ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ఢిల్లీలో జరిగిన 9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 13 OCT 2023 1:34PM by PIB Hyderabad

నమస్కారం!

జీ20 పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ 140 కోట్ల మంది భారతీయుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఒక విధంగా ఈ సదస్సు ప్రపంచంలోని విభిన్న పార్లమెంటరీ పద్ధతులకు సంబంధించిన ‘మహాకుంభ మేళా' లేదా భారీ సమావేశం. మీవంటి ప్రతినిధులు అందరూ వివిధ పార్లమెంట్‌ల పనితీరులో అనుభవం కలిగి ఉన్నారు. ఈ గొప్ప ప్రజాస్వామ్య అనుభవాలతో మీరు భారతదేశాన్ని సందర్శించడం మా అందరికీ గొప్ప సంతోషకరమైన విషయం. 

మిత్రులారా, 

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్. ఈ రోజుల్లో దేశమంతటా పండుగలకు సంబంధించిన అనేక కార్యకలాపాలు జరుగుతాయి. అయితే ఈసారి జీ20 పండుగ ఉత్సాహం సంవత్సరం పొడవునా కొనసాగింది. ఏడాది పొడవునా దేశంలోని వివిధ నగరాల్లో జీ20 ప్రతినిధులకు మేం ఆతిథ్యం ఇచ్చాం. ఫలితంగా ఆయా నగరాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది. దీని తర్వాత భారత్ చంద్రునిపై అడుగు పెట్టింది. ఇది దేశవ్యాప్తంగా ఉత్సవాల ఉత్తేజాన్ని మరింత పెంచింది. తదనంతరం ఇక్కడ ఢిల్లీలో విజయవంతంగా జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని మేం నిర్వహించాం. ఇప్పుడు ఈ పీ20 శిఖరాగ్ర సమావేశం ఇక్కడ జరుగుతోంది. ఏ దేశానికైనా గొప్ప బలం దాని ప్రజలే.. దాని ప్రజల సంకల్ప శక్తే. ఈ రోజు ఈ శిఖరాగ్ర సమావేశం కూడా ప్రజలకు ఉన్న ఈ శక్తిని వేడుకగా చేసుకునేందుకు ఒక కారణంగా మారింది.

మిత్రులారా, 

ప్రజాస్వామ్య మాతృక, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్‌లో పీ20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంట్‌ల ప్రతినిధులుగా మీకు.. ‘చర్చలు, సంప్రదింపులకు పార్లమెంట్లు ముఖ్యమైన ప్రదేశాలు’ అని తెలుసు. వేల సంవత్సరాల క్రితం జరిగిన చర్చలు, సంప్రదింపులకు సంబంధించిన చాలా మంచి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. 5000 సంవత్సరాల కంటే పురాతనమైన మా గ్రంథాలు, మా వేదాలలో సమావేశాలు, కమిటీల గురించి ఉంది. అప్పుడు సమాజ ప్రయోజనాల కోసం సామూహిక నిర్ణయాలు తీసుకునేవారు. అత్యంత పురాతన వేదమైన ఋగ్వేదంలో కూడా "సం-గచ్ఛ-ధ్వం సంవద-ధ్వం సం, వో మనాంసి జానతామ్" అని ఉంది. అంటే ‘మనం కలిసి నడవాలి.. కలిసి మాట్లాడాలి.. మన మనస్సులు ఒకటే అయి ఉండాలి’ అని అర్థం. ఆ కాలంలో కూడా గ్రామ సభలలో చర్చల ద్వారా గ్రామాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు.

భారత్‌లో ఈ వ్యవస్థను చూసి గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆశ్చర్యపోయారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రబలంగా ఉన్న ఈ వ్యవస్థ గురించి ఆయన వివరంగా రాశారు. తమిళనాడులో 9వ శతాబ్దానికి చెందిన శిలా శాసనం గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇది గ్రామ శాసనసభల నియమ నిబంధనల గురించి తెలియజేస్తోంది. 1200 సంవత్సరాల నాటి ఆ శాసనంలో.. ఏ సభ్యుడు ఏ కారణం చేత ఏ పరిస్థితులలో అనర్హులు కాగలరనేది కూడా ఉందని తెలుసుకోవడం మీకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. నేను 1200 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాను. నేను మీకు అనుభవ మండపం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మాగ్నా కార్టా కంటే ముందుగానే 12వ శతాబ్దంలో ‘అనుభవ మండపం’ అనే సంప్రదాయం ఉంది. ఇందులో కూడా చర్చలు, సంప్రదింపులను ప్రోత్సహించారు. ప్రతి తరగతి, ప్రతి కులం, ప్రతి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇక్కడికి వెళ్లేవారు. జగద్గురు బసవేశ్వరులు ఇచ్చిన ఈ బహుమతి నేటికీ భారత్‌కు గర్వకారణంగా ఉంది. 5000 సంవత్సరాల పురాతన వేదాల నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రయాణం, ఈ పార్లమెంటరీ సంప్రదాయాల అభివృద్ధి అనేవి కేవలం మన వారసత్వమే కాదు.. మొత్తం ప్రపంచ వారసత్వం కూడా.

మిత్రులారా, 

భారతదేశ పార్లమెంటరీ ప్రక్రియలు కాలక్రమేణా నిరంతరం మెరుగుపడుతూ మరింత శక్తిమంతంగా మారాయి. దేశంలో మేం సాధారణ ఎన్నికలను అతిపెద్ద పండుగగా పరిగణిస్తాం. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత్‌లో 17 సాధారణ ఎన్నికలు, 300 కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను భారత్ నిర్వహించడమే కాకుండా వీటిలో దేశ ప్రజల భాగస్వామ్యం కూడా నిరంతరం పెరుగుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ ప్రజలు మా పార్టీని వరుసగా రెండోసారి గెలిపించారు. మానవ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా 2019 సాధారణ ఎన్నికలు నిలిచాయి. దీనిలో 60 కోట్ల కంటే ఎక్కువ.. అంటే 600 మిలియన్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. మీరు ఊహించొచ్చు.. ఆ సమయంలో భారత్‌లో 91 కోట్లు.. అంటే 910 మిలియన్ల నమోదిత ఓటర్లు ఉన్నారు. ఇది ఐరోపా మొత్తం జనాభా కంటే ఎక్కువ. దేశంలోని మొత్తం నమోదిత ఓటర్లలో సుమారు 70 శాతం ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది భారత పార్లమెంటరీ పద్ధతులపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో తెలియజేస్తోంది. దీనిలో మహిళలు గరిష్ఠంగా భాగస్వామ్యమవటం ఒక ముఖ్యమైన అంశం. 2019 ఎన్నికల్లో భారతీయ మహిళలు రికార్డు సంఖ్యలో ఓటు వేశారు. మిత్రులారా.. కేవలం గణాంకాల పరంగానే కాకుండా రాజకీయ ప్రాతినిధ్యం పరంగా కూడా భారత ఎన్నికల వంటి మరొక ఉదాహరణ మీకు ప్రపంచంలో కనిపించదు. 2019 సాధారణ ఎన్నికల్లో 600 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఈ ఎన్నికల్లో ఒక కోటి కంటే ఎక్కువ.. అంటే 10 మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల కోసం 1 మిలియన్.. అంటే 10 లక్షల కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మిత్రులారా, 

భారత్‌ కాలంతో పాటు ఎన్నికల ప్రక్రియలో ఆధునిక సాంకేతికతతో సమ్మిళితం చేసింది. సుమారు 25 సంవత్సరాలుగా భారత్‌ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు- ఈవీఎంలను దేశం ఉపయోగిస్తోంది. ఈవీఎంల వాడకం వల్ల ఎన్నికల్లో పారదర్శకత, ఎన్నికల ప్రక్రియ సామర్థ్యం రెండూ పెరిగాయి. దేశంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఇప్పుడు నేను మీకు మరొక గణాంకాన్ని ఇస్తున్నాను. ఇది విని కూడా మీరు ఆశ్చర్యపోతారు. వచ్చే ఏడాది భారత్‌లో సాధారణ ఎన్నికలు మళ్లీ జరగబోతున్నాయని మీకు తెలుసు. ఈ ఎన్నికల్లో 100 కోట్ల మంది ఓటర్లు..  అంటే 1 బిలియన్ మంది ప్రజలు ఓటు వేయబోతున్నారు. పీ20 సమ్మిట్‌లోని ప్రతినిధులందరూ వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలను చూసేందుకు రావాలని ముందస్తుగా ఆహ్వానిస్తున్నాను. మీకు మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం చాలా సంతోషిస్తుంది.

మిత్రులారా, 

కేవలం కొన్ని రోజుల క్రితమే భారత పార్లమెంట్ ఒక చాలా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీని గురించి నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భారత్ నిర్ణయించింది. దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో దాదాపు 32 లక్షలు.. అంటే 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు. వీరిలో సుమారు 50 శాతం మంది మహిళా ప్రతినిధులే. నేడు ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని భారత్‌ ప్రోత్సహిస్తోంది. పార్లమెంట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పార్లమెంటరీ సంప్రదాయాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. 

మిత్రులారా, 

భారత పార్లమెంటరీ సంప్రదాయాలపై దేశ ప్రజలకు చెక్కుచెదరని విశ్వాసం ఉండేందుకు మరో కీలకమైన కారణం ఉంది. దీనిని మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా బలం మా వైవిధ్యం, మా విశాలత్వం, మా ఉత్తేజంలో ఉంది. ఇక్కడ ప్రతి మతానికి చెందిన ప్రజలు ఉన్నారు. వందల రకాల ఆహారం, వందల రకాల జీవన విధానాలే మాకు గుర్తింపు. దేశంలో వందలాది భాషలు మాట్లాడుతారు. మాకు వందలాది మాండలికాలు ఉన్నాయి. భారత్‌లో 28 భాషల్లో 900 కంటే ఎక్కువ టీవీ ఛానళ్లు ప్రజలకు తాజా సమాచారాన్ని అందించేందుకు 24 గంటలు పని చేస్తున్నాయి. ఇక్కడ సుమారు 200 భాషల్లో 33 వేల కంటే ఎక్కువ విభిన్న వార్తాపత్రికలు ప్రచురణ అవుతున్నాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో దాదాపు 3 బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. భారత్‌లో సమాచార ప్రవాహం ఎంత భారీగా, శక్తిమంతంగా ఉందో.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. 21వ శతాబ్దపు ఈ ప్రపంచంలో భారత్‌కు ఉన్న ఈ ఉత్తేజం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి మా గొప్ప బలాలు. ఈ ఉత్తేజమే ప్రతి సవాలుతో పోరాడటానికి, ప్రతి సమస్యను కలిసి పరిష్కరించుకునేందుకు మాకు స్ఫూర్తినిస్తోంది. 

మిత్రులారా, 

ఈ రోజు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఏం జరిగినా దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఘర్షణలు, పోరాటాల కారణంగా నేడు ప్రపంచం సంక్షోభాలను ఎదుర్కొంటోంది. సంక్షోభాలతో నిండిన ఈ ప్రపంచంపై ఎవరికీ ఆసక్తి ఉండదు. విభజిత ప్రపంచం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు పరిష్కారాలను అందించలేదు. శాంతి, సోదరభావానికి సంబంధించిన సమయం ఇది.. కలిసి నడిచే, కలిసి ముందుకు సాగే కాలం ఇది. అందరి వృద్ధి, శ్రేయస్సుకు సంబంధించిన క్షణం ఇది. ప్రపంచంలోని విశ్వాస లోపాన్ని అధిగమించి మానవ-కేంద్రీకృత ఆలోచనతో మనం ముందుకు సాగాలి. మనం ప్రపంచాన్ని 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' స్ఫూర్తితో చూడాలి. ప్రపంచానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే ప్రభావం అంత పెద్దదిగా ఉంటుంది. ఈ స్ఫూర్తితోనే ఆఫ్రికా సమాఖ్యను జీ20లో శాశ్వత సభ్యునిగా చేయాలని భారత్‌ ప్రతిపాదించింది. సభ్య దేశాలన్నీ దీనిని అంగీకరించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ వేదికపై పూర్తి ఆఫ్రికా పార్లమెంట్ భాగస్వామ్యాన్ని చూసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను.

మిత్రులారా, 

ఈ సాయంత్రం మా స్పీకర్ ఓం బిర్లా గారు మిమ్మల్ని భారత నూతన పార్లమెంట్ భవనానికి తీసుకువెళ్తున్నారని తెలిసింది. అక్కడ మీరు పూజ్య మహాత్మా గాంధీకి కూడా నివాళులు అర్పించబోతున్నారు. మీకు తెలిసినట్లుగానే దశాబ్దాలుగా సరిహద్దుల కేంద్రంగా భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు దేశంలో వేలాది మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి దగ్గరగా మీరు భారత పార్లమెంటు పాత భవనాన్ని కూడా చూస్తారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఉగ్రవాదులు మా పార్లమెంట్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎంపీలను బందీలుగా పట్టుకుని వారిని బలి తీసుకోవాలనేది ఉగ్రవాదుల ప్రణాళిక. ఇలాంటి అనేక ఉగ్రవాద ఘటనలను ఎదుర్కొన్న తర్వాత భారత్ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది. ఉగ్రవాదం ప్రపంచానికి ఎంత పెద్ద సవాలుగా ఉందో ఇప్పుడు ప్రపంచం కూడా తెలుసుకుంటోంది. ఎక్కడ దాడి జరిగినా.. ఏ కారణం చేత ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదమనేది మానవత్వానికి వ్యతిరేకం. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం ఉగ్రవాదం పట్ల ఎల్లప్పుడూ అత్యంత కఠినంగా ఉండాల్సి ఉంటుంది. అయితే దీనికి మరొక ప్రపంచిక  కోణం ఉంది. దీనిపై నేను మీ దృష్టిని మరల్చాలనుకుంటున్నాను. ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం లేకపోవడం చాలా విచారకరం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం నేటికీ ఐక్యరాజ్యసమితిలో ఏకాభిప్రాయం కోసం వేచి చూస్తోంది. ప్రపంచం అవలంబిస్తున్న ఈ వైఖరిని మానవత్వపు శత్రువులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉగ్రవాదంపైన చేస్తోన్న ఈ పోరాటంలో మనం ఎలా కలిసి పనిచేయొచ్చో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్‌లు, ప్రతినిధులు ఆలోచించవలసి ఉంది.

మిత్రులారా, 

ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజా భాగస్వామ్యం కంటే మంచి మాధ్యమం మరొకటి ఉండదు. ‘ప్రభుత్వాలు మెజారిటీతో ఏర్పడతాయి కానీ దేశాన్ని ఏకాభిప్రాయంతో నడపాలి’ అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. మన పార్లమెంట్‌లు, ఈ పీ20 ఫోరం కూడా ఈ భావనను బలోపేతం చేయగలవు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రపంచాన్ని మెరుగైనదిగా తయారుచేసేందుకు మనం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. భారత్‌లో మీ బస ఖచ్చితంగా ఆహ్లాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావాలని, దేశంలో మీ ప్రయాణం సుఖవంతం కావాలని కోరుకుంటూ.. నేను మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు. 

గమనిక: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు. 

 

***


(रिलीज़ आईडी: 2198104) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam