతృత్వంలో అభివృద్ధి అనే అంశానికి జీ-20 చర్చల్లో ప్రాధాన్యం లభించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు మహిళా నేతృత్వ ఆధ్వర్య అభివృద్ధి అనే విషయం కొంత కొత్త అనుభవంగా అనిపించింది. ఈ అంశంపై చర్చలు జరిగినప్పుడు, ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. అయితే, జీ20 ప్రకటనలో, మహిళా నేతృత్వ అభివృద్ధి అనే అంశం భారత్ ద్వారా ప్రపంచానికి చేరింది. ఇది మన అందరికీ గర్వకారణం.
గౌరవ అధ్యక్షా,
ఈ నేపథ్యంలో, శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ ద్వారా మహిళలు పోటీ చేయడంపై చర్చ చాలా కాలం కొనసాగింది. గతంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేశారు. ఇదంతా 1996 లో మొదలైంది. అటల్ బిహారీ వాజ్ పేయి సమయంలో బిల్లులను చాలా సార్లు తెచ్చారు. కానీ సంఖ్యలు కలసిరాలేదు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతికూల వాతావరణం ఉంది. ఈ ముఖ్యమైన పని చేయడం కష్టమైంది. అయితే ఇప్పుడు మనం నూతన సభకు వచ్చాం. ఇక్కడ ఒక నూతనత్వం అనే భావన ఉంది. మన దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళా శక్తిని చట్టం ద్వారా పాలుపంచుకునేలా చేయడానికి సమయం ఆసన్నమైందని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల, ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ‘నారీ శక్తి వందన్ అధినియం’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రేపు లోక్‌సభలో దీనిపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యసభలో కూడా పరిశీలన జరుగుతుంది. నేను మీ అందరినీ అత్యంత చిత్తశుద్ధితో కోరుతున్నాను. ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందితే అది మన ఐక్యతా శక్తిని అపారంగా పెంచే అంశంగా నిలుస్తుంది. రాజ్యసభలో నా గౌరవ సహచరులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. రాబోయే రోజులలో అవకాశం వచ్చినప్పుడు దీనిని ఏకాభిప్రాయంతో పరిశీలించండి. ఈ అభ్యర్థనతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
చాలా ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2199703)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam