ప్రధాన మంత్రి కార్యాలయం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
27 NOV 2025 1:30PM by PIB Hyderabad
కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో మునుపెన్నడూ లేనన్ని అవకాశాలు నేడు భారత్‌కు ఉన్నాయి. నేడు భారత అంతరిక్ష వ్యవస్థలో ప్రైవేటు రంగం భారీ ముందడుగు నడుస్తోంది. భారత కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి దేశ యువశక్తికి స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ అద్దం పడుతోంది. ఆవిష్కరణల్లో, సవాళ్లను ఎదుర్కోవడంలో మన యువత సామర్థ్యం, వ్యవస్థాపకులుగా ఎదగాలన్న వారి ఉత్సాహం నేడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. మున్ముందు ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ వ్యవస్థలో భారత్ అగ్రగామిగా నిలవనున్న తీరును నేటి కార్యక్రమం ప్రతిబింబిస్తోంది. పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకాలకు నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంది ఔత్సాహిక యువ అంతరిక్ష పారిశ్రామికవేత్తలకు, దేశ యువతకు మీరిద్దరూ గొప్ప ప్రేరణ. మీపై మీరు నమ్మకముంచారు. సవాళ్లను స్వీకరించడానికి మీరు వెనుకాడలేదు. దాని ఫలితాన్ని నేడు దేశమంతా చూస్తోంది. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది.
మిత్రులారా,
భారత అంతరిక్ష ప్రస్థానం పరిమిత వనరులతోనే ప్రారంభమైనప్పటికీ, మన ఆశయాలు మాత్రం ఎప్పుడూ పరిమితం కాలేదు. ఒకప్పుడు రాకెట్ విడిభాగాలను మనం సైకిళ్లపై తరలించేవాళ్లం. పెద్ద కలలు కనేందుకు భారీ సంపదే అవసరం లేదని, దృఢ సంకల్పముంటే చాలని నేడు భారత్ రుజువు చేసింది. దశాబ్దాలుగా భారత అంతరిక్ష ప్రయాణానికి ఇస్రో కొత్త రెక్కలు తొడిగింది. విశ్వసనీయత, సామర్థ్యం, విలువల్లో భారత్ తనకంటూ ఓ విశిష్ట గుర్తింపును సంతరించుకుంది.
మిత్రులారా,
మారుతున్న ఈ కాలంలో అంతరిక్ష రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో మనందరికీ తెలుసు. కమ్యూనికేషన్, వ్యవసాయం, సముద్ర పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, వాతావరణ అంచనా, దేశ భద్రతలో ఇది పునాదిగా మారింది. అందుకే భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక సంస్కరణలను చేపట్టాం. ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేటు ఆవిష్కరణలకు అవకాశాన్నిచ్చింది. కొత్త అంతరిక్ష విధానాన్ని రూపొందించింది. కొత్త ఆవిష్కరణలను అంకుర సంస్థలు, పరిశ్రమలతో అనుసంధానించేందుకు కృషి చేశాం. ఇన్‌స్పేస్‌ను నెలకొల్పాం. ఇస్రో సౌకర్యాలు, సాంకేతికతను మన అంకుర సంస్థలకు అందించాం. గత ఆరేడు సంవత్సరాల్లోనే భారత్ తన అంతరిక్ష రంగాన్ని సార్వత్రిక, సహకార, ఆవిష్కరణాత్మక వ్యవస్థగా తీర్చిదిద్దుకుంది. నేటి కార్యక్రమం దీన్ని సంగ్రహంగా మన ముందుంచుతోంది. ఇది మనం గర్వించదగ్గ కార్యక్రమం.
మిత్రులారా,
భారత యువత ఎల్లప్పుడూ అన్నిటికన్నా దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. వీరు ప్రతి అవకాశాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకుంటారు. అంతరిక్ష రంగంలో ప్రభుత్వం అవకాశమిచ్చిన సమయంలో.. దేశ యువత ముఖ్యంగా జెన్-జీ తరం ముందుకొచ్చి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. నేడు దేశంలో 300కు పైగా అంతరిక్ష అంకుర సంస్థలు భారత అంతరిక్ష ప్రయాణ భవితలో కొత్త ఆశలు నింపుతున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే, మా అంతరిక్ష అంకుర సంస్థలు చిన్న చిన్న జట్లుగానే మొదలయ్యాయి. గత అయిదారేళ్లుగా వారిలో చాలా మందిని కలిసే అవకాశం నాకు లభించింది. కొన్నిసార్లు కేవలం ఇద్దరు వ్యక్తులు, ఒక్కోసారి ఓ చిన్న అద్దె గదిలో ఉండే అయిదుగురు సహోద్యోగులు... ఇలా చాలా చిన్న బృందాలుండేవి. వనరులు పరిమితంగా ఉండేవి. కానీ ఆశయాలు ఉన్నతంగా ఉండేవి. ఈ స్ఫూర్తే భారత ప్రైవేటు అంతరిక్ష విప్లవానికి మూలం. నేడు జెన్- జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారు. చోదక వ్యవస్థలు, మిశ్రమ పదార్థాలు, రాకెట్ స్టేజ్‌లు, లేదా ఉపగ్రహ ప్లాట్ఫాంలు... ఇలా కొన్నేళ్ల కిందట ఊహకు కూడా అందని రంగాల్లో భారత యువత నేడు పనిచేస్తున్నారు. భారత ప్రైవేటు అంతరిక్ష ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు భారత అంతరిక్ష రంగం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది.
మిత్రులారా,
నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్న ఉపగ్రహాలకు నిరంతరం డిమాండ్ పెరుగుతోంది. చాలా తరచుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉపగ్రహ సేవల రంగంలోకి కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. అంతరిక్షం ఇప్పుడు వ్యూహాత్మక ఆస్తిగా స్థిరపడింది. అందువల్ల మున్ముందు ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు పెరగబోతోంది. భారత యువతకు ఇదో గొప్ప అవకాశం.
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో భారత్‌కు ఉన్న సామర్థ్యలు ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఉన్నాయి. మనకు నిపుణులైన ఇంజినీర్లున్నారు. అత్యుత్తమ తయారీ వ్యవస్థలున్నాయి. ప్రపంచ స్థాయి ప్రయోగ వేదికలున్నాయి. అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించే ధోరణి మనది. భారత అంతరిక్ష సామర్థ్యం తక్కువ వ్యయంతో కూడుకున్నది, అలాగే విశ్వసనీయమైనది కూడా. అందుకే భారత్‌పై ప్రపంచం అనేక అంచనాలు పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఉపగ్రహాలను భారత్‌లో తయారు చేయాలనుకుంటున్నాయి. భారత్ నుంచి ప్రయోగ సేవలను తీసుకోవాలనుకుంటున్నాయి. భారత్‌తో సాంకేతిక భాగస్వామ్యాలను కోరుకుంటున్నాయి. కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే.
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులు భారత్‌లో విస్తృత స్టార్టప్‌ల విప్లవంలో భాగం. గత దశాబ్ద కాలంలో ఫిన్‌టెక్, అగ్రిటెక్, హెల్త్‌టెక్, క్లైమేట్ టెక్, ఎడ్యుటెక్, ఢిపెన్స్ టెక్ వంటి పలు రంగాల్లో అంకుర సంస్థలు పుట్టుకొచ్చాయి. దేశ యువత, ముఖ్యంగా జెన్-జీ తరం, ప్రతి రంగంలోనూ వినూత్న పరిష్కారాలను అందిస్తుంది. భారత జన్-జీ నుంచి ప్రపంచంలోని జెన్-జీ స్ఫూర్తిని పొందగలదని ఇవాళ నేను నమ్మకంగా చెప్పగలను. భారత జెన్-జీ సృజనాత్మకత, సానుకూల దృక్పథం, సామర్థ్య నిర్మాణ నైపుణ్యాలు ప్రపంచంలోని జెన్-జీ తరానికి స్ఫూరి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థగా భారత్ అవతరించింది. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన అంకుర సంస్థలు, ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.5 లక్షలకు పైగా నమోదైన అంకుర సంస్థల్లో చాలా వరకు యూనికార్న్ హోదా సాధించాయి.
మిత్రులారా,
ఇవాళ భారత్, యాప్‌లు, సేవలకు మాత్రమే పరిమితం కాలేదు. డీప్-టెక్, తయారీ, హార్డ్‌వేర్ ఆవిష్కరణల వైపు పురోగమిస్తుంది. ఇందుకు జెన్-జెడ్ తరానికి కృతజ్ఞతలు. సెమీకండక్టర్ రంగం ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు దేశ సాంకేతిక భవిష్యత్తుకు బలమైన పునాది. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, చిప్ తయారీ, డిజైన్ కేంద్రాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నాయి. చిప్‌ల నుంచి వ్యవస్థల వరకు బలమైన ఎలక్ట్రానిక్స్ విలువ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేస్తోంది. ఇది స్వావలంబన సంకల్పంలో భాగం మాత్రమే కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ను బలమైన, విశ్వసనీయమైన ఆధారంగా మారుస్తుంది.
మిత్రులారా,
మనం చేసే సంస్కరణల పరిధి నిరంతరం విస్తృతమవుతుంది. అంతరిక్ష ఆవిష్కరణలను ప్రైవేట్ రంగానికి విస్తరించినట్లుగా మరో రంగంలోనూ కీలక చర్యలు చేపట్టనున్నాం. అణురంగ విస్తరణకు కూడా భారత్ సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీని ద్వారా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లు, అణు ఆవిష్కరణల్లో అవకాశాలు కలుగుతాయి. ఈ సంస్కరణ భారత శక్తి భద్రతకు, సాంకేతిక నాయకత్వానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది.
మిత్రులారా,
నేడు పరిశోధన రంగంలో జరుగుతున్న అధ్యయనాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందువల్ల పరిశోధన రంగంలో యువతకు ఎక్కువ అవకాశాలను కల్పించటంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. అధునాతన పరిశోధనల్లో యువతకు మద్దతుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. "ఒకే దేశం, ఒకే సభ్యత్వం" ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ పత్రికలు అందుబాటులో ఉంటున్నాయి. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల్లో దేశవ్యాప్తంగా యువతకు మద్దతిచ్చేందుకు లక్ష కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 10,000కు పైగా ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందిస్తాయి. రానున్న రోజుల్లో 50,000 కొత్త ల్యాబ్స్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు భారత్‌లో నూతన ఆవిష్కరణలకు పునాది వేస్తాయి.
మిత్రులారా,
రాబోయే శకం భారతదేశానిది. ఇక్కడి యవతది. ఇక్కడి ఆవిష్కరణలది. కొన్ని నెలల క్రితం, అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష రంగ ఆకాంక్షల గురించి వెల్లడించాను. రాబోయే ఐదేళ్లలో భారత ప్రయోగ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నాం. అంతరిక్ష రంగంలో ఐదు కొత్త యూనికార్న్‌లు ఉద్భవిస్తాయనుకున్నాం. స్కైరూట్ బృందం పురోగతి ద్వారా భారత్ నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తుంది.
మిత్రులారా,
ప్రతీ భారత యువతీ, యువకుడికి, ప్రతి అంకుర సంస్థ, శాస్త్రవేత్త, ఇంజనీర్, పారిశ్రామికవేత్తకు అడుగడుగునా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. స్కైరూట్ బృందానికి మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేశ అంతరిక్ష ప్రయాణానికి కొత్త ఊపునిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. సమస్త భూ ప్రపంచం, అంతరిక్షంలోనూ 21వ శతాబ్దం భారతదేశానిదే అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వక శుభాకాంక్షలు!
***
(रिलीज़ आईडी: 2196730)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam