ప్రధాన మంత్రి కార్యాలయం
కర్ణాటకలోని ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణ ద్వారా మాత్రమే ఈ సంసార సాగరం నుంచి విముక్తి పొందగలం: ప్రధానమంత్రి
గీత వచనాలు వ్యక్తులకు మార్గనిర్దేశం చేయడమే కాక.. దేశ విధానాల
దిశను కూడా నిర్ణయిస్తాయి: ప్రధానమంత్రి
శాంతి, సత్యాన్ని కాపాడాలంటే అన్యాయ శక్తులను ఎదుర్కోవాల్సిన
అవసరం ఉందని భగవద్గీత బోధిస్తుంది. ఈ సూత్రమే దేశ భద్రతా
విధానానికి మూలస్థంభం: ప్రధానమంత్రి
నీటి సంరక్షణ, చెట్లు నాటడం, పేదల అభ్యున్నతి, స్వదేశీని ఆచరించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం, యోగ సాధన, ప్రాచీన గ్రంథాలను సంరక్షించడం, కనీసం 25 వారసత్వ క్షేత్రాలను సందర్శించడమనే తొమ్మిది సంకల్పాలను తీసుకుందాం: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 NOV 2025 2:05PM by PIB Hyderabad
కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న శ్రీ కృష్ణ మఠంలో నేడు నిర్వహించిన లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పూజ్యులైన సాధువులు, గురువుల సమక్షంలో శ్రీ కృష్ణ భగవానుడి దివ్య దర్శనం, శ్రీమద్ భగవద్గీత మంత్రాల ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం తనకు గొప్ప అదృష్టమని వ్యాఖ్యానించారు. ఇది లెక్కలేనన్ని ఆశీస్సులు పొందడంతో సమానమని పేర్కొన్నారు.
మూడు రోజుల క్రితం తాను గీతా భూమి అయిన కురుక్షేత్రంలో ఉన్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. నేడు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందిన, జగద్గురు శ్రీ మధ్వాచార్య గారి మహిమతో పావనమైన ఈ భూమికి రావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని అన్నారు. ఈ సందర్భంలో లక్ష మంది ప్రజలు కలిసి చేసిన భగవద్గీత
శ్లోకాల పారాయణాన్ని ప్రపంచమంతా చూసిందని, మన దేశానికి చెందిన వేల సంవత్సరాల పురాతన ఆధ్యాత్మిక వారసత్వపు సజీవ దివ్యత్వం అందులో ప్రతిఫలించిందని తెలిపారు.
కర్ణాటక ప్రాంతానికి రావడం, ఇక్కడి ఆప్యాయతగల ప్రజల మధ్య ఉండటం తనకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పవిత్రమైన ఉడుపిని సందర్శించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పారు. తాను గుజరాత్ లో జన్మించినప్పటికీ.. గుజరాత్, ఉడిపికి మధ్య ఎల్లప్పుడూ లోతైన, ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని గతంలో ద్వారకలో రుక్మిణీ మాత పూజించిందని, ఆ తర్వాత జగద్గురు శ్రీ మధ్వాచార్యుల వారు ఈ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారని శ్రీ మోదీ ప్రస్తావించారు. గత సంవత్సరం తాను సముద్రం అడుగున ఉన్న శ్రీ ద్వారకాను సందర్శించి దివ్యానుభూతిని పొందానని ఆయన తెలిపారు. ఈ విగ్రహాన్ని దర్శించుకున్నప్పుడు తనకు కలిగిన గాఢమైన అనుభూతిని ఊహించవచ్చని, ఈ దర్శనం తనకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఉడుపికి రావడం తనకు మరో రకంగా కూడా ప్రత్యేకమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉడుపి జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సుపరిపాలన నమూనాకు కర్మభూమిగా ఉందని ఆయన చెప్పారు. 1968లో ఉడుపి ప్రజలు జనసంఘ్ నాయకుడు వీఎస్ ఆచార్య గారిని మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నుకున్నారని, దీంతో ఉడుపి కొత్త పాలనా నమూనాకు పునాది వేసిందని గుర్తు చేశారు. నేడు జాతీయ స్థాయిలో కనిపిస్తున్న పరిశుభ్రతా ప్రచారాన్ని ఉడిపి.. అయిదు దశాబ్దాల క్రితమే ఆచరించిందని పేర్కొన్నారు. నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించి కొత్త నమూనాను అందించడం వంటి కార్యక్రమాలను ఉడుపి 1970లలోనే ప్రారంభించిందని చెప్పారు. నేడు ఈ ప్రచారాలు జాతీయ అభివృద్ధి, జాతీయ ప్రాధాన్యతలో భాగమై, దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు.
రామచరితమానస్‌లోని మాటలను గుర్తుచేస్తూ.. ‘‘కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణ ద్వారా మాత్రమే ఈ సంసార సాగరం నుంచి విముక్తి లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమాజంలో మంత్రాలు, గీత శ్లోకాలను పారాయణం చేయడం శతాబ్దాలుగా జరుగుతోందని, అయితే లక్ష గొంతులు ఏకమై ఈ శ్లోకాలను పఠించినప్పుడు అది ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ఇంత మంది ప్రజలు గీత వంటి పవిత్ర గ్రంథాన్ని పఠించినప్పుడు.. ఆదివ్య వచనాలన్నీ ఒకే చోట ప్రతిధ్వనించినప్పుడు, మనస్సు, బుద్ధికి
కొత్త బలాన్ని ప్రసాదించే ప్రత్యేక శక్తి ఉద్భవిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ శక్తి ఆధ్యాత్మిక శక్తికి మాత్రమే కాకుండా సామాజిక ఐక్యత శక్తికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. నేడు లక్ష మంది గీతను పఠించడమనే ఈ సందర్భం ఒక విశాలమైన శక్తి క్షేత్రాన్ని అనుభవించే అవకాశంగా మారిందని, సామూహిక చైతన్య శక్తిని ప్రపంచానికి చూపుతోందని చెప్పారు.
లక్ష కంఠ గీత భావాన్ని దివ్యరూపంలో ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీకి తాను ప్రత్యేకంగా వందనం చేస్తున్నానని
ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామిజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను తమ స్వహస్తాలతో గీతను లిఖించేందుకు ప్రేరేపించడం ద్వారా.. కోటి
గీతా లేఖన యజ్ఞాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇది సనాతన సంప్రదాయానికి ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. భగవద్గీతలోని భావాలు, బోధనలతో దేశ యువత అనుసంధానమవుతున్న తీరు నిజంగా అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. దేశంలో శతాబ్దాలుగా వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాల జ్ఞానాన్ని రాబోయే తరానికి అందించే సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం కూడా రాబోయే తరాలను భగవద్గీతతో అనుసంధానం కావడానికి అర్థవంతమైన ప్రయత్నంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడికి రావడానికి మూడు రోజుల ముందు తాను అయోధ్యను కూడా సందర్శించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. నవంబర్ 25న శుభప్రదమైన వివాహ పంచమి రోజున అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. అయోధ్య నుంచి ఉడిపి వరకు కోట్లాది మంది రామ భక్తులు అత్యంత దివ్యమైన, గొప్ప వేడుకను వీక్షించారని తెలిపారు. రామ మందిర ఉద్యమంలో ఉడుపి పోషించిన కీలక పాత్ర యావత్తు దేశానికి తెలుసని అన్నారు. అనేక దశాబ్దాల క్రితం పరమ పూజ్యులైన దివంగత విశ్వేశ తీర్థ స్వామీజీ ఈ మహోద్యమానికి దిశానిర్దేశం చేశారని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ధ్వజారోహణ వేడుక ఆ కృషి ఫలితంగానే ఫలసిద్ధిని సూచించే పర్వదినమైందని తెలిపారు. అయోధ్యలోని కొత్త
ఆలయంలో జగద్గురు మధ్వాచార్యుల పేరుతో ఒక భవ్య ద్వారం నిర్మించడం ద్వారా శ్రీరామ మందిర నిర్మాణం ఉడుపికి మరొక ప్రత్యేకతనూ కలిగించిందని ఆయన వివరించారు. శ్రీరాముడి పరమభక్తుడైన జగద్గురు మధ్వాచార్యులు శ్రీరాముని ఆరు దివ్య గుణాలతో అలంకరించిన.. ‘‘పరబ్రహ్మ, అపార శక్తి, పరాక్రమాల సముద్రం‘’ అనే అర్థం వచ్చే ఒక శ్లోకాన్ని రచించిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే రామమందిర ప్రాంగణంలో జగద్గురు మధ్వాచార్యుల పేరుతో ఒక ద్వారం ఏర్పడటం ఉడుపి ప్రజలకు, కర్ణాటకకు, యావత్ దేశానికి గొప్ప గర్వకారణమని ఆయన అన్నారు.
జగద్గురు శ్రీ మధ్వాచార్య భారతదేశ ద్వైత సిద్ధాంతానికి మార్గదర్శి, వేదాంతానికి ఒక ప్రకాశించే జ్యోతిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆయన స్థాపించిన ఉడిపిలోని అష్టమఠాల వ్యవస్థ సంస్థాగత నిర్మాణానికి, కొత్త సంప్రదాయాల ఆవిర్భావానికి సజీవ ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక్కడ శ్రీ కృష్ణుడిపై భక్తి, వేదాంత జ్ఞానం, వేలాది మందికి అన్నదానం చేయాలనే సంకల్పం ఉందని తెలిపారు. ఒక విధంగా ఈ స్థలం జ్ఞానం, భక్తి సేవ అనే పవిత్ర త్రివేణి సంగమంలా పావనమైందని పేర్కొన్నారు.
జగద్గురు మధ్వాచార్యులు జన్మించిన కాలంలో భారతదేశం అనేక అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ఆ సమయంలో ఆయన సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి విశ్వాసాన్ని ఏకం చేయగల భక్తి మార్గాన్ని చూపించారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఆయన అందించిన ఈ మార్గదర్శకత్వం వల్లే మధ్వాచార్యులు స్థాపించిన మఠాలు శతాబ్దాల తర్వాత కూడా నేటికీ ప్రతిరోజూ లక్షలాది ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఆయన స్ఫూర్తితో ద్వైత సంప్రదాయంలో అనేక మంది మహనీయులు వెలుగులోకి వచ్చి ధర్మం, సేవ, దేశనిర్మాణ కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్లారని ప్రస్తావించారు. ఈ ప్రజా సేవా సంప్రదాయమే ఉడుపి గొప్ప వారసత్వమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
జగద్గురు మధ్వాచార్యుల సంప్రదాయం హరిదాస సంప్రదాయానికి శక్తినిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. పురందరదాసు, కనకదాసు వంటి గొప్ప సాధువులు సరళమైన, మధురమైన, సులభంగా అర్థమయ్యే కన్నడ భాషలో ప్రజల్లోకి భక్తిని తీసుకెళ్లారని చెప్పారు. వారి రచనలు సమాజంలోని అత్యంత దిగువ వర్గాల హృదయాన్ని కూడా తాకాయని, వారిని ధర్మం, సనాతన విలువలతో అనుసంధానం చేశాయని చెప్పారు. ఈ రచనలు ఇవాళ్టి తరానికి కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. సోషల్ మీడియా రీల్స్ లో యువతరం ఇప్పుడు కూడా పురందర దాసు "చంద్రచూడ శివ శంకర పార్వతి" కీర్తన విన్నప్పుడు, భిన్నమైన ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనవుతున్నట్లు గమనించినట్టు ఆయన చెప్పారు. ఉడుపిలో తనలాంటి భక్తుడు ఇక్కడ ఉన్న చిన్న కిటికీలోంచి శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేసుకున్నప్పుడు, అది కనకదాసు భక్తితో అనుసంధానమయ్యే అవకాశంగా మారుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇవాళ, గతంలోనూ కనకదాసుకి నమస్కరించే అవకాశం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీకృష్ణుని బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవని, గీతలోని మాటలు కేవలం వ్యక్తులకు మాత్రమే కాక, మన జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అందరి సంక్షేమం కోసం పనిచేయాలని శ్రీకృష్ణుడు గీత ద్వారా బోధించాడని తెలిపారు. జగద్గురు మధ్వాచార్యులు తన జీవిమంతా ఈ బోధనలను అనుసరించి దేశ ఐక్యతను బలోపేతం చేశారని వ్యాఖ్యానించారు.
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సర్వజన్ హితయ, సర్వజన్ సుఖయా అనే నినాదాల్లో శ్రీకృష్ణ భగవానుడి శ్లోకాల స్ఫూర్తి ఉందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. పేదలకు సహాయం చేయాలని శ్రీకృష్ణుడు చెప్పారని, ఈ స్ఫూర్తే ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ వంటి పథకాలకు ఆధారంగా నిలిచిందని చెప్పారు. మహిళా భద్రత, సాధికారతకు సంబంధించి శ్రీకృష్ణుడు అందించిన జ్ఞానమే నారీశక్తి వందన్ అధినియం అనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవటానికి దేశానికి స్ఫూర్తిని అందించిందని చెప్పారు. కృష్ణుడు బోధించిన సర్వజన సంక్షేమ సూత్రమే వ్యాక్సిన్ మైత్రి, సౌర కూటమి, వసుధైవ కుటుంబకం వంటి భారతదేశ విధానాలకు ఆధారమని వ్యాఖ్యానించారు.
యుద్ధ రంగంలోనే శ్రీకృష్ణుడు గీత సందేశాన్ని ఇచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శాంతి, సత్య స్థాపనకు అణచివేతదారుల అంతం కూడా అవసరమని భగవద్గీత బోధిస్తుందని స్పష్టం చేశారు. దేశ భద్రతా విధానానికి ఇది కీలమైనదని చెప్పారు. వసుదైక కుటుంబం గురించి భారత్ మాట్లాడుతుందని, 'ధర్మో రక్షతి రక్షితః' అనే మంత్ర భావనను తెలియజేస్తుందని వెల్లడించారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి కరుణ సందేశం వెలువడుతుందని, అదే వేదికపై నుంచి మిషన్ సుదర్శన చక్ర ప్రకటన కూడా వస్తుందన్నారు. దేశంలోని కీలక ప్రాంతాలు, పారిశ్రామిక, ప్రభుత్వ రంగాల చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయటమే మిషన్ సుదర్శన్ చక్ర అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. దీన్ని శత్రువులు చేధించలేరని, ఒకవేళ ధైర్యం చేసి ముందుకు వస్తే, భారత సుదర్శన చక్రం వారిని నాశనం చేస్తుందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ లో దేశ సంకల్పాన్ని ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందినవారితో సహా చాలామంది దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గతంలో ఇటువంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఉండిపోయాయని, కానీ ఈ నవ భారతం ఎవరి ముందు తలవంచదని, ప్రజల భద్రతా విషయంలో వెనకడుగు వేయదని తెలిపారు. "శాంతిని ఎలా నెలకొల్పాలో, దాన్ని ఎలా పరిరక్షించాలో భారతదేశానికి తెలుసు" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
మన కర్తవ్యాలు, జీవిత ప్రాధాన్యతల గురించి భగవద్గీత తెలియజేస్తుందని, దాని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కొన్ని సంకల్పాలను తీసుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు. తొమ్మిది తీర్మానాల వంటి విజ్ఞప్తులు వర్తమానానికి, భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని చెప్పారు. సాధువుల సమాజం ఈ విజ్ఞప్తులను ఆశీర్వదిస్తే, అవి ప్రతి పౌరుడికి తప్పకుండా చేరతాయన్నారు.
మొదటి తీర్మానం.. నీటిని సంరక్షించటం, ఆదా చేయటం, నదులను పరిరక్షించటమని ప్రధానమంత్రి తెలిపారు. రెండో తీర్మానం.. చెట్లను నాటటమని, దేశవ్యాప్తంగా "ఏక్ పేడ్ మా కే నామ్" కార్యక్రమం ఊపందుకుంటోందని, ఈ కార్యక్రమానికి అన్ని మఠాల బలం తోడైతే, దాని ప్రభావం మరింత విస్తృతమవుతుందన్నారు. మూడో తీర్మానం, దేశంలోని కనీసం ఒక పేద వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలని చెప్పారు. నాలుగో సంకల్పం, స్వదేశీ ఆలోచన. బాధ్యతాయుతమైన పౌరులుగా అందరం స్వదేశీ ఆలోచనను పాటించాలన్నారు. నేడు ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ మంత్రంతో దేశం ముందుకు సాగుతోందని, మన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, సాంకేతికత స్థిరంగా ఎదుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అందువల్ల 'స్థానిక ఉత్పత్తుల కోసం మన గొంతును వినిపించాలి' అని స్పష్టం చేశారు.
ఐదో తీర్మానం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ఆరో తీర్మానం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవటం, ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవటం, నూనె వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. ఏడో తీర్మానం యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. ఎనిమిదో తీర్మానం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు మద్దతివ్వటమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చాలావరకు దేశ ప్రాచీనకాల జ్ఞానం తాళపత్రాల్లో దాగి ఉందని తెలిపారు. ఈ జ్ఞానాన్ని సంరక్షించేందుకు జ్ఞాన్ భారతం మిషన్‌పై భారత ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సహకారం ఈ వారసత్వాన్ని కాపాడటానికి సహాయపడుతుందన్నారు.
తొమ్మిదో తీర్మానం, దేశవ్యాప్తంగా మన వారసత్వానికి సంబంధించిన కనీసం 25 ప్రాంతాలను సందర్శించాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. మూడు, నాలుగు రోజుల కిందట హర్యానాలోని కురుక్షేత్రలో మహాభారత అనుభవ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి జీవనతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రజలు ఈ కేంద్రాన్ని సందర్శించాలన్నారు. ఏటా గుజరాత్‌లో శ్రీకృష్ణ భగవానుడు, రుక్మిణీ మాతల వివాహ మహోత్సవం మాధవ్‌పూర్ మేళా జరుగుతుందని, దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు అక్కడికి వెళ్తారని, వచ్చే ఏడాది ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు.
శ్రీ కృష్ణ భగవానుడి జీవితమంతా, భగవద్గీతలోని ప్రతి అధ్యాయం.. కార్యాచరణ, కర్తవ్యం, సంక్షేమమనే సందేశాన్ని తెలియజేస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. భారతీయులకు 2047 సంవత్సరం కేవలం అమృతకాలం మాత్రమే కాదని.. వికసిత్ భారత్ నిర్మాణానికి కర్తవ్య యుగమని చెప్పారు. ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడికి ఒక బాధ్యత ఉందని, ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు సొంత కర్తవ్యం ఉందన్నారు. ఈ కర్తవ్యాలను నెరవేర్చటంలో కష్టపడి పనిచేసే కర్ణాటక ప్రజలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రతి ప్రయత్నాన్ని దేశానికి అంకితం చేయాలన్నారు. ఈ కర్తవ్య స్ఫూర్తిని అనుసరించటం ద్వారా అభివృద్ధి చెందిన కర్ణాటక, భారత్ అనే కల సాకారం అవుతాయని వెల్లడించారు. పవిత్రమైన ఉడుపి భూమి నుంచి వెలువడే శక్తి, వికసిత్ భారత్ సంకల్పానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రసంగాన్ని ముగించారు.
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
ప్రధానమంత్రి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, వందలాది మంది విద్యార్థులు, సాధువులు, పండితులు, వివిధ రంగాల పౌరులు సహా 1,00,000 మంది పాల్గొన్న లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతను ఏక కంఠంతో పారాయణం చేశారు.
కృష్ణుని గర్భగుడికి ఎదురుగా ఉన్న సువర్ణ తీర్థ మండపాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. పవిత్రమైన కనకన కిండికి స్వర్ణ కవచాన్ని అంకితమిచ్చారు. కనకన కిండికి ద్వారా సన్యాసి కనకదాసు, భగవాన్ శ్రీ కృష్ణ దర్శనం పొందినట్లు ప్రతీతి. వేదాంతంలో ద్వైత తత్వశాస్త్ర ఆద్యుడైన శ్రీ మధ్వాచార్యులు ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని 800 ఏళ్ల కిందట స్థాపించారు.
***
(रिलीज़ आईडी: 2196718)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam